Are Amaindi - 11 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

అరె ఏమైందీ? - 11

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నో ఆంటీ. నేను అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామనుకోవడానికి కారణం కేవలం నా మామ్ ఆలా కావాలనుకుందని మాత్రమే కాదు. ఏదో తెలివితక్కువగా అలోచించి అనిరుధ్ తో ఆలా బిహేవ్ చేసాను, దూరం పెట్టాను తప్ప, తనంటే నిజంగానే ఇష్టపడుతున్నాను." ఆలా అంటున్నప్పుడు మంజీర బుగ్గలు ఎర్రబడిపోయి సిగ్గుతో తలదించుకుంది.

"సరే అయితే. కానీ నీ పెళ్లి ఇలా అనిరుధ్ జరిపించాలనుకోవడం మాత్రం సరికాదు. ఇది నేను అంగీకరించలేను." తనూజ అంది.

"నాకూ తనని అలా బలవంతపెట్టడం ఇష్టం లేదు." అనీజీ ఎక్సప్రెషన్ తో అంది మంజీర. "కానీ తను వేరేలా ఒప్పుకుంటాడనిపించడం లేదు."

"మీరిద్దరూ నేను మీ శ్రేయోభిలాషినని, మీ మంచే కోరుకుంటానని ఒప్పుకుంటారు కదా." మంజీర ఇంకా సర్వేశ్వరం మొహాల్లోకి చూస్తూ అడిగింది తనూజ.

"నీకన్నా మా మంచి చెప్పేవాళ్లెవరుంటారు? అందుకనేకదా నిన్ను పిలిచి నీకు విషయం అంతా చెప్పింది" సర్వేశ్వరం అన్నాడు

"నా మామ్, డాడ్ తరువాత నన్నంతగా అభిమానించే మనిషివి నువ్వే. నువ్వేం చెప్పినా నా మంచికోరే చెప్తావు అని నాకు తెలుసు. నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు ఆంటీ." మంజీర అంది.

"ఇలాంటి బ్లాక్ మెయిల్స్ అవీ వద్దు. అనిరుధ్ ని నువ్వూ ఇష్టపడుతున్నావు అని చెప్పి, పెళ్లి చేసుకోమని అడుగుదాం. ఒప్పుకుంటాడనే నాకు అనిపిస్తోంది."

"ఒకవేళ ఒప్పుకోకపోతే.........." సడన్గా ఆందోళన కనిపించింది మంజీర మోహంలో.

"ఒప్పుకుంటాడనే నాకు అనిపిస్తోంది. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నువ్వు అనిరుధ్ ని మర్చిపోవడమే మంచిది."

అలా వినగానే అదే ఆందోళనతో సర్వేశ్వరం మొహంలోకి చూసింది మంజీర.సర్వేశ్వరం మొహం కూడా అలాంటి ఆందోళనతోనే నిండిపోయివుంది అది విన్నాక.

"కానీ తన మనసులో ఎవరూ లేకపోతె నిన్ను చేసుకోవడానికి కచ్చితంగా ఒప్పుకుంటాడు. నేను మాట్లాడి తనని ఒప్పిస్తాను."

సర్వేశ్వరం ఏదో అనబోతూ వుండగా మంజీర అంది. "డాడ్, ఆంటీ చెప్తున్నది బాగానే ఉన్నట్టుంది. అలాగే చెయ్యనిద్దాం."  

"మంజీర పూచీ నాది. మంజీర జీవితాన్ని అన్ని రకాలుగా చక్కబరిచే ఇక్కడనుండి వెళతాను." తనూజ అంది. "నువ్వు నాకు ఎంతో చేసావు. ఎంతో పెద్ద ప్రెస్టీజియస్ కాలేజ్ లో, హాస్టల్ లో వుంచి మరీ నన్ను చదివించావు. కానీ నేనేం చేసాను? నేనే ఒక సైకియాట్రిస్ట్ ని అయివుండి, వదిన మానసిక వ్యాధితో బాధపడుతూ వున్నా, తనకి ఏ సహాయం కాలేక పోయాను. మంజీర తల్లి అంత చిన్నవయసులో చనిపోయినా, నేను తనకీ ఏ రకంగానూ ఉపయోగపడలేకపోయాను. పెళ్లి చేసుకుని నా దారిని నేను వెళ్ళిపోయాను. నేను ప్రామిస్ చేస్తున్నా. నా మేనకోడలి జీవితం అన్నిరకాలుగా ఆనందకరంగా వుండేలా చేస్తాను. నాకు అవకాశం ఇవ్వు."

"నువ్వలా అప్పుడు పెద్ద కాలేజ్ లో వుండి చదవబట్టే కదా, ఇప్పుడింత మంచి సైకియాట్రిస్ట్ వి కాగలిగేవు? అలాగే నువ్వేం కావాలని పెళ్ళిచేసుకుని వెళ్లిపోలేదు, మంచిసంభందం వచ్చింది కదాని నేనే నిన్ను బలవంతపెట్టి పెళ్ళిచేసాను." సర్వేశ్వరం అన్నాడు. "నీ మీద నాకు పూర్తి నమ్మకం వుంది. ఈ విషయంలో నేను ముందే నీ సలహా, సహాయం తీసుకోవలిసింది. సరే, ఇప్పుడు ఈ విషయం పూర్తిగా నీకే వదిలేస్తున్నాను. నువ్వే చూస్కో, ఇక బాధ్యత నీదే."

"సరే, నేను రేపే వెళ్లి అనిరుధ్ తో మాట్లాడతాను. మీరిద్దరూ నిశ్చింతగా వుండండి. అంతా పాజిటివ్ గా వుంటుంది."

ఆ తరువాత ముగ్గురూ భోజనాలు చేసి, ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రకి ఉపక్రమించారు. 

&&&

మరొకసారి మంజీర తో మాట్లాడాలన్న నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ రోజు ఉదయం నుండి చాలా థ్రిల్లింగా వుంది అనిరుధ్ కి. పూర్తిగా, స్పష్టంగా మంజీర దగ్గరనుండి విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తొమ్మిది అలా అవుతుండగా ఇంటినుండి బయటపడడానికి సిద్ధం అయ్యాడు. సర్వేశ్వరం ఇంటికి వెళ్లి, మంజీర తో విషయం అంతా మాట్లాడాక, అలా మనోజ్ ఇంటికి వెళ్లి అతనితో విషయం అంతా చెప్పాలనుకున్నాడు. ఇంక తలుపులు తీసి, బయటపడమనుకుంటూన్న సమయంలో ఎవరో తలుపుతట్టిన శబ్దం వినిపించింది. ఈ సమయం లో ఎవరై వుంటారా అని ఆశ్చర్యపడుతూ తలుపులు తీసాడు అనిరుధ్. అనిరుధ్ ని ఇంకా ఆశ్చర్యపరుస్తూ గుమ్మం దగ్గర నలభై, నలభై అయిదు సంవత్సరాల వయస్సు వున్న స్త్రీ కనిపించింది.

"నేను మంజీర అత్తని. నీతో మాట్లాడాలని వచ్చాను. లోపలి రావచ్చా?" చిరునవ్వుతో అడిగిందావిడ.

"తప్పకుండా లోపలి రండి." ఆవిడకి లోపలికి రావడానికి దారి ఇస్తూ  చిరునవ్వుతో అన్నాడు అనిరుధ్.

"మిమ్మల్ని చాలా రోజుల కిందట నా చిన్నతనంలో చూసాను. కానీ మిమ్మల్ని చూడగానే మంజీర అత్త అని గుర్తుపట్టగలిగాను." అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ అన్నాడు అనిరుధ్ హాల్లో వున్న కుర్చీల్లో ఇద్దరూ ఒకరి కొకరు అపోజిట్ గా సెటిల్ అవ్వగానే.

 ఆవిడ అందంగా ఉందని అనుకున్న ఆ చిన్నతనంలో తన పొరపాటు ఏమీ లేదన్న నిర్ణయానికి వచ్చేసాడు అనిరుధ్. ఇప్పుడు ఈ వయసులో కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా వుందావిడ

గలగలా అందంగా నవ్వింది తనూజ. "నువ్వు బొద్దుగా క్యూట్ గా వుండేవాడివి. ఇంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా అవతావని మాత్రం ఊహించలేదు."

అది వినగానే అనిరుధ్ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి.

"మీ అమ్మగారు కూడా నాకు బాగా తెలుసు. ఆవిడ నా వదినతో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఒకానొక సమయం లో నా అన్నయ్య ఫ్యామిలీ కి ఆవిడ బాగా హెల్ప్ చేశారు." ఇంకా అంది తనూజ.

"మీ అన్నయ్య కూడా మా ఫ్యామిలీ కి బాగా హెల్ప్ చేశారు. మా అమ్మ వైద్యానికి, ఇంకా ఈ ఇల్లు కట్టుకోవడానికి. మా నాన్నగారు ఇంక మీ అన్నయ్య కూడా మంచి స్నేహితులు." అనిరుధ్ అన్నాడు.

"మీ అమ్మానాన్న అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. ఐ యాం సారీ." తనూజ అంది.

"ఇట్స్ ఆల్రైట్. అది జరిగి చాలా రోజులైంది. నేను అలవాటు పడిపోయాను." అనిరుధ్ నవ్వాడు. "నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరే రావడం నాకు ఆశ్చర్యంగా వుంది."

"నా అన్నయ్య నాకంతా చెప్పాడు. బహుశా ఆ విషయం లో నీ నిర్ణయం చెప్పడానికే అయివుంటుంది. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు, ఇల్లు వదులుకోవడానికా, లేకపోతె మంజీరని పెళ్లిచేసుకోవడానికా?" కళ్ళు చిట్లించి అనిరుధ్ మొహంలోకి చూస్తూ అడిగింది తనూజ.

"ముందుగ్గా నేను మరోసారి మంజీర తో క్లియర్ గా మాట్లాడాలనుకుంటున్నాను." గట్టిగా నిట్టూర్చి అన్నాడు అనిరుధ్.  

"ఒకవేళ నువ్వు ఇల్లు వదులుకోవడానికి ఇష్టంలేకే మంజీరని పెళ్లిచేసుకోదలుచుకుంటే, ఇక అటువంటి అవసరం లేదు. నేను నా అన్నయ్యతో మాట్లాడాను. ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి మా అన్నయ్య ఎటువంటి చర్యలు తీసుకోడు. అంతేకాదు నువ్వు ఆ బాకీ తీర్చినా, తీర్చకపోయినా కూడా పర్లేదు. ఆ డబ్బులు తిరిగి తీసుకునే ఉద్దేశంతో మీ నాన్నగారికి మా అన్నయ్య ఇవ్వలేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అనిరుధ్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"థాంక్ యూ, థాంక్ యూ వెరీమచ్." రిలీఫ్ తో నిండిపోయింది అనిరుధ్ మొహం. "అయినా ఆ బాకీ తీర్చాల్సిన  బాధ్యత నా మీద వుంది. ముందో వెనకో ఆ బాకీ నేను తప్పకుండా తీర్చేస్తాను." దృఢస్వరం తో అన్నాడు అనిరుధ్.

"కానీ................" కాస్త ఆగి అంది తనూజ. ".................నువ్వు మంజీరని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకుంటే అది మా అందరికీ ఎంతో ఆనందం కలిగించే విషయం. తను కూడా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా వుంది. నువ్విప్పటికే ఎవరితోనన్నా ప్రేమలో వుండకపోతే, మంజీర ని ఎందుకు పెళ్లిచేసుకోకూడదు?"  

"మొదటినుండి నా లక్ష్యం సివిల్స్. నేను ఎలాగన్నా ఐ ఏ ఎస్ కావాలన్న ఉద్దేశంతో వున్నాను. కాబట్టి ఇప్పటివరకూ నాకు ఎవెరితోటి ఎటువంటి ప్రేమలు అవీ లేవు." నవ్వుతూ అన్నాడు అనిరుధ్.

"ఆ తరువాత అన్నా నువ్వు పెళ్లిచేసుకుంటావు కానీ, జీవితాంతం ఒంటరిగా ఉండిపోవు కదా. మరప్పుడు మంజీరనే ఎందుకు పెళ్లిచేసుకోకూడదు." మరోసారి కళ్ళు చిట్లించి అనిరుధ్ మొహంలోకి చూస్తూ అడిగింది తనూజ.

అనిరుధ్ ఏదో అనబోతూ వుండగా మళ్ళీ తనూజె అంది. "నువ్వు నిరంజన్ తో వ్యవహారం గురించి ఆలోచిస్తున్నావేమో. ఏదో సరిగ్గా ఆలోచించలేక వాడితో కలిసి తిరిగిందే తప్ప మంజీర కి వాడిమీద ఎటువంటి లవ్ లేదు. వాడిని కనీసం ముట్టుకోనివ్వడం కూడా ముట్టుకోనివ్వలేదు."

"ఆ విషయం నాకు తెలుసు."నవ్వుతూ అన్నాడు అనిరుధ్.

"ఆ విషయం నీకు తెలుసా? అదెలా?" ఆశ్చర్యంగా అడిగింది తనూజ.

"ఆ విషయం తరువాత చెప్తాను. కానీ ఒక్క విషయం చెప్పండి." సడన్గా అనిరుధ్ మొహం సీరియస్ గా మారి పోయింది. "మేమిద్దరం ఏదో చిన్నతనం లో కలిసి ఆడుకున్నాం, అంతకన్నా మా ఇద్దరిమధ్య ఏమీ లేదు. మరి మీరందరూ కేవలం నేనే మంజీరని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ అన్నయ్య తనగురించి నా కన్నా వందరెట్లు బెటర్ వ్యక్తిని వెదికి తీసుకురాగలరు." 

"నీ బాల్యం, నువ్వు మంజీర తో గడిపిన రోజులు నీకెంతవరకూ గుర్తువున్నాయి?" అనిరుధ్ ప్రశ్న విననట్టుగా అడిగింది తనూజ.

"నేను మా అమ్మగారితో కలిసి తనింటికి వెళ్ళేవాడిని. అలాగే తనూ తన అమ్మగారితో కలిసి మా ఇంటికి వచ్చేది. అప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం, చాలా రకాల ఆటలు. అవన్నీ ఇప్పుడు నాకు గుర్తులేవు." నవ్వాడు అనిరుధ్.

"ఎనీహౌ మీరిద్దరూ చాలా ఇంటిమేట్ గా వుండేవారు."

"ఆ చిన్నతనం లో అది సహజం కదా. ఏ పిల్లలైనా అలా ఇంటిమేట్ గానే వుంటారు. అది నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. మంజీర కూడా సీరియస్ గా తీసుకుందని నేను అనుకోను. అప్పట్లో మేమలా కలిసి ఆడుకున్నందుకే వాళ్ళ నాన్నగారు నాకిచ్చి పెళ్ళిచేయాలనుకుంటున్నారని, తను నన్ను పెళ్లిచేసుకుందామనుకుంటోందని నేను అనుకోను."

"అది నిజమే. అది అందుకు కారణం కాదు." తలూపింది తనూజ. "ఇంతకీ వాళ్ళమ్మ నిర్మల నిన్నెలా చూసుకునేది? నీతో ఎలా వుండేది? నీకావిడేమన్నా అసలు గుర్తువుందా?"

"బాగానే గుర్తు వుంది. ఆవిడ నన్ను చాలా అభిమానంగా చూసుకునేది. మా అమ్మ ఇంకా ఆవిడ చాలా మంచి స్నేహితులు. నిజానికి ఆవిడ నేను మంజీర తో అలా ఆడుకోవడానికి చాలా ప్రోత్సహించేది. ఆవిడ నన్ను తరచూ అడిగిన ప్రశ్న 'నా కూతురిని పెళ్ళిచేసుకుని జాగ్రత్తగా చూసుకుంటావా అని?" మరోసారి నవ్వాడు అనిరుధ్.

"దానికి నువ్వేం చెప్పేవాడివి?" తనూజ కూడా నవ్వి అడిగింది.

"ఓహ్, తప్పకుండా అలాగే అనేవాడిని."

“ఇంకా తక్కిన విషయాలు ఏమన్నా ఆ చిన్నతనం లో జరిగినవి నీకు గుర్తు వున్నాయా?” కుర్చీలో వెనక్కి జారగిలబడి  అడ్జస్ట్ అవుతూ అడిగింది తనూజ.

“ఆ గుర్తున్నాయి. మాకు బహుశా ఏడెనిమిదేళ్ల  వయస్సు వుంటుందనుకుంటా అప్పుడు.”  అంటూ ఆ వయసులో తనకీ ఇంకా మంజీర కి నిర్మల పెళ్లిచేసిన విషయం చెప్పాడు అనిరుధ్. “కానీ ఆ విషయాన్ని నేనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఆవిడకి మతిస్థిమితం సరిగ్గా వుండేది కాదని మనకందరికీ కూడా తెలుసు కదా. కాకపోతే చిన్నపిల్లలకి పెళ్లి ఏమిటి?”

“బహుశా నువ్వు, మంజీర చిన్నతనంలో ఆడుకున్న తీరు ఆవిడని ఇంప్రెస్ చేసివుండాలి. నీకు భార్యగా మంజీర సుఖపడుతుందని ఆవిడ అనుకునివుంటుంది. అంతేకాకుండా మీ అమ్మగారు ఆవిడకి మంచి స్నేహితురాలు. ఆవిడ అత్తగారు అయితే తన కూతురు ఏ ఇబ్బందీ లేకుండా వుంటుందని కూడా అనుకుని వుండాలి. అందుకనే నువ్వే మంజీర భర్త కావాలని ఆవిడ తీర్మానించుకుని వుండివుండాలి.”

“ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు.” తనూజ ఇచ్చిన చిన్న గ్యాప్ లో అన్నాడు అనిరుధ్. “ఒకటి ఆవిడకి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆవిడ చర్యలు సీరియస్ గా తీసుకోనవసరం లేదు. ఇక రెండవది.........” కాస్త ఆగి అన్నాడు అనిరుధ్. “............ఆవిడ చనిపోయి పది సంవత్సరాలు  పైనే అవుతూంది. ఎప్పుడో ఆవిడ సరిగ్గా ఆలోచించలేక చేసిన పనులు ఇప్పుడెలా మనల్ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తాయి?”

తనూజ నవ్వి అంది. “నేనింకా నీకు విషయం పూర్తిగా చెప్పలేదు. ఎలా జరిగిందో, ఏ ప్రకారం జరిగిందో చెప్పలేను కాని మంజీర లో వాళ్ళమ్మ తాలూకు స్ప్లిట్ పర్సనాలిటీ తయారయింది. అది అప్పుడప్పుడు తనలో ఎక్స్పొజ్ అవుతూ వుంది. అది మంజీర లో ఎక్ష్పొజ్ అయి మా అన్నయ్యకి నువ్వే మంజీర మొగుడివని, ఇంక తనని వేరే ఎవరికి ఇచ్చి చేసినా, వాడిని చంపి పారేస్తానని చెప్పింది. ఆవిడ అభిప్రాయం లో, ఐ మీన్, ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అభిప్రాయం లో నీకు మంజీర కి తను పెళ్లి చేసిన రోజున పెళ్లి అయిపోయింది. నువ్వు తన భర్తవి.”

“చాలా ఆశ్చర్యంగా వుంది. నేనసలు నమ్మలేకపోతున్నాను.” ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్. “ఈ స్ప్లిట్ పర్సనాలిటీ, ఇంకా మల్టిపుల్ పర్సనాలిటీ ల గురించి నేనూ చదివాను. కానీ ఇలా వినడం ఇదే మొదటిసారి.అసలు మంజీర కి ఆ ప్రాబ్లం ఎలా వచ్చి వుంటుంది?”

“ఆ విషయమై నేను కొంత స్టడీ చేయాలి. కాకపోతే మా వదిన మాత్రం తను చనిపోయినా సరే ఎప్పుడూ మంజీర కూడా  వుండి తనని చూసుకుంటానని చెప్పేదట. బహుశా ఆవిడ అలా అనడం మంజీర సబ్-  కాంషస్ మైండ్ ని ఇంప్రెస్ చేసి ఆవిడ స్ప్లిట్ పర్సనాలిటీ క్రియేట్ అవ్వడానికి కారణం అయివుండాలి.”

“కాని అది కేవలం మంజీర తాలూకు స్ప్లిట్ పర్సనాలిటీ మాత్రమే. అంటే పార్ట్ ఆఫ్ మంజీర’స్  మైండ్ ఇట్సెల్ఫ్. దానిని తన తండ్రి ఇంకా మంజీర ఎందుకు పట్టించుకోవాలి?”

తనూజ మరోసారి నవ్వింది. “మంజీర ఇంకా తన డాడ్ ఇద్దరూ కూడా అది మా వదినగానే భావిస్తూ వున్నారు. మంజీర తాలూకు స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోవడం లేదు. ఆవిడ చెప్పింది ఇద్దరూ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే నువ్వే తన భర్తవి కావాలన్న నిర్ణయానికి వచ్చేశారు. నిన్ను మా అన్నయ్య అలా బ్లాక్ మెయిల్ చేయడానికి అదే కారణం.”

అనిరుధ్ అయోమయంగా చూస్తూ వుండిపోయాడు ఏం చెప్పాలో తెలియక.

“కాకపోతే నీకు తను నిరంజన్ తో క్లోజ్ గా వుండేది అని తెలుసు కదా. అంతేకాకుండా తను నీతో చాలా పొగరుగా కూడా వుండేదట. అందువల్ల నువ్వు మామూలుగా అడిగితే ఒప్పుకోవని అలా బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించాలనుకున్నారు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎప్పుడో ఎక్స్పొజ్ అయి అలా చెప్పేసి వుంటే బాగుండేది. కాకపోతే ఆ సంఘటన ఇటీవలే జరిగింది.”

“ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్స్పొజ్ అయి అలా చెప్పడం సరిగ్గా ఎప్పుడు జరిగింది?”

“ఒకసారి తన బాయ్ ఫ్రెండ్, అదే ఆ నిరంజన్, తనని తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి అక్కడ రేప్ చేయడానికి ట్రై  చేశాడుట. అక్కడే ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్స్పొజ్ అయి వాడిని చితకేసింది. అక్కడ మంజీర ఏం మాట్లాడిందో ఏం చేసిందో తనకి గుర్తులేదు. అక్కడనుండి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏ ఇంటికి వచ్చి, మా అన్నయ్యకి ఇదిగో ఇందాకా చెప్పానే అది చెప్పింది.”

తనూజ చెప్పడం పూర్తికాగానే గట్టిగా నవ్వాడు అనిరుధ్. “ఇప్పుడు అర్ధం అయింది నాకు ఆ నిరంజన్ భూతం, దెయ్యం అని ఎందుకు అన్నాడో.”

“నువ్వు చెప్పేది నాకు అర్ధంకావడం లేదు.” అయోమయంగా అంది తనూజ.

అప్పుడు అనిరుధ్ తను నిరంజన్ ని కలుసుకుని మాట్లాడినదంతా చెప్పాడు. “బహుశా మంజీర లో స్ప్లిట్ పర్సనాలిటీ ని నిరంజన్ భూతం అనుకుని వుంటాడు. ఒక మంజీర లాంటి నాజూకు అయిన అమ్మాయి నిరంజన్ లాంటి వాడిని అలా కొట్టగలగడం ఏమిటా అని ఆశ్చర్యపడ్డాను. బహుశా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్స్పొజ్ అవ్వడం వల్ల తనకి అలాంటి శక్తి వచ్చివుంటుంది.”

“నువ్వు చెప్పింది నిజం. కొన్ని ప్రత్యేకమైన మానసిక పరిస్తితులు మనుషులకి అటువంటి శక్తిని ఇస్తాయి.” తనూజ అంది.

ఆ తరువాత ఇద్దరిమధ్య కొంత నిశబ్దం అలుముకుంది. తనూజ ఏదో అనబోతూ వుండగా, అనిరుద్ధే అన్నాడు. “కేవలం ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అలా డిక్లేర్ చేసిందని, ఇంకా వాళ్ళమ్మ కోరుకుందని మంజీర నన్ను పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. మనస్పూర్తిగా తనకి నా మీద ఇష్టం లేదు.”

“నేను ఈ విషయం మంజీర ని అడిగాను. తనకి నిన్ను మనస్పూర్తిగా చేసుకోవాలని వుంది. ఇది కేవలం తన అమ్మ కావాలనుకుంటుందని, ఇంకా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అలా అడిగిందని మాత్రమే కాదు. నీ మీద తనకి నిజంగానే ఇష్టం వుంది. అందుకనే నిన్ను పెళ్లిచేసుకోవాలని   అనుకొంటూంది.”

దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)