మాయమైన నేస్తం
నీ స్వరం కోకిల స్వరం కాదు
అయినా అది మాకు వీనుల విందు.
ఆకారమేమో పొట్టి కానీ
నువ్వంటే మాకు మమకారం జాస్తి.
మా ఇంటి చూరు లోను ,
మా పెరటిలోని చెట్టు మీద
గూడు కట్టుకుని మాతో కలిసి సహజీవనం చేసేదానివి.
ఆ కరెంటు తీగలు మీద నువ్వు ఉయ్యాల ఊగుతుంటే
మాకు భయం వేసేది.
నీలాగా గూడెవరు కట్టలేరు
మేము ఎన్నోసార్లు ప్రయత్నించి
ఓడిపోయాం.
మాతో ఉన్నట్టే ఉంటావు
ఎప్పుడు కడతావో తెలియదు అంత అందమైన గూడు.
నీ గూడు అంటే మాకు అపురూపం
ఆ కొమ్మకి మరింత అందం.
పనిముట్లు లేకుండా పరంధాముడు ఇచ్చిన
ముక్కుతో గూడు కట్టేస్తావు.
మేము చూరులేని ఇంటిలోకి మారిపోయాం
నీకు గూడు లేకుండా అయిపోయింది .
కాపురానికి పనికొచ్చే చెట్లన్ని
కనుమరుగు అయిపోయాయి.
దొరికిందేదో తిని బిడ్డల్ని పెంచుకుని
రెక్కలొచ్చిన బిడ్డలు గూడు ఎగిరిపోతే
గూడులో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మాలాగే.
కబుర్లు మోసుకొచ్చే స్తంభాలు చూసి
మురిసిపోయం కానీ అది నిన్ను మాయం చేసిందని
ఆలస్యంగా తెలుసుకున్నాం.
జరగవలసింది ఏదో జరిగిపోయింది.
పర్యావరణ పరిరక్షణ అని పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇప్పుడు మేడ మీద గుప్పెడు గింజలు వేసి
కాసిన్ని నీళ్లు గిన్నెలో పోసి పెడదామంటే
నీ జాడే లేదు.
ఎక్కడని వెతకం నిన్ను.
మా తరమంతా ఆనందంగా నిన్ను చూస్తూ పెరిగా ము
రాబోయే తరానికి బొమ్మ పిచ్చుకలు చూపిస్తాము.
అదే బాధగా ఉంది
సహజంగా కాదు
కృత్రిమంగా పిల్లలను పెంచుతున్నాము అని
నువ్వు పొట్టిదానివే
కానీ గట్టి దానివి
మా గుండెలు దోచిన దానివి
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279