The mind behind the machine - 4 in Telugu Love Stories by swathi books and stories PDF | యంత్రం వెనుక మనసు - 4

The Author
Featured Books
Categories
Share

యంత్రం వెనుక మనసు - 4

"ఏమిటో చెప్పు ఆర్య, తప్పకుండా చేస్తాను" అన్నాడు అయాన్ తన మెకానికల్ వాయిస్‌లో.
"మా చెల్లి ఉంది చూడు.. ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఈసారి నేను దాన్ని ఆటపట్టించాలి. ఏం చేసినా తనే గెలుస్తోంది, నేనే ఓడిపోతున్నాను. తనకి నా మీద భయం పుట్టాలి. నా పేరు వింటేనే గజగజ వణికిపోయేలా ఏదైనా ఐడియా ఉంటే చెప్పు" అని అడిగాడు. అలా తన పేరు చెప్పగానే నీల భయపడిపోవాలని ఊహించుకుంటూ ఆర్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.
వెనుక నుండి నీల వచ్చి ఆర్య నెత్తి మీద ఒక్కటి చరిచింది.
"అది ఎప్పటికీ జరగదు లేరా అన్నయ్య! ముందర రా.. అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటోంది" అంటూ గట్టిగా నవ్వుతూ అక్కడి నుండి పారిపోయింది. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్య నోరెళ్లబెట్టాడు.
అందరూ టిఫిన్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్లేట్లలో వేడివేడి దోశలు ఆవిర్లు కక్కుతున్నాయి. నీల పక్కనే కూర్చున్న ఆర్య, ఆమె వైపు ఒక రకమైన 'లుక్' ఇచ్చి, తన ప్లాన్ ఫెయిల్ అయిన కోపాన్ని దోశ మీద చూపిస్తున్నాడు.
రాజు గారు పూరి తింటూ, "ఏమిటి ఆర్య.. అయాన్‌ని లోపలికి తీసుకెళ్లి ఏదో సీరియస్ చర్చలు జరిపావు? ఏంటి విషయం?" అని అడిగారు.
నీల కళ్లు ఆర్పకుండా ఆర్య వైపు చూస్తూ నవ్వు ఆపుకుంటోంది. ఆర్య కంగారు పడిపోయి, "ఏమీ లేదు నాన్న.. ఊరికే జనరల్ విషయాలు" అని కవర్ చేయబోయాడు.
కానీ అప్పుడే అయాన్ అక్కడికి వచ్చాడు రాజు గారు అయాన్ నిన్ను ఆర్య నిన్ను ఎందుకు లోపలికి తీసుకొని వెళ్ళాడు అని అడిగారు రాజు గారు హాలులో ఒక్కసారిగా నిశ్శబ్దం. సుస్మిత, రాజు గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీల మాత్రం కుతూహలంతో ముందుకు వంగింది.
"అయాన్.. వద్దురా బాబు! ఆగు!" అని ఆర్య బతిమాలుతున్నా వినకుండా అయాన్ కంటిన్యూ చేశాడు.. "నీల తన పేరు చెప్పగానే భయపడి గజగజ వణికిపోవాలని, దానికి ఏదైనా ఐడియా ఇవ్వమని ఆర్య నన్ను అడిగాడు. కానీ నా విశ్లేషణ ప్రకారం నీలకు ఆర్య అంటే భయం లేదు, పైగా తనే ఆర్యను ఆటపట్టిస్తోంది. అని అయాన్ జరిగిన విషయం చెప్పాడు
అంతే! నీల ఒక్కసారిగా పెద్దగా నవ్వేసింది. రాజు గారు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. "ఒరేయ్ ఆర్య.. నీకు రోబోలు కూడా సలహాలు అడగడం మొదలుపెట్టాయా? అయినా నీకు నీ చెల్లి మీద అంత భయం ఎందుకురా?" అని ఎగతాళి చేశారు రాజు గారు.
ఆర్య ముఖం మాడిపోయింది. "అమ్మ.. చూడు వీళ్ళని!" అని సుస్మిత వైపు తిరిగాడు. సుస్మిత ఇంకా చాలండి మీరు మీ పిల్ల నా కొడుకుని ఏడిపిస్తున్నారు నోట్లో నాలుక లేదు అందుకే ఇలా ఆటపిట్టిస్తున్నారు అని వెనుకేసుకొని వచ్చింది అవునవును నాలుక ఏంటి బుర్ర కూడా లేదు అని రాజు గారు అన్నారు.
నీల మెల్లగా ఆర్య చెవిలో, "నన్ను భయపెడతావా అన్నయ్య? నా బాడీగార్డ్ ఎవరో చూశావా? అయాన్ నా ఫ్రెండ్!" అని ఆటపట్టించింది.
అయాన్ మాత్రం ఇవేమీ పట్టనట్టు నిలబడి ఉన్నాడు. కానీ నీల ముఖంలో కనిపించిన ఆ ఆనందం చూసి, తన మెమరీ చిప్‌లో ఒక కొత్త విషయాన్ని నోట్ చేసుకున్నాడు: "మనుషులు ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడంలో కూడా చాలా ప్రేమ ఉంటుంది."
ఆర్య, నీల కాలేజీకి రెడీ అయి వెళ్ళిపోయారు. రాజు గారు ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటూ, "సరే సుస్మిత, నేను వెళ్ళి వస్తాను" అన్నారు.
సుస్మిత ముఖం చిన్నబుచ్చుకుని, "మళ్ళీ ఎప్పుడు వస్తారు? పది రోజులా లేక పదిహేను రోజులా?" అని అలకగా అడిగింది. అది గమనించిన రాజు గారు నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్ళి, "ఏమిటి మేడం గారికి అప్పుడే అలక వచ్చేసిందా?" అని ప్రేమగా అడిగారు.
"మరి సార్ గారికి ఇల్లు, పెళ్ళాం, పిల్లలు ఉన్నారని గుర్తుంటే కదా! ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ఇంటికి వస్తారు" అంది సుస్మిత.
రాజు గారు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, "నీ అలక నిజమే సుస్మిత. కానీ ఇదంతా ఎవరి కోసం? మన కోసమే కదా! నీకు, మన పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే కదా నేను ఇంత కష్టపడుతున్నాను" అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

"నిజమేనండి, నేను కాదనడం లేదు. కానీ మీరు పక్కన లేనప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకేం ఉపయోగం?" అని ఆవేదనగా అడిగింది సుస్మిత.
రాజు గారు ఆమె కళ్ళలోకి చూస్తూ, "నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం సుస్మిత. నేను లేకపోయినా ఇల్లుని, పిల్లలని ఎంత చక్కగా చూసుకుంటున్నావు! ఈ ఒక్క ప్రాజెక్ట్ అయిపోతే చాలు.. ఇకపై ఇంత తరచుగా బయట ఊర్లకు వెళ్ళాల్సిన పని ఉండదు. అప్పుడు నీతో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటాను" అని మాట ఇచ్చారు.
సుస్మిత ఏదో సీరియస్ గా లెక్కలు వేయడం చూసి, "ఏమిటా లెక్కలు?" అని అడిగారు రాజు గారు.
"అదా.. మీరు ఇలా చెప్పడం ఇది ఎన్నో సారో అని అంకెలు లెక్కలేస్తున్నాను!" అంది సుస్మిత ఏడుపులో కూడా నవ్వుతూ.
రాజు గారు గుర్రుగా చూస్తూనే నవ్వేశారు. సుస్మిత కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, "జాగ్రత్తగా వెళ్ళి రండి" అని చెప్పింది. "పిచ్చిదానిలా ఏడవకు.. నేను త్వరగానే వచ్చేస్తాను కదా" అని ఆమెను దగ్గరకు తీసుకున్నారు రాజు గారు.