Tholipournami - 5 in Telugu Love Stories by sreelu books and stories PDF | తొలి పౌర్ణమి - 5

The Author
Featured Books
  • पहला प्यार ? - 2

    पहला हा सही सुना अपने कुछ उसके बारे में एहसास से ज्यादा करने...

  • मौन की आवाज

    शीर्षक: मौन की आवाजगांव के किनारे एक पुराना बरगद का पेड़ था....

  • माई डियर प्रोफेसर - भाग 35

    -------------स्टाफ रूम का माहोल अजीब सा हो गया था। चारू हैरत...

  • Money Vs Me - Part 14

    यहाँ तक मेरी कहानी सुनकर शायद आपको भी यही लग रहा होगा कि अब...

  • ऊर्जा त्बा

    यजुर्वेद सूक्ति (5) की व्याख्या"इषे त्वा ऊर्जे त्वा"यजुर्वेद...

Categories
Share

తొలి పౌర్ణమి - 5

ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ ను పైకి లేపాడు,ఇంతలో వెనకనుంచి ఎవరో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకున్నారు, “ఆ చల్లటి గాలిలో చమటలు పట్టాయి”. మెల్లగా వెనక్కి తిరిగాడు, అది ఎవరో కాదు తన కలలో వచ్చిన ఆకాష్.
 కలలో భయపెట్టిన ఆకాష్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఆ రోధన చాలా భయంకరంగా ఉంది.
“ రేయ్.. ఎందుకురా నన్ను చంపావు…. చెప్పు! చెప్పరా….. “
విక్రమ్ భయం అంచులు దాటింది, బైక్ కిందకు వదిలేసాడు.. 
“రేయ్ నేను ఏది కావాలని చేయలేదు రా!!..”
“లేదు .. నువ్వు కావాలనే చేశావు” అంటూ అరిచాడు ఆకాష్..
నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా “నేనేది కావాలని చెయ్యలేదు”..అంటూ ఆకాష్ కి సమాధానం చెప్పే క్రమంలో విక్రమ్ కూడా బాధపడుతున్నాడు..
“రేయ్ విక్రమ్! ఏమైంది రా నీకు, రాత్రిపూట ఒక్కడివే మర్రి చెట్టు కింద పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నావ్” అని వినిపించింది… విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తాతయ్య ఆలస్యం అయ్యేసరికి వెతుక్కుంటూ స్కూటీలో వచ్చాడు, విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతను కౌగిలించుకున్నాడు . భయంతో విక్రమ్ శరీరం వణుకుతోంది, ఒక ఐదు నిమిషాల తర్వాత స్థిమితపడ్డాడు.
జరిగిన విషయం చెప్పగానే తాత చుట్టూ వెతికాడు, చూస్తే అక్కడ ఎవరు లేరు, చేసేదేమీ లేక ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు,
 మనవడు నిద్రపోయాక . విషయం ఏంటో తెలుసుకుందామని సూర్యా ని తన గదిలోకి పిలిచాడు రామన్న తాత. 
ఏంటి సూర్య ఏమైంది రా వాడికి, చిన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేవాడు, అందరితో బాగా కలిసిపోయేవాడు, ఇప్పుడు చూస్తే సరిగ్గా మాట్లాడట్లేదు వింతగా ప్రవర్తిస్తున్నాడు, “అసలేమయ్యింది విక్రమ్ కు” అని కంగారుగా అడిగాడు..
ఏం చెప్పమంటావు నాన్న.. నేను ఉద్యోగం కోసం హిందూపురం వెళ్ళింది గుర్తుందా, అప్పుడు జరిగిన సంఘటన ఇది అంటూ చెప్పసాగాడు. 


“లోపలికి రండి సార్, ఇప్పుడే పూజ పూర్తయింది వచ్చి దండం పెట్టుకోండి” అన్నాడు సూర్య.
 బయట కాళ్ళు కడుక్కొని లోనికి వచ్చారు, అందరూ దేవుడికి నమస్కరించి భోజనానికి కూర్చున్నారు.
రమణ మరియు సూర్య ఏవో కాలేజీ విషయాలు మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు.
అప్పుడు రమణ కావాలనే, “విక్రమ్ మొన్న జరిగిన పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి” అని అడిగాడు.
500 కు గాను 350 వచ్చాయి అంకుల్. 
అంతేనా మా ఆకాష్ కి 480 వచ్చాయి, ఆ రోజు చెప్తే విన్నావా ఆటలు రిఫ్రెష్మెంట్ అని ఏదేదో అన్నావ్ గా ఇప్పుడు చూడు.., ఇప్పటికైనా మారితే నీకే మంచిది..
అది వినగానే విక్రమ్ కొంచెం నిరాశ పడ్డాడు. 
అది గమనించిన సూర్య , “మార్కుల్లో ఏముంది లేండి సార్ చదువుకుంటే అవే వస్తాయి, అయినా విక్రమ్ స్పోర్ట్స్ చాలా బాగా ఆడతాడు ఏదో ఒక రోజు ఆ స్పోర్ట్స్ వల్ల గొప్ప స్థాయికి వెళ్తాడని నా నమ్మకం.”
ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రశాంతంగా భోజనం చేయండి అంది శారద..
అది అంతటితో ఆగలేదు రమణ తిరిగి మాట్లాడుతూ - ఆ… స్పోర్ట్స్ ఆడుకుని ఎవరు సుఖపడ్డారు సార్, ఎవరో నూటికో కోటికో ఒక్కరు. అదే చదువుకుంటే దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు, మీరు చెప్పిన స్పోర్ట్స్ ని ఎక్కడ ఉపయోగించలేం కదా అని వెకిలి గా నవ్వాడు.
“ఇదిగో మీరు నేను చదువుకున్నాం, చాలా పైకొచ్చాం కదా” అన్నాడు సూర్య..
“ఏంటి అవమానిస్తున్నారా” అని పెద్ద గొంతుతో అరిచాడు. 
అది కాదు సార్,నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎప్పుడూ చదవండి అంటూ ఒత్తిడి పెట్టడమే కాదు వాళ్ళకి కావాల్సిన కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. 
అవును అంకుల్ మీ వల్ల ఆకాష్ ఎంత టెన్షన్ పడుతున్నాడో నాకు తెలుసు..
“ఓహో !.. ఇప్పుడు నా పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నువ్వే నాకు నేర్పిస్తావా” అన్నాడు రమణ.
నేను మీ మంచికే చెప్తున్నా..
“ముందు నీ కొడుక్కి డిసిప్లిన్ నేర్పించి మంచి మార్కులు వచ్చేలా చేయవయ్యా, ఇలా బలాదూర్ గా వదిలేస్తే వాడు చెడిపోయేదే కాకుండా నలుగురిని చెడగొడతాడు..”
“ఏంటి సర్ కొంచెం కూడా మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నారు”, చిన్న పిల్లల ముందు మీరు ఇలాగేనా మాట్లాడేది.
మరి ఇంకెలా మాట్లాడాలి, మీలాగా “ఏ బాధ్యత లేకుండా గాలికి తిరుగు” అని చెప్పాలా.. చెప్పండి..
అది కాదు సార్, అంత చిన్న వయసులో వాళ్ళకు బాధ్యతలు చెప్పి లేనిపోని భయాలు కలిగించడమెందుకు, వాళ్లకు ధైర్యంగా ఉండటం నేర్పాలి, మీరు మీ ఆశయాలు లేదా ఆలోచనలు వాళ్ళపై రుద్దడం వల్ల వాళ్ళ సొంత ఆలోచనా విధానాన్ని కోల్పోయి దీని గురించే ఆలోచిస్తుంటారు.. అలాంటప్పుడు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని ఎలా ఎంచుకుంటారు చెప్పండి.., దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి రమణ.
నీ దగ్గర నీతులు వినే కర్మ నాకు పట్టలేదు, మీరు మీ కొడుకుని ఇలాగే పెంచండి, అదేం ఉద్దరిస్తా డో నేనూ చూస్తా..
“ఇంత సూక్ష్మంగా చెప్పిన అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు మీరు లెక్చరర్ ఏనా” అన్నాడు సూర్య. 
“భోజనానికి పిలిచి ఇదా మీరు చేసేది, పదండి మన ఇంటికి పోదాం” అంటూ పైకి లేచాడు రమణ. 
 సూర్య, శారద ఎంత చెప్తున్నా వినకుండా కుటుంబంతో సహా కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 
రమణ అలాంటివాడు అని సూర్య అస్సలు అనుకోలేదు.
 సరిగ్గా శనివారం రోజు ఆకాష్ తిరిగి హిందూపురం వచ్చాడు. రెండు కుటుంబాల మధ్య నిశ్శబ్దం సాగుతోంది, ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఆకాష్ కానీ దాని గురించి ఏం మాట్లాడలేక ఊరకుండిపోయాడు. 
మరుసటి రోజు ఆదివారం కావడంతో అలా బయటకు వచ్చాడు ఆకాష్. అది చూసిన విక్రమ్ కలవడానికి బయటికి వచ్చాడు..
“ఆకాష్ ఎలా ఉన్నావ్..”
బాగున్నా .., అంటూ తలవంచుకుని ముందుకు కదిలాడు ఆకాష్..
”మనం క్రికెట్ ఆడడానికి వెళ్దామా..” అని అడిగాడు విక్రమ్.
 ఏం మాట్లాడకుండా అలానే ముందుకెళ్తున్నాడు.
 ఇంతలో ఆకాష్ చేతిని ఎవరో పట్టుకున్నారు, చూస్తే సూర్యా..
చూడు ఆకాష్ మేము పెద్దవాళ్ళo ఎలా ఉన్నా, చిన్న పిల్లలు మీరు చాలా ఫ్రెండ్లీ గా ఉండాలి !! "అలాంటివన్నీ పట్టించుకోకూడదు క్రికెట్ ఆడడానికి వెళ్ళు” , అన్నాడు. 
సూర్యా కు ఎదురు చెప్పలేక విక్రమ్ తో కలిసి ఆడటానికి వెళ్ళాడు, ఇద్దరు ఎంజీఎం గ్రౌండ్ ని చేరుకున్నారు.
 మొత్తం 14 మంది రెండు టీములుగా విడిపోయారు. విక్రమ్ మరియు విజయ్ తలోవైపు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు, టాస్ గెలిచిన విక్రమ్ ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అది చూసిన తన టీమ్ మెంబర్స్ కోప్పడ్డారు, ముందు బ్యాటింగ్ తీసుకుంటే అందరికీ బ్యాటింగ్ వచ్చేదని వాసు అభిప్రాయపడ్డాడు.
విక్రమ్, విజయ్ ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు.
ఆట మొదలైంది!!
 విజయ్ మొదట బ్యాటింగ్ కు దిగాడు. మొదటి ఓవర్ ను చాలా కట్టుదిట్టంగా వేశాడు విక్రమ్, కానీ ఆ తర్వాతి ఓవర్ నుంచి రన్స్ లీక్ అవుతూనే ఉన్నాయి, విజయ్ అడపాదడపా బౌండరీలు కొట్టడం మొదలు పెట్టాడు, మరో వైపు విజయ్ టీం లో ఉన్న ఇతర ప్లేయర్లు వికెట్లు కోల్పోతుంటే ఆకాష్ వచ్చి స్ట్రైక్ నిలబెట్టుకున్నాడు. 6 ఓవర్ల తరువాత స్కోర్ 70-4 ఉంది, విజయ్ – 43, ఆకాష్ – 15 మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
 ఇలా అయితే స్కోర్ చాలా వస్తుందని వెంటనే బౌలింగ్ కి వచ్చాడు విక్రమ్, నాన్ స్ట్రైకర్ లో ఉన్న ఆకాష్ వద్దకు వెళ్ళి “బాగా ఆడుతున్నావ్” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆకాష్ ఏం మాట్లాడలేదు.
విక్రమ్ బౌలింగ్ కోసం లాంగ్ రన్నప్ తీసుకుని, పరిగెడుతూ వచ్చి మొదటి బంతిని వేగంగా విసిరాడు, ఆ బంతిని సిక్సర్ గా మలిచాడు విజయ్, “వెంటనే విక్రమ్ వైపు చూసి కళ్ళెగరేశాడు”. విక్రమ్ ఏం మాట్లాడకుండా, తరవాతి బంతికి ఇంకా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆఖరి సెకండ్ లో పేస్ తగ్గించి ‘ స్లో- బాల్’ వేశాడు. టెంప్ట్ అయిన విజయ్ బ్యాట్ ను ముందే ఉపేసి బౌల్డ్ అయ్యాడు. 
అంతే ఒక్కసారిగా అందరూ విక్రమ్!... విక్రమ్!... అంటూ కేకలు వేశారు, విజయ్ కి అది నచ్చలేదు, విక్రమ్ టీమ్ అంతా ఒక చోట చేరి మాట్లాడుతున్నారు, ఇంతలో విక్రమ్ చెవిలో ఈ మాటలు పడ్డాయి. “నేను ఇంకా రెడీగా లేను ముందే బాల్ వేసి చీట్ చేస్తున్నాడు వాడమ్మా వాడెం ప్లేయర్ రా, bloody cheater”.
 విక్రమ్ కు చిర్రెత్తుకొచ్చింది…, అంతే పక్కనే ఉన్న వికెట్ తీసుకొని విజయ్ మీదకు వేగంగా వెళ్ళాడు, విక్రమ్ చేతిలో ఉన్న వికెట్ ని ఎలాగోలా గా పక్కకు లాగేసాడు వాసు . కానీ విక్రమ్ ఆగలేదు విజయ్ ముందు నిలబడి తన పిడికిలి బిగించి దవడ మీద ఒక్క గుద్దు గుద్దాడు! అంతే దవడ పక్కకు జరిగినంత పని అయింది కిందపడ్డాడు విజయ్.
  పైకి లేచిన విజయ్, ఏమాత్రం తగ్గకుండా “ఈరోజు నా చేతిలో చచ్చావు రా” అంటూ తన బ్యాట్ తో విక్రమ్ తలమీద కొట్టాడు. అంతే విక్రమ్ నుదుటి పైనుంచి రక్తం ధారలుగా కిందకి కారింది.
   వచ్చిన ఆవేశానికి విక్రమ్ కు పిచ్చెక్కింది, తన నుదుటి నుంచి వస్తున్న రక్తపు ధారల మధ్యలోంచి విజయ్ ను సూటిగా చూస్తూ, తన జట్టును వెనక్కి సవరించి “ఎవడు చస్తాడో డిసైడ్ చేసేది నేను” అంటూ విజయ్ గొంతు పట్టుకున్నాడు, విజయ్ కూడా వెనకడుగు వేయకుండా విక్రమ్ కాలర్ పట్టుకున్నాడు, ఒకరి తర్వాత ఒకరు గుద్దుకుంటున్నారు, ముఖం మీద, కడుపు మీద, డొక్కల్లో, ఎక్కడపడితే అక్కడ..
చుట్టూ ఉన్నవాళ్లు ఎంత చెప్పినా ఆగట్లేదు. మిగిలిన ప్లేయర్లు భయంతో విక్రమ్ ని ఆపడానికి ప్రయత్నించట్లేదు, ఎందుకంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తోంది అతనే, విజయ్ తన్నులు తింటున్నాడు అంతే, విక్రమ్ తన మాట వింటాడని అందరూ “ఆకాష్” ను ముందుకు తోశారు.
విక్రమ్, విజయ్ ఆపండి, అని అరిచాడు ఆకాష్. అది వాళ్ళిద్దరికీ చెవిన పడలేదు, విక్రమ్ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు ఆకాష్. కోపంలో ఉన్న విక్రమ్ ఆకాష్ ని పక్కకు తోశాడు. ఆ తోసిన వేగానికి ఆకాష్ కిందపడ్డాడు, ఆ గొడవ ఆగలేదు.
ఆకాష్ కిందపడిన ప్రయత్నం మానుకోలేదు పైకి లేచి మళ్ళీ ఆపడానికి వచ్చాడు , ఆకాష్ ప్రయత్నానికి విసుగెత్తిన విక్రమ్ ఈసారి మరింత గట్టిగా తోశాడు, ఈసారి తన వేగాన్ని అసలు నియంత్రించుకోలేక గట్టిగా ఊపిరి పీలుస్తూ కింద పడిపోయాడు. ఆకాష్ ని పట్టించుకోకుండా ఇద్దరు మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు అలా 10 సెకండ్లు గడిచింది. “ఆకాష్” అని గట్టిగా కేక వినిపించింది, కొట్లాట ఆపి ఇద్దరు అటువైపు చూసారు, ప్లేయర్లంతా ఆకాష్ చుట్టూ చేరారు. గొడవను వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు విక్రమ్. ఆకాష్ కి సరిగ్గా ఊపిరాడట్లేదు, విక్రమ్ కి చాలా భయమేసింది, ఆ భయం ఎంత అంటే తన జీవితం మొత్తాన్ని చీకటితో కమ్మేసేంత.
 విక్రమ్ అందరితో కలిసి ఆకాష్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.
 విజయ్ ఆకాష్ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రమణతో “విక్రమ్ ఆకాష్ ను చంపడానికి ప్రయత్నించాడని” చెప్పాడు. 
 రమణకు జరిగిన విషయం తెలుసుకునేందుకు ఓపిక లేదు, ఒకపక్క కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, వెంటనే బయలుదేరి కుటుంబం మొత్తం హాస్పిటల్ కి చేరింది, డాక్టర్ వచ్చి “కండిషన్ క్రిటికల్ గా ఉంది” అని చెప్పి లోపలికి వెళ్లిపోయారు..
ఆకాష్ వాళ్ళ అమ్మ శాంతి నేరుగా విక్రమ్ వద్దకు వెళ్ళి చెంప పగలగొట్టింది, “నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు గా ఎందుకిలా చేశావు” అని అరిచింది..
విక్రమ్ నిశ్శబ్దంగా ఉన్నాడు…
డాక్టర్ ఏవేవో పరీక్షలు చేసి చూశారు ఏం చేసినా పల్స్ లేదు, ఎలక్ట్రానిక్ పరికరాలు తెప్పించి సి.పి.ఆర్ చేశారు అట్లీస్ట్ అలా అయినా ఊపిరి తిరిగి వస్తుందేమో అన్న ఆశతో…
 అలా చాలా సేపు ప్రయత్నించాక, డాక్టర్ బయటకు వచ్చి “ఐయామ్ సారీ సర్” అన్నాడు …
 రమణా శాంతి అక్కడే కూలబడిపోయారు, బోరు మంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు…
“ మీరు తర్వాత క్యాబిన్ కి రండి మీతో కొంచెం మాట్లాడాలి” అని వాళ్ళతో చెప్పి ఏదో ఎమర్జెన్సీ కేసు ఉంటే డాక్టర్ వెళ్ళిపోయాడు.
 విక్రమ్ కు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నేనేనా ఆకాష్ ను చంపింది అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు.
 వచ్చిన వాళ్లంతా విక్రమ్ ను తిడుతుంటే అక్కడ ఏర్పడిన పరిస్థితి నిజంగా అతనికి ఒక నరకం లా అనిపిస్తోంది..
రమణ శాంతి ఏడుస్తూనే ఉన్నారు, తెలిసిన వాళ్లంతా అక్కడికి వచ్చి వాళ్ళను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు, “ కానీ కన్న కొడుకు పోయిన బాధని ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు కదా”.. వాళ్ళు అలానే ఏడుస్తూ ఉండిపోయారు. కాసేపయ్యాక ఎలాగోలా వాళ్లకు సర్ది చెప్పి ఆకాష్ ని తీసుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు.
 ఆకాష్ ను చివరిగా చూడడానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, విక్రమ్ కొంచెం దూరంగా నిలబడి ఆలోచనలో పడ్డాడు, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, ఇప్పుడు విక్రమ్ మైండ్ లో ఒక బ్లాంక్ స్పేస్ మాత్రమే ఉంది.
 తను మంచిగా చదువుకొని కుటుంబ పరిస్థితి మారుస్తానని చెప్పిన ఆకాష్ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా, మరింత బాధ కలుగుతోంది రమణకు.