లక్ష్యమా... నిర్లక్ష్యమా
గుడారం ఎత్తేసే సమయం అయ్యింది
జెండా పాతేందుకు గొయ్యి తవ్వకం జరుగుతోంది
విస్తళ్ళలో కూరల వడ్డన పూర్తయ్యింది
ఎసట్లో బియ్యం మరుగుతోంది
చీమలుకూడా దూరని కాపలా ముందుంది
వెనకనుంచి ఏనుగుల పారిపోతే మాత్రం ఏమౌతుంది
అవునవును... సమర శంఖారావం వినిపిస్తోంది
తొందరెందుకు,పిడి బిగించనీ కత్తి నూరనీ ... పోయేదేముంది
సూర్యాస్తమయం అయ్యింది చీకటి పడుతోంది
లాంతర్లకంటిన మసి తుడవాల్సిఉంది
జోరున వాన కురుస్తోంది.. వళ్ళు మూడొంతులు తడిసింది
నీడనిచ్చే పచ్చని చెట్టు మీద పిడుగు పడింది గొడుగు గాలికి కొట్టుకుపోయింది
బంగారు కల బయట నిలబడి ఎదురు చూస్తోంది
నిద్రా దేవతగారే అప్పుడే రానంటోంది
కలికాలం కసిగా వెంబడిస్తోంది
ఇదిగో... చెప్పుల బేరం ఇప్పుడే మొదలయ్యింది
నా గ్రంధరాజం ముద్రణ జరుగుతోంది
ముందుమాటలో అక్షర దోషాలు సరిదిద్దాల్సి వుంది
కొంపకు నిప్పంటుకుంది
వరుణ యాగం చేద్దాం... భయపడాల్సిందేముంది
చివరాఖరి బండికి వేళయ్యింది
మంచి శకునం రానీ.. హడావిడేముంది
తాళం బలంగానే పడింది
గడియ వేయని పొరపాటు సహజమే....జరుగుతూనేవుంటుంది
హతవిధీ అని కూలబడితే లాభమేముంది
విధానం తెలిస్తేనేగా.. వీధి తలుపు తెరుచుకునేది