రంగులెన్నో చూశాను
రంగు రంగుల కలలుగన్నాను
రంగుల లోకంలో విహరించాను
హంగులు చూసి మురిసిపోయాను మైమరచిపోయాను
వర్ణాలన్నీ వంటిపై ఒంపుకున్నాను
కలియబెట్టి మేనంతా పులుముకున్నాను
ఒక్కో రంగూ వెలిసిపోతుంటే వెలవెలబోయాను
వన్నె తరిగిపోతుంటే పాలిపోయాను
ఉన్నట్టుండి ఏదో నది మీద పడితే ఉలిక్కిపడి పైకి చూశాను
అప్పటికే నేను నిలువెల్లా తడిసి పోయాను.. అణువణువునా మెరిసిపోయాను
హే ప్రభూ.. మీరద్దిన ఈ రంగును
అందరికీ అంటిస్తాను
ఎంత విదిల్చుకున్నా వదలనంతగా రాసేస్తాను...పూసేస్తాను
ఇకపై ఊసరవెల్లిని కాను
హరివిల్లై మీ మనోగగనంలో విరుస్తాను
జ్ఞాన విరిజల్లై లోకమంతా కురుస్తాను
కలుషాలను కడుగుతూ కమలమై తరిస్తాను.. కలమై హలమై బలమై చెలరేగుతాను
చెక్కుచెదరక స్థిరమై చరిత్రకు గుర్తుండిపోతాను