గురునాదం మాస్టర్ ఎవరికోసమో వచ్చారు అనుకొని నా పనులు చేసుకుంటున్నాను. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో, సార్ పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠం వినకుండా అల్లరి చేసే వాళ్ళు, ఆడుకునేవాళ్లు అయినా మాస్టారు కోప్పపడకుండా పాఠం పీరియడ్ అయిపోయే వరకు చెప్పి వెళ్లేవారు. ఆయన ముఖంలో ఏనాడు చీకాకు గాని, కోపం గాని చూడనే లేదు. దాదాపు 55 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
"కార్తీక్ "అనే పిలుపుతో తల ఎత్తి పైకి చూశాను. "నమస్తే సార్" అని పలకరించాను. కుర్చీ వేశాను..
కుర్చీలో కూర్చుని, "ఎలా ఉన్నావు, కార్తీక్? స్కూలుకు రావడం లేదు ఎందుకు?" అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాను. అంతా విని, "నేను నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. జీవితంలో గుర్తుపెట్టుకో! చదువును కొనసాగించు. చదువు కోసం నువ్వు స్కూలుకు రానవసరం లేదు. పని చేసుకుంటూనే పుస్తకాలు తీసుకొని రాత్రిపూట చదువుకో! ఏమైనా అనుమానాలు ఉంటే నా దగ్గరకు రా. మంచిగా ఉండు. చెడ్డ పనుల పట్ల ఆసక్తిని పెంచుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యానికి దూరంగా ఉండు. జాగ్రత్తగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
మాస్టారు వెళ్లిపోతుంటే, ఈ ప్రపంచంలో నా మంచిని కోరుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు అన్న సంతోషముతో కంట్లో నుండి నీరు కారాయి. ఇక అప్పటినుండి ఉదయం షాప్ లో పనిచేసుకుంటూ, రాత్రివేళ చదవడం మొదలుపెట్టాను. నేను చదువుతుంటే అబ్దుల్లా కూడా వచ్చి చదివేవాడు.
అప్పుడప్పుడు రాణి వచ్చి తినుబండారాలు ఇచ్చేది. నేను అబ్దుల్లా తినేవాళ్ళం. జీతం డబ్బులు కొద్దీగా కూడ పెట్టుకుంటూ రాణి కి బట్టల కోసం ఇచ్చేవాడిని.
ఒకరోజు ఒక బైక్ రిపేర్ చేశాక, దాని ఓనర్ అయిన ఇబ్రహీం బావమరిది వచ్చి రిపేర్ సరిగా చేయలేదంటూ గొడవపడ్డాడు. ఈ విషయంలో ఇబ్రహీం నాకు సపోర్ట్ గా నిలబడ్డాడు. అతన్ని పంపించి వేశాడు మరియు కార్తీక్ ను ఏమైనా చేసినా నీ తాట తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఒక రోజు రాత్రి నేను చదువుకుంటుండగా ఒక తాగుబోతు బైక్ రిపేర్ కోసం వచ్చాడు. ఈ సమయంలో రిపేరు చెయ్యము, ఉదయం రావాలని ఎంత నచ్చచెప్పినా అతడు వినలేదు. బైకు రిపేరు చెయ్యకపోతే చంపేస్తాను అంటూ నామీదకి ఉరికాడు. నన్ను, నేను రక్షించుకునే ప్రయత్నంలో అతన్ని పక్కకు తోసేసాను. అతడు కింద పడి తలకు దెబ్బ తగిలి మరణించాడు. పోలీసులు దాన్ని హత్యగా పరిగణించి నన్ను అరెస్టు చేశారు "అని చెప్పాడు.
అదంతా విన్న సత్య, " నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. అతన్ని ఎందుకు చంపావో చెప్పు? " అని గట్టిగా అడిగింది.
"నమ్మితే నమ్మండి. లేకుంటే లేదు" అంటూ కార్తీక్ కోపంగా పైకి తన గది లోకి వెళ్ళిపోయాడు.
ఆనందరావు, సుమ, సత్య లు కార్తిక్ అలా కోపంగా రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోవడం చూసి ఏమీ చేయలేక నిరాశగా వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
ఇంట్లోకి వెళ్ళగానే ఒక మనిషి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు.
ఆనందరావును చూడగానే తన జేబులో నుంచి ఫోన్ తీసుకొని అందులో ఒక ఫోటో చూపించి," ఇతను ఎక్కడ ఉంటున్నాడో మీకు తెలుసా? " అని అడిగాడు.
అతని వయస్సు 60 సంవత్సరాల దాకా ఉంటాయి. కానీ చాలా ఆరోగ్యంగా, కండబలంతో హుషారుగా ఉన్నాడు. ఇతను పోలీసు వాడై ఉంటాడని ఆనందరావు అనుమానించి, ఆ ఫోటో చూశాడు. అది మరెవరిదో కాదు, కార్తీక్ ది.
ఆనందరావు వివరాలు చెప్పాలా, వద్దా?ఒకవేళ చెప్తే కార్తీక్ కు ఏమైనా ప్రమాదం వస్తుందేమో అన్న అనుమానంతో, "తెలుసు, కానీ మీరెవరు?"అని అడిగాడు.
"అయ్యో నన్ను నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. క్షమించండి. నా పేరు సూర్యనారాయణ. నేను జైలర్ గా పనిచేసి పోయిన నెల రిటైర్ అయ్యాను. నేను జైలర్ గా పనిచేస్తున్న సమయంలోనే కార్తీక్ మొదట రిమాండ్ ఖైదీగా రావడం జరిగింది. అందరికంటే చాలా భిన్నంగా ఉండేవాడు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు,ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఎప్పుడూ ఏదో బాధపడుతున్నట్లుగా కనిపించేవాడు. తన తోటి ఖైదీలు అతన్ని ఎగతాళి చేసినా, కొట్టినా మౌనంగా భరించేవాడు. ఎదురు తిరిగేవాడు కాదు. ఏదైనా పని అప్పగిస్తే ఖచ్చితంగా చేసేవాడు.
ఒకసారి వాళ్ళ మామయ్య జైలుకు వచ్చి అతనితో కొన్ని సంతకాలు తీసుకొని, లాయర్ ను ఏర్పాటు చేస్తాను.. నీకోసం వాదించడానికి.. అని అడగగా, "నేను నేరం చేశాను. ఒప్పుకుంటున్నాను. నాకు లాయర్ వద్దు" అని చెప్పి పంపించి వేశాడు. నేను కూడా లాయర్ ను ఏర్పాటు చేస్తాను శిక్ష తగ్గుతుంది అని ఎంత చెప్పినా, నేను బయట ఉన్న లోపల ఉన్న ఒక్కటే. నా కోసం ఎదురుచూసేవారు కానీ ఒక కన్నీటి బొట్టు రాల్చేవారు కానీ ఎవరూ లేరు, అని చెప్పేవాడు.
అయితే కార్తీక్ జైలులో ఉన్న అన్ని సంవత్సరాలు ప్రతి నెల ఒక పార్సిల్ వచ్చేది. అందులో సెండర్ నేమ్" భవిత" అని ఉండేది. అందులో బట్టలు, స్వీట్లు ఉండేవి. కానీ కార్తీక్, వారెవరో నాకు తెలియదు అంటూ తిరస్కరించేవాడు. అయినా క్రమం తప్పకుండా ప్రతినెలా పార్సిల్ వచ్చేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కార్తీక్ నేరం అంగీకరించడం వలన శిక్ష కూడా పడింది.
కార్తీక్ మేజర్ అయ్యాక, వాళ్ల మామయ్య మళ్ళీ జైలుకు వచ్చాడు. సంతకాల కోసం. నేను వద్దన్నా వినకుండా మొత్తం ఆస్తి రాసిచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు కార్తీక్ మరదలు రాణి వచ్చింది. కార్తీక్ ను చూసి బాధపడింది.
"ఆస్తి ఎందుకు రాసిచ్చావు? నువ్వు ఎలా బ్రతుకుతావు? నీ తాత కొంత నీకు, మాకు రాసిచ్చాడు. నీ భాగం అడగడానికి మా నాన్నకు బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఎందుకు ఇచ్చావు?" అని అడగగా... " నాకు ఆస్తిపై ఆశ లేదు. పైగా రాసింది నీకోసమే! ఇవన్నీ ఆలోచించకుండా సంతోషంగా ఉంటూ" అంటూ చెప్పి పంపించేశాడు.
ఖైదీల సత్ప్రవర్తన కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను చేసింది. అందులో కార్తీక్ ధ్యానం చేయడం నేర్చుకున్నాడు. ప్రతిరోజు శాంతంగా ఉండడానికి ధ్యానం చేసేవాడు మరియు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎంతో కఠినమైనశిక్షణ తీసుకున్నాడు. అతని ఓపిక,పట్టుదల, కటోర శ్రమ చూసి అతనికి ట్రైనింగ్ ఇచ్చే మాస్టారు కూడా ఆశ్చర్యపోయేవాడు. మరియు అతనిని చాలా బాగా ప్రోత్సహించాడు.
అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా కార్తీక్ పుస్తకాలు చదివేవాడు. అతడు పుస్తకాలు చదవడం చూసి నేను కొంతమంది గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రలు ఇచ్చేవాడిని. అవి కూడా చదివేవాడు. ఇతను చదువు ఆగిపోకూడదని అతనికి టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు కూడా వ్రాయించాను. అవన్నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. జైల్లో ఉండగానే చదువు పూర్తి అయింది. అతని ప్రవర్తన చూసి నాకు ముచ్చటేసేది.
నేను ఏ పని చెప్పినా ఎదురు మాట్లాడకుండా చేసేవాడు. జైలులో ఇతని జీవితం మగ్గిపోకూడదని ఇతని మంచి ప్రవర్తన కలవాడని శిక్షకాలం తగ్గించమని పై అధికారులకు, ప్రభుత్వానికి,కోర్టుకు నివేదికలు పంపేవాడిని. అతను సమాజానికి ఉపయోగపడాలి అని యూనిఫామ్ జాబ్కు సరిపోతాడని భావించి ఇతనికి సివిల్స్ లో ఐపీఎస్ కు మరియు రాష్ట్రస్థాయిలో ఎస్సై. డియస్పి . పరీక్షల కోసం సన్నద్ధం చేయించేవాడిని. పరీక్షలు కూడా బాగానే రాశాడు. సివిల్స్ లో పిలిమినరీ, మెయిన్స్ ను క్లియర్ చేశాడు. నాకు చాలా సంతోషం వేసింది. తోటి ఖైదీలు కూడా సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది ఇతని బాటలోనే చదవడం ప్రారంభించారు. కార్తీక్ ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమయ్యే దశలో అతనికి జైలు నుండి విముక్తి లభించింది.
అతను పని చేసే మెకానిక్ షాప్ అక్కడ తీసేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు అతని కోసం వెతుకుతూ ఉన్నాను. అతను సివిల్స్ క్లియర్ చేశాడా, లేదా? " అని ఆత్రంగా అడిగాడు.
దానికి సత్య, "మీరేమో ఐపీఎస్ లాంటి పెద్ద పోలీస్ ఆఫీసర్ ను చేయాలని అనుకున్నారు కానీ అతనేమో పెద్ద హంతకుడు అయి తిరుగుతున్నాడు" అంటూ వెటకారంగా మాట్లాడింది.
ఆనందరావు అంతా విని, " కార్తీక్ గురించి కొంత కార్తీక్ ద్వారా అంటే జైలుకుజైలుకు వెళ్లేదాకా విన్నాము. ఇప్పుడు మీ ద్వారా జైలు జీవితం మరియు విడుదల అయ్యే వరకు విన్నాము.మరి జైలు నుండి విడుదల అయ్యాక ఏం జరిగింది? అతనికి పెళ్లి ఎప్పుడు అయ్యింది? వంటి వివరాలు మనం తెలుసుకోవాలి" అన్నాడు తర్వాత సత్య కార్తీక్ ను కలిసిన సంగతి అతను ఉంటున్న ఇల్లు వివరాలు చెప్పగా సూర్యనారాయణ తనని కలుస్తానని వెళ్లిపోయాడు.
ఆనందరావు, సుమా, సుభద్ర భోజనాలు చేస్తున్నారు అప్పుడు సుమ, " నాన్న కార్తీక్ ఇంట్లో చూసిన ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా ఉంది. ఒకటి రెండు సార్లు కలిసినట్లుగా ఉంది కానీ గుర్తుకు రావడం లేదు" అన్నది.
అప్పుడు సుభద్ర వివరాలన్నీ తెలుస్తాయి లే!భోజనం చేయండి అని చెప్పింది. భోజనాలు అయ్యాక అందరూ విశ్రాంతి తీసుకుంటుండగా.. మేనేజర్ వచ్చి" సార్ మీ కోసం ఎవరో వచ్చారు "అని చెప్పాడు.
ఆనందరావు," అతని పేరు ఏమిటి, ఎందుకోసం వచ్చాడు? " అని అడిగాడు. దానికి మేనేజర్, " పేరు చెప్పడం లేదు సార్. ఏం పని అని అడిగినా, మీతోనే చెప్తారంట. చాలా అర్జెంట్ అని మాత్రం చెప్తున్నాడు సార్ "అని చెప్పాడు. "సరే పద" అని ఆనందరావ్ వెళ్లేసరికి ఆ యువకుడు కూర్చుని ఉన్నాడు.
ఆనందరావును చూసి లేవలేదు మరియు ముఖం చాలా సీరియస్ గా ఉంది. ఆనందరావు కూర్చుని అతని పరిశీలనగా చూసి, విషయం చెప్పమని సైగ చేశాడు.
ఆ యువకుడు, "మీకు ఒక సందేశం తీసుకువచ్చాను. ఈ సందేశం పంపినది టైగర్ హరిచంద్ర ప్రసాద్. వరుసకు మీకు బావ అవుతారు. మీరు తెలుసో తెలియకో కార్తీక్ ను కలుస్తున్నారు. అతనికి సహాయం చేయాలని చూస్తున్నారు. ఇప్పటితో అవన్నీ ఆపేయండి. కార్తీక్ ను కలవకూడదు. అతనికెట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయరాదు, ఎందుకంటే కార్తీక్కు హరిచంద్ర ప్రసాద్ మరణ శాసనం రాశారు. కావున అతని చావును ఎవరు ఆపలేరు. హరిచంద్ర ప్రసాద్ ఏమరపాటు వల్ల ఒకసారి అతను చావు అంచుల్లోకి వెళ్లి బతికాడు. ఇకపై ఆ తప్పు జరగదు. మీరు కాదని కార్తీక్ వైపు నిలబడితే, మీ కుటుంబాన్ని కోల్పోవాల్సి ఉంటుంది" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.