Are Amaindi - 2 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

అరె ఏమైందీ? - 2

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అది చాలా కాలం కిందట మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు." అదే చిరాకుతో అన్నాడు మనోజ్. "తరువాత తనెంత పొగరుగా బిహేవ్ చేసేదో నీకూ తెలుసు. మనవైపు కన్నెత్తి చూసేది కూడా కాదు."

"అలాంటి అందమైన అమ్మాయికి ఆ పొగరు ఇంకా అందాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా గులాబీ రేకులంటి ఆ అందాన్ని అనుభవించే అదృష్టం ఆ నింరంజన్ గాడు కొట్టేసాడు. వాడిగురించి ఆలోచిస్తూంటేనే నాకు అసూయగా వుంది."   

"నాకు మాత్రం చాలా చిరాగ్గా వుంది." మరోసారి కోపంగా అరిచాడు అనిరుధ్. "నువ్వసలు నా సమస్యకి ఎమన్నా పరిష్కారం చూపిస్తావా లేదా?"

"నీ సమస్యని మర్చిపోలేదు. అక్కడికే వస్తున్నా." గట్టిగా నిట్టూర్చి కుర్చీలో అడ్జస్ట్ అయ్యాడు మనోజ్. "నువ్వు ఆ సర్వేశ్వరాన్ని మరోసారి కలుసుకో. ఇంత మొత్తం అప్పు వారం రోజుల్లో తీర్చడం నీ వల్ల అయ్యే పని కాదని, నీకు సమయం కావాలని అడుగు."

"అతను నాతో మాట్లాడిన తీరు చూస్తే అందుకు ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఎలాగైనా మా ఇల్లు తీసేసుకోవాలనే చూస్తున్నట్టున్నాడు." కోపంగా అన్నాడు అనిరుధ్.

"మీరు మీ ఇల్లు చాలా అందంగా కట్టుకున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ సర్వేశ్వరం ఇల్లు మీ ఇంటికన్నా పదిరెట్లు పెద్దది. ఇంకా ఎన్నో సౌకర్యాలు అందులో వున్నాయి. అతను మీ ఇల్లు ఎందుకు కావాలనుకుంటున్నాడో నాకు అర్ధం కావడంలేదు." మనోజ్ ఆశ్చర్యంగా అన్నాడు.

"అదే నాకూ అర్ధం కావడంలేదు." ఈసారి అనిరుధ్ మొహంలో కూడా ఆశ్చర్యం నిండుకుంది.

"నాకు ప్రస్తుతానికి తోస్తూ వున్నది ఇదే. వెళ్లి మరోసారి ఆయన్ని కలవు. ఆ అప్పు తీర్చడానికి సమయం ఇవ్వమని ప్రాధేయపడు."

"నాకూ అంతకన్నా దారేమీ కనిపించడం లేదు. కానీ............" విచారంగా అన్నాడు అనిరుధ్. "............అంత పెద్ద అప్పు తీర్చాలంటే ఐ ఏ ఎస్ కావాలన్ననా గోల్ కి ఫుల్ స్టాప్ పెట్టి నేను ఏదన్నా జాబ్ లో జాయిన్ అవ్వాల్సిందే. అప్పటికి కూడా నేను ఎప్పటికి ఆ అప్పు అంతా తీర్చగలనో బోధపడ్డం లేదు."

"ముందెళ్ళి ఆయన్ని మరోసారి కలుసుకుని మాట్లాడు. ఒక విషయం నిర్ణయమయ్యాక, తరువాత విషయాలు ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాం. ముందుగానే అన్ని విషయాలు అలోచించి కంగారు పడకు."

"ఆల్రైట్. రేపే వెళ్లి మరోసారి ఆయన్ని కలిసి మాట్లాడతాను."కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్.

"నువ్విక్కడ భోజనం చెయ్యకుండా వెళ్లనిచ్చేదే లేదు." మనోజ్ కూడా కుర్చీలోనుండి లేచి అన్నాడు. "ఇప్పటివరకూ ఎప్పుడైనా నిన్ను ఇక్కడనుండి భోజనం చెయ్యకుండా వెళ్లనిచ్చానా?

"మీవాళ్ళెవరూ ఇంటిదగ్గర లేకుండా నువ్వే వంట చేసుకుని ఇబ్బంది పడుతున్నావు. మళ్ళీ నాక్కూడా ఎందుకు?" మొహమాటంగా అన్నాడు అనిరుధ్.

"నువ్వేదో మొహమాటానికి కాదు నా వంటకి భయపడి అంటున్నావని తెలుసు. అయినా ఇక్కడ భోజనం చెయ్యకుండా నిన్ను వెళ్లనివ్వను." ధృడంగా వుంది మనోజ్ స్వరం.

దాంతో అనిరుధ్ కి ఇంక ఆ రోజు అక్కడే భోజనం చెయ్యక తప్పలేదు.     

&&&

"అంత అప్పు ఒక వరం రోజుల్లో తీర్చడం అంటే నాకు అయ్యేపని కాదు. నాకు కొంత సమయం కావాలి." ఆ మర్నాడు అనిరుధ్ సర్వేశ్వరాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, తేలికగానే ఆయన్ని కలవడం కుదిరింది. ముందురోజు లాగే హాల్లో కుర్చీలో కూచుని వెయిట్ చేస్తూంటే, రెండు నిమిషాల్లోనే వచ్చి కలిసాడు సర్వేశ్వరం. అయన కూడా తన ఎదురుగుండా వున్న కుర్చీలో సెటిల్ అయ్యాక మాట్లాడడం మొదలు పెట్టాడు అనిరుధ్.

"నాకేం ఈ అప్పు ఎగ్గొట్టే ఉద్దేశం లేదు. ఎలాగో కిందామీదా పడి తీరుస్తాను. కానీ వారం రోజుల్లో పది లక్షల రూపాయల అప్పుని తీర్చడం నా వల్ల అయ్యేపనికాదని మీకూ తెలుసు." 

"ఒకవేళ నేను నీకు సమయం ఇచ్చానే అనుకో, ఎంత కాలం లో నువ్వు నా అప్పు తీర్చగలవు? నీకున్న డిగ్రీ అర్హతకి నీకు ఇరవైవేలకి మించి జీతం ఇచ్చే వుద్యోగం రాదు. అందులో సగం నీ ఖర్చులకే పోతుంది. ఆ మిగిలిన సగం డబ్బుతో నువ్వు నా అప్పుకి వడ్డీ కూడా కట్టలేవు."

దానికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

"ఇదిలా కాదు. నేను చాలా కాలం ఓపిక పట్టాను. ఇంక ఓపిక పట్టలేను. నువ్వు నీ ఇంటిని నా బాకీ కింద నాకు రాసి ఇచ్చెయ్. ఇంకా పైన ఎమన్నా చెల్లించాల్సివున్నా నేను పట్టించుకోను. కోర్టులచుట్టూ తిరగాల్సిన బాధ నీకూ నాకూ కూడా తప్పుతుంది."

"కానీ మీకు తెలుసు కదా ఎంత ముచ్చటపడి మా అమ్మానాన్నా ఆ ఇంటిని కట్టుకున్నారో. ఆ ఇంటిని ఎలా వదులుకోగలను?" ఆవేదనగా అన్నాడు అనిరుధ్.

"నువ్వు నా అప్పుని తీర్చలేవు. అలాగే నీ ఇంటినీ వదులుకోలేవు. మరిప్పుడేం చేద్దాం?" కోపంగా అన్నాడు సర్వేశ్వరం. "నువ్వు నా బాకీ తీర్చడానికి ఏళ్ళకి ఏళ్ళు ఎదురుచూసే ఓపిక నాకు లేదు."

దానికి ఏం చెప్పాలో తెలియక మరోసారి మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

"ఈ సమస్య పరిష్కారం కావడానికి ఒకే ఒక్క మార్గం వుంది." సడన్గా ఆ నిశబ్దం ఛేదిస్తూ అన్నాడు సర్వేశ్వరం.

"ఏమిటది, దయచేసి చెప్పండి?" ఆసక్తిగా అడిగాడు అనిరుధ్.

"నువ్వు దీనికి ఒప్పుకుంటే, నీ ఇల్లు నీకు వుండిపోవడమే కాదు, నువ్వసలు నా బాకీయే తీర్చవల్సిన అవసరం లేదు. నేనే నీకు బోలెడంత డబ్బు ఇస్తాను." అనిరుధ్ చెప్పింది విననట్టుగానే అన్నాడు సర్వేశ్వరం.

"మీరు నాకు ప్రత్యేకంగా డబ్బివ్వనవసరం లేదు. నేనే మీ బాకీ వీలు చూసుకుని తీర్చేస్తాను. ముందు నేనేం చెయ్యాలో చెప్పండి." కుర్చీలో ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు అనిరుధ్.

"నువ్వు నా కూతురు మంజీర ని పెళ్లి చేసుకోవాలి." అనిరుధ్ మొహం లోకి చూస్తూ అన్నాడు సర్వేశ్వరం.

"ఏమిటి?" కరంట్ షాక్ కొట్టినట్టుగా అయి, తనకి తెలియకుండానే కుర్చీలోనుండి లేచి నిలబడ్డాడు అనిరుధ్. "నేను మంజీరని పెళ్లి చేసుకోవాలా?"

"అవును నువ్వు సరిగ్గానే విన్నావు." సర్వేశ్వరం కూడా కుర్చీలోనుండి లేచినిలబడ్డాడు. "నువ్వు నా కూతురు మంజీరని పెళ్ళిచేసుకుంటే నువ్వు నీ ఇల్లు నాకివ్వడమేమిటి, నా ఇల్లే నీదయిపోతుంది. తను నా ఒక్కగానొక్క కూతురు కాబట్టి నా ఆస్థి మొత్తం కూడా నీదే అవుతుంది."

"కానీ తనూ ఆ నిరంజన్ లవర్స్. ఇద్దరూ పెళ్లిచేసుకుందామన్న ఆలోచనలో వున్నారు. వాళ్ళ లవ్ విషయంలో రెండు కుటుంబాలకి కూడా ఎలాంటి అభ్యతరం లేదు." ఎలా మాట్లాడుతున్నాడో అనిరుధ్ కి బోధపడడం లేదు. ఇదంతా ఇంకా చాలా షాకింగానే వుంది.

"తనెప్పుడూ ఆ నిరంజన్ ని ప్రేమించలేదు. అలా భ్రమపడిందంతే." సర్వేశ్వరం అన్నాడు. "వాళ్ళిద్దరి పెళ్ళీ జరిగే సమస్యే లేదు."

"ఎందువల్ల వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోవడం లేదు అన్నవిషయం గురించి నేను ఆలోచించ దలుచుకోలేదు. దానికి ఏమైనా కారణాలు వుండివుండొచ్చు." అనిరుధ్ అన్నాడు. "కానీ మంజీరని నేనే పెళ్ళిచేసుకోవాలని మీరెందుకు అనుకుంటున్నారు?"

"నువ్వే తన భర్తవి కావాలి. వేరే ఎవరూ కావడానికి అవకాశమే లేదు."

"మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు." అనిరుధ్ లో ఆశ్చర్యం ఇంకా ఎక్కువ అయిపోయింది.  

"కారణాలు ఏవీ అడగొద్దు. నువ్వు నా అప్పు తీర్చవలసిన అవసరం లేకుండా నీ ఇల్లు కాపాడుకోవడానికి మిగిలివున్న ఏకైక మార్గం ఇది. మా అమ్మాయిని పెళ్లి చేసుకో."

"అసలు మంజీర కి ఈ పెళ్లి ఇష్టమేనా?" ఇంకా దిగ్భ్రమలోనే వున్నాడు అనిరుధ్.

"తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ జరగదు. మంజీర ఒప్పుకుంది కాబట్టే నేను తన పెళ్లి నీతో చెయ్యాలని నిర్ణయించుకున్నాను."

ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్. తను వింటున్నది కలలోనా లేక నిజంగానా అన్నది బోధపడడం లేదు.  సర్వేశ్వరం ఇలాంటి ప్రస్తావన తెస్తాడన్నదికలలో కూడా వూహించలేని విషయం.

"ఏమిటింకా ఆలోచిస్తున్నావు? నీతో పెళ్లి మంజీర కి కూడా ఇష్టమేనని చెప్పాను కదా. నువ్వు తనతో ఆనందంగా జీవించగలవు. అందులో నీకు సందేహం ఏమీ అవసరం లేదు."

"నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి." ఎలాగో అన్నాడు అనిరుధ్

"సరే అయితే. ఆలోచించుకునే నీ నిర్ణయం చెప్పు. కాకపోతే అందుకు కూడా ఒక వారం కన్నా ఎక్కువ గడువు నీకు నేను ఇవ్వను. ఒక వారం లోగా ఈ విషయమై నువ్వు నీ అంగీకారం తెలియపరచక పోతే .............." తను చెప్పదలుచుకున్నది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగాడు సర్వేశ్వరం ".........నీ మీద కోర్ట్ లో కేసు ఫైల్ చేసి నీ ఇల్లు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంకా ఆ పైన రావాల్సిన మొత్తానికి కూడా నీ మీద చర్యలు తీసుకుంటాను. ఇంక నువ్వెళ్లొచ్చు." ఆలా అన్న తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు సర్వేశ్వరం. 

&&&

"నువ్వు సివిల్స్ ఫస్ట్ రాంక్ లో పాసయి మన డిస్ట్రిక్ట్ కె కలెక్టర్ గా వచ్చినా, నీ మీద నాకింత అసూయ కలిగివుండేది కాదు. గులాబీ పువ్వు లాంటి ఆ అమ్మాయి అందాన్ని ఆలా అనుభవించే ఛాన్స్ వస్తే, ఎగిరి గంతేసి, వెంటనే అవునని చెప్పకుండా ఆలోచించుకోవడానికి సమయం కావాలంటావా? మంచి మెంటల్ హాస్పిటల్ ఎక్కడుందో కూడా అడక్కపోయావా? నీకు కొంత మెంటల్ ట్రీట్మెంట్ కూడా అవసరం."

అప్పుడు మళ్ళీ ఎప్పటిలానే అనిరుధ్, మనోజ్, మనోజ్ స్టడీ రూమ్ లో వున్నారు. అనిరుధ్ చెప్పినదంతా విన్నాక మనోజ్ అన్నాడు.

"ఆలా ఎగిరి గంతేసి ఒప్పుకోవడానికి అది ఆ నిరంజన్ గాడితో ఎలా తిరిగేదో మనందరికీ బాగా తెలుసు. వాడెప్పుడో తన అందాల్ని తీరు తీరుగా అనుభవించే వుంటాడు." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"అంత అద్భుతమైన అందగత్తెకి ఇద్దరు పిల్లలు వున్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తను కేవలం వాడితో తిరిగిందంతే.  ఇదే నీ ప్లేస్ లో నేనుంటే వేరే మాట చెప్పకుండా వెంటనే ఒప్పుకుని వుండేవాడిని." మనోజ్ అన్నాడు.

"అయితే నేను ఆయనతో నువ్వు మంజీరని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా వున్నావని చెప్తాను. నాకు ఈ తలపోటు తప్పొచ్చు." అదే చిరాకుతో అన్నాడు అనిరుధ్.

"లాభం లేదు. అందుకు అయన ఒప్పుకోడు. ఆయనకి ఎంత ఆస్తి వుందో మనకందరికీ తెలుసు. కావాలంటే తన కూతురికి ఆకాశంలో చందమామని కూడా తేగలడు. కానీ నిన్ను తన భర్తని చెయ్యడానికి నిన్నలా బ్లాక్మెయిల్ చెయ్యడం వరకూ వెళ్ళాడు. అంటే తన అభిప్రాయంలో నువ్వు మాత్రమే తన భర్తవి కావలి."

"అదే నాకూ అర్ధం కావడం లేదు. ఏదెలా వున్నా తను అద్భుతమైన సౌందర్యరాశి. తన తండ్రా అంత ఆస్థిపరుడు. తనకి ఒక లవ్ ఎఫైర్ వుండేది అని చెప్పినా కూడా ఎవరైనా సరే తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. అలాంటిది అయన నన్నే తన భర్తగా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నాడు?" మరొకసారి ఆశ్చర్యం నిండిపోయింది అనిరుధ్ లో.

"నువ్వు ఆ మంజీర తో కూడా మాట్లాడి చూడాల్సింది. అతను కేవలం ఆలా చెప్తున్నాడో, లేకపోతె తనకి నిజంగా ఈ పెళ్లి ఇష్టమో తెలిసిపోయేది."

"ఆఖర్లో అయన అలా చెప్పి వెళ్ళిపోయాక నేనూ వెనక్కి వచ్చేసాను." కాస్త ఆగాక అన్నాడు అనిరుధ్ మళ్ళీ. "దీనికి కూడా కేవలం ఒక వారం మాత్రమే గడువు ఇచ్చాడు. ఒక వారంలోగా నేను అంగీకారం తెలుపక పోతే, మునపటి పరిణామమే."

"నువ్వు ఒకసారి మంజీర ని కలుసుకుని మాట్లాడి చూడు. తనని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నవాడు, పెళ్ళికి ముందు నువ్వు తనతో మాట్లాడతానంటే వద్దని అనడు. నీకు విషయం కొంచెం క్లియర్ అయ్యే అవకాశం వుంది."

"తను ఎంత పొగరుగా బిహేవ్ చేసేది అన్న విషయం తలుచుకుంటూవుంటే తనని చూడాలని కూడా అనిపించడం లేదు. ఒకే ఊరివాళ్ళం అయినా మనవైపు కళ్ళెత్తి కూడా చూసేది కాదు. తనతో మాట్లాడాలంటే చాలా చిరాగ్గా వుంది." కోపంగా అన్నాడు అనిరుధ్.

"అలాని ఊరుకుంటే జీవితాంతం కలిసి కాపురం చెయ్యాలి, ఆ విషయం మర్చిపోకు." మనోజ్ అన్నాడు. "నువ్వంతగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు కాబట్టి, ఒకసారి ముందు కలిసి మాట్లాడు."

"సరే అయితే. అలాగే చేస్తాను." నిట్టూర్చి అన్నాడు అనిరుధ్. ఆలోచిస్తూంటే మనోజ్ చెప్పినది కరక్టే అనిపిస్తూంది.

"అంతే కాకుండా ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేరవ్వు. సర్వేశ్వరం లాంటి వ్యక్తి తన కూతురిని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని అంతగా ఆలోచిస్తున్నాడంటే, నీకు తప్పుకునే ఛాన్స్ వుంటుందని నేననుకోను."

మనోజ్ మొహంలోకి కోపంగా చూసాడు అనిరుధ్.

"అన్నీ మర్చిపోయి గులాబీ రేకు లాంటి ఆ అమ్మాయి అందం గురించి ఆలోచించు. అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిసొచ్చే కోట్లకొద్దీ ఆస్థి గురించి ఆలోచించు. నీ మూడ్ మారుతుంది."

"నీలాగ నేనెప్పుడూ ఆలోచించలేను." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.  

"ఏది ఏమైనా నీ క్యారక్టర్ గురించి మాత్రం అయన బాగానే అంచనా వేసాడు. మామూలుగా ఒప్పుకోవని తెలిసే నిన్నలా బ్లాక్ మెయిల్ చేసాడు." మనోజ్ నవ్వి అన్నాడు.

"ఇద్దరూ టీ తాగండి. చాలా సేపటినుండి బాగా చదువుతూ అలసిపోయినట్టున్నారు." మనోజ్ చెల్లెలు అక్కడికి ఒక ట్రే లో రెండు టీ కప్పులతో వచ్చి అంది.

"అవును. చాలా అలసిపోయాం." ఆ ట్రే లోనుండి ఒక టీ కప్పు తీసుకుంటూ చిరునవ్వుతో అన్నాడు మనోజ్. "మేం ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ అయిపోవడం ఖాయం."

చిన్న చిరునవ్వుతో అనిరుధ్ కూడా ఆ ట్రేలోనుండి ఒక టీ కప్పు తీసుకున్నాడు.

&&&

మనోజ్ చెప్పినది తనకి ఎంతమాత్రం అంగీకారం కాకపోయినా, తను చెప్పినదాంట్లో మాత్రం నిజం లేకపోలేదు. నిజంగానే మంజీర మాత్రం అద్భుతమైన సౌందర్యరాశి. తనది ఎంతటి అందం అంటే, తను తనవైపు ఎంతమాత్రం చూడకపోయినా, తనకి మాత్రం తనతో మాట్లాడాలని, గడపాలనే ఉండేది. మనోజ్ చెప్పినట్టుగా తన గర్వం, అహంకారం తన అందాన్ని ఇంకా పెంచాయేకాని తగ్గించలేదు.

మనోజ్ లాగే తనకీ ఆ నిరంజన్ అంటే ఈర్ష్య, అసూయ వున్నాయి. అసలు వాడివైపు తానెలా ఆకర్షింపబడిందో, వాడితో తనకి లవ్వేమిటో తనకి ఇప్పటికీ అర్ధం కాదు. ఆ నిరంజన్ పెద్ద అందగాడేమీ కాదు. మామూలుగా ఉంటాడు. వాడికి వున్నదల్లా ఏమిటంటే వాడి తండ్రి మన్మధరావు సర్వేశ్వరం అంతగా కాకపోయినా ధనవంతుడే. సర్వేశ్వరం ఇంకా మన్మధరావు మంచి స్నేహితులు కావడం వల్ల నిరంజన్ ఇంకా మంజీరల మధ్య కూడా స్నేహం కుదిరింది. దానికి తోడు ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదవడం వల్ల కలిసి మెలిసి తిరగడానికి అవకాశం ఏర్పడింది.  

మంజీర తనూ  చిన్నప్పుడు, అంటే తామిద్దరికీ ఇంచుమించులో పన్నెండేళ్ల వయసు వచ్చేవరకూ మంచి స్నేహితులుగా వుండేవారు. అప్పటికి ఈ నిరంజన్ గురించి మంజీర కి తెలియడం కూడా తెలియదు. తామిద్దరూ ఎన్నిరకాలుగా ఆడుకునేవారో, ఎంత కలివిడిగా వుండేవారో ఆలోచిస్తూంటే ఇప్పటికి కూడా తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంటుంది.  అవి కేవలం తమ చిన్నప్పటి చేష్టలే అయినా వాటిని అనిరుధ్ ఎప్పుడూ మర్చిపోలేదు. వద్దన్నా అవి గుర్తుకువస్తూనే వుంటాయి. అలాంటిది మంజీర వాటినన్నిటినీ మర్చిపోయి, తనసలు తెలియనే తెలియనట్టుగా ఎలా బిహేవ్ చెయ్యగలుగుతూ వుందో అనిరుధ్ కి అర్ధం కాదు.

అనిరుధ్ కి, మంజీర కి మధ్య అంత మంచి స్నేహం కుదరడానికి కారణం తన తల్లి ఇంకా మంజీర యొక్క తల్లి నిర్మల మంచి స్నేహితులు. కలిసి చాలా, చాలా విషయాలు మాట్లాడుకుంటూ వుండేవారు. తను వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా, తన తల్లి తనని కూడా వాళ్ళింటికి తీసుకుని వెళుతూ వుండేది. అలా తనకి మంజీర తో కలిసి ఆదుకోవడానికి మంచి అవకాశం దొరికింది.

తన తల్లి, ఇంకా మంజీర తల్లి నిర్మల మంచి స్నేహితులు కావడానికి కూడా ఒక కారణం వుంది. ఆ నిర్మల మానసిక పరిస్థితి అంత బాగా వుండేది కాదు. అప్పుడప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ వుండేది. ఊళ్ళోవాళ్ళందరూ ఆవిడని ఒక పిచ్చిదానిగా భావించి దూరంగా పెడితే, తన తల్లి మాత్రం ఆవిడమీద సానుభూతి చూపించి, ఆవిడ ఇంటికి తరచూ వెళుతూ ఆవిడతో టైం స్పెండ్ చేసేది. తన తల్లి అలా చేస్తూ వున్నందుకు, ఆ సర్వేశ్వరం ఎంతగానో ఆనందించి తన తల్లికి కృతజ్ఞతలు చెప్పేవాడు కూడా.  ఆవిడ కూడా తమ ఇంటికి మంజీర ని తీసుకుని వచ్చి తన తల్లితో టైం స్పెండ్ చేస్తూ ఉండేది. ఆ సమయం లో కూడా మంజీర, తనూ కలిసి ఆడుకుంటూ వుండేవారు.   

ఆవిడ మానసిక పరిస్థితి అంతగా బావులేదని పెళ్ళికి ముందే తెలిసినా, ఆవిడ బాగా అందంగా వుందని,  సర్వేశ్వరం ఆవిడని పెళ్లి చేసుకున్నాడని అంటారు. అయితే తనకన్నా ఎక్కువ అందంగా వున్న అమ్మాయికి జన్మనివ్వడమే కాదు, ఆవిడతో పెళ్లయినతరువాతే సర్వేశ్వరానికి అంతా కలిసి వచ్చింది. కొంచెం పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారంలో కోట్లకి కోట్లు సంపాదించగలిగాడు.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)