Vennela Poolu - 12 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెన్నెల పూలు - 12

Featured Books
Categories
Share

వెన్నెల పూలు - 12

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

దీర్ఘం గా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అభినవ్.

"మీలో లోపం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?" తనూజ అడిగింది

"పెళ్లయ్యేవరకూ తెలీదు. తెలిసిఉంటే నేనసలు పెళ్లిచేసుకునేవాడినే కాదు." నిట్టూర్చాడు అభినవ్.

“మీలో సమస్య ఉందని మీకు పెళ్లయ్యాకే గదా తెలిసింది? మీరెవరన్న సెక్స్ స్పెషలిస్ట్ ని చూసే అవకాశం ఇచ్చిందా ఆ అమ్మాయి?”

“నాలోనే సమస్య ఉందని మీరెలా ఊహించారు ముందే?”

“ఈ ఇంపొటెన్సీ అన్నది నూటికి తొంభై శాతం మగాళ్లకే ఆపాదించబడుతుంది. అదీ కేవలం అపోహలతో, అర్ధం చేసుకోలేక. కానీ పరిశోధనల్లో తేలిందేమిటి అంటే అసలు ఇంపొటెన్సీ అన్నదే లేదు.”

“లేదు మేడం. నేను నిజంగానే ఇంపోటెంట్. తనకది నేను అసలు చెయ్యలేకపోయాను. తన ఫ్రస్ట్రేషన్ లో న్యాయం వుంది.” వేదనగా అన్నాడు అభినవ్.

“కానీ మీరు ఇంపోటెంట్ అన్న విషయం మీకు కేవలం ఫస్ట్ నైట్ రోజున మాత్రమే తెలిసింది. అంతకు ముందు మీరెప్పుడూ ఇంపోటెంట్ అని మీరు అనుకోలేదు. ఎందుకంటే మీలో భావాలు అవీ అన్నీ మామూలుగా ఉండేవి. అలాగే మీరది ఎవరితోనూ ట్రై చేసి వుండలేదు కూడా.” కుర్చీలో ఇంకొంచం సర్దుకుని కూచుంటూ అంది తనూజ.

“యూ ఆర్ అబిసోల్యూట్లీ రైట్ మేడం.” ఆశ్చర్యం తో అన్నాడు అభినవ్.

 “లుక్ అభి ............” ముందుకు వంగి బల్లమీద తన రెండు మోచేతులు బాలన్స్ చేసుకుని అతని మొహం లోకి చూస్తూ అంది. “.......... పెళ్ళికి ముందు ఆ విషయం లో ఏ అనుభవం లేని మగాడు ఆ సమయం లో తడబడడం, ఫెయిల్ అవ్వడం చాలా సహజం అయిన విషయం. ఆ సమయం లో భార్య కూడా కో-ఆపేరెట్ చేస్తే చాలా ఈజీ గా ఆ సమస్యని అధిగమించొచ్చు.”

అభినవ్ దీర్ఘం గా నిట్టూర్చాడు తప్ప ఏం మాట్లాడలేదు.

“మీరిద్దరూ చాలా చూడముచ్చటైన జంటగా కనిపిస్తున్నారు. వయసులో కూడా చాలా చిన్న. అందుకనే నేను చెప్తున్నాను. ఒక్కసారి కలిసికూచుని ఆలోచించండి. నేనూ మీతో డిస్కస్ చెయ్యడానికి సిద్ధం గా వున్నాను. విడిపోయాక మీరు మారు పెళ్ళివాళ్లే అవతారు తప్ప, మొదటి పెళ్ళివాళ్ళలా ఎవరూ చూడరు. ఈ అపోహ పోగొట్టుకుంటే మీరిద్దరూ కలిసిజీవించినంత ఆనందంగా, మరొక పార్టనర్ తో కలిసిజీవించలేరు.”    

“మాకు అటువంటి అవకాశం లేదు. మీరు ఎలాగన్నా మమ్మల్ని కలిపిఉంచాలన్న ప్రయత్నం ఆపి, మాకు త్వరగా విడాకులు వచ్చేలా చూడండి.” ఇరిటేటింగ్ గా అన్నాడు అభినవ్.

“మీది అరేంజ్డ్ మ్యారేజ్. మీ ఇద్దరికీ పెళ్ళికిముందు ఒకరితో ఒకరికి పరిచయం వుండివుండదు. అందువల్ల ఒకరినొకరు అర్ధం చేసుకోలేక ఈ సమస్య వచ్చింది. మీ ఇద్దరూ ఒక్కసారి...........”

“తను ఏం చేసిందో ఒక్క సంఘటన మీతో చెప్తే మీరింక మమ్మల్ని కలిపి ఉంచాలనే ప్రయత్నం మానేస్తారనుకుంటా.”

“చెప్పండి.” మళ్ళీ కుర్చీలో వెనక్కి జారబడుతూ అడిగింది తనూజ.

“ఒకరోజు తన ఫ్రెండ్ ని మా ఇంటికి పిలిపించుకుంది. నా కళ్ళముందే వాడితో అది చేయించుకుంది. వాడు అది చేసాక, వాడి ముందే నా మొహంలోకి చూస్తూ అడిగింది “వీడిలాగా నువ్వెప్పుడన్నానాకు చేయగలవా?” అని. అప్పుడు వాడు అన్నాడు. “నీ ప్లేస్ లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేవాణ్ణి. ఇలాంటి బతుకు బతకడం వేస్ట్.” అది చెప్పాక చేతుల్లో మొహం దాచుకుని భోరుమన్నాడు అభినవ్.

అది విన్నాక షాక్ తో తనకి తెలీకుండానే కుర్చీలోనుండి లేచి నిలబడింది తనూజ. “నిజంగానే అలా చేసిందా?"

“వాడు చెప్పినట్టుగా నాకు చనిపోవాలని అనిపించింది. కానీ దానిమొగుడిగా నాకు చనిపోవాలని లేదు. సాధ్యమైనంత త్వరగా మాకు విడాకులు వచ్చేలా చూడండి.” కళ్ళు తుడుచుకుని తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు.

“మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అలా ఇస్తే నేను మీకు సాధ్యమైనంత త్వరగా విడాకులు వచ్చేలా చేస్తాను. ప్రామిస్.”

“ఒకే. చెప్పండి నేనేం చెయ్యాలో.”

“మీరు ప్రతిరోజూ సాయంత్రం వచ్చి ఒక అరగంట నాతో స్పెండ్ చెయ్యాలి. అలాచేస్తే నేను మీకు క్విక్ గా విడాకులు వచ్చేలా చేస్తాను.” తనూజ అంది.

“ఎందుకలా?” చిత్రంగా చూస్తూ అడిగాడు అభినవ్.

“ప్లీజ్. ఎందుకని అడగొద్దు. అలా చెయ్యండి చాలు. మీరు నాకు ఫీజు కూడా ఇవ్వనవసరం లేదు. మీకు చాలా త్వరలో విడాకులు ఇప్పించేస్తాను.”

“సరే అయితే.” అలా అన్నాక అభినవ్ అక్కడనుండి వెళ్ళిపోయాడు          

&&&

ఆ తర్వాత చాలా త్వరగానే విడాకులకు అప్లై చేయించింది తనూజ. అభినవ్ కూడా సాయంత్రాలు వచ్చి తనూజ ని కలవడం ప్రారంభించాడు. ఆఫీస్ క్లోజ్ చేసి మరీ అభినవ్ తో బయటకి వెళ్తూండేది తనూజ.

తనూజ అలా చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన కారణం వుంది. ఆ రోజు తనతో మాట్లాడినప్పుడు తను, తనలో సూసైడల్ టెండెన్సీ చూసింది. జాగ్రత్తగా గైడ్ చెయ్యకపోతే , మాట్లాడకపోతే తను అంతపని చెయ్యొచ్చనే భయం తనకి కలిగింది.

“మీతో ఇలా సమయం గడపడం చాలా బాగుంది.” ఒకరోజు తామిద్దరూ బీచ్ లో కూచుని ఉండగా అన్నాడు తను. “అసలు నాతో ఇలా సమయం గడపాలని మీకు ఎందుకు అనిపించింది?”

“నాకు ఒక మంచి ఫ్రెండ్ కావాలనిపించింది. అందుకనే.” నవ్వింది తనూజ.

“నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ కొరత తీరింది. నేనలా తనకి విడాకులు ఇవ్వటం నా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా ఇష్టం లేదు. తనేమో నేనే విడాకులు కావాలంటున్నట్టుగా అందరికీ చెపుతూంది. నేనేమో అసలు విషయం ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను.”

“నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను. నీలో ఏ లోపం లేదు. ఆదికేవలం ఒక అపోహ మాత్రమే. నా మాట నమ్ము.” తను తనకి తెలీకుండానే అతనిని నువ్వు అని పిలవడం ప్రారంభించింది. అభినవ్ మాత్రం తనని జాగ్రత్తగా మీరు అనే పిలుస్తున్నాడు.

“నేను మాత్రం అలా అనుకోలేకపోతున్నాను. నేను అది తనకి అసలు ఎందుకు చెయ్యలేకపోయాను? అది తలుచుకుంటూవుంటే నాకు చాలా చిన్నతనంగా వుంది. సూసైడ్ చేసుకుని చనిపోవాలని వుంది.”

“తనకి నువ్వంటే ఇష్టం లేదు. నీతో పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించి ఉంటుంది. వాడు వదిలేసి ఎక్కడికో పోయివుంటాడు. ఎదో కారణం వల్ల పెద్దల బలవంతం మీద నిన్ను పెళ్ళిచేసుకుని ఉంటుంది. నిన్ను పెళ్లిచేసుకున్న తరువాత తనుప్రేమించినవాడు తారసపడివుండివుంటాడు. అందుకనే నిన్ను వదుల్చుకోవాలని తాపత్రయపడింది.”

దానికి అభినవ్ ఏం మాట్లాడకుండా మౌనంగానే వున్నాడు.

“ఆ రోజు తనకది చేసినవాడు తనింతకు ముందు ప్రేమించినవాడు అయివుంటాడు. నువ్వు సూసైడ్ చేసుకునేలా చేస్తే ఇలా విడాకుల గురించి బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే వాళ్ళు అలా మాట్లాడి అలా చేశారు.”

దానికి కూడా అభినవ్ ఏం మాట్లాడలేదు.

“నువ్వొక మంచి అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే అన్ని సమస్యలు తీరతాయి.” అనునయం గా అంది.

“ఇంకోసారి విడాకులు ఇప్పించాల్సిన బాధ్యత మీకు కల్పించలేను.” అలాఅన్నాక మాట్లాడకుండా అక్కడనుండి వెళ్ళిపోయాడు అభినవ్.

అభినవ్ నుండి ఆ అపోహ ని ఎలా తొలగించాలా అని తీవ్రం గా ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది తనూజ.       

&&&

సుస్మిత కి మాట ఇచ్చిన ప్రకారం గానే చింటూ ఊరిని చేరుకున్నాడు శరత్. అది చిన్నఊరే కావడం తో చింటూ ఇంటిని తెలుసుకోవడం పెద్దగా కష్టం కాలేదు.

“ఎందుకు బాబూ మా అబ్బాయి గురించి అడుగుతున్నారు? తనేమన్నా ప్రమాదం లో పడ్డాడా లేదా తప్పేమన్నా చేశాడా?” ఆదుర్దాగా అడిగింది ఆ యింట్లో వుంటున్న అరవై సంవత్సరాలు అలా వున్న ముసలావిడ

“తన ఇంటికి వెళ్లివస్తానని కొన్నిరోజులు సెలవు తీసుకున్నాడు. అతను ఎంతకీ తిరిగిరాకపోవడం తో, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుండడం తో, విషయం కనుక్కోమని అతను పనిచేస్తున్న ఇంటివాళ్ళు నన్ను పంపించారు.” ఆ ముసలావిడని చూస్తూంటే జాలేస్తూంది శరత్ కి.  

“ఇంచుమించులో ఒక నెల కిందట తనిక్కడికి వచ్చిన మాట నిజమే. కానీ ఒక్కరోజు మాత్రమే వున్నాడు. తరవాత ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు.” ఆదుర్దా ఇంకా ఎక్కువ అయిపోయింది ఆమె మొహం లో.

“ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయాడా? అతను ఎక్కడికి వెళ్ళివుంటాడో మీకేం ఐడియా లేదా?” నిరుత్సాహం గా అడిగాడు శరత్.

“లేదు బాబూ. ఎప్పుడు వచ్చినా నాకు కొంచెం డబ్బిచ్చి వెళుతూంటాడు. ఈసారి అదీ చెయ్యలేదు. వాడికన్నా నా తమ్ముడే నయం. వచ్చినప్పుడల్లా నాకు బాగా డబ్బిచ్చివెళ్తాడు.”

“మీ తమ్ముడు అంటే అతనికి మామయ్య. అతనెక్కడవుంటాడు? అతనికేమన్న చింటూ గురించి తెలుస్తుందా?” శరత్ ఆసక్తిగా అడిగాడు.

“వాడు పనిచేసే ఇంట్లోనే తానూ ఉంటాడు. అసలు చింటూ చేసేది ప్రతీది నా తమ్ముడికి తెలుస్తుంది. మీరు నా తమ్ముడిని చింటూ గురించి అడిగిచూశారా?”

“ఓహో, మీరు టిబ్బూ గురించి మాట్లాడుతున్నారా?” నవ్వాడు శరత్. “ టిబ్బూ కి కూడా చింటూ గురించి ఏమీ తెలీదు. తనూ మాలాగే ఆందోళన పడుతున్నాడు.”

“అవును, వాడిని టిబ్బూ అని అక్కడ పిలుస్తారని నా తమ్ముడు చెప్పాడు.” అందావిడ. “ఎప్పుడో వాడికి తొమ్మిదేళ్లు అలా వున్నప్పుడు చింటూ ని నా తమ్ముడు ఆ యింటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచీ వాడు అక్కడే వున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూంటాడు. వచ్చినప్పుడు కాస్త డబ్బు ఇస్తూ వుంటాడు. ఈ సారి ఏమీ ఇవ్వలేదు. పెద్దదాన్ని అయిపోయాను. నా రెక్కల కష్టం మీదే బతకాలంటే కష్టం అయిపోతూంది. ఏవేవో రోగాలు కూడా వచ్చాయి.” ఆశగా చూస్తూ అందావిడ.

“ఇదుంచండి.” ఆవిడ ఉద్దేశం అర్ధం అయి పర్సు లోనుండి తీసి ఒక అయిదువందల రూపాయల నోటు ఆవిడకి ఇచ్చాడు.

“సంతోషం బాబు.” ఆ నోటు తీసుకుని నమస్కారం చేస్తూ అందావిడ.

“పర్వాలేదమ్మా.” శరత్ అన్నాడు. “ఇంతకీ మీ అబ్బాయికి ఈ వూళ్ళో స్నేహితులు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళనెవరినన్న కలుస్తూ ఉంటాడా?”

“కొంతమంది వున్నారు. కానీ వాడితో బాగా దోస్తీ గా ఉండేది మాత్రం జగ్గడే. మొన్న వచ్చినప్పుడు వాడిని కలిశాడో లేదో నాకు తెలీదు. కలిస్తే మాత్రం వాళ్లిద్దరూ ఆ సారా కొట్టుకి పోకుండా వుండరు.”

“నేను ఆ జగ్గడిని ఎలా కలవాలి?”

“మీరు ఈ వూళ్ళో ఎవరిని పోలి జగ్గడు........”

అప్పుడే ఆ దారిగా పోతూ వాళ్ళ మాటలు వింటున్న ఒక వ్యక్తి వాళ్ళదగ్గరికి వచ్చాడు. “మీకు పోలి జగ్గడు కావాలా? వాడు రావిచెట్టు కిందవున్నాడు. ఏదో వాడి స్నేహితులతో మాట్లాడుతూ వున్నాడు. వాడికి మందు ఇప్పించే వాడు ఎవరన్నా దొరికితే, వాడితో కలిసి ఆ మందు షాపు కి పోతాడు.”

“దయచేసి నన్ను ఆ పోలి జగ్గడి దగ్గరికి తీసుకెళ్ళు.” అని ఆ వ్యక్తి తో అని ఆ ముసలావిడ మొహం లోకి చూసి అన్నాడు. “మరి నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిసి మాట్లాడతానమ్మా.”  

శరత్ ఆ వ్యక్తి తో కలిసి నడుస్తూవుండగా వెనకనుండి ఆవిడగొంతు ఆదుర్దా గా వినిపించింది “బాబూ”

“చెప్పండి?” తన దగ్గరికి వచ్చిన ఆవిడ మొహం లోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు శరత్.

“నా కొడుక్కి ఏం ప్రమాదం జరిగివుండదు కదా? వాడేమీ తప్పు పనులవీ చెయ్యడం లేదు కదా?”

ఆవిడ మొహం లో ఆందోళనకి శరత్ కి జాలేసింది. “నాకు తెలియదమ్మా. చాలా రోజులు గా మాకెవరికీ తన ఆచూకీ తెలియడం లేదు. తనింక రాడంటే మేము వేరే ఎవరినన్నా పనిలో పెట్టుకోవాలి కదా. అందుకనే కనుక్కుందామని ఇలా వచ్చాను.”

“పూచీ అంతా తనదని తీసుకువెళ్లాడు నా తమ్ముడు. వాడినిలా గాలికి వదిలేస్తాడనుకోలేదు. ఈ సారి వచ్చినప్పుడు నా తమ్ముడిని కడిగి పారేస్తాను.” కోపంగా అందావిడ.

“ఇందులో టిబ్బూ తప్పేం ఉందనుకోను. చింటూ చిన్నపిల్లాడేం కాదుకదా.”

“మీరు చెప్పింది నిజమే.” నిట్టూరుస్తూ అందావిడ. “మీరు నా తమ్ముడిని కలిసినప్పుడు నా కొడుకు ని పట్టించుకోమని చెప్పండి. అలాగే నాకు కొంచెం డబ్బు కూడా ఇవ్వమని చెప్పండి. ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతూంది.”

దరిద్రం ఎంత భయంకరమైనది! కొడుకు ఆచూకీ తెలీక ఆందోళనపడుతూన్న ఆ సమయం లో కూడా ఎలా బతకాలో తెలీక బాధపడుతూందావిడ. డబ్బుంటే ఈ సమస్య ఉండేది కాదు.

 “ఇది కూడా ఉంచండమ్మా.” ఇంకో ఐదువందలు కూడా ఆవిడ చేతిలోవుంచి ఆ ఇంకోవ్యక్తితో కలిసి అక్కడనుండి కదిలాడు శరత్.

వెనకనుండి ఆవిడ కృతజ్ఞతాపూర్వకం గా అంటున్న మాటలు వినిపిస్తూనే వున్నాయి. 

&&&

“ఆ ఆ మధ్య వచ్చినప్పుడు చింటూ నన్ను కలిసాడు. ఎదో కొంతసేపు మాట్లాడుకున్నాం. కానీ నెల పైగా అయిపోయింది. ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు.”

శరత్ కలిసి చింటూ గురించి అడిగాక పోలి జగ్గడు అన్నాడు.

“వాడికి రెండు చుక్కల మందు పోయిస్తే చాలు. అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి.” వాడితో వున్నవాడొకడు అన్నాడు.

అది వినగానే అక్కడఉన్నవాళ్ళందరూ గట్టిగా నవ్వారు. పోలి జగ్గడు కూడా చిన్నగా నవ్వాడు, వాళ్ళు చెప్పింది నిజమే అన్నట్టుగా.

“సరే అయితే. నీకు నచ్చిన వైన్ షాప్ కి తీసుకెళ్ళు. నీకు కావలిసినంత తాగుదువు గాని.” మనసులో చిరాకు మొహం లో కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు శరత్.

“వాడు మరీ తాగేస్తే ఈ లోకం లో వుండడు. వాడినుండి మీకేం కావాలన్నా వాడు మరీ పూటుగా తాగేకుండానే అడిగి తెలుసుకోండి.”

జగ్గడు, శరత్ అక్కడనుండి నడుస్తూవుంటే మళ్ళీ వెనకనుండి ఎవరో అన్నారు. మళ్ళీ నవ్వులు వినిపించాయి.       

&&&

“నాకు ఒక్కడినీ తాగడం నచ్చదు. నాతోపాటుగా నువ్వూ తాగొచ్చుకదా.” శరత్ ఇప్పించిన మందు తాగుతూ అన్నాడు జగ్గడు.

“ముందు నాకు విషయం అంతా చెప్పు. అప్పుడే నీకు ఇంకా మందు పోయించేది. “ వాడి ఏకవచన సంబోధనాన్ని పట్టించుకోకుండా అడిగాడు శరత్.

“సరే. నీకేం కావాలో అడుగు.”

“నెల కిందట ఆఖరిసారి నిన్ను కలిసినప్పుడు చింటూ, నువ్వూ మాట్లాడుకున్నాం అన్నావు కదా, ఏం మాట్లాడుకున్నారు?”

కుర్చీలో వెనక్కివాలి కళ్ళు చిట్లించాడు జగ్గడు నిజంగానే ఆ సంభాషణ అంతా మర్చిపోయినట్టుగా. “అంత పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. నిజంగా వాడు మందు ముట్టుకోకుండా ఉన్నంతసేపూ ఏం మాట్లాడలేదు. తాగాక ఎదో వాగాడు. అప్పుడూ నేనూ తాగే ఉండడం వల్ల ఏం మాట్లాడాడో నాకు అంతగా గుర్తులేదు.”

“ఎప్పుడూ చింటూ అలాగే ఉంటాడా?”

“ఎప్పుడూ అలా వుండడు. తాగినప్పుడు, తాగనప్పుడు కూడా ఏదో ఒకటి వాగుతూ వుంటాడు. వాడిక్కడికొచ్చినప్పుడల్లా మేం మర్చిపోకుండా చేసే పని ఈ తాగుడు తర్వాత...........” గట్టిగా నవ్వుతూ అన్నాడు జగ్గడు. “......... ఆ మల్లిక దగ్గరికి వెళ్లడం. కానీ ఈ సారి వాడు ఆ మల్లిక ఊసే ఎత్తలేదు.”

“ఆ మల్లిక ఎవరు? ఆవిడదగ్గరికి మీరిద్దరూ ఎందుకు వెళతారు?” అయోమయం గా అడిగాడు శరత్.

“ఒక ఆడదానిదగ్గరికి, ఒక మగాడు ఎందుకు వెళ్తాడు? నువ్వు అదీ కూడా తెలీని అమాయకుడిలా వున్నవే." మరోసారి గట్టిగా నవ్వాడు జగ్గడు. “మల్లిక ఒక్కతే ఇద్దరు మగాళ్లు ఒక్కసారి తనని పంచుకోవడానికి అంగీకరించేది. మాకు కలిసి తాగడం లాగే, కలిసి ఆమెని పంచుకోవడం కూడా చాలా ఇష్టం.”

“ఎలాంటి మనుషులు వీళ్ళు?” జుగుప్సగా అనిపించింది శరత్ కి. “ముందు మీరిద్దరూ ఎం మాల్టాడుకున్నారో చెప్పు?” అని అడిగాడు.

“నాకు ఇంకొంచెం మందు పడితే కానీ ఏదీ గుర్తుకు రాదు.” అన్నాడు వాడు.

“నువ్వు ఎంతోకొంత మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్తే కానీ నీకింక మందు పోయించేది లేదు.” కటువుగా అన్నాడు శరత్.

చేత్తో గ్లాస్ పట్టుకుని, కుర్చీలో వెనక్కివాలి, కళ్ళు మూసుకున్నాడు జగ్గడు. “మందు తాగివున్నప్పుడు కూడా వాడు ప్రత్యేకం గా నాతొ ఏం మాట్లాడలేదు. ఎందుకో చాలా అలజడి గా కనిపించాడు. ఎందుకలా వున్నావని నేను రెండు, మూడుసార్లు అడిగాను. కానీ నాకు వాడు ఏం చెప్పలేదు.”

చిరాగ్గా చూస్తున్నాడు శరత్. వీడేమన్నా చెప్పబోతున్నాడా, లేదా?

“గొణుక్కున్నట్టుగానే ఎదో అన్నాడు. నువ్వు ఈ రోజు ఇలా అడుగుతావని తెలిసిఉంటే  వాడేం గొణుక్కున్నాడో కొంచెం జాగ్రత్తగా వినేవాడిని. అందులోనూ అప్పుడు నేను కూడా బాగా తాగే వున్నాను. ఇంకా నెల పైన కూడా గడిచిపోయింది.”

“సరే అయితే.” కోపం గా లేచాడు శరత్ తన కుర్చీలోంచి. “నేను వెళ్తున్నాను.”      

“వెళ్ళిపోకు. కూచో. కొంచెం గుర్తుచేసుకుని చెప్తాను.”

“మందుకోసం ఎదో ఒకటి కల్పించిచెప్పాలని మాత్రం చూడకు.” మళ్ళీ కూచుంటూ అన్నాడు శరత్ 

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)