ముగింపు...
తల్లి అడిగినట్టు లోపలికి తీసుకొచ్చి లీల గదిలో వదిలి బయటకు వెళ్లారు బసవయ్య.
సగానికి సగం అయిపోయి ఎముకల గూడులా మారిన మనవరాలిని కన్నీళ్ళతో చూస్తూ నెమ్మదిగా చీర చెంగున దాచిన లీల జ్ఞాపకాల పుస్తకాన్ని బయటకు తీసి తన గుండెల మీద పెట్టారు.
గుండెల మీద బరువుగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది లీలా.
అప్పటికే గడప దాటి కర్ర సాయంతో బయటకు వెళ్ళిపోతున్నారు ఆండాలమ్మ.
బామ్మ గారిని చూస్తూ గుండెల మీద చేయి పెట్టి తడుముకున్న లీలా చేతికి పుస్తకం దొరకడంతో... అది అదేనా అని ఆత్రంగా తడిమి చూస్తున్న లీల ముఖంలో కన్నీళ్ళతో కూడిన నవ్వు.
అప్పుడే కొత్తగా ఊపిరి పోసుకున్నట్టు అనిపిస్తున్న గుండెతో గట్టిగా ఏడుస్తూ పుస్తకాన్ని గుండెలకి హత్తుకున్న లీల లో ఆ క్షణమే తిరిగి ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంది.
ఎంతసేపు అలా పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చిందో గుమ్మం దగ్గర నిలబడి విన్న బామ్మ గారికే మాత్రమే తెలుసు.
నెమ్మదిగా పెరటి గుమ్మం దగ్గరికి వెళ్లి మళ్లీ తన వాలు కుర్చీలో చేరగలబడిన బామ్మ అప్పటికే రవి అస్తమించి నిశి నిండుకుంటున్న ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయారు.
తన కట్టుబాట్లు చాదస్తం కట్టి పట్టుకుపోతున్న కొన ఊపిరిని మనవరాలి గుండెల్లో మళ్లీ నింపిన అండలమ్మ గారు మరుసటి ఉదయాన్ని మూసిన కన్నులతో కట్టెల మీద పడుకొని చూస్తున్నారు.
రెపరెపలాడుతున్న ఊపిరి దీపానికి ఆవిడ వదిలిన ఊపిరి కొత్త కాంతి పుంజమై శక్తినిచ్చింది.
ఆచారాల కన్నా ఎక్కువగా తల్లి మీద అమితంగా పెంచుకున్న గౌరవం అభిమానంతో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన బసవయ్య గారు ఆవిడ ఆఖరి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
బామ్మ తన చేతులతో ఇచ్చిన జ్ఞాపకాల పుస్తకాన్ని తిరిగి నెమ్మదిగా సన్నటి నవ్వుతో తిరగేస్తుంది లీలా.
తనలో వచ్చిన కొత్త శక్తికి అందరి మనుసులు కొంత కుదుట పడ్డాయి.
కొన్ని రోజుల తర్వాత ఆనంద్ రాసిన ప్రేమలేఖ ఎంతో ఆర్థిక ఎంతో ఇష్టంగా తెరిచి చదివింది లీలా...
నా ప్రాణం నీ దగ్గరే వదిలి వెళ్తున్న.. నువ్వు ప్రాణాలతో ఉన్నంతవరకు మనిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా.. నా ప్రాణం భద్రంగా నీతోనే ఉంటుంది.
జాగ్రత్తగా చూసుకో దాన్ని.. నిన్ను దాటిపోకుండా.
కాలం కనికరించి, కట్టుబాట్లు అనుకరించి, కన్న వాళ్ళ మనసులు కరిగి.. మనం కలిసే క్షణాలే కదిలి వస్తే.. నీ కళ్ళల్లో కన్నీళ్ళతో కాదు నీ పెదవుల మీద చిరునవ్వుతో నువ్వు నా ముందు నిలవాలి.
ఎదురు చూస్తుంటాను అప్పటివరకు.. నా ప్రాణానికి ఈ ప్రేమ లేఖతో నీ ప్రియమైన ఆనంద్ విన్నపం.. జాగ్రత్త!!
ఎప్పుడు ఆనంద్ చెప్పే పదాలే అయినా సరే ప్రేమగా అక్షరాలలో నింపి తనకు అందించిన అతని ప్రేమ.
కళ్ళనిండా నీళ్లతో కొన్ని వందల సార్లు చదివిన తనివి తీరని లీల మళ్లీ మళ్లీ ఆ ప్రేమ లేఖను చదువుతూ జ్ఞాపకాల పుస్తకాన్ని తిరగేస్తున్న లీల కళ్ళు ప్రేమలేఖ వెనుక నిలిచిపోయాయి.
నచ్చలేదు వాడు నాకు.. నచ్చకపోవడానికి కారణం వాడి రూపం కాదు వాడు పుట్టిన కులం. అది గొప్పదా, తక్కువ అన్నది కాదు. అది మనది కాదు.
అమ్మానాన్న గోరు ముద్దలలతో నూరిపోసిన కట్టుబాట్లు సాంప్రదాయాలు. నర నరాల్లో నిండిపోయి నా రక్తంలో కలిసిపోయాయి. నా ఊపిరి ఉన్నంత వరకు నన్ను వదిలి పోవు.
నీ ఊపిరి వాడు అని తెలిశాక అస్తమించే సూర్యుడు కోసం చీకటి చెరలోకి చేరే నీ ప్రాణాన్ని బలి తీసుకోలేకపోయాను. నా కొడుకు అంటే నాకు ప్రాణం అలాగే వాడికి నువ్వంటే ప్రాణం అయినా సరే తల్లిగా నా మాట కాదని వాడు అడుగు ముందుకు వేయడు.
నేను అడుగు వెనక్కి తీసుకోలేను..
మళ్లీ చెప్తున్నాను నచ్చలేదు వాడు నాకు. అయినా సరే వాడి ప్రాణాన్ని నీలో నింపుకున్న నీ ప్రేమ కోసం ఆగిపోతున్నాను.....
ఆ తర్వాత అక్షరాలు లేవు,
కన్నీళ్ళతో నిండిన లీలా కళ్ళకు అక్షరాలు కనబడడం లేదు.
ఏడుస్తూ బామ్మ గారి ఫోటో ముందు నిలబడి చేతులు జోడించింది లీలా .
రుణబంధమ, అనుబంధమో,.. కణం కణంలో నిండిన కట్టుబాట్లకు మరో రూపం ఆండాలమ్మ.
అది అహమొ, అభిమానమొ.. లేక తన పెంపకానికి తన కన్న వాళ్ళు నేర్పిన సంప్రదాయ సంస్కారాల స్వాభిమానమొ..
ఉదయించే కుసుమాల కోసం తన ఊపిరి దీపాన్ని చిరుదివ్వెగా వెలిగించారు.
జరిగింది తెలుసుకున్న ఆనంద్ పెద్ద ఆవిడ మరణానికి ఒక రకంగా తను కూడా కారణమని చాలా బాధపడ్డాడు.
రోజులు ఎవరి కోసం ఆగవు..
ఋతువులు మారుతూ కాలం కదిలి రెండు కుటుంబాల మధ్య మాటలు కుదిరి ఆనంద్ లీలా కళ్యాణం పీటలెక్కింది.
కొంతమంది ప్రశ్నించారు బామ్మ గారిని ఉదాహరణగా చూపించారు.
కొంతమంది వాదించారు వారి తర్కానికి మౌనంగా నిలిచారు.
ఆండాలమ్మ గారి చివరి కోరిక ఆనంద్ లీలా కళ్యాణం.. అదే ఊరిలో అంగరంగ వైభవంగా రెండు కుటుంబాలు జరిపించాయి.
వాదించి తర్కించి వేదనతో ముగిసే జీవితాలలో మిగిలేది శూన్యమే.
కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం... మధ్యలో నడిచేది ఎంత జగన్నాటకం.
మనిషిగా పుట్టి మరణంతో ముగిసిపోయే మధ్య గమనంలో కొన్ని సంతోషాలు, కొన్ని అనుబంధాలు.. ప్రేమతో పంచుకుందాం.
ఆనంద్ రాసిన ఆ ప్రేమ లేఖ లోని ప్రేమను లీలా తెలుసుకునే నాటికి ఆండాలమ్మ గారి ఊపిరి దీపం వారి ప్రేమకు దీవెనగా మారింది.
ఆవిడ దీవెనతో అందిన ఆ ప్రేమకి ఒక అందమైన జ్ఞాపకంగా అండలమ్మ గారి ఫోటో వెనకే ఆ ప్రేమ లేఖని భద్రంగా దాచుకుంది లీలా...!!
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.