ఊపిరి ఇచ్చే బొమ్మ
అవును
నాకు జాలి వేస్తోంది...
మిమ్మల్ని అందరిని చూసి
మండే ఎండల్లో దారి పక్కన నిలబడి
కాస్త చల్లగాలి వీచి చెమట చుక్కలు తుడిచేదాన్ని
కాసేపు మనసు కుదుట పడిచేదాన్ని.
చిటారు కొమ్మునున్న మిఠాయి పొట్లం చూపించి
డొక్క నింపే దాన్ని.
విషమంతా నేనే మింగేసి
కాస్త ఊపిరి పోసే దాన్ని.
ఆకాశం మీదకి ఆవిరిని మోసుకు పోయి
నీటి చుక్కను మో సుకొచ్చి
అందరి గొంతులను తడిపి
నేను కూడా దాహం తీర్చుకునేదాన్ని.
అందమైన పువ్వుల్ని
ఆరాధనకి ఇచ్చి
మీ గూడుకు నేను తోడునై.
మానని గాయానికి ఔషధమై
చివరకి చితి మంట కి సమిధ నయ్యే నేస్తాన్ని.
అమ్మ ప్రాణం పోస్తే నేను ఊపిరి ఇచ్చే బొమ్మని
అమ్మని శరణాలయానికి
ఈ ఊపిరి నిచ్చే బొమ్మని
నిర్ధాక్షిణ్యంగా ముక్కలు చేసి
నగరం పెరిగిందని ఆనందపడి
ఆకాశాన్నంటే భవనాలు లేపి
కాలుష్యం ఊపిరి లాగేస్తోంది
మండే ఎండలు గుండెను మండిస్తున్నాయి
అంటూ గుండెలు బాదుకుంటే
ఏమి చేయగలను.
అయినా మించిపోయింది లేదు
మీరు నాకు ప్రాణం పోయండి
నేను జీవితాంతం మీకు జీవం పోస్తాను.
నేను సజీవంగా ఉంటే
అమ్మలా ఆదరిస్తాను
భగవంతుడిలా ప్రాణం పోస్తాను.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279