పసిడి వన్నె అంచున్న చున్నీ తళుక్కున మెరవగానే
విక్రమ్ చూపు అటువైపు మళ్లింది.
తెల్లటి చూడీదార్ వేసుకొని,
ముంగురులపై వేళ్లను సవరిస్తూ,
బస్సు చివరి మెట్టును దిగుతున్న ఆ అమ్మాయి,
రాత్రి దీపాల వెలుగులో తేలిపోయే మృదువైన కాంతిలా కనిపించింది.
ఆ కలువరేకులాంటి కనులు అతని చూపును తాకిన క్షణం,
ఉప్పెనలా ఎగిసిపడిన మనోభారం ఒక్కసారిగా తగ్గి, ప్రశాంతత అలముకుంది.
ఆమె వైపు చూపు మళ్లగానే,
ఒక్క క్షణం ప్రపంచమంతా మసకబారిపోయింది…
కానీ తను మాత్రం ఎంతో స్పష్టంగా, హృదయానికి దగ్గరగా కనిపిస్తోంది.
అలా, విక్రమ్ మనసులో ఓ తీపి అలజడి మొదలైంది” “
ఆ అమ్మాయి ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ బస్ లోపలికి వెళ్ళింది..
కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు విక్రమ్..
విక్రమ్ తలను ఎవరో కుడివైపు తిప్పారు, చూస్తే జయ
“ ఏంట్రా ఊగిపోతున్నావ్ చలిగా ఉందా…”
పోరా నువ్వు ఒకడివి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అంటూ మళ్ళీ తన కోసం ఎదురుచూడసాగాడు.
“ ఏంటబ్బా వీడు, ఎప్పుడూ లేనిది కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు “, అని మనసులో అనుకున్నాడు జయ..
ఆమె కిందకు దిగి తన లగేజ్ తీసుకున్న తరువాత వచ్చి విక్రమ్ పక్కనే నిలబడింది, విక్రమ్ ఆనందానికి అవధులు లేవు.
ఎవరికోసమో ఎదురు ఎదురుచూస్తున్నటుంది, మాటి మాటికి వాచ్ చూసుకుంటూ దిక్కులు చూస్తోంది..
“రేయ్ జయ నింగిలో ఉండాల్సిన చందమామ నా ఎదురుగా వచ్చిందేంట్రా”
కనబడడు గాని వీడికి లోపల సెకలెక్కువే, అని మనసులో అనుకున్నాడు జయ..
రేయ్ నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు రా, ఈ ఫీలింగ్ ఎంటో అర్థం కావట్లే…
ఏమైందిరా, స్టమక్ ప్రాబ్లెమా..
అది కాదు…., “పెళ్లి చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలనిపిస్తోంది” అంటూ తన వైపు చేయి చూపకుండా సైగ చేశాడు విక్రమ్..
లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆ…
ఈ లవ్ మీద నాకు నమ్మకం లేదు, కానీ తనతో నా లైఫ్ బాగుంటుంది అని ఎందుకో అనిపిస్తోంది..
విక్రమ్ తనకు అట్రాక్ట్ అయ్యాడని జయకు అర్థమైంది, మెల్లగా అతని చెవి దగ్గరికి వెళ్ళి..
మావ అమ్మాయి బాగుంది, నీకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. ఎలాగో తను స్ట్రేంజరే కాబట్టి మాట్లాడడానికి ట్రై చెయ్ వర్క్ అవుట్ అయితే ఓకే లేకుంటే తన దారి తనది మన దారి మనది.
రేయ్ నువ్వు నన్ను ఇరికించట్లేదు కదా..
లేదు లే మావ, నువ్వు వెళ్ళు అంటూ ముందుకు తోశాడు, జయ
విక్రమ్ తన దగ్గరికు వెళ్లి ఏం అడగాలో తెలీక, “Can I help you with the luggage” అని అడిగాడు.
“No thanks , I can take care” అని సుకుమారంగా అంది.
ఇదంతా చూసిన జయ విక్రమ్ దగ్గరకు రాగానే..
‘ నువ్వు కూలోడివారా, నువ్వు కూలోడివా…., ఎదవ, ఆ యూట్యూబ్లో హెల్పింగ్ రీల్స్ చూసి ఇలా తయారయ్యార్రా మీరంతా … డాక్టర్ డబ్బులు తీసుకోకుండా వైద్యం చేయడం, లెటర్ రాసి పడేస్తే జవాన్ వెళ్లి హెల్ప్ చేయడం, చెత్త నాయాల అమ్మాయితో అలానే నా మాట్లాడేది, స్మూత్ గా హ్యాండిల్ చేయాలిరా..’
అది కాదు మావా..
“నువ్వు ముయ్”, అయినా అది ఆంధ్రా బస్ రా, తెలుగమ్మాయితో ఎవడన్నా ఇంగ్లీష్ లో మాట్లాడతాడా, నీకు చెప్పి వేస్ట్ 5 నిమిషాల్లో బస్సు వస్తుంది ఇంటికెళ్లి రాగి జావ తాగి పడుకో.
“ఇప్పుడు చూసి నేర్చుకో” అంటూ వెళ్ళాడు జయ.. అతనికి కూడా కొంచెం భయంగానే ఉంది..
”మీకు క్యాబ్ కావాలా అని అడిగాడు.”
“మీరు డ్రైవరా” అని అడిగింది తను..
విక్రమ్ కు నవ్వాగలేదు…
ఆమె తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తోంది, ఇంతలో అటువైపుగా ఒక అమ్మాయి స్కూటీ వేసుకుని వెళ్తుండడం చూసి పిలవడానికి ముందుకు కదిలింది, ఈ గందరగోళం లో తన కాలు బ్యాగ్ స్ట్రిప్ లో ఇరుక్కొని ఉండడం తను గమనించలేదు…
అంతే కాలు అందులో చిక్కుకొని కిందక పడబోయింది. విక్రమ్ వెంటనే చేయి చాపి ఆమె చేతిని అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో విక్రమ్ రిఫ్లెక్సెస్ అంత వేగంగా ఎప్పుడు రియాక్ట్ అవలేదు.
“విక్రమ్ కు తనలో లేని ప్రశాంతత ఆమె కళ్లలో కనిపించిందో ఏమో అలానే చూస్తూ ఉండిపోయాడు..
ఎంతలా అంటే… తన కళ్ళు ఇక దేన్ని చూడాలనుకోవట్లేదు ఆమె మధురమైన ముఖాన్ని తప్ప, తన చేతులు ఇక దేన్ని స్పర్శించదలచలేదు ఆమె మృదువైన చేతులని తప్ప, తన మనసు ఇక దేన్ని కోరుకోవట్లేదు స్వచ్ఛమైన ఆమె ప్రేమను తప్పా”
చూసింది చాల్లేరా ఇక పైకి లేపు” అన్నాడు జయ.
విక్రమ్ కనురెప్ప ఆర్పి తన చేతిని రెండు చేతులతో పట్టుకొని పైకి లేపాడు.
మీరు ok నా..
I am fine, Thank you.
ఇంతలో స్కూటీ లో వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చింది.
ఐయామ్ విక్రమ్, నీ పేరేంటి అని అడిగాడు ….
పేరు చెప్పబోతోంది తను..
ఆగండి నేను గెస్ చేస్తా...అన్నాడు విక్రమ్..
సరే గెస్ చెయ్యండి చూద్దాం..
చూడటానికి లక్షణంగా ఉన్నారు మీ పేరు కచ్చితంగా మహాలక్ష్మి అయ్యుంటుంది..
తను చిరునవ్వు నవ్వి, ఉహూ నా పేరు చాందినీ..
“మరి మీ పేరంటి” అని స్కూటీలో వచ్చిన అమ్మాయిని అడిగాడు జయ..
శృతి..
చాందిని గారు మీ నేటివ్ ఎక్కడ… అడిగాడు విక్రమ్
మాది బాసరపల్లి..., పెనుకొండ దగ్గర …
ఏంటి ఇలా బెంగళూరుకు వచ్చారు మరి..
ఏ రాకూడదా..
అలా ఏం కాదు, కాసువల్ గా అడిగా..
నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఈ సోమవారం జాయినింగ్ ఉంది..
అవునా.. కాంగ్రడలేషన్స్ చాందిని, అంటూ మళ్ళీ షక్ హ్యాండ్ ఇచ్చాడు విక్రమ్..
‘ వీడికి ఏం మాట్లాడాలో తెలీదు కానీ ఎలాగోలా పులిహోర కలుపుతున్నాడు ‘ అని అనుకున్నాడు జయ..
ఏ కంపెనీనో అడుగుదామా వద్దా, అడిగితే నేను తన వెంట పడతా అనుకుంటుందా, అని ఆలోచిస్తున్నాడు విక్రమ్.
ఇంతలో, “విక్రమ్.. బస్సొచింది రా” పిలిచింది అమ్మ.
విక్రమ్ కు ఆమెతో ఇంకాసేపు మాట్లాడాలనిపించింది, కానీ చేసేది లేక “సరే చాందిని బాయ్” అని వెళ్ళిపోయాడు, నచ్చక నచ్చక ఒక అమ్మాయి నచ్చితే మనస్పూర్తిగా మాట్లాడ లేదన్న అసంతృప్తితోనే బస్ ఎక్కాడు.
విక్రమ్ వాళ్ళని బస్సు ఎక్కించి జయ తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు జయ.
మ్యాథ్స్ పీరియడ్‌లో గడియారపు ముళ్లు మెల్లగా కదులుతున్నాయి.
సార్ బోర్డు మీద లెక్క రాస్తూ ,"60 km/hr” వేగంతో వెళ్తున్న బస్ 5 గంటల్లో ఎంత దూరం వెళ్తుంది?" అని అడిగాడు….
ముందు బెంచ్‌లో కూర్చున్న విజయ్ చకచకా లేచి “300 km సార్” అన్నాడు.
“దట్స్ కరెక్ట్ విజయ్” అంటూ మెచ్చుకున్నాడు సార్.
అప్పుడే వెనుక బెంచ్ నుంచి విక్రమ్ :"సార్… కానీ మధ్యలో డ్రైవర్‌కి టీ తాగాలని అనిపిస్తే కొంచెం ఆలస్యం అవుతుంది కదా?" అన్నాడు.
ఒక్కసారిగా మొత్తం క్లాస్ నవ్వులతో మార్మోగింది, విజయ్ ముఖం కాస్త సీరియస్ అయింది.
టీచర్ కూడా తల ఊపుతూ -"లెక్క కరెక్ట్… కానీ లాజిక్ కొత్తది" అని చిరునవ్వు నవ్వాడు.
ఆకాష్ విక్రమ్ వంక చూస్తూ “సమాధానం తప్పైనా కరెక్టైనా నీకు తెలిసిన ఆన్సర్ ని చాలా ధైర్యంగా చెబుతావు నువ్వు చాలా గ్రేట్ రా, నేనైతే తెలిసినా చెప్పలేను..” అన్నాడు.
అందులో ఏముంది “మనసులో సందేహాలు లేకుండా ఉంటే మనకు చదువు బాగా అర్థమవుతుందని మా నాన్న చెప్తుంటాడు , అందుకే నాకు అనిపించింది చెప్తా” అన్నాడు విక్రమ్..
విక్రమ్ కు ఉన్న కాన్ఫిడెన్స్ తనకు వస్తే బాగుంటుంది అనుకున్నాడు.
“ఆకాష్ నువ్వు ఏ హీరో కి ఫ్యాన్..’
నేనా.. నేను ఎక్కువ సినిమాలు చూడను రా..
సరే ఈరోజు సాయంత్రం “పోకిరి” సినిమా వస్తుంది మా ఇంట్లో కలిసి చూద్దామా..ఆ సినిమా చూశావనుకో “బాబుకు” ఫ్యాన్ అయిపోతావ్..
అమ్మో, మా నాన్న చంపేస్తాడు..
రేయ్ నేను నిన్ను థియేటర్ కి పిలవట్లేదు, టీవీ లో చూద్దాం అంటున్నా, శనివారమే కదా మళ్ళీ ఆ సినిమా తొందరలో రాదు.
నేనేం చెప్పినా మా నాన్న ఒప్పుకోడు.
సరే ఒక పని చెయ్యి, మా నాన్నతో మ్యాథ్స్ లో డౌట్ చెప్పించుకుంటా అని వచ్చేయ్, నేను చూసుకుంటా..
సరే అడిగి చూస్తా..
**
సాయంత్రం గేమ్స్ పీరియడ్ వచ్చింది, స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆసక్తిగా ఉంది.
ఫైనల్ ఓవర్ నడుస్తోంది, విక్రమ్ స్ట్రైక్ లో ఆడుతున్నాడు.
టీమ్‌కి 10 రన్స్ కావాలి, 4 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
బౌలర్ బంతి విసిరాడు — విక్రమ్ సింపుల్ దాన్ని బౌండరీ కి తరలించాడు,
తర్వాత బంతి అదునుగా రాలేదు, స్ట్రైక్ రొటేట్ చేసి ప్రెషర్ తగ్గిద్దామని సింగిల్ తీశాడు విక్రమ్.
స్ట్రైక్ లో ఆకాష్… ఇప్పుడు 2 బంతుల్లో, 5 పరుగులు కావాలి.
అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
విక్రమ్ ఆకాష్ దగ్గరకు వెళ్లి నువ్వు సింగిల్ తీసివ్వు నేను చూసుకుంటా అన్నాడు.
బౌలర్ వేగంగా బంతి విసిరాడు — ఆకాష్ బంతిని కూడా తాకలేకపోయాడు..
అందరూ ఆకాష్ ని తిట్టడం మొదలుపెట్టారు...
“ఏంటి ఆకాష్! ఒక్క రన్ కూడా కొట్ట లేవ!, అసలు నిన్ను టీం లోకి తీసుకున్న ఆ విక్రమ్ ని అనాలి , ఆడడం రాకుంటే ఊరికే కూర్చోవచ్చు గా.”
ఆ మాటలు విన్న ఆకాష్ డల్ అయిపోయాడు.
అది విన్న విక్రమ్ వాళ్ళ వంక సీరియస్ గా చూసాడు, వాళ్ళనుంచి నిశ్శబ్దం, నాన్ స్ట్రైక్ నుండి ఆకాష్ వద్దకు వచ్చాడు..
చూడు ఆకాష్ వాళ్ల ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు భయపడి ఉరికే ఉన్నా ఎలాగూ మ్యాచ్ పోతుంది, నువ్వు ఎలా కొట్టిన పర్లేదు కానీ ధైర్యంగా కొట్టు ఏదో ఒకటి అయిపోతుంది అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు.
ఆకాష్ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఈసారి తన బ్యాట్ ని ముందే ఎత్తి పట్టుకున్నాడు..
ఈసారి బౌలర్ బంతిని మరింత వేగంగా విసిరాడు..
ఆకాష్ భయపడకుండా బ్యాట్ ని చాలా వేగంగా ఊపాడు, తన అదృష్టం కొద్దీ బంతి సరిగ్గా బ్యాట్ కు తగిలి సిక్స్ వెళ్ళిపోయింది.., మ్యాచ్ గెలిచేశారు..
అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్ ని పైకి ఎగరేశారు..
మైదానంలో వెంటనే గోల —
అవతలి జట్టులో ఉన్న విజయ్ విక్రమ్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు, “కొట్టడానికి చేత కాక వాడికి స్ట్రైక్ ఇస్తే వాడు గుడ్డిగా ఊపి గెలిపించాడు, ఇంకో మ్యాచ్ ఆడే ధైర్యం ఉందా” అని అడిగాడు..
“స్కూల్లో కాదు, ఆదివారం ఎంజీఎం గ్రౌండ్ కి రా అక్కడ చూసుకుందాం”, అన్నాడు విక్రమ్.
నువ్వు సూపర్ ఆకాష్ “ సిక్సర్ చాలా బాగా కొట్టావ్ “ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆకాష్ ఏమో విక్రమ్ కోసం చూస్తున్నాడు..
విక్రమ్ ఆకాష్ వద్దకు వచ్చి, “ఇంతే మావ మనం ట్రై చేస్తుంటే ఏదో ఒకటి తగులుతుంది అదే ఊరికే ఉన్నామనుకో అసలు తగిలే అవకాశం లేదు, ధైర్యం ఎప్పుడు గెలిపిస్తుంది ఆకాష్”. అంటూ భుజం తట్టాడు..
“నీ వల్లే నేను ధైర్యంగా ఆడాను” అన్నాడు ఆకాష్, అప్పటి నుండి విక్రమ్ అంటే తనకి చాలా అభిమానం.
ఆరోజు సాయంత్రం ఆకాష్ వాళ్ళ నాన్నతో అబద్దం చెప్పి, ఇద్దరు పోకిరి సినిమా చూసారు, ఆ సినిమా కి ఫిదా అయిపోయాడు ఆకాష్, నిజంగా “బాబు” ఫ్యాన్ అయిపోయాడు..
అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు…
అప్పటినుంచి తనలో దాచుకున్న ఎన్నో విషయాలు విక్రమ్ తో చెప్పేవాడు ..
“ఆకాష్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాడా ”, అని విక్రమ్ కు అనిపించేది.
మరుసటి సోమవారం స్కూల్ అవగానే ఆకాష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఊళ్ళో ఏదో పండగంటే వాళ్ల బాబాయ్ జతలో పంపించారు.
డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడం వల్ల హేమ వెళ్ళలేదు.
సాయంత్రం 5:30 అవుతుంది. విక్రమ్ ఆకాష్ వాళ్ళ ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వచ్చాడు. గుమ్మం ముందు కూర్చొని, హేమ పేక మేడలు కడుతోంది.
“ ఆకాష్ ఉన్నాడా” అని మెల్లగా అడిగాడు.
ఆమె పట్టించుకోనట్టు తన పనిలో నిమగ్నమైంది..
విక్రమ్ కి కోపం వచ్చి గబగబా అడుగులు వేస్తూ ఇంటి గుమ్మం వైపు నడిచాడు. అతని కాలికి తగిలిన ఒక చిన్న రాయి వెళ్లి హేమ కడుతున్న మేడలను కూల్చేసింది.