Quotes by M C V SUBBA RAO in Bitesapp read free

M C V SUBBA RAO

M C V SUBBA RAO Matrubharti Verified

@mcv
(7)

జై జవాన్

నువ్వు మాకంటే
ఎందుకు విభిన్నం

లోకానికి తెలియ చెప్పాలన్నదే
ప్రయత్నం.

తలకి రక్షణ కవచం
పెట్టుకోవాలంటే
మాకు బద్ధకం

కానీ
నీ తల మీద కవచం
దేశ రక్షణకు
ధీర సంకల్పం,

ఏడాదికో రెండుసార్లు
జెండాకు వందనం చేస్తాం.

జెండా కనిపించినప్పుడల్లా
గౌరవ వందనం చేస్తూనే ఉంటావు.

మా కళ్ళు అడ్డమైనదారులు
వెతుక్కుంటాయి.

నీ కళ్ళు శత్రువులని ఇట్టే
పసిగడతాయి.

నిదుర లేదు, అలసట లేదు –
నీకు దేశ రక్షణ తపన ఒకటే.

మేము సమయం మించి
ఏ పని చేయలేం
మా రక్షణకి నువ్వు ఉన్నావు
అనే ధైర్యం

మా చెవులకు వినిపించేవి
చెప్పుడు మాటలు

శత్రువుల తుపాకీ చప్పుళ్ళు
ఎప్పుడూ నీ చెవిలో మారు మ్రోగుతూ
ఉంటాయి.

ఉదయమే నీ గొంతులో వినిపించేది
వందేమాతరం.
రేడియోలో వందేమాతర గీతానికి
గొంతు కలపని దౌర్భాగ్యం మాది.

ప్రకృతి బీభత్సంలో మాకు నువ్వు
ఆపద్బాంధవుడివి.
బాధితులకు ఆశ్రయిస్తుంది నీ హస్తం
యుద్ధంలో శత్రువుల పాలిట
భస్మాసుర హస్తం కూడా అదే.
నీ చేతులు శత్రువుల రక్తంతో
తడిసిపోయి ఉంటే
మా చేతితో పట్టుకున్న
నల్లధనం మురికితో
మెరుస్తున్నాయి.

ఎంతైనా నీ వృత్తి నీ జన్మకి
సార్ధకత ఇచ్చింది.

సైనికుడు అంటే మాలో
గౌరవం పెంచింది.

మేము డిగ్రీలు సంపాదించిన
నిరుద్యోగులుగా మిగిలిపోయాం

గుండె బలం
కండబలం
తల్లితండ్రుల వారసత్వ బలం
నిన్ను నెల జీతగాడిగా నిలబెట్టింది

నీ వెన్నెముక –
ధైర్యానికి నిలువు స్తంభం,
శత్రువుల తుపాకీ చప్పుళ్ళకి
మా వెన్నులో జలదరింపు
అదే మా నైజo
శత్రువు అంటే భయం లేదు
నీ గుండెలో

బాణసంచా శబ్దాలకి కూడా
భయమే మాకు

ఎండల్లో వానల్లో
మంచు ముక్కల మధ్య
నీ కాపురం.
అయినా ఉక్కులా చెక్కు
చెదరదు నీ శరీరం .

చలువక్రీములు ,లోషన్లు
పూత పూసుకోనిదే
గడవదు మాకు ప్రతి దినం

మాకు ఇంచక్కా ఎక్కడ పడితే
అక్కడ రహదారులు
మంచులో బూట్లు కూరుకు పోతున్న
జారి పడిపోతున్న ఆగదు నీ పయనం.
నీకున్న అవకాశం
ఓ అడుగు వెనక్కి కాదు –
అంతా ముందుకు
గమనం మాత్రమే.

ముందడుగు ఆచితూచి వేస్తాం
మేము స్వేచ్ఛ జీవులం

మీ పాదరక్షలకి
మాతృభూమి ధూళి అలంకారం
మెరిసిపోయే బూట్లు
మా కాళ్ళకి అలంకారం.

నీ రక్తం నిన్ను ప్రతిరోజు
పలకరిస్తూనే ఉంటుంది
సల సలా మరుగుతూనే ఉంటుంది.
అది నీకు అలవాటైపోయిన దినచర్య.

గోరుచితికి రక్తం చిమ్మితే
తలుచుకుని బాధపడతాం
మేము రోజంతా

నీ శరీరం సర్వం –
యుద్ధభూమికి అంకితంగా
మారిన దేవాలయం,
నీ జీవితం –
భద్రతకో యజ్ఞంగా
నిలిచిన దీక్షాగృహం.

మువ్వన్నెల జెండాకి
నువ్వంటే ఎంతో ఇష్టం
ఆఖరి యాత్రలో
నీ వెంటే ఉంటుంది.

అందుకే నువ్వు
విభిన్నం మాకంటే

-

Read More

పెళ్లి పందిరిలో ప్రకృతి పండగ

పెళ్లంటే నూరేళ్ల పంట
కలకాలపు వలపుల పంట

భూమాత వేదికగా వచ్చింది.
ఆకాశం పందిరిగా నిలిచింది
పచ్చటి చెట్టు తోరణమై అలంకరించింది

మూడు ముళ్ళకి సాక్షిగా అగ్ని నిలిచాడు
పెళ్ళివారికి వాయువు సుగంధ మై వీచింది
వరుణదేవుడు పన్నీరై పులకరింప చేశాడు.

పంచభూతాలే పెళ్లికి సేవలు చేస్తుంటే
పర్యావరణం పాడు చేసే ప్లాస్టిక్ ఎందుకు

పండగ పూట పచ్చదనం పూయాలి!
పెళ్లి మండపం పూలతో నిండాలి,
కానీ ప్లాస్టిక్ డెకరేషన్లకు ఆమోదం వద్దు!

తలంబ్రాలు వేడుక సనాతనంగా
జరగనిస్తేనే ముద్దు.
మధ్యలో వచ్చినవి
మరిచిపోవడమే మన హద్దు.
వియ్యాలవారి విందుకి
అధునాతనమైన హంగులు ఎందుకు .

ప్రమాదమని తెలిసినా
దాని పక్కకు చేరడం ఎందుకు

కమ్మని కాఫీ కి
నీటిలో కరిగిపోయే మట్టి పాత్ర ముద్దు.

గొంతు ఎండిపోతుంటే
గొంతులో కాకుండా
ఒంటి మీద పడే గ్లాసుతో నీళ్లు
ఇచ్చే సాంప్రదాయం మనకి వద్దు

ఆకుపచ్చ అరిటాకు విందుకు అందం.
లేకపోతే కుట్టుడాకు మన సాంప్రదాయం.

విందుకు ముప్పై రకాలు
ఎందుకు దండగ
ఆదరణతో పెట్టిన మూడు ముద్దలు
అతిధికి ఎంతో ఆనందం.

పెళ్లి భోజనం పరుగులు తీయించకూడదు
ఆస్వాదించాలి ఆశీర్వదించాలి

కన్నుల పండుగ చూపించాల్సిన వేడుకలో,
కన్నీరు తెప్పించకూడదు భూమి కంటిలో!

పెళ్లి ఒక్కరోజు – కానీ ప్లాస్టిక్ జీవితం వందల ఏళ్లు,
అది పడి ఉంటే భవిష్యత్తు మిగిలేదేంటీ?

పెళ్ళిళ్ళు పసందైన భోజనాలకే కాదు,
పసిపిల్లల భవిష్యత్తుకూ మార్గదర్శకాలు కావాలి!
ఊరంతా వచ్చి ఆశీర్వదించే వేళ,
ప్రకృతిని కూడా పిలుద్దాం, ఆనందించేలా!

పదిలంగా ఉన్న సంప్రదాయమే,
పరిరక్షించే మార్గం,
మన భూమికి భాగ్యం.

అనుక్షణం పర్యావరణ పరిరక్షణకు
పాటుపడదాం
ఎప్పటికో మార్పు వస్తుందని ఆశిద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

Read More

కుండ

మట్టిలో పుట్టిన మాణిక్యం
నరుడికి వేసవి తాపం తీర్చే అమృతభాండం

రంగు నల్ల బంగారం
గుండె శీతలయంత్రం

తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితం
చెయ్యి జారితే ముక్కలయ్యే కుంభం

సప్తస్వరములు పలికిస్తే అది ఘటం
నోరూరించే ఊరగాయకి అదే ఆధారం

సాదరంగా ఆహ్వానించేది పూర్ణకుంభం
కడవరకు సాగనంపే ఆత్మీయ భాండం

జోరుగా కురిసే వర్షం కుండ పోత
మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే
వట్టి మట్టి పూత.

కాకి బావకు దాహం తీర్చే
సన్న మూతి కూజా

వేసవి వచ్చిందంటే
గొంతును చల్లబరిచే తర్బూజ.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

Read More

ఏది మనది

రోదిస్తున్న పసి గుడ్డుని
ఊయలలో వేసి నిద్రపుచ్చుతుంది అమ్మ.

పెరిగే భారం భరించలేక
ఉయ్యాలలా ఊగింది భూమాత.

కాళ్ళ కింద భూమి
వణికిన వేళ

ఆకాశాన్ని తాకిన మేడలు
అమ్మ ఒడి చేరిపోయాయి.

కలల సౌధాల కింద
బతుకులన్నీ బుగ్గి అయిపోయాయి

నాది అనుకున్న ది
నన్నే బలి తీసుకుంది
నీడనిచ్చిన గూడు
నా సమాధి అయింది

అశాశ్వతమైన ఆనందం
క్షణాల్లో ఆవిరయ్యింది.

రక్తసంబంధం,
కలుపుకున్న బంధం,
పెంచుకున్న స్నేహబంధం,
అన్ని ఒకే క్షణంలో
చిరునామా మార్చుకున్నాయి.

గాలి తాకిన రేణువులా
ఆశలు క్షణంలో అదృశ్యం

కొండంత కోరికలతో
కోట్లు సంపాదించాలని ఆశయం

మానవ మనుగడే ప్రశ్నార్థకం
ఎందుకో ఈ తాపత్రయం

ఏది మనది?
ఏది మిగిలేది ?

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కా కినాడ
9491792279

Read More

.మాకు వరం

నిజంగా ఆ ఊరు మాకు వరమే

పాపాలన్నీ కడిగే పంపానది

కోరిన వెంటనే వరాలు ఇచ్చే స్వామిని

వరాలిచ్చే స్వామిని మోసే రత్నగిరిని

అందంగా అక్కున చేర్చుకున్న అన్నవరం

నిజంగా మాకు వరమే.

కొత్త గా జీవితంలో అప్పుడే అడుగు పెట్టిన వాళ్ళు

జీవితాన్ని రుచి చూసిన వాళ్ళు

కులమతాలు ఏమైతే నేమి

వ్రతం పట్టి మొక్కు తీర్చుకొని

కళ్ళకు అద్దుకోవడం కూడా మర్చిపోయి

ఆత్రుతగా అడ్డాకులోని అమృతాన్ని

నోటికి అందిస్తే స్వర్గమే కనబడింది.

ఆ అమృతం దేవతలు తయారు చేస్తారేమో

అందుకే అంత అద్భుతమైన రుచి.

ఎర్రగా బుర్రగా ఉండి

నలుచదరంగా ఆకులో తేలిపోతూ ఉంటుంది.

చెయ్యి తిరిగిన అమ్మ చేయలేని అమృతం.

స్వామి వారు తయారీలో చెయ్యవేస్తారేమో

ప్రసాదంలా కాదు పరమాన్నంలా తినాలి అనిపిస్తుంది

అన్నవరంలో ఉండిపోవాలనిపిస్తుంది

రోజు ప్రసాదం తినొచ్చని

ఆకును అంటిన ఆఖరి ప్రసాదం కూడా
నాలికతో నాకేస్తాం.

రహదారిలోనూ గుడిమెట్లలోను
వేడిగా దొరికిన ప్రసాదాన్ని ఆత్రుతగా కొనుక్కుంటాం.
నిజంగా అన్నవరం మాకు వరమే.

పంపానది పరవళ్ళు
రత్నగిరి సొగసులు
చూసి సమయం మర్చిపోయి
పిడపర్తి వారి కాల నిర్ణయ గడియారం చూసి మురిసిపోయి
రత్నగిరి పేరెట్టుకుని
రయ్యమని దూసుకుపోయే
రత్నాచల్ లో ముందుకు సాగిపోయా
నిజంగా అన్నవరం మాకు వరమే.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279

Read More

బొమ్మల పెళ్లి

మండు తున్న ఎండాకాలం
పిల్లలందరికీ ఆటవిడుపు కాలం

మధ్యాహ్నం అమ్మ నడవలో సేదతీరే వేళ
పెరడులోని మామిడి చెట్టు కింద పెళ్లి సంబరం

గుబురుగా ఉన్న గున్న మామిడి పెళ్లి పందిరి
కొమ్మ కొమ్మకు కట్టుకుంది పచ్చటి తోరణం

చెట్టు దిగకుండానే కోయిల ఊదుతోంది నాదస్వరం
బొమ్మలన్నిటికీ ప్రాణం పోసేది ఆ బ్రహ్మ

ఈ పుత్తడిబొమ్మలను తయారు చేసేది ఈ పరబ్రహ్మ.
గట్టుమీద తాటి మాను తల తాకట్టు పెట్టి
వధూవరులై పెళ్లి పీటలెక్కింది.

అమ్మ పట్టుచీర ముక్క
నాన్న జరీ అంచుల చాపులో ముక్క
కట్టుకుని నుదుటన తిలకం పెట్టుకొని
దిష్టి చుక్క పెట్టుకుని ముద్దొచ్చేలా ఉన్నాయి తాటాకు బొమ్మలు

పక్కింటి పసిపాపలు
ఇంటిలోని వరాల మూటలు
ఎదురింటిలోని ముద్దుగుమ్మలు

గున్న మామిడి కి ఆపక్క ఈ పక్క చేరి
పెళ్లి పెద్దలై జరిపించారు కళ్యాణం
అమ్మ పెట్టిన తాయిలమే విందు భోజనం.

తాయిలాలు పంచుకుని తలో ప్రక్క
చెదిరిపోయారు
బొమ్మల పెళ్లి అయిపోయింది.

గుడిలో ఉండే దేవుళ్ళకి ప్రతి ఏటా కళ్యాణం.
ఈ ఆటల పెళ్ళికి ప్రతి వేసవి ఒక ముహూర్తమే.

బాల్యంలో మర్చిపోలేని ఆట
మధురానుభూతి మిగిల్చిన ఆట.
ఆరోగ్యకరమైన ఆనందపు పూదోట

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

.

Read More

గుండె

నా గుండె గుప్పెడంత
మోసే బరువులు కొండంత

సంతోషాన్ని పంచేది అదే
దుఃఖాన్ని దాచిపెట్టలేనిది అదే

ప్రేమను ఊయలలు ఊపేది అదే
పగకు కడగండ్లు పెట్టేది అదే

ఈ మట్టి బొమ్మ నడవాలంటే ఇంధనం పంపు చేసేది అదే.
మనసుకి మంత్రం వేసేది అదే
మాయ చేసేది కూడా అదే.

పరిస్థితులను ఒప్పించేది
పరిమితులను మరిపించేది అదే.

గాయాన్ని తట్టుకోలేదు
గాబరాని ఆపలేదు.

చిన్న మాటతో సంతోషం
పెద్ద పెద్ద మాటలు అంటే బాధపడేది అదే.

కలతలన్నీ సర్దుకుని దాచుకునేది అదే
నన్ను కంగారు పెట్టి నా రక్తం మరిగించేది అదే.

నా నరాల్లో రక్తం ఉరకలెత్తి
మెదడును మరిగించేసి
నా గుండెకు తీర్పు చెప్పేసింది.

దాన కర్ణుడని నాకు బిరుదులిప్పించి
ఆగమేఘాల మీద చేరవలసిన చోటుకు చేరిపోయి
ఆగిపోతున్న ఊపిరికి చేతులు అడ్డం పెట్టేసింది.

నా గుండె ఒకరికి జీవం పోసింది
జన్మనిచ్చిన తల్లిదండ్రుల కళ్ళల్లో నెమ్మది నింపింది
కట్టుకున్న భార్య వ్రత ఫలం దక్కించేలా చేసింది.
కన్న బిడ్డలకి తండ్రిని మిగిల్చింది.

మట్టిలో కలవవలసిన నా గుండె
మరొకరి క్షణాలను చిరునవ్వులుగా మార్చింది

నేను లేకపోయినా
నా గుండె శబ్దం వినిపిస్తునంత సేపు
నా జీవితం ఎవరికో వెలుగు తీరుగా నిలుస్తుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

Read More

మాయమైన నేస్తం

నీ స్వరం కోకిల స్వరం కాదు
అయినా అది మాకు వీనుల విందు.

ఆకారమేమో పొట్టి కానీ
నువ్వంటే మాకు మమకారం జాస్తి.

మా ఇంటి చూరు లోను ,
మా పెరటిలోని చెట్టు మీద
గూడు కట్టుకుని మాతో కలిసి సహజీవనం చేసేదానివి.

ఆ కరెంటు తీగలు మీద నువ్వు ఉయ్యాల ఊగుతుంటే
మాకు భయం వేసేది.

నీలాగా గూడెవరు కట్టలేరు
మేము ఎన్నోసార్లు ప్రయత్నించి
ఓడిపోయాం.

మాతో ఉన్నట్టే ఉంటావు
ఎప్పుడు కడతావో తెలియదు అంత అందమైన గూడు.

నీ గూడు అంటే మాకు అపురూపం
ఆ కొమ్మకి మరింత అందం.
పనిముట్లు లేకుండా పరంధాముడు ఇచ్చిన
ముక్కుతో గూడు కట్టేస్తావు.

మేము చూరులేని ఇంటిలోకి మారిపోయాం
నీకు గూడు లేకుండా అయిపోయింది .

కాపురానికి పనికొచ్చే చెట్లన్ని
కనుమరుగు అయిపోయాయి.

దొరికిందేదో తిని బిడ్డల్ని పెంచుకుని
రెక్కలొచ్చిన బిడ్డలు గూడు ఎగిరిపోతే
గూడులో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మాలాగే.

కబుర్లు మోసుకొచ్చే స్తంభాలు చూసి
మురిసిపోయం కానీ అది నిన్ను మాయం చేసిందని
ఆలస్యంగా తెలుసుకున్నాం.

జరగవలసింది ఏదో జరిగిపోయింది.
పర్యావరణ పరిరక్షణ అని పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఇప్పుడు మేడ మీద గుప్పెడు గింజలు వేసి
కాసిన్ని నీళ్లు గిన్నెలో పోసి పెడదామంటే
నీ జాడే లేదు.

ఎక్కడని వెతకం నిన్ను.
మా తరమంతా ఆనందంగా నిన్ను చూస్తూ పెరిగా ము
రాబోయే తరానికి బొమ్మ పిచ్చుకలు చూపిస్తాము.
అదే బాధగా ఉంది
సహజంగా కాదు
కృత్రిమంగా పిల్లలను పెంచుతున్నాము అని

నువ్వు పొట్టిదానివే
కానీ గట్టి దానివి
మా గుండెలు దోచిన దానివి

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279

Read More

ఊపిరి ఇచ్చే బొమ్మ

అవును

నాకు జాలి వేస్తోంది...

మిమ్మల్ని అందరిని చూసి

మండే ఎండల్లో దారి పక్కన నిలబడి

కాస్త చల్లగాలి వీచి చెమట చుక్కలు తుడిచేదాన్ని

కాసేపు మనసు కుదుట పడిచేదాన్ని.

చిటారు కొమ్మునున్న మిఠాయి పొట్లం చూపించి

డొక్క నింపే దాన్ని.

విషమంతా నేనే మింగేసి

కాస్త ఊపిరి పోసే దాన్ని.

ఆకాశం మీదకి ఆవిరిని మోసుకు పోయి

నీటి చుక్కను మో సుకొచ్చి

అందరి గొంతులను తడిపి

నేను కూడా దాహం తీర్చుకునేదాన్ని.

అందమైన పువ్వుల్ని

ఆరాధనకి ఇచ్చి

మీ గూడుకు నేను తోడునై.

మానని గాయానికి ఔషధమై

చివరకి చితి మంట కి సమిధ నయ్యే నేస్తాన్ని.

అమ్మ ప్రాణం పోస్తే నేను ఊపిరి ఇచ్చే బొమ్మని

అమ్మని శరణాలయానికి

ఈ ఊపిరి నిచ్చే బొమ్మని

నిర్ధాక్షిణ్యంగా ముక్కలు చేసి

నగరం పెరిగిందని ఆనందపడి
ఆకాశాన్నంటే భవనాలు లేపి
కాలుష్యం ఊపిరి లాగేస్తోంది

మండే ఎండలు గుండెను మండిస్తున్నాయి

అంటూ గుండెలు బాదుకుంటే

ఏమి చేయగలను.

అయినా మించిపోయింది లేదు

మీరు నాకు ప్రాణం పోయండి

నేను జీవితాంతం మీకు జీవం పోస్తాను.

నేను సజీవంగా ఉంటే

అమ్మలా ఆదరిస్తాను

భగవంతుడిలా ప్రాణం పోస్తాను.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

Read More

అందమైన మొహానికి బంగారు ముక్కెర తగిలించుకొని
ముత్యాలు లాంటి అక్షరాలతో కాగితాన్ని అలంకరిస్తుంది.

నీలిరంగు సిరా చుక్కతో ప్రాణం పోసుకుని
అందమైన అక్షరాలకు పురుడు పోస్తుంది.

సహస్రనామాలతో పిలిచిన దైవం ఒక్కడే
ఏ కలం నుండి వచ్చినా అది అక్షరమే

ఏ భాషలో లోని అక్షరమైన
కలం నుండే ప్రాణం పోసుకుంటుంది

కవికి సాయంగా ఉండి
అందమైన కావ్యాలను రాయించింది

ప్రశ్నకు జవాబులు టక్కున రాయించి
విద్యార్థి చేత విజయోత్సవాలు జరిపిస్తుంది

ఎర్ర రంగు సిరా గొంతులో పోసుకుని
జవాబులన్నింటికీ గురువు గారి చేత మార్కులు వేయిస్తుంది.
నిండు సున్నా వేసి మొట్టికాయలు వేస్తుంది.

అధికారి అహంకారాన్నంత
అక్షరాలుగా మలచి సంతకానికి సాయం చేసింది.

ఆ సంతకమే చిరుద్యోగికి భయం పుట్టిస్తుంది
నిరుద్యోగకి ఇంత ముద్దు పెట్టిస్తుంది

జేబులో ఠీవిగా నిలబడి అక్షరాస్యుడనే
గౌరవం తెస్తుంది.
జేబులో ఉండి దారిన పోయే దానయ్యకు
అవసరానికి సహాయపడుతుంది.

ఒళ్ళు వెచ్చగా ఉంటే అర్థం కాని భాషలో
డాక్టర్ గారి చేత మందులు చీటీ రాయిస్తుంది.

చేతిలో అందంగా ఉండి చెయ్యరాని పనులు
చేయకూడని పనులు చేస్తుంది.

పదునెక్కిన కత్తి నిలువునా ప్రాణం తీస్తుంది.
కలం అక్షరాలు నేర్పించి కలల తీరం చేరుస్తుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279

Read More