Nirupama - 4 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

నిరుపమ - 4

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"మీకు ఆల్రెడీ పరిచయం చేసేసానుగా ఈ అమ్మాయి మా అక్క కూతురని." మేనక వైపు చూస్తూ మొదలుపెట్టాడు స్మరన్. " మా అక్క బ్యాంకు మేనేజర్. కొన్ని రోజులపాటు అర్జెంటు పనిమీద వేరే వూరు వెల్తూ వుంది. తనెప్పుడూ మేనకని ఒక్కర్తినీ ఇంట్లో వదలి వెళ్ళలేదు. నా దగ్గర వుంచుదామన్నానేను నా అసైన్మెంట్స్ మీద తిరుగుతూ వుంటాను. మీకు అభ్యంతరం లేక పోతే మా మేనకని మీ ఇంట్లో కొంచెం రోజులు ఉంచుదాం అనుకుంటాన్నాను. మీరు కాదనరనే ఉద్దేశంతో నేను మా అక్కకి చెప్పేసాను కూడా తన కూతుర్ని మీ ఇంట్లో వుంచుతానని. నా స్నేహితుడి ఇంట్లో తన కూతురిని ఉంచడానికి మా అక్కకి ఎటువంటి అభ్యంతరం లేదు."

"ఇది నిజంగా మీరు ఇలా అడగాల్సిన విషయమా? సింపుల్గా మేనక మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని ఎందుకు చెప్పరు?" నిర్మల కోపంగా అంది. "కొన్ని రోజులు కాదు. ఎప్పటికీ తను ఇక్కడే వుంటుందన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తనని చూస్తూ ఉంటే నాకు మా అమ్మాయిని చూస్తూన్నట్టే వుంది. తనూ ఎక్కువగా ఇలా పంజాబీ డ్రెస్ లోనే ఉండేది. రెండు జడలు వేసుకునేది." తన మొహంలోకే చూసి అంటూవుంటే మేనక కూడా నిర్మల మొహంలోకి చూసింది. ఏదోబాధ అంతర్లీనంగా కొట్టొచ్చినట్టుగా కనిపించింది నిర్మల మోహంలో మేనకకి.

"మా ఆవిడ చెప్పింది నిజం. స్మరన్, మేనక మా ఇంట్లో ఉండడం మా ఇద్దరికీ చాలా ఇష్టం అయిన విషయం. తను ఉండడానికి వీలుగా కిందని ఒక రూంని ఏర్పాటు చేస్తాను." రంగనాథ్ అన్నాడు.

"వేరే రూమ్ ఎందుకండీ? నిరుపమ తన మేనత్త ఇంటినుండి రావడానికి ఒక నెల రోజులు పడుతుంది కదా. తను వచ్చేవరకు ఈ అమ్మాయి తన రూంలోనే ఉంటుంది. తనొచ్చేసాక ఆలోచించొచ్చు. కావాలంటే యిద్దరూ అప్పుడు ఒక రూమ్ లోనే ఉంటారు." రంగనాథం మొహంలోకి చూస్తూ అంది నిర్మల.

ఇమ్మీడియేట్ గా మొహాల్లోకి చూసుకున్నారు రంగనాథ్, స్మరన్ ఇంకా మేనక. నిర్మల పరిస్థితి అంతా స్మరన్ వివరించి చెప్పడం వల్ల మేనక ఆశ్చర్యపడలేదు.

"ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? మీకెవరికైనా ఇందులో అభ్యంతరం వుందా?" ప్రస్నార్ధకంగా అడిగింది నిర్మల.

"తన రూంలో ఉండడానికి నాకెలాంటి అభ్యంతరంలేదు." మేనక వెంటనే అంది. అంతకన్నా ఇంకేం మాట్లాడాలో తనకి తెలియడం లేదు. ముందే తెలిసినా, నిర్మల తన కూతురు ఇంకా బ్రతికే ఉందని ఆలా నమ్మడం హృదయాన్ని పిండుతున్నట్టుగా ఉంది మేనకకి.

"మరింకేం? మీరు తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఆ రూమ్ చూపించండి. నేను ఈ లోపల కాఫీ తీసుకుని వస్తాను." కుర్చీలోంచి లేస్తూ అంది నిర్మల.

తలూపి రంగనాథ్ కుర్చీలోంచి లేచాడు. స్మరన్ ఇంకా మేనక కూడా వాళ్ళ కుర్చీలు ఖాళీ చేసారు.

"మా అమ్మాయి రూమ్ మేడ మీద వుంది. మీరు నాతో రండి." అక్కడినుంచి కదులుతూ అన్నాడు రంగనాథం. అప్పుడు రంగనాథం, స్మరన్ ఇంకా మేనక మేడ మీద రూంలోకి వెళుతూ ఉంటే నిర్మల వంటింటి వైపు నడిచింది.

&

"చూసారుగా. అదీ పరిస్థితి. తను చనిపోయినా మా అమ్మాయి ఇంకా బ్రతికే ఉందని నమ్ముతోంది మా ఆవిడ. తననెలా మా అమ్మాయి చనిపోయిందని నమ్మించాలో నాకు అర్ధంకావడం లేదు." మేడమీద రూమ్ లోకి వెళ్ళాక విచార వదనంతో అన్నాడు రంగనాథ్.

"నో మిస్టర్ రంగనాథ్. తన కూతురు చనిపోయిందన్న విషయం మీ ఆవిడకి తెలుసు. కానీ ఆ విషయం ఏక్సెప్ట్ చెయ్యడం తనకి ఇష్టంలేదు. అందుకనే తను బ్రతికి ఉందని బలవంతంగా తనని తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తూ వుంది." స్మరన్ అన్నాడు.

"మీరు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా రూమ్ మధ్యలో నిలబడిపోయి అన్నాడు రంగనాథ్.

"జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్ధం అవుతుంది." రంగనాథ్ మొహంలోకి అర్ధవంతంగా చూస్తూ అన్నాడు స్మరన్. "కొంచం గుర్తు చేసుకోండి. మొదటిసారి నేను వచ్చినప్పుడు నిరుపమ తన ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్లిందని చెప్పింది. ఎందుకంటే తనని నాకు పరిచేయం చెయ్యడం కుదరదని తనకి బాగా తెలుసు. ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికే ఆలా చెప్పింది. ఇప్పుడు నిరుపమ ఎప్పటికీ తన రూమ్ లోకి రానే రాదని ఆవిడకి తెలుసు. అందుకనే మేనక ఈ రూమ్ లో ఉండడానికి అంగీకరించింది. చూస్తూ వుండండి. నెల రోజులు గడిచాక తను ఇంటికి రాకపోవడానికి ఇంకొక కారణం చెప్తుంది."

"మై గాడ్! వాట్ ఈజ్ దిస్? నా గుండెలు పిండేస్తున్నట్టుగా వుంది అంకుల్. తన తల్లి ఇలా పిచ్చిదానిలా అయిపోతుందని ఊహించలేక పోయిందా అంతా హార్ట్ లెస్ గా సూసైడ్ చేసుకుంది ఆ రాస్కేల్!" కోపాన్ని తట్టుకోలేక పోతూ వుంది మేనక.

"కూల్, కూల్ యువర్ సెల్ఫ్ డియర్. అదీ తెలుసుకోవడానికే గదా మనం ప్రయత్నం చేస్తూంది." మేనక భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు స్మరన్.

"ఐ యామ్ సారీ అంకుల్. నేనలా అని ఉండకూడదు." బాధగా రంగనాథ్ మొహంలోకి చూస్తూ అంది మేనక.

"ఫర్వాలేదమ్మా. ఎన్నోసార్లు నేను అలాగే అనుకున్నాను. కనీసం ఇంతగా బాధపడే తన తల్లి గురించయినా ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.

"ఎనీహౌ, ఇదే నువ్వుండబోయే గది. మా అమ్మాయి చనిపోయాక తన గదిలోకి మేమొచ్చింది చాలా తక్కువసార్లు. ఈ గదినిండా మా అమ్మాయి జ్ఞాపకాలే వున్నయి." కాస్త ఆగి మళ్లీ అన్నాడు రంగనాథ్.       కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు తను.

"మా ఆవిడ ఆక్సిడెంట్లో చనిపోయినపుడు చాలా రోజులు మీలాగే బాధపడ్డాను నేను కూడా. కానీ మనం ఎం చేయగలం? కొన్ని విషయాలు మనం యాక్సప్ట్ చేసే తీరాలి." రంగనాథ్ కుడిచేతిని చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు స్మరన్. "దేవుడు చిన్నచూపు చూసినప్పుడు మనం ఇలాగే బాధపడాలి. కాలమే మీకు మనోశాంతి ఇవ్వగలదు."

"అది కాదు. మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిస్తే నాకు కొంత మనోశాంతి లభిస్తుందనుకుంటున్నాను. మీరు తెలుసుకోగలరు కదా ఆ విషయం? మీ మీదే ఆశతో ఉన్నాను." స్మరన్ మొహంలోకి చూస్తూ, తన కుడి చేతిని అతని చేతుల్లోనుంచి విడిపించుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రంగనాథ్.

" తప్పకుండా. ఒక నెలకి కొంచం అటూ ఇటూ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను." స్మరన్ స్వరం ధృడంగా ఉంది.

"ఆల్రైట్." తలూపి మేనక మొహంలోకి చూసాడు రంగనాథ్. "ఈ గదిలోనే ఇదిగో ఈ సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది మా అమ్మాయి. ఇదే రూంలో ఉండడానికి నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా."

అనుకోకుండానే సీలింగ్ ఫ్యాన్ వైపు చూసింది మేనక. ఎదో చెప్పలేని భయంతో నిండిపోయింది ఆమె హృదయం.

"నువ్వు ఈ రూంలో ఉండలేనంటే చెప్పు. నీకు కింద వేరే రూమ్ ఏర్పాటు చేస్తాను. మా ఆవిడకి ఎదో ఒక కారణం చెప్పొచ్చు." రంగనాథ్ మళ్ళీ అన్నాడు.

"అవును మనూ. నీకు ఇక్కడ వుంటే ఇబ్బందిగా ఉంటుందనిపిస్తే నువ్వు వేరే రూంలో ఉండొచ్చు. అది నీ అసైన్మెంట్ కి ఇబ్బంది ఏమీ కాదు." స్మరన్ కూడా అన్నాడు మేనక మొహంలోకి చూస్తూ.

"ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇదే రూంలో ఉంటాను." సడన్ గా ఒక రకమైన ధృడత్వంతో అంది మేనక.

"కానీ...." రంగనాథ్ ఎదో చెప్పబోయాడు.

"అంకుల్." మేనక మాట్లాడడం మొదలు పెట్టింది. "నిరుపమ నాలాంటి నా అంతా వయసే ఉన్న ఒక అమ్మాయి. ఎదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంది. అంతమాత్రం చేత నేను భయపడేలా? అంతేకాకుండా తనెందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి నేను నా అంకుల్ కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇదే రూంలో వుంటే నాకేమయినా హింట్స్ లభించొచ్చోమో కూడా. అందుకని నేను ఈ రూమ్ లోనే ఉంటాను."

"నువ్వలా అనుకుంటే ఇబ్బందేమీ లేదు." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.

రంగనాథ్ ఎదో అనబోతూ వుంటే కాఫీ కప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది నిర్మల. ముగ్గురు ఎలెర్ట్ అయిపోయారు.

"మీరు ఇంకా ఇక్కడే ఉండడంతో నేనే ఇక్కడికి వచ్చాను." ఆ ట్రేతో వాళ్ళ దగ్గరికి వచ్చింది నిర్మల.

"ఈ గది నాకు ఎంతగానో నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను." ఒక కాఫీ కప్పు ట్రే లోంచి తీసుకుంటూ అంది మేనక.

"నీకు నచ్చుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మా అమ్మాయి తన గదిని ఎంతో చక్కగా ఉంచుకుంటుంది." రంగనాథ్ అన్నాడు. స్మరన్, రంగనాథ్ కూడా కాఫీ కప్పులు తీసుకున్నారు ఆ ట్రే నుండి. "ఇంతకీ మా అమ్మాయి ఫోటోని చూసావా ఈ గోడ మీద." ఖాళీ ట్రే తో అక్కడికి కొంచం దూరంలో ఉన్న గోడ దగ్గరికి వెళుతూ అంది నిర్మల. స్మరన్, రంగనాథ్ ఇంకా మేనక కూడా ఆమె వెనకాలే నడిచారు.

రంగనాథ్ స్మరన్ కి ఇచ్చిన ఫోటో యే అదీ. బాగా ఎన్లార్జ్ చేసి గోడ మీద పెట్టారు. "తనని కలిసి మాట్లాడే ముందు తనెలా ఉంటుందో తెలుసుకోవడం నీకు బాగుంటుంది." ఆ ఫోటో వైపు చూస్తూ అంది నిర్మల.

"మీ అమ్మాయి నిజంగా బ్యూటిఫుల్! ఇంత అందమైన అమ్మాయిని ఇప్పటివరకు నేను చూడలేదు." ఆ పెద్ద ఫొటోలో ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది నిరుపమ.

"తనని కలుసుకుని మాట్లాడడానికి నువ్వు బాగా ఎదురు చూడాల్సిందే. తన మేనత్త ఇంటికి వెళ్లిందంటే ఒక పట్టాన రాదు. తన మేనత్త కూడా ఒక పట్టాన తనని పంపించదు." మేనక మొహంలోకి నవ్వుతూ చూస్తూ అంది నిర్మల.

కానీ ఆ నవ్వులో ఇంకా మోహంలో ఎదో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది మేనకకి. తన అంకుల్ చెప్పింది అక్షరాలా నిజం! ఈమెకి తన కూతురు చనిపోయిందన్న విషయం తెలుసు. తను బ్రతికే ఉందని బలవంతంగా తనని తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.

"అలాగే ఆంటీ. తనని కలుసుకోవాలని నాకూ చాలా ఆతృతగానే ఉంది. కానీ తనక్కడ ఆలా ఎంజాయ్ చేస్తూందంటే చెయ్యనివ్వండి. నేను ఎదురుచూస్తాను. ఫర్వాలేదు." తనూ చిరునవ్వుతో అంది మేనక.

"అయితే నువ్వింకిక్కడ సెటిల్ అవ్వు. నేను మళ్ళీ కలుస్తాను. నా పనులు నీకు తెలుసు కదా. అమ్మతో మాత్రం ఫోన్లో మాట్లాడుతూ ఉండడం మర్చిపోకు." మేనక మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.

"నేను మర్చిపోయినా తను నాకు ఫోన్ చెయ్యడం మర్చిపోదు. నువ్వేమి ఆందోళన పడకు. ఇంకా ఇక్కడ ఆంటీ నాకుండగా ఎవరూ నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." నిర్మల మొహంలోకి చూస్తూ అంది మేనక.

"చాలా కరెక్ట్ గా చెప్పావు!" మెచ్చుకోలుగా మేనక మొహంలోకి చూస్తూ అంది నిర్మల. "మీ అమ్మగారు నీకు ఫోన్ చేసినపుడు తనని ఇక్కడకి రమ్మని చెప్పు. తనతో నాకు మాట్లాడాలని ఉంది."

" తప్పకుండా అలాగే చేస్తాను." తలూపుతూ అని స్మరన్ మొహంలోకి చూసింది మేనక. "నా గురించి ఏమీ ఆలోచించకుండా మీరు వెళ్ళండి అంకుల్. మామ్ కి నా గురించి ఏ విచారం అవసరం లేదని చెప్పండి. నేను మాట్లాడినప్పుడు నేనూ చెప్తాను." అంది.

"సరే అయితే." అని ఆ గదిలోంచి బయటకి వచ్చాడు స్మరన్. స్మరన్ వెనకాతలే రంగనాథ్ కూడా వచ్చేసాడు నిర్మలని, మేనక అదే రూంలో విడిచిపెట్టి.

&

"నిరుపమ చనిపోయాక నేనే ఆ ఫోటోని అంతగా ఎన్లార్జ్ చేయించాను. అది కింద హాల్ లో పెట్టి పువ్వుల దండ వెయ్యాలని నా అభిప్రాయం. కానీ మా ఆవిడ ఒప్పుకోలేదు. ఎలాగో ఆ ఫోటో తన రూమ్ లో ఆలా పెట్టాను కానీ పువ్వుల దండ వెయ్యడానికి మాత్రం మా ఆవిడ ఒప్పుకోలేదు." యిద్దరూ ఇంటిబయటకి వచ్చాక నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.

"ఎలా ఒప్పుకుంటుంది తను మీ అమ్మాయి చనిపోయిందని అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు." ఆగి రంగనాథ్ మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్. "ఎనీహౌ నిరంజన్ సైకాలజిస్ట్ కదా. మీ ఆవిడగురించి అతను ఏమన్నాడు?"

"ఎదో ట్రీట్మెంట్ అవసరం అన్నాడు. కానీ మీరు చెప్పింది మాత్రం చెప్పలేదు." తనూ ఆగి అన్నాడు రంగనాథ్.

"ఈ రోజే నేను ఆయన్ని కలుసుకుని మాట్లాడతాను. తన దగ్గర నాకు ఎదో ఒక క్లూ దొరకొచ్చనిపిస్తూంది."

"నాకు అలా అనిపించడం లేదు. మా అమ్మాయి నాతోటి ఎంతో క్లోజ్. అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునేది. ఆ విషయం నాకే చెప్పనప్పడు నిరంజన్ కి మాత్రం చెప్పి ఉంటుందా?" భృకుటి ముడివేసి అన్నాడు రంగనాథ్.

"ఆ విషయం నాకు వదిలివేయండి. నేను మాట్లాడి తేల్చుకుంటాను. మరింక నేను వెళ్ళొస్తాను." ఆ తరువాత అక్కడినుంచి తను ఇంకా మేనక వచ్చిన మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు స్మరన్.

&

"నేను పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఐదు సంవత్సరాల సర్వీస్ అయింది. అప్పుడు మూడు నెలల గర్భిణీ గా వున్న నా భార్య ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తరువాత నాకెందుకో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చెయ్యాలని అనిపించలేదు. అందుకే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ డిటెక్షన్ పని మొదలు పెట్టాను. మరీ ప్రతీ అసైన్మెంట్ లోనూ సక్సెస్ ఫుల్ కాలేక పోయిన ఫర్వాలేదు. అలాగే నాకు ఇతర ఆస్తులు కూడా కొన్ని వున్నయి. దాంతో నాకు మైంటెనెన్సు కి ఇబ్బంది లేదు. అందులోనూ నాకు ఫామిలీ కూడా లేదు కదా. దాంతో పెద్ద ఖర్చులూ వుండవు." నిట్టూరుస్తూ అన్నాడు స్మరన్. "ఎనీహౌ ఈ డిటెక్షన్ అంటే నాకు మొదటినుండీ చాలా ఇష్టం. ఎదో ఒక పద్ధతిలో లైఫ్ సెటిల్ అవుతుందని  పోలీస్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాను కానీ నాకు డిటెక్షనే చెయ్యాలని ఉండేది."

"మీ భార్య పోయిన నాటికీ మీ వయసు ఎంత?" నిరంజన్ అడిగాడు.

అప్పటికి ఒక్క అరగంట అయింది స్మరన్ నిరంజన్ దగ్గరికి వచ్చి. ఆ ఇద్దరూ నిరంజన్ గదిలో సెటిల్ అయ్యారు. ఎప్పటిలాగే నిరంజన్ ఆ నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని వున్నాడు.

"ముప్ఫయి. ఆ సంఘటన జరిగి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు  అయింది." స్మరన్ నవ్వుతూ అన్నాడు. "మీరు తరువాత అడగబోయే ప్రశ్న నేను చెప్పగలను. మళ్ళీ నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని, అవునా?"

"ఎగ్జాట్లీ. మీరు చాలా యంగ్ గా ఉండగానే మీ భార్య చనిపోయారు. మళ్ళీ మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేదా మళ్ళీ పెళ్లి చేసుకోమని?" భృకుటి ముడేసాడు నిరంజన్.

"నాకు ప్రేమలు లాంటివి పెద్దగా తెలియదు. అప్పటి మా అసోసియేషన్ కేవలం రెండు సంవత్సరాలే అయినా నేను నా భార్యా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం ఎంతో అభిమానించుకొనేవాళ్ళం. అందువల్లే అనుకుంటా తాను చనిపోయాక నేను ఇంకొక అమ్మాయి గురించి కూడా ఆలోచించ లేకపోయాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసంతా తనే నిండిపోయి ఉంది. అందుకనే ఇంకొక పెళ్ళికి అంగీకరించలేదు. మా అక్క నన్ను చాలా ప్రెజర్ పెట్టింది. కానీ నేను ఇంకొక అమ్మాయి గురించే ఆలోచించ లేనప్పుడు పెళ్లిచేసుకోవడం ఆ అమ్మాయికి ద్రోహం చెయ్యడమే కదా."

"మీకు ప్రేమలు లాంటివి పెద్దగా తెలియవన్నారు, కానీ దీనినే నిజమైన ప్రేమ అంటారు." కుర్చీలో వెనక్కివాలి అన్నాడు నిరంజన్. "నా జీవితంలో మీ జీవితంలో లాంటి విషాదకర సంఘటనలేమి లేవు. కానీ నాకు మొదటినుండీ వివాహం మీద, సంసారం జీవితం మీద ఆసక్తి లేదు. అందుకనే నేను పెళ్లిచేసుకోలేదు." నవ్వుతూ అన్నాడు నిరంజన్.

"ఒంటరి జీవితం కూడా ఒక రకంగా ఆనందకరమే. నాకూ అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది." స్మరన్ కూడా నవ్వాడు.

"నిర్మల నాకు ఫస్ట్ కజిన్ కాకపోయినా కజిన్. మా పెద్దవాళ్ళు తన పెద్దవాళ్ళు కూడా తనని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. తనకీ నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టమే. నాకూ తనంటే ఇష్టమే. నాకు ఒంటరి జీవితం ఆసక్తే అయినా తనని పెళ్లి చేసుకునే ఉండేవాడిని. కానీ కజిన్ మేరేజెస్ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. అందుకే తనని పెళ్లి చేసుకోలేదు."

"మన దేశంలో ఫస్ట్ కజిన్ మ్యారేజీలు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా జరుగుతాయి. నిజానికి చాలా ఫేమస్ పీపుల్ కూడా ఫస్ట్ కజిన్లని మ్యారేజీ చేసుకున్నారు. ఆలా ఆలోచించడం మీ మెచూరిటీకి నిదర్శనం." స్మరన్ అన్నాడు.

"ఎలాంటి రక్త సంబంధం భార్యా భర్తల మధ్య ఉండకపోవడం మంచిది మిస్టర్ స్మరన్. అప్పుడే అన్నిరకాలుగా బావున్న పిల్లలు పుట్టే అవకాశం వుంది."

"యు అర్ రైట్ సర్." తలూపుతూ అని ఆగడు స్మరన్ తను అడగాల్సినిది ఎలా అడగడమా అని ఆలోచిస్తూ.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)