జై జవాన్
నువ్వు మాకంటే
ఎందుకు విభిన్నం
లోకానికి తెలియ చెప్పాలన్నదే
ప్రయత్నం.
తలకి రక్షణ కవచం
పెట్టుకోవాలంటే
మాకు బద్ధకం
కానీ
నీ తల మీద కవచం
దేశ రక్షణకు
ధీర సంకల్పం,
ఏడాదికో రెండుసార్లు
జెండాకు వందనం చేస్తాం.
జెండా కనిపించినప్పుడల్లా
గౌరవ వందనం చేస్తూనే ఉంటావు.
మా కళ్ళు అడ్డమైనదారులు
వెతుక్కుంటాయి.
నీ కళ్ళు శత్రువులని ఇట్టే
పసిగడతాయి.
నిదుర లేదు, అలసట లేదు –
నీకు దేశ రక్షణ తపన ఒకటే.
మేము సమయం మించి
ఏ పని చేయలేం
మా రక్షణకి నువ్వు ఉన్నావు
అనే ధైర్యం
మా చెవులకు వినిపించేవి
చెప్పుడు మాటలు
శత్రువుల తుపాకీ చప్పుళ్ళు
ఎప్పుడూ నీ చెవిలో మారు మ్రోగుతూ
ఉంటాయి.
ఉదయమే నీ గొంతులో వినిపించేది
వందేమాతరం.
రేడియోలో వందేమాతర గీతానికి
గొంతు కలపని దౌర్భాగ్యం మాది.
ప్రకృతి బీభత్సంలో మాకు నువ్వు
ఆపద్బాంధవుడివి.
బాధితులకు ఆశ్రయిస్తుంది నీ హస్తం
యుద్ధంలో శత్రువుల పాలిట
భస్మాసుర హస్తం కూడా అదే.
నీ చేతులు శత్రువుల రక్తంతో
తడిసిపోయి ఉంటే
మా చేతితో పట్టుకున్న
నల్లధనం మురికితో
మెరుస్తున్నాయి.
ఎంతైనా నీ వృత్తి నీ జన్మకి
సార్ధకత ఇచ్చింది.
సైనికుడు అంటే మాలో
గౌరవం పెంచింది.
మేము డిగ్రీలు సంపాదించిన
నిరుద్యోగులుగా మిగిలిపోయాం
గుండె బలం
కండబలం
తల్లితండ్రుల వారసత్వ బలం
నిన్ను నెల జీతగాడిగా నిలబెట్టింది
నీ వెన్నెముక –
ధైర్యానికి నిలువు స్తంభం,
శత్రువుల తుపాకీ చప్పుళ్ళకి
మా వెన్నులో జలదరింపు
అదే మా నైజo
శత్రువు అంటే భయం లేదు
నీ గుండెలో
బాణసంచా శబ్దాలకి కూడా
భయమే మాకు
ఎండల్లో వానల్లో
మంచు ముక్కల మధ్య
నీ కాపురం.
అయినా ఉక్కులా చెక్కు
చెదరదు నీ శరీరం .
చలువక్రీములు ,లోషన్లు
పూత పూసుకోనిదే
గడవదు మాకు ప్రతి దినం
మాకు ఇంచక్కా ఎక్కడ పడితే
అక్కడ రహదారులు
మంచులో బూట్లు కూరుకు పోతున్న
జారి పడిపోతున్న ఆగదు నీ పయనం.
నీకున్న అవకాశం
ఓ అడుగు వెనక్కి కాదు –
అంతా ముందుకు
గమనం మాత్రమే.
ముందడుగు ఆచితూచి వేస్తాం
మేము స్వేచ్ఛ జీవులం
మీ పాదరక్షలకి
మాతృభూమి ధూళి అలంకారం
మెరిసిపోయే బూట్లు
మా కాళ్ళకి అలంకారం.
నీ రక్తం నిన్ను ప్రతిరోజు
పలకరిస్తూనే ఉంటుంది
సల సలా మరుగుతూనే ఉంటుంది.
అది నీకు అలవాటైపోయిన దినచర్య.
గోరుచితికి రక్తం చిమ్మితే
తలుచుకుని బాధపడతాం
మేము రోజంతా
నీ శరీరం సర్వం –
యుద్ధభూమికి అంకితంగా
మారిన దేవాలయం,
నీ జీవితం –
భద్రతకో యజ్ఞంగా
నిలిచిన దీక్షాగృహం.
మువ్వన్నెల జెండాకి
నువ్వంటే ఎంతో ఇష్టం
ఆఖరి యాత్రలో
నీ వెంటే ఉంటుంది.
అందుకే నువ్వు
విభిన్నం మాకంటే
-