ఎన్నేళ్లకొచ్చిన ఈ రాయలసీమ గడ్డ మీదకి?
కర్నూలు సీమ పల్లె దారిలో అడుగుపెడితే...
కళ్ల ముందర ఊరుందిగానీ, నా చిన్నతనం కనబడదే!
ఇక్కడే కద్యా అప్పట్లో...
మా పశువుల్ని (ఎద్దులను)తోలుకొని మేపులకి వచ్చింది!
ఎర్రటి బండరాళ్లెక్కి, కేకలేసుకుంటూ గంతులేసింది!
ఇక్కడే కాసిన ఆ గుబురు సీతాఫలాలు కోసి,
పచ్చిగా ఉన్నాయని ఆ పచ్చని గడ్డిలో దాచిపెట్టి...
అవి మాగి, పండుగ రంగు పులుముకున్నాక...
ఎంత కమ్మగా ఆరగించేటోళ్లం!
ఇప్పుడు చూడు... ఆ గడ్డీ లేదు, ఆ చెట్లూ లేవు,
కళ్ల ముందర ఆడుకున్న ఆ పెద్ద బండరాళ్లే కరువయ్యాయి!
ఇక ఆ బండరాళ్ల సందుల్లో... ఆ బంగారు తేనె కోసం మేం చేసిన రచ్చ అంతాఇంతా కాదు మవా!
ఎండిన ఆవు పేడను తెచ్చి అంటించి, ఆ దట్టమైన పొగతో ఆ తేనెటీగల్ని తరిమేవాళ్లం.
అయినా అవి వదలక ముమ్మరంగా దాడి చేసి మొహాలన్నీ కుట్టేసేవి!
ఉదయం కల్లా మొహాలన్నీ వాచి, కళ్లు సగానికి మూసుకుపోయి బెలూన్లలా తయారయ్యేవి!
అయినాసరే సిగ్గుపడకుండా, మొహానికి ఆ మచ్చలతోనే అలాగే స్కూల్‌కి బరితెగించి పోయేటోళ్లం!
కానీ, ఇప్పుడేంది మవా పరిస్థితి?
ఆ తేనెటీగలు గూడు కట్టడానికి ఆ చెట్లు లేవు,
పుప్పొడి తెచ్చి మకరందం నింపడానికి ఆ పూల మొక్కల జాడే లేదు!
ఆ వాన కాలంలో...
ఈ బండమీద పడిన వాన గుంట నీళ్లే కదా మేం తాగింది!
ఇప్పుడు ఆకాశం కరుణించక, వానలు లేక,
ఆ చెలకల్లో గుక్కెడు నీళ్లు కూడా దొరకనంటున్నాయి.
చిన్నప్పుడు...
ఈ గుట్టల మీద, ఆ పుట్టల కాడ...
వాన పడ్డ కొత్తలో గుట్టలు గుట్టలుగా పుట్టగొడుగులు పుట్టేవి!
మా జెబ్బా వాటిని తెచ్చి జేజి చేతిలో పెట్టేవాడు...
కానీ, ఇప్పుడేంది దేవుడా?
ఆ గుట్టల జాడే లేదు, ఆ పుట్టగొడుగుల మాటే లేదు!
ఇసుక కోసం, మట్టి కోసం ఆ గుట్టల్నే పిండేసి కరిగించేసారు!
కాలం మారిన కొద్దీ ఊరు మారిపోయింది,
మా చిన్ననాటి జ్ఞాపకాల గుర్తులు కూడా చెరిగిపోయాయి.
పచ్చగా, బతికి ఉన్న మా ఊరు...
ఇప్పుడు కళ్ల ముందర ఒక వెలవెలబోయే జ్ఞాపకం అయిపాయె!