షీలా! నువ్వేంటి అసలు మాట్లాడటం లేదు? ఏం చేస్తున్నావు షీలా?" అంటూ నీల తన భుజం మీద చేయి వేసేసరికి, షీలా ఉలిక్కిపడింది. అప్పటిదాకా ఆమె అయాన్ వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది.
అప్పుడు నీల, "ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న నీకు ఫోన్లో చెప్పాను కదా.. ఇతనే అయాన్! అయాన్, తను నా స్నేహితురాలు షీలా," అని పరిచయం చేసింది. దానికి షీలా, "అవసరం లేదు నీలా.. ఇందాకే మాకు పరిచయం అయ్యింది," అని కొంచెం సిగ్గుపడుతూ అంది.
నీలకు అర్థం కాలేదు. 'షీలా ఎందుకు అంతలా సిగ్గుపడుతోంది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది?' అని తనలో తాను ఆలోచించుకోసాగింది. అప్పుడే సుస్మిత కాఫీ పట్టుకొని వచ్చింది. షీలా కి ఇస్తూ "నీలా! కాలేజీకి వెళ్ళావు కదా.. అప్పుడే వచ్చావేంటి?" అని అడిగింది.
"లేదమ్మా, ఈరోజు సార్ రాలేదని సెలవు ఇచ్చారు," అని చెప్పింది నీల.
"మరి అన్నయ్య ఎక్కడ?" అని అడిగితే, "అన్నయ్యకు కాలేజీలో పని ఉంది. అలాగే నాన్న ఊరు వెళ్లేముందు ఆఫీసు పని ఒకటి అప్పచెప్పారు, అది చూసుకొని వస్తానన్నాడు," అని సమాధానమిచ్చింది
అవునా! ఆ.. చెప్పడం మర్చిపోయాను. ఇందాక నాన్న కార్ వరకు వెళ్లినప్పుడు అయాన్‌ను ఎవరో ఆకతాయి పిల్లలు ఏడిపించారంట," అని చెప్పి సుస్మిత లోపలికి వెళ్ళిపోయింది. అది వినగానే నీల కంగారుగా అయాన్ చేయి పట్టుకొని, "నీకు ఏమైన అయిందా" అయాన్? నిన్ను ఏమైనా చేశారా? చెప్పు!" అని అడిగింది.
అప్పుడు షీలా వెంటనే నీల చేయి పక్కకు తీసి, "నువ్వు కంగారు పడకు నీలా! నేను ఉన్నాను కదా.. నేనే కాపాడాను," అని చెప్పింది. అయాన్ కూడా "అవును నీలా మేడం! నన్ను షీలా గారే కాపాడారు," అన్నాడు.
షీలా ఏమో సిగ్గుపడుతోంది, అయాన్ ఏమో తనను కాపాడింది అంటున్నాడు. 'వీరిద్దరి మధ్య ఏదో తేడాగా ఉంది' అని మనసులో అనుకుంటూ నీల లోలోపల అసూయతో రగిలిపోసాగింది.
షీలా మాట్లాడుతూ, "సరే నీలా, నాకు కొంచెం నీరసంగా ఉంది. నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను," అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్నప్పుడు అయాన్ చాలా వినయంగా, "షీలా గారు! ఆవిరి పట్టండి, అప్పుడు రొంప తగ్గుతుంది. మందులు వేసుకోవడం మర్చిపోకండి, బాగా విశ్రాంతి తీసుకోండి," అని చెప్పాడు. అయాన్ ది మెకానిక్ వాయిస్ అయినప్పటికీ, షీలాతో మాట్లాడుతున్నప్పుడు అది చాలా మృదువుగా అనిపించింది.
అది చూసిన నీల కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంతో, అసూయతో వారిద్దరినీ చూస్తూనే ఉండిపోయింది. షీలా మాత్రం మురిసిపోతూ, సిగ్గుపడుతూ అటూ ఇటూ చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నీల తదేకంగా వారిద్దరినీ చూస్తూ కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి సుస్మిత ఎన్నిసార్లు పిలిచినా ఆమె బయటకు రాలేదు. "నాకు ఆకలిగా లేదు" అని లోపలి నుండే గట్టిగా చెప్పేసింది.కాసేపటికి అయాన్ వచ్చి నీల గది తలుపు తట్టాడు. "ఎవరు?" అని అడిగింది నీల."నేనే మేడం గారు, అయాన్‌ని," అన్నాడు బయటి నుండి. ఆ గొంతు వినగానే నీల మొహంలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. వేగంగా వెళ్లి తలుపు తీయబోయి, ఒక్క క్షణం ఆగింది. 'నేను ఎందుకు తన గురించి ఇంతలా ఫీల్ అవుతున్నాను? తను మనిషి కాదు, ఒక రోబో! అసలు నాకు ఏమవుతోంది? నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఇది అస్సలు కరెక్ట్ కాదు.. నేను ఇలా చేయకూడదు' అని తనను తాను నియంత్రించుకుని, నెమ్మదిగా తలుపు తీసింది."చెప్పు అయాన్, ఏమిటి? ఎందుకు పిలిచావు?" అని అడిగింది.అప్పుడు అయాన్ చాలా వినయంగా, "మేడం గారు, భోజనం టైమ్ దాటిపోయింది, మీరు ఇంకా ఏమీ తినలేదు. మీ నాన్నగారు వెళ్లేముందు అందరినీ జాగ్రత్తగా చూసుకోమని నాకు బాధ్యత అప్పగించి వెళ్ళారు. ఇప్పుడు మీరు భోజనం చేయకపోతే ఆయనకు నేను ఏమని సమాధానం చెప్పాలి?" అని అడిగాడు. ఆ మాటల్లోని శ్రద్ధ నీల మనసును మళ్ళీ ఆలోచనలో పడేసింది.
అయాన్ తన మెకానిక్ గొంతుతో సమాధానమిస్తుంటే, నీల ఆశ్చర్యంగా చూస్తూ, "కేవలం మా నాన్న గారు నీకు చెప్పినందుకే నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నావా అయాన్?" అని అడిగింది.అప్పుడు అయాన్ చాలా నిలకడగా, "అవును మేడం. ఇది నా ఆర్డర్. నా ప్రోగ్రామింగ్‌లో ఉన్న ఆదేశాలను నేను దాటకూడదు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా విధి," అని నిష్కల్మషంగా అన్నాడు
నీల మనసులో ఒక చిన్న నిట్టూర్పు విడిచింది. 'నిజమే.. నేను ఎక్కువగా ఊహించుకుంటున్నాను. తను ఒక యంత్రం, కేవలం ఆదేశాలను పాటిస్తాడు తప్ప నాపై ఇష్టంతో చేయడం లేదు' అని తనని తాను సమాధానపరుచుకుంది. "సరే అయాన్, నాకు ఇప్పుడు ఏమీ వద్దు. నేను కాసేపు ఆగి వచ్చి తింటాను, ఓకేనా?" అని చెప్పింది.కానీ అయాన్ అక్కడి నుండి కదలకుండా, "కనీసం ఈ జ్యూస్ తాగండి మేడం. మీ శరీరానికి శక్తి అవసరం," అని చెప్పి గ్లాసును నీలకి అందించాడు. నీల ఆ జ్యూస్ తీసుకుని లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సుస్మిత మనసులో ఒక వింత మార్పు మొదలైంది. 'ఇది కేవలం రోబో అయినా సరే.. పనులు ఎంత చక్కగా చేస్తోంది! మాట తీరు, పద్ధతి అన్నీ బాగున్నాయి. దీని వల్ల ఏదో చెడు జరుగుతుందని నేను ఊహించి భ్రమపడ్డాను' అని తనలో తాను అనుకుంది. 'ఏమైతే ఏముంది, మొండి పట్టు పట్టే నీల కనీసం జ్యూస్ తాగేలా చేసింది. ఒక్కోసారి నీలకు కోపం వస్తే అది తగ్గే వరకు ఎవరికీ శాంతి ఉండదు. అది తెచ్చి ఇచ్చే వరకు నాకు బాధ తప్పదు అనుకునేదాన్ని, కానీ అయాన్ దాన్ని చాలా సులువుగా డీల్ చేశాడు' అనుకుంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
అయితే, లోపల జ్యూస్ గ్లాసు పట్టుకున్న నీల ఆలోచనలు మాత్రం అయాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. అయాన్ చెప్పింది కేవలం ఆదేశమేనా? లేక ఆ యంత్రం వెనుక ఏదైనా మర్మం ఉందా? అయాన్ ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ మృదుత్వం నిజంగానే ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామా లేక తన కోసం మారుతున్న ఒక కొత్త స్పందనా?