బొమ్మల పెళ్లి
మండు తున్న ఎండాకాలం
పిల్లలందరికీ ఆటవిడుపు కాలం
మధ్యాహ్నం అమ్మ నడవలో సేదతీరే వేళ
పెరడులోని మామిడి చెట్టు కింద పెళ్లి సంబరం
గుబురుగా ఉన్న గున్న మామిడి పెళ్లి పందిరి
కొమ్మ కొమ్మకు కట్టుకుంది పచ్చటి తోరణం
చెట్టు దిగకుండానే కోయిల ఊదుతోంది నాదస్వరం
బొమ్మలన్నిటికీ ప్రాణం పోసేది ఆ బ్రహ్మ
ఈ పుత్తడిబొమ్మలను తయారు చేసేది ఈ పరబ్రహ్మ.
గట్టుమీద తాటి మాను తల తాకట్టు పెట్టి
వధూవరులై పెళ్లి పీటలెక్కింది.
అమ్మ పట్టుచీర ముక్క
నాన్న జరీ అంచుల చాపులో ముక్క
కట్టుకుని నుదుటన తిలకం పెట్టుకొని
దిష్టి చుక్క పెట్టుకుని ముద్దొచ్చేలా ఉన్నాయి తాటాకు బొమ్మలు
పక్కింటి పసిపాపలు
ఇంటిలోని వరాల మూటలు
ఎదురింటిలోని ముద్దుగుమ్మలు
గున్న మామిడి కి ఆపక్క ఈ పక్క చేరి
పెళ్లి పెద్దలై జరిపించారు కళ్యాణం
అమ్మ పెట్టిన తాయిలమే విందు భోజనం.
తాయిలాలు పంచుకుని తలో ప్రక్క
చెదిరిపోయారు
బొమ్మల పెళ్లి అయిపోయింది.
గుడిలో ఉండే దేవుళ్ళకి ప్రతి ఏటా కళ్యాణం.
ఈ ఆటల పెళ్ళికి ప్రతి వేసవి ఒక ముహూర్తమే.
బాల్యంలో మర్చిపోలేని ఆట
మధురానుభూతి మిగిల్చిన ఆట.
ఆరోగ్యకరమైన ఆనందపు పూదోట
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
.