గుండె
నా గుండె గుప్పెడంత
మోసే బరువులు కొండంత
సంతోషాన్ని పంచేది అదే
దుఃఖాన్ని దాచిపెట్టలేనిది అదే
ప్రేమను ఊయలలు ఊపేది అదే
పగకు కడగండ్లు పెట్టేది అదే
ఈ మట్టి బొమ్మ నడవాలంటే ఇంధనం పంపు చేసేది అదే.
మనసుకి మంత్రం వేసేది అదే
మాయ చేసేది కూడా అదే.
పరిస్థితులను ఒప్పించేది
పరిమితులను మరిపించేది అదే.
గాయాన్ని తట్టుకోలేదు
గాబరాని ఆపలేదు.
చిన్న మాటతో సంతోషం
పెద్ద పెద్ద మాటలు అంటే బాధపడేది అదే.
కలతలన్నీ సర్దుకుని దాచుకునేది అదే
నన్ను కంగారు పెట్టి నా రక్తం మరిగించేది అదే.
నా నరాల్లో రక్తం ఉరకలెత్తి
మెదడును మరిగించేసి
నా గుండెకు తీర్పు చెప్పేసింది.
దాన కర్ణుడని నాకు బిరుదులిప్పించి
ఆగమేఘాల మీద చేరవలసిన చోటుకు చేరిపోయి
ఆగిపోతున్న ఊపిరికి చేతులు అడ్డం పెట్టేసింది.
నా గుండె ఒకరికి జీవం పోసింది
జన్మనిచ్చిన తల్లిదండ్రుల కళ్ళల్లో నెమ్మది నింపింది
కట్టుకున్న భార్య వ్రత ఫలం దక్కించేలా చేసింది.
కన్న బిడ్డలకి తండ్రిని మిగిల్చింది.
మట్టిలో కలవవలసిన నా గుండె
మరొకరి క్షణాలను చిరునవ్వులుగా మార్చింది
నేను లేకపోయినా
నా గుండె శబ్దం వినిపిస్తునంత సేపు
నా జీవితం ఎవరికో వెలుగు తీరుగా నిలుస్తుంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279