పెళ్లి పందిరిలో ప్రకృతి పండగ
పెళ్లంటే నూరేళ్ల పంట
కలకాలపు వలపుల పంట
భూమాత వేదికగా వచ్చింది.
ఆకాశం పందిరిగా నిలిచింది
పచ్చటి చెట్టు తోరణమై అలంకరించింది
మూడు ముళ్ళకి సాక్షిగా అగ్ని నిలిచాడు
పెళ్ళివారికి వాయువు సుగంధ మై వీచింది
వరుణదేవుడు పన్నీరై పులకరింప చేశాడు.
పంచభూతాలే పెళ్లికి సేవలు చేస్తుంటే
పర్యావరణం పాడు చేసే ప్లాస్టిక్ ఎందుకు
పండగ పూట పచ్చదనం పూయాలి!
పెళ్లి మండపం పూలతో నిండాలి,
కానీ ప్లాస్టిక్ డెకరేషన్లకు ఆమోదం వద్దు!
తలంబ్రాలు వేడుక సనాతనంగా
జరగనిస్తేనే ముద్దు.
మధ్యలో వచ్చినవి
మరిచిపోవడమే మన హద్దు.
వియ్యాలవారి విందుకి
అధునాతనమైన హంగులు ఎందుకు .
ప్రమాదమని తెలిసినా
దాని పక్కకు చేరడం ఎందుకు
కమ్మని కాఫీ కి
నీటిలో కరిగిపోయే మట్టి పాత్ర ముద్దు.
గొంతు ఎండిపోతుంటే
గొంతులో కాకుండా
ఒంటి మీద పడే గ్లాసుతో నీళ్లు
ఇచ్చే సాంప్రదాయం మనకి వద్దు
ఆకుపచ్చ అరిటాకు విందుకు అందం.
లేకపోతే కుట్టుడాకు మన సాంప్రదాయం.
విందుకు ముప్పై రకాలు
ఎందుకు దండగ
ఆదరణతో పెట్టిన మూడు ముద్దలు
అతిధికి ఎంతో ఆనందం.
పెళ్లి భోజనం పరుగులు తీయించకూడదు
ఆస్వాదించాలి ఆశీర్వదించాలి
కన్నుల పండుగ చూపించాల్సిన వేడుకలో,
కన్నీరు తెప్పించకూడదు భూమి కంటిలో!
పెళ్లి ఒక్కరోజు – కానీ ప్లాస్టిక్ జీవితం వందల ఏళ్లు,
అది పడి ఉంటే భవిష్యత్తు మిగిలేదేంటీ?
పెళ్ళిళ్ళు పసందైన భోజనాలకే కాదు,
పసిపిల్లల భవిష్యత్తుకూ మార్గదర్శకాలు కావాలి!
ఊరంతా వచ్చి ఆశీర్వదించే వేళ,
ప్రకృతిని కూడా పిలుద్దాం, ఆనందించేలా!
పదిలంగా ఉన్న సంప్రదాయమే,
పరిరక్షించే మార్గం,
మన భూమికి భాగ్యం.
అనుక్షణం పర్యావరణ పరిరక్షణకు
పాటుపడదాం
ఎప్పటికో మార్పు వస్తుందని ఆశిద్దాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279