నువ్వు లేకుండా ఎలా, కచ్చితంగా తీసుకునే వెళ్తా..
“మావ ఎక్కడి కన్నా టూర్ వెళ్దామా”, అడిగాడు జయ..
రేయ్ టూర్ అన్నావంటే ఇక్కడే బండాపి మరి తంతా..
నేనే మన్నా రా..
ఇప్పటికే 15 సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసావ్, ఇంటికి వెళ్లొచ్చాక చూద్దాం..
సరే మావ.., బండాపు…
ఎందుకురా…
మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ సిల్క్ బోర్డు నుంచే బస్ ఎక్కాలి, అన్నాడు జయ.
రేయ్ ఇక్కడి నుంచి మళ్లీ 15 కిలోమీటర్లు నేను ఒంటరిగా వెళ్లాలిరా నాతో పాటు వచ్చి మమ్మల్ని ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ వద్ద దింపి నువ్వు నా బండి తీసుకెళ్ళు, నీ బైక్ ని రిపేర్ కి ఇచ్చావ్ గా..
ఓరి పిచ్చోడా… నువ్వు ఇంకా ఆలోచనలు మానుకోలేదా.., అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా “నీ గతం, నీ తప్పు కాదు అది ఒక పొరపాటు.., లేదా విధి అంతే..”.
నేనేం చెయ్యను అది నన్ను విడిచిపెట్టట్లేదు.., అయినా నేను చేసిన పొరపాటు సరిచేసే అవకాశం కూడా లేదు..
నీకు చెప్పి వేస్ట్ గాని! పదా..
రేయ్ విక్రమ్.. ఎలాగో కొత్త ఆఫీస్ కి వెళ్తున్నాము అక్కడ ఎవరైనా మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలి రా. నువ్వు ఎలాగో అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడవు, అట్లీస్ట్ నాకు సపోర్ట్ గా ఉండి కొంచెం సాయం చేయొచ్చు గా…..
ఎరా నీకేం పని పాట లేదా, ఎప్పుడు అమ్మాయిని సెట్ చేసుకోవాలని నాతో చెప్తుంటావ్, నిజంగా ఒక అమ్మాయి తోడు అంత బాగుంటుందా…అని అడిగాడు విక్రమ్
నువ్వు కొంచెం దరిద్రం లో ఉండిపోయి వీటిని పట్టించుకోలేదు గాని, “ ఒక అబ్బాయిని మార్చాలన్నా లేదా ముంచాలన్నా అమ్మాయి ప్రేమే రా”..కానీ ఈ కాలంలో మునిగిపోయే ప్రేమ కథలే ఎక్కువ అనుకో, అది వేరే విషయం..
ఇదేదో వినడానికి బానే ఉంది కానీ, మన వల్ల అవ్వదు లే.
అలా అనొద్దు ఎన్నాళ్లని ఇలానే ఉంటాం, ఈసారి ఎలాగోలా మంచి అమ్మాయిని పడేస్తా చూడు నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యి.., కావాలంటే నీకు వెతికి పెడతా..
“ పోరా రే!” అన్నాడు విక్రమ్….
అది 2010 జూలై, సూర్య తన కుటుంబంతో కలిసి తన సొంత ఊరైన మందలపల్లి వదిలేసి ఉద్యోగం కోసం హిందూపూర్ కి వచ్చాడు. సూర్య ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లో లెక్చరర్, ఆయన టీచ్ చేసే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. హిందూపూర్ లోని ఎంజీఎం గ్రౌండ్ దగ్గర్లో వాళ్లు అద్దెకు దిగారు. ఆ కాలనీలో చాలా నే ఇళ్లున్నాయి, సూర్య వాళ్ల పక్కనే ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇల్లు కూడా సూర్య ఉంటున్న ఇంటి ఓనర్ దే.
తరువాతి రోజు విక్రమ్ ని దగ్గరే ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాడు సూర్య, విక్రమ్ అప్పుడు 8 వ తరగతి చదువుతున్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ విక్రమ్ ని నెల రోజులు ఆలస్యం కావడంతో చేర్పించుకోమని చెప్పారు, కానీ సూర్య బ్రతిమిలాడి ఒప్పించాడు.
సూర్య ఎప్పుడు విక్రమ్ తో ఒక మాట చెప్పేవాడు,” ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం ఊరికే ఉండకూడదు, తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా సమాధానం చెప్పాలి”అని.
ఆ మాటను విక్రమ్ ఇంకోలా తీసుకొని ఎవరన్నా ఏదన్నా అంటే కోప్పడేవాడు, అలా చాలాసార్లు గొడవలు పడ్డాడు, అతను పడ్డ గొడవలకి సర్ది చెప్పుకోలేక సూర్య చాలా ఇబ్బంది పడేవాడు.
విక్రమ్ క్రికెట్ బాగా ఆడేవాడు, ఆ వయసులోనే అంత బాగా ఆడడం చూసిన సూర్య అతనికి మంచి క్రికెట్ కోచింగ్ ఇప్పించాలని అభిప్రాయపడ్డాడు. సూర్య అందరిలాంటి వాడు కాదు తాను ఉపాధ్యాయుడిని కదా అని తన పిల్లలను ఒత్తిడి పెట్టి చదివించి స్టేట్ ర్యాంకులు తెప్పించాలని అతను ఎప్పుడు అనుకోలేదు. విక్రమ్ చిన్న పిల్లోడైన అతని స్వేచ్ఛ అతనికి ఉండేది, విక్రమ్ కి మాట ఇచ్చినట్లే అతడిని ఒక క్రికెట్ క్లబ్ లో జాయిన్ చేశాడు.
పొద్దున్నే స్కూల్ కి వెళ్ళడం సాయంత్రం వచ్చి క్రికెట్ క్లబ్ లో క్రికెట్ నేర్చుకోవడం, అలాగే ఆదివారాలు కూడా క్లబ్ లోనే సమయాన్ని గడిపేవాడు విక్రమ్. అలా విక్రమ్ కు ఇద్దరు పరిచయమయ్యారు, ఒకడేమో వాసు ఇంకొకడు విజయ్. వాళ్ళిద్దరూ విక్రమ్ తో కలిసి కోచింగ్ సెంటర్ కు వెళ్లేవాళ్లు మరియు ఆదివారాలు గ్రౌండ్లో క్రికెట్ కూడా ఆడేవాళ్ళు. ముగ్గురు ఒకే స్కూల్ కావడంతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. వాసు ఏమో బౌలర్ విజయ్ బ్యాట్స్మెన్.
కోచ్ ఎప్పుడూ విక్రమ్ ని పొగిడేవాడు దాన్ని చూస్తూ విజయ్ ఓర్చుకునేవాడు కాదు ఎందుకంటే అతను కూడా ఒక బ్యాట్స్మెన్ కదా. ” ఎప్పుడైనా పోటీ అన్నది లేనంతవరకే స్నేహం బాగుంటుంది”.
ఆగస్టు మొదలైంది..
విక్రమ్ వాళ్ళ పక్కింట్లోకి ఒక కొత్త కుటుంబం దిగారు. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉన్నారు, రమణ, శాంతి వాళ్లకి ఇద్దరు పిల్లలు ఆకాష్ మరియు హేమ. వాళ్లు వస్తువులను టెంపో నుంచి ఇంటిలోకి తీసుకెళ్తుండగా సూర్య వెళ్లి సాయం చేశాడు. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే సూర్య పనిచేస్తున్న ఇంటర్మీడియట్ కళాశాలలోని అతడు జాయిన్ అవుదామని వచ్చాడు, అతను ఒక ఎకనామిక్స్ లెక్చరర్. అంతా సద్దడం పూర్తయ్యాక సూర్య మరియు రమణ కొంత సేపు మాట్లాడుకున్నారు. తర్వాత అందరూ కలిసి సూర్యా ఇంట్లోనే భోజనం చేశారు అలా భోంచేస్తున్నప్పుడు ఆకాష్ ని పరిచయం చేసుకున్నాడు విక్రమ్. ఇద్దరు ఒకే వయస్సు కలవారు కాబట్టి తొందరగా కలిసిపోయారు, హేమ చూస్తే హెడ్ సెట్ పెట్టుకుంది,తనను పలకరించలేదు విక్రమ్.
మరుసటి రోజు విక్రమ్ వెళ్తున్న స్కూల్ కి ఆకాష్, హేమా లను చేర్పించారు. ఆకాష్ కి కూడా క్రికెట్ అంటే ఇష్టం కానీ వాళ్ళ నాన్న చదువు పాడైపోతుందని అతన్ని ఆటలు ఆడించేవాడు కాదు. ఆకాష్ కు వాళ్ళ నాన్న అంటే చచ్చేంత భయం. అతని వల్ల కాకపోయినా వాళ్ళ నాన్న కోసం ఎప్పుడూ కష్టపడి చదివే వాడు, ఇకపోతే హేమ, తనకి చిన్నప్పటి నుంచి కొంచం చెవుడు. ఎవరైనా మెల్లగా మాట్లాడితే సరిగ్గా వినిపించేది కాదు.
ఆకాష్ విషయానికొస్తే ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు, విక్రమ్ పది మాటలు మాట్లాడితే ఇతను ఒక మాట మాట్లాడేవాడు, ఎందుకలా అని అడిగితే “మనం ఎప్పుడు క్రమశిక్షణగా ఉంటే జీవితం బాగుంటుందని, చాలా గొప్ప స్థాయికి వెళ్తామని” వాళ్ళ నాన్న రమణ చెప్పారంటా..
సూర్యా దీనికి భిన్నంగా విక్రమ్ తో ఇలా చెప్పేవాడు” జీవితాన్ని సరదాగా గడుపుతూ, చేసే పనిలో మాత్రం క్రమశిక్షణగా ఉంటే చాలు”. కానీ కోపాన్ని వదిలేయాలని విక్రమ్ ను మందలించేవాడు.
ఇలా రెండు భిన్నమైన సిద్ధాంతాలు పాటించే ఇద్దరి స్నేహం మొదలైంది, ఇది ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి..
ఒకరోజు రమణ.. శాంతి మరియు ఆకాష్ ఉండగా ఇలా అన్నాడు. ‘ చూడు శాంతి ఏంటో మన జీవితం, అదే నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చుంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకునే వాడిని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది డబ్బుతో ముడిపడి ఉంటుంది, అవన్నీ నేను ఇప్పుడు కాలేజీలో పిల్లలకు పాఠాలుగా చెప్తున్నాను అదే నేను ఆచరించి ఉండుంటే మన జీవితం వేరేలా ఉండేది’ ..
ఇప్పుడు బానే ఉన్నాం కదండి..
లేదు శాంతి, ఎన్నాళ్లని ఇలా మధ్యతరగతి లో బ్రతకాలి రా.. అనిపిస్తోంది నాకు. కానీ నాకు ఇప్పుడేం భయం లేదు, ఎందుకంటే నేను ఎలా అయితే క్రమశిక్షణగా ఉండాలనుకున్నానో ఆకాష్ ను అలానే నడిపిస్తున్నా, అలానే చదివిస్తున్నా, ఇప్పుడు కష్టంగా అనిపించినా వాడి భవిష్యత్తు బాగుంటుంది, “నేను కరెక్ట్ గా చెప్పానా “ అంటూ ఆకాష్ వంక చూసాడు.
ఆ మాటలు విన్నాక ఆకాష్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు, “అవును నాన్నా” అంటూ తలూపాడు..
అది సెప్టెంబర్ మొదటి శనివారం, “రే ఆకాష్ క్రీకెట్ ఆడటానికి రారా” అంటూ పిలిచాడు విక్రమ్..
. "లేదు విక్రమ్ ఈరోజు ఆటలకు వెళితే మా నాన్న తిడతాడు , మా నాన్న వేసిన షెడ్యూల్లో ఆటలకోసం ఆదివారం రెండు గంటల సమయం మాత్రమే ఉంది అప్పుడు వస్తా” అన్నాడు
అయినా శనివారం సాయంత్రం షెడ్యూల్ ఏంటి.., వీకెండ్ ఇచ్చిందే ఆటల కోసం కదరా.
ఈరోజు చదవకుంటే మా నాన్న చంపేస్తాడు..
రోజు చదువుతూనే ఉంటావు గా..
మా నాన్న అంతే, నువ్వెళ్ళు, నేను రేపు కచ్చితంగా వస్తా..
నువ్వు వస్తావని టీం రెడీ చేశా, ఈ ఒక్కరోజు రారా. ఏం కాదు.
ఏంటి విక్రమ్… ఇలా ఆటలాడుతూ తిరిగితే ఎలా బాగుపడతావు, వెళ్ళి చదువుకో, అంటూ బయటికి నడుచుకుంటూ వచ్చాడు రమణ..
అంకుల్ గేమ్స్ ఆడితే మైండ్ రిలాక్స్ అవుతుంది, విషయాలు తొందరగా అర్థం అవుతాయి చదువు బాగా అబ్బుతుంది, అని మా నాన్న చెప్పాడు…
అయితే నువ్వెళ్లి ఆడుకో, మావాడు ఈరోజు రాడు, ఎన్ని మార్కులు వస్తాయో చూద్దువు.., మీ అందరికి చెప్తే వినరు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది..
చేసేదేమీ లేక విక్రమ్ అక్కడినుంచి ముందుకు కదిలాడు, దారిలో వాసు , విజయ్ కలిస్తే వాళ్ళతో పాటు వెళ్లిపోయాడు.
సమయం 8 :10 అవుతుంది విక్రమ్ తో పాటు అమ్మానాన్నలు లగేజ్ అంతా సర్దుకుని బయటకు వచ్చారు. అక్కడ ఆటో ఎదురుచూస్తోంది, లగేజ్ అంత ఆటో లో పెట్టి అమ్మ నాన్నలను కూర్చోబెట్టాడు.
విక్రమ్, జయ బండ్లో బయలుదేరారు, 8 : 30 కి బస్టాప్ చేరుకున్నారు.
ట్రావెల్స్ బస్సు రావడానికి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది.
విక్రమ్ , జయ బస్టాప్ నుంచి కొంచెం దూరంగా నడిచారు.
“ ఎక్కడికి రా” అడిగింది అమ్మ.
టీ తాగి వస్తాం, మీకూ కావాలా..
వద్దు, త్వరగా రండి.
“సరే అమ్మా”, అక్కడినుంచి కొంచెం దూరంగా వెళ్లి ఇద్దరు తలో సిగరెట్ వెలిగించారు..
రేయ్ జయ..
చెప్పు మావ..
నువ్వు ఎందుకు మా ఇంట్లో ఉండకూడదు, చాలా దూరం నుంచి వస్తున్నావ్ ఆఫీస్ కి.
ఇక అంతే సంగతి మా అత్త నాన్నకు చెప్పి మర్డర్ చేయిస్తుంది..
సరే మీ నాన్న నెంబర్ ఇవ్వు, నే మాట్లాడతా..
వద్దులే రా…. మా నాన్న నేను చెప్తేనే వినడు… నువ్వు చెప్తే ఎందుకు వింటాడు, అదీకాక మా అత్తకు పిల్లలు లేరు నన్నే సొంత కొడుకులా చూసుకుంటోంది, ఇప్పుడు నేను వచ్చేస్తే, వాళ్ళు సరిగ్గా చూడలేదని వెళ్ళిపోయా అనుకుంటారు.
అవునా, అయితే వద్దులే మావా..
అలా పాత విషయాలు ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు, ఇంతలో విక్రమ్ వెనకనుంచి హార్న్ వినపడింది, ఇద్దరు ఆ వైపు చూశారు, ఒక ట్రావెల్స్ బస్సు వచ్చి వాళ్ల పక్కనే ఆగింది, సిగరెట్ పక్కకు పడేశారు..
ఆగిన బస్సులోంచి ఒక్కొక్కరిగా ప్రయాణికులు దిగుతున్నారు.
ఇంతలో…