చెడిన వస్తువు నీకు ఎవ్వరిచ్చినగాని
తీసుకొనవు నీవు వాడకముకు
చెడు మాటలెందులకు మదిలోన నింపెదవు
చెత్తబుట్టగ మనసు మార్చుకోకు
చెడిపోయిన వస్తువులు ఎవరిచ్చినా వాడుకోడానికి తీసుకోవు.. కానీ చెడ్డ మాటలతో మనసునెందుకు నింపుకుంటావు.. అలా నింపి దాన్ని చెత్త బుట్టగా చేయకని భావం...ఓంశాంతి
కాలమొక నదివోలె ఆగదెవ్వరికొరకు
పులస చేపలవోలె ఎదురీదుమూ
అపుడె చేరెదవయ్య నీదు లక్ష్యము నీవు
వలస పక్షులవోలె ఎగిరిపోకూ
కాలం ఒక నదివంటిది ఎవరికోసం ఆగదు
పులస చేపల్లా ఎదురీదాలి(సమస్త మస్త్య జాతి లో ఒక్క పులసలే నీటికి ఎదురీదగలవు).. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం... అంతేగానీ పరిస్థితులు అనుకూలంగా లేవని వలస పక్షల్లా ఎగిరిపోకూడదు( తప్పుకోకూడదు) అని అర్ధం..ఓంశాంతి
తలుపులన్ని ముయ్య నలుపు అలుముకొనును
ఆ నిశికి నీవేగ బాధ్యుడవ్వు
తెరచి చూడు కాస్త తెలుపు పంచు వెలుగు
తెల్లవారెను తెలివికలిగి మెలుగు
తలుపులన్నీ మూసుకుంటే నల్లని అంధకారం అలుముకుంటుంది.. ఆ చీకటికి మనమే బాధ్యులం
తెరిస్తే వెలగు తెలుపుని పంచుతుంది
తెల్లవారింది ఇంక తెలివి తెచ్చుకోమని అర్ధం...ఓంశాంతి
సోమవారమునాడు సోమనాధు తలచి
మంగ్ళవారము మారుతికి మొక్కి
ప్రతిరోజు మంచిదని గుర్తెరిగి సాగిపో
మంచి మనసుకు ఉండు శివుని అండ
సోమవారం ఈశ్వరుడిని తలచి నమస్కరిస్తావు.. మంగళవారం ఆంజనేయస్వామికి మొక్కుతావు..
అలాగే ప్రతిరోజు మంచిదే అని గుర్తుంచుకుని ముందుకు సాగిపో.. నీ మంచి మనసుకు శివుని (పరమాత్ముని)అండ ఎప్పుడూ వుంటుంది అని భావం..ఓంశాంతి
శతృవుల బలమెపుడు చేటు చేయదు నీకు
నీదు బలహీనతే చేటు చేయూ
అట్టి అరులను ఎరిగి హరియించుమిప్పుడే
ఈ మంచిమాట విని ఆచరించు
శతృవుల బలం వలన మనకు కీడు వాటిల్లదు
మనలోని బలహీనతలే మనకు చెడు చేస్తాయి
అటువంటి శతృవులు(బలహీనతలు)నీలో వుంటే వెంటనే గుర్తించి తొలగించు...ఈ మంచి మాట విని పాటించమని భావం.. ఓంశాంతి