సమయం ఆరు గంటలు... గడిచిపోయాయి.పోలీసులు, ఆనందరావు మనుషులు నగరమంతా వెతికినా కార్తీక్, సుమ ల ఆచూకీ తెలియ రాలేదు. కిడ్నాపర్లు సుమను తీసుకువెళ్లే సమయంలోనే సుమ యొక్క ఫోను ఎక్కడో పడిపోయింది, కావున ఎటువంటి సమాచారం లేదు.
ఇంత లోపల ఆనందరావు బావమరిది రాజారావు మరియు అతని కూతురు సత్యభామ కూడా వచ్చారు. సత్య సుమ కంటే మూడేళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోలేదు. సత్య తన తండ్రి మాట ఎప్పుడూ వింటుంది కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాటా వినడం లేదు. ఎందుకో పెళ్లి చేసుకోవడం లేదు. సత్యకు అందం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎందరో పెళ్ళికొడుకులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా సత్య వారందరినీ తిరస్కరిస్తూనే ఉంది.
ఆనందరావును సుభద్రను ఓదారుస్తూ ఉండగా.. పనిమనిషి హేమ పరిగెత్తుకుంటూ వచ్చి, సుమ వస్తోంది అని చెప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందరావు, సుభద్ర, సురేంద్ర సుమకు ఎదురుగా వెళ్లి, " ఇంతసేపు ఎక్కడ ఉన్నావు?కార్తీక్ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాడు?నిన్ను ఏమైనా చేశాడా? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అప్పుడు సుమ, " నాకేమీ కాలేదు. మీరు అనవసరంగా కార్తీక్ ను ఏమి అనవద్దు. అతను నాకు అన్నయ్యతో సమానం. తను నన్ను చెల్లెలుగా చూసుకున్నాడు. అతడు నాతో అసభ్యంగా ఏమి ప్రవర్తించలేదు. తన ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడాడు" అని చెప్పింది.
"అది సరే, మీరు ఎక్కడికి వెళ్లారు? ఇంతసేపు ఏమి చేశారు? కార్తీక్ ఎక్కడ?" అని సత్య అడిగింది.
అప్పుడు సుమ, " కార్తీక్ కిడ్నాపర్ల నుంచి తీసుకువచ్చే సమయంలో తను నాకు రక్షణగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక బుల్లెట్ తన కుడి భుజం లోకి దూసుకొని వెళ్ళింది. కార్తీక్ అలాగే బాధను ఓర్చుకొని నన్ను కారు లో కొద్ది దూరం నడిపి, నన్ను కారు దిగి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కానీ నాకు మనసు రాలేదు. నాకోసం ఒకరి ప్రాణం పోవడం కరెక్ట్ కాదని అనిపించి నేనే కార్ ను నడుపుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళాను. కార్తీక్ వద్దంటున్నా వినకుండా హాస్పిటల్లో జాయిన్ చేశాను. బ్లడ్ లాస్ ఎక్కువ కావడం వల్ల స్పృహ కోల్పోయాడు. కండిషన్ సీరియస్ అయ్యింది. వెంటనే బ్లడ్ ఎక్కించి,సర్జరీ చేయించి,తన ప్రాణాలకు ప్రమాదం లేదు అని తెలిసేంతవరకు నాకు కుదురుగా లేదు. అతన్ని ఐసీయూలో నుంచి జనరల్ వార్డులోకి మార్చగానే నేను వచ్చాను "అని చెప్పింది.
హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు సుభద్ర, " సుమ! ఇంత జరిగాక నీకు వివాహం అవుతుందో?లేదో? మేము నీ తల్లిదండ్రులం కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతాము. కానీ మగ పెళ్లి వారికి ఇది చెప్తే నమ్ముతారా? వారు పెళ్లి ని క్యాన్సల్ చేస్తారేమో? పెళ్లి ఆగిపోతే చాలా అవమానం. నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు "అంటూ ఏడవ సాగింది.
సుభద్ర చెప్పింది కూడా నిజమే కదా అని ఆనందరావుకు కూడా పెళ్లి విషయంలో భయం వేసింది.
అప్పుడు సుమ, " అమ్మ! నువ్వేమీ బాధ పడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఆగదు. నేను కార్తీక్ అన్నయ్యకు మాట ఇచ్చాను" అని అన్నది.
ఆనందరావు, "అసలు ఈ విషయం జగన్మోహన్ కు, అబ్బాయి ఆర్యకు ఎలా చెప్పాలి? ఎలా ఒప్పించాలి?" అని బాధతో అన్నాడు.
అప్పుడు సుమ, "నువ్వేమీ ఎవరికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను కార్తీక్ ను హాస్పిటల్కు తీసుకువెళ్లే సమయంలోనే కార్తీక్ సుమ నువ్వు ఇంటికి వెళ్ళు లేదా నీ పెళ్లి ఆగిపోవచ్చు అని నన్ను హెచ్చరించాడు. నిన్ను కాపాడటమే నా ప్రధాన కర్తవ్యం పెళ్లి తర్వాత అని నేను అతని మాట వినలేదు. అప్పుడు కార్తీక్ తన ఫోను ఇచ్చి ఆర్య కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పమని చెప్పాడు. నేను ఆర్య కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాను. నేను కార్తీక్ హాస్పిటల్కు చేరేలోగా ఆర్య అతని స్నేహితుడు హాస్పిటల్కి వచ్చి రెడీగా ఉన్నారు. వారి సాయంతోనే కార్తీక్ కు ఆపరేషన్ జరిగింది. ఈ 6 గంటలు ఆర్య నాతోనే ఉన్నాడు. మీకు విషయం తర్వాత చెప్పొచ్చులే అని అనుకున్నాను" అన్నది.
సరిగ్గా ఆ సమయంలోనే ఆనందరావుకు ఫోన్ వచ్చింది. అవతల ఆర్యా నుంచి. ఆనందరావు కంగారుగా ఫోన్ ఎత్తాడు.
" అంకుల్ నేను ఆర్యన్ ను మాట్లాడుతున్నాను. సుమ ఇల్లు చేరిందా? " అని అడిగాడు.
" హా ఇప్పుడే చేరింది "అని చెప్పాడు.
అప్పుడు ఆర్య, "అంకుల్ నేను సుమ హాస్పిటల్ లోనే ఉన్నాము. కార్తీక్ ను హాస్పిటల్ లో జాయిన్ చేశాను. సర్జరీకి ముందు కార్తిక్, ఒకవేళ నాకు ఏమి జరిగినా కూడా మీ పెళ్లి ఆగకూడదని మాట తీసుకున్నాడు. దేవుడు దయవల్ల ప్రమాదం లేదు. పెళ్లి యధావిధిగా జరుగుతుంది. మీరేమీ కంగారు పడవద్దు. ఏర్పాట్లు యధావిధిగా చేసుకోండి" అన్నాడు.
ఆనందరావుకు ప్రాణం లేచి వచ్చినట్టుంది.
అప్పుడు ఆర్య, "అంకుల్ మీకు మా కుటుంబం తరఫున ఒక విషయంలో క్షమాపణ అడుగుతున్నాము. ఎందుకంటే మా బంధువుల్లో ఒకరు వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వాలని చూశారు. మా నాన్న, నేను ఒప్పుకోలేదు. అందుకే వారు ఈ పెళ్లి ఆపాలని మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇంకా ఏమీ కాదు లెండి "అని చెప్పి కాల్ కట్ చేశాడు.
ఆనందరావుకు ఈ విషయం అంత అందరికీ చెప్పాడు. అందరూ నెత్తి మీద పెద్ద కొండ దిగిపోయినంతగా సంబరపడ్డారు. అందరూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు, కానీ కొందరి మది లో కార్తీక్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? అనే ప్రశ్న వేధిస్తూనే ఉంది.
ఆనందరావు మేనేజర్ ను పిలిచి," హాస్పిటల్ కి వెళ్ళు. కార్తీక్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకో! హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఇక్కడికి తీసుకొని రా!బిల్లు మొత్తం కట్టేయ్ "అని చెప్పి పంపించాడు.
తర్వాత వివాహ పనులు పూర్తి అయ్యాయి. వివాహం రంగ రంగ వైభవంగా జరిగింది. బంధువులు అందరూ ఆనందరావు ఇంట్లోనే ఉన్నారు. ఇక ఆరోజు సుమను అత్తగారింటికి పంపాల్సిన రోజు...అందరూ భోజనాలు చేసి సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలోనే మేనేజర్ కార్తీక్ ని తీసుకొని ఆనందరావు ఇంటికి వచ్చాడు. ఆనందరావు, అతని భార్య సుభద్ర,కూతురు, అల్లుడు, కొడుకు, తమ్ముడు, సురేంద్ర, బావమరిది రాజారావు అతని కూతురు సత్యభామ ఇంకా బంధువులు ఉన్నారు.
కార్తీక్ ను చూడగానే, " అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది? నన్ను క్షమించు! నిన్ను చూడడానికి హాస్పటల్ రాలేకపోయాను" అని అన్నది సుమ.
ఆర్య కూడా కార్తీక్ ను కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పాడు. ఆనందరావు , అతని భార్య కూడా కృతజ్ఞతలు చెప్పారు సత్యభామ ఏమీ మాట్లాడలేదు.
అప్పుడు రాజారావు, " చూడడానికి మంచి వాడిలా కనిపిస్తున్నావు. జైలుకు ఎందుకు వెళ్లావు? " అని అడిగాడు. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.
అప్పుడు సురేంద్ర, "నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. చెప్తాను వినండి అన్నాడు.
"కార్తీక్ వాళ్ళ నాన్న పేరు రాజారెడ్డి. ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. మంచి ట్రాక్ రికార్డు కలదు. రాజారెడ్డి గారి నాన్నగారు ఊరిలో చాలా పెద్దమనిషి. ఊరిలో వీళ్ళకు చాలా పొలాలు, ఇల్లు, ఆస్తిపాస్తులు కలవు. తమ కూతురును ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ రాజారెడ్డి సుగుణ అనే పేదరాలని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అందుకు అతని తండ్రి అంగీకరించలేదు. ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పాడు.
రాజా రెడ్డి గారు తండ్రి కి దూరంగా దగ్గర్లోని ఒక టౌన్ లో కాపురం పెట్టాడు. వాళ్లకు కార్తీక్ జన్మించాడు. వాళ్లంతా సుఖంగా సంతోషంగా ఉండేవాళ్లు. ఒకరోజు వీరు ముగ్గురూ కలిసి టౌన్ లో షాపింగ్ అని బయటికి వెళ్లారు. అప్పుడు కార్తీక్ వయస్సు 10 సంవత్సరాలు. వాళ్ల కళ్ళ ముందర ఒక బస్సు మంటల్లో చిక్కుకుంది అందులో 20 మంది విద్యార్థులు కలరు. వెంటనే రాజారెడ్డి అతని భార్య బస్సులోకి ఎక్కి డ్రైవర్ని కండక్టర్ ని పిల్లల్ని బయటకి పంపించడం మొదలుపెట్టారు కానీ దురదృష్టవశాత్తు మంటలు ఎక్కువ అయి కార్తీక్ తల్లిదండ్రులు ఒక విద్యార్థి మంటల్లో సజీవ దహనం అయ్యారు. కార్తీక్ ఒంటరివాడు అయ్యాడు.
కార్తీక్ బంధువులు కార్తీక్ ను వాళ్ల తాత దగ్గర వదిలిపెట్టారు అప్పటికే వాళ్ళ తాత, కొడుకు మీద దిగులుతో మంచం పట్టి ఉన్నాడు. కొడుకు మరణ వార్త విన్న రెండు రోజుల్లోనే మరణించాడు. అయితే వాళ్ల తాత దగ్గర దూరపు బంధువులు ఆయన బాగోగులు చూస్తూ ఉండేవారు. కార్తీక్ ఎప్పుడైతే తాత దగ్గరకు చేరాడో ఆస్తి ఎక్కడ కార్తీక్ వస్తుందో అని ఆ బంధువులు కార్తీక్ ను చాలా ఇబ్బందులు పెట్టి హీనంగా చూసేవారు అంతేకాక కొద్ది కాలానికి కార్తీక్ ను బయటకు గెంటేశారు.
కార్తీక్ ఒక మెకానిక్ షాప్ లో పనికి కుదిరాడు అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు మెకానిక్ షాప్ ఓనరు కార్తీక్ ను బాగానే చూసుకునేవాడు. ఓనర్ కొడుకు అబ్దుల్లాతో కార్తీక్కు స్నేహం కుదిరింది.దాదాపు ఇద్దరూ ఒకే వయస్సు. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక తాగుబోతుతో ఆ గొడవలో కార్తీక్ చేతిలో తాగుబోతు చనిపోయాడు. నేర అంగీకరించడం వలన మరియు మైనర్ అతనిని జువైనల్ హోమ్ కు తరలించడం జరిగింది. తన నేర అంగీకరించడం వలన శిక్ష కూడా పడింది. కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాక ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్నాడు. జైలు నుంచి విడుదలై ఆరు నెలలు అవుతుంది. కానీ రెండు రోజుల క్రితమే మన ఊరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు ఆ ఆరు నెలలు ఏం జరిగిందో తెలియదు.
తెలియాలంటే కార్తీక్ నోరు విప్పాల్సిందే"
అన్నాడు.
అప్పుడు ఆనందరావు ఏది ఏమైనా కార్తీక్ నాకు చాలా సహాయం చేశాడు.
" కార్తీక్ ఇంకేం కావాలో అడుగు? " అన్నాడు.
అప్పుడు సుమ " డాడీ! కార్తీక్ ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి "అని అడిగింది.
కానీ కార్తీక్, "నాకు ఇవేమీ వద్దు. నా జీవితంలో నాతో కలిసి ఎవరి ఉన్నా, నాతో పాటు వాళ్లకు కూడా ప్రమాదాలు వస్తాయి. కాబట్టి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి" అంటూ గబగబా బయటికి వెళ్లిపోయాడు.