Telugu Quote in Story by N.Vishnu Vardhan Babu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ప్రియాతి ప్రియమైన చిన్నికి....!

" నిన్నిలా సంబోధించడం సరైందే కదా! ఎందుకంటే నేను నీకు ప్రియమైన వాణ్ని కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నాకు ప్రియాతి ప్రియమైన దానివే

నేను పుట్టిన కొన్ని కోట్ల కోట్లు క్షణాలకు నీ దర్శనమైంది. తరువాత ఏ క్షణంలో నీ మాయలో పడిపోయానో నాకే తెలియదు.. నాకు తెలిసిందల్లా ప్రతీక్షణం నిన్ను చూస్తుండిపోవడం. కుదిరితే నీ మాటలు వింటుండిపోవటం. వీలైతే అలాగే ఉండిపోవాలనుకోవటం

ఎప్పుడూ చిరునవ్వులొలికే నీ అమాయకమైన వదనాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. తేట తెలుగుకే కొత్త సొబగుల నీ మాటలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చురుకైన కళ్లు చిలుకముక్కు, నిత్యం చిరునవ్వుతో విచ్చుకునే అధరాలూ, హృదయాన్ని నేరుగా తాకే నీ మాటలూ మళ్లీ మళ్లీ చూడాలనీ, వినాలనీ, వీలైతే దోసిట్లో పట్టుకుని, గుండెల్లో దాచుకోవాలని ఎంత ఆశో నాకు

నిన్ను పలకరించాలనీ, గుండె గొంతుకలో కొట్లాడుతున్న భావాలన్నీ నీతో చెప్పేసుకోవాలనీ, ఎప్పుడూ నీ వెంటే నేను. ఉండాలని ఎన్ని కలలో...

నీ రాకతో నా ప్రపంచం ఊపిరి పోసుకుంటుంది. నువ్వెళ్లిపోయాక అంతా శూన్యం నిర్జీవం మళ్లీ నువ్వొచ్చే ఉదయం కోసం ఎంత నిరీక్షణో,

నీ పక్కనే ఉండి నేనింతలా నీ కోసం....... ఆరాటపడుతుంటే నువ్వు నా ఉనికినే గుర్తించవు. కనీసం కన్నెత్తి నా వైపు చూడనైనా చూడవు. పోనీ, నీతో కలిసి చదువుకునే భావంతోనైనా పన్నెత్తి పలకరించవు.

నేను నీ నుంచి ఎక్కువేం కోరుకోలేదు చిన్నీ, నువ్వు నా నువ్వులా నాతో ఉంటే చాలు. నన్ను నీ నేనని అనుకుంటే చాలు.

ఏదో సంతోషం నా గుండెను తాకిన బావుందనిపిస్తుంది. ఆ పంచుకోవాలనిపిస్తుంది. ఏదైనా కష్టం వచ్చి దిగులు మేఘాలు కమ్ముకున్నప్పుడు నీతో చెప్పుకుని, నీ ఒడిలో సేద తీరాలి అనిపిస్తుంది

ఒంటరితనపు వేదన లావాలా ఎగిసినప్పుడు పక్కన నువ్వుంటే చిటికెన వేలితో ప్రపంచాన్ని జయిస్తానన్న ధైర్యం వస్తుంది.

ఎప్పుడూ నిశ్శబ్దం తిరుగాడే మా ఇంట్లో నువ్వు సందడి చేస్తే చూడాలనుకున్నాను. నీ చిరునవ్వులతో, గలగల మాటలతో ఇంట్లో అణువణువూ నిండిపోవాలనుకున్నాను.

నన్ను నవ్వించే చసక్కులానో, మనసు పొరల్లో పట్టించే అల్లరిలా ఏదోలాగా నాతో నువ్వుంటే చాలనుకున్నాను.

ఇన్నేళ్లూ కలిసి చదువుకున్నా ఏ రోజూ నీతో నేరుగా మాట్లాడే ధైర్యం చేయలేని నేను నా చేతలతో నిన్ను ఆకట్టుకోవాలని చూశాను. ప్రతిదీ నీ కోసమనే చేశాను......... నీ కోసమే చేశాను.

నీ ప్రేమ సాగరంలో నేనూ ఓ నీటి బిందువులా అయినా ఉండాలనుకున్నాను. కానీ, నువ్వు నన్నో కన్నీటి బిందువులా మార్చేశావు. నా కలలన్నీ కలలనీ, ఆశలన్నీ అత్యాశలని చెప్పకనే చెప్పి వెళ్లిపోయావు. జానపద కథల్లో హఠాత్తుగా మాయమై పోయిన రాకుమారిలాగా వెళ్లిపోయావు, నువ్వు ఎదురే కానంత దూరంగా, నీ కబురే తెలియనంత సుదూరంగా... ఎక్కడికో వెళ్లిపోయావు.

అప్పటి నుంచి నీ కోసం నిన్ను తెలిసినవారికల్లా అడిగాను. నిన్ను చూసిన -కంటినల్లా అడిగారు. నువ్వు శ్వాసిస్తే పులకరించిన గాలినీ, స్పర్శిస్తే ఉత్తేజం పొందిన పువ్వులని నీ అడుగులకి మరుగులొత్తిన దారినీ అడిగి చూశాను. ఎవ్వరూ చెప్పలేకపోయారు. . మన నేస్తాలతో కూడా ఎవరితో నువ్వు సన్నిహితంగా లేకపోవడంవల్ల చాలా కష్టపడి మరీ నీ చిరునామా సంపాదించాను.

నా జ్ఞాపకాలలో....ఓ జ్ఞాపకంగా,మనసు పొదల్లొ నిత్యం గుచ్చుకునే ముల్లులాగా మిగిలి పోకూడదనేదే నా తపన. ఏదో నువ్వు వస్తావన్న నమ్మకంతో నువ్వు వదిలేసిపోయిన చీకట్లో, మిగిల్చిపోయిన శూన్యంలో నిన్ను వెతుక్కుంటూ బతికేస్తున్నా. ఏమో ఎన్నో అద్భుతాలు -సాధ్యమయ్యే ఈ లోకంలో నువ్వూ నేనూ కలవటం కూడా సాధ్యమేనన్న వెర్రీ ఆశతోనే ఈ ఉత్తరంరాస్తున్నాను. ఇదంతా నీకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక జవాబు రాసి, పంపెయ్. నువ్వు స్పందించావన్న సంతోషంతో ఇంకో యుగమైనా గడిపేస్తా......

ఉంటా మరి... 'ఎప్పటికైనా 'నీ' అవుతానో కానో తెలియని 'నేను'

_ NVVB

Telugu Story by N.Vishnu Vardhan Babu : 111922007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now