.మాకు వరం
నిజంగా ఆ ఊరు మాకు వరమే
పాపాలన్నీ కడిగే పంపానది
కోరిన వెంటనే వరాలు ఇచ్చే స్వామిని
వరాలిచ్చే స్వామిని మోసే రత్నగిరిని
అందంగా అక్కున చేర్చుకున్న అన్నవరం
నిజంగా మాకు వరమే.
కొత్త గా జీవితంలో అప్పుడే అడుగు పెట్టిన వాళ్ళు
జీవితాన్ని రుచి చూసిన వాళ్ళు
కులమతాలు ఏమైతే నేమి
వ్రతం పట్టి మొక్కు తీర్చుకొని
కళ్ళకు అద్దుకోవడం కూడా మర్చిపోయి
ఆత్రుతగా అడ్డాకులోని అమృతాన్ని
నోటికి అందిస్తే స్వర్గమే కనబడింది.
ఆ అమృతం దేవతలు తయారు చేస్తారేమో
అందుకే అంత అద్భుతమైన రుచి.
ఎర్రగా బుర్రగా ఉండి
నలుచదరంగా ఆకులో తేలిపోతూ ఉంటుంది.
చెయ్యి తిరిగిన అమ్మ చేయలేని అమృతం.
స్వామి వారు తయారీలో చెయ్యవేస్తారేమో
ప్రసాదంలా కాదు పరమాన్నంలా తినాలి అనిపిస్తుంది
అన్నవరంలో ఉండిపోవాలనిపిస్తుంది
రోజు ప్రసాదం తినొచ్చని
ఆకును అంటిన ఆఖరి ప్రసాదం కూడా
నాలికతో నాకేస్తాం.
రహదారిలోనూ గుడిమెట్లలోను
వేడిగా దొరికిన ప్రసాదాన్ని ఆత్రుతగా కొనుక్కుంటాం.
నిజంగా అన్నవరం మాకు వరమే.
పంపానది పరవళ్ళు
రత్నగిరి సొగసులు
చూసి సమయం మర్చిపోయి
పిడపర్తి వారి కాల నిర్ణయ గడియారం చూసి మురిసిపోయి
రత్నగిరి పేరెట్టుకుని
రయ్యమని దూసుకుపోయే
రత్నాచల్ లో ముందుకు సాగిపోయా
నిజంగా అన్నవరం మాకు వరమే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279