నా కలం
అండగా నిలిచే కండల్లోని బలం నా కలం
దప్పిక తీర్చే కుండలోని జలం నా కలం
అజ్ఞాన తిమిరాన్ని తురిమే కరవాలం నా కలం
ఆత్మిక సుగంధాన్ని గుభాళించే కమలం నా కలం
కుల వ్యాకులమంటని కవి కుల తిలకం నా కలం
కోకిల గానం నెమలి నాట్యం కలగలసిన రూపం నా కలం
ఎన్నటికీ కొండెక్కని దీపం నా కలం
ఎప్పటికీ ఆరిపోని అగరొత్తుల ధూపం నా కలం
రామ లక్ష్మణుల రక్షణకై హనుమంతుడు చుట్టిన తోక నా కలం
ఐదు పడగల పాము తలతిక్క దించిన కృష్ణయ్య నెత్తికెక్కిన నెమలీక నా కలం
శివుని దీవెన నా కలం
పావన భావనల వాహిని నా కలం
గుప్పెడంత గుండెలో నెత్తురు నింపే నరం నా కలం
పొడి పొడి మాటల మూటను పాటల పూదోట చేసే స్వరం నా కలం
శుభ భావ జలం జాలువారే జలపాతం నా కలం
ఉన్నత శిఖరాలపై ఎగిరే శాంతి కపోతం నా కలం
కార్తికేయుని జయ పతాకం లో కనిపించే కుక్కుటం నా కలం
సంక్రాంతి శోభకు సందడి తెచ్చే గాలిపటం నా కలం
నిజాల బీజాలను మొలిపించే పొలం నా కలం
మంచిని మింగే తిమింగళాలకు వేసిన గేలం నా కలం
వేళ్ళ మధ్యన వెలిగే వెన్నెల పుష్పం నా కలం
కనుసన్నల్లో చిగురించే చిరునవ్వు నా కలం
సిరా పారే నిర్జీవ నాళం కాదు నా కలం
సకల శాస్త్రాల సారం నిండిన కమండలం నా కలం
దిశదశలు తెలియక తెగ తిరిగే గ్రహ శకలం కాదు నా కలం
దశావతారాల తత్వ దర్శనం చేయించే సుదర్శనం నా కలం
వ్యధల బాధల వేదనలపై గదాఘాతం నా కలం
నిద్రిత జగతిని మేల్కొల్పే శంఖనాదం నా కలం
కచ్ఛితత్వపు కత్తికి పిడి నా కలం
నూతన ఒరవడికి అడుగులు నేర్పే అమ్మ ఒడి నా కలం