పద్య భారతి
మళ్ళించు నీ నడక ముళ్ళబాటలనుండి
పూలదోటలవైపు మరలిపొమ్ము
గమ్యమును గుర్తెరిగి గమన దిశ మార్చుకొన
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
రూకలెన్ని ఉన్న సోకులెన్ని ఉన్న
ఎండుటాకులవోలె రాలిపోవు
కనుక కాసులకన్న ఆశయాలు మిన్న
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
కోర్కె చెడ్డది కాదు
మంచి కోర్కెలుగోరు
మంచికై ముందుండి నిలిచిపోరు
నాయకులు పరగ్రహపువాసులైతేగాదు
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
తిరుగు తిరగలందు చిక్కి చితికి నలిగి
పిండగును గోధుమలు రొట్టెకొరకూ
జ్ఞానాధములకన్న గోధుమలు మిన్నగద
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
శ్వాస శ్వాసకు తగ్గునాయుష్షు జీవులకు
ధనరాశులెంతగా పెరుగుతున్నా
పెరుగు పులియక మునుపె వెన్నదీసి పంచ
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు