ఇదంతా బయట నిలబడి చూస్తున్న అయాన్, ఆ దృశ్యాలను తన మెమరీలో సేవ్ చేసుకున్నాడు. మనుషుల మధ్య ఉండే ఈ విడదీయరాని బంధాన్ని, ఒకరు లేనప్పుడు మరొకరు పడే ఆ వేదనను చూసి.. ఒక యంత్రమైనా సరే, అయాన్ లోపల ఏదో తెలియని అనుభూతి కలిగింది.
రాజు గారు వెళ్తూ.. "అయాన్! నేను ఇంట్లో ఉండను కదా, నువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి" అని బాధ్యత అప్పగించారు. "అలాగే సార్!" అని అయాన్ ఆయన సూట్‌కేస్ కారులో పెట్టి, సాగనంపి తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు.
అయాన్ లిఫ్ట్ దగ్గరకు రాగానే, అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. "ఎవరీ హ్యాండ్‌సమ్ బాయ్?" అనుకుంటూ అతని చుట్టూ చేరారు. లిఫ్ట్ ఎక్కనివ్వకుండా అతడిని ప్రశ్నలతో ముంచెత్తారు. "ఎవరు నువ్వు? ఏ ఫ్లాట్ మీది?" అని అడుగుతుంటే అయాన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
అంతలో కొందరు ఆకతాయి అబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు. "ఎవడురా వీడు? ఎప్పుడూ చూడలేదు! ఎవరి చుట్టం నువ్వు?" అని ఎగతాళిగా అడిగారు. అయాన్ నెమ్మదిగా, "హాయ్.. నా పేరు అయాన్" అన్నాడు.
అతని మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. "చూడటానికి మనిషిలా ఉన్నాడు కానీ మాట ఏంటి రోబోలా ఉంది?" అని ఒకరు అంటే.. "అసలు వీడు మనిషా రోబోనా? ఒకసారి బట్టలు విప్పి చూద్దాం పదండి" అని అబ్బాయిలు వెటకారం మొదలుపెట్టారు. అమ్మాయిలు కూడా అవును అన్నట్టుగా అతడిని చుట్టుముట్టి వేధించడం మొదలుపెట్టారు.
సరిగ్గా అప్పుడే.. "స్టాపిట్! (ఆపండి!)" అనే గట్టి అరుపు వినిపించింది.
అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నీల పక్క ఫ్లాట్‌లో ఉండే షీలా నిలబడి ఉంది. "ఎందుకు అతడిని అలా ఏడిపిస్తున్నారు? ఎవరైతే మీకేంటి? అతను నీల ఇంటికి వచ్చిన కొత్త రోబో. ఆ విషయం నాకు నిన్నే నీల చెప్పింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అందరూ ఇక్కడి నుండి వెళ్తారా లేదా?" అని గట్టిగా అరిచింది.
షీలా కోపంగా అరిచేసరికి, ఆ ఆకతాయిలు ఆమె వైపు గుర్రుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయాన్ నెమ్మదిగా షీలా వైపు చూసి, "థాంక్యూ షీలా!" అన్నాడు.
"అయ్యో.. పర్వాలేదు అయాన్! మనం పక్క పక్క ఫ్లాట్ వాళ్ళం, ఇలాంటి వాటికి థాంక్స్ ఎందుకు?" అని నవ్వింది షీలా. అయాన్ లోపలికి వెళ్ళిపోతుంటే, షీలా అతడినే వింతగా చూస్తూ ఉండిపోయింది.
అయాన్ లోపలికి వచ్చాడు. సుస్మిత ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయి ఉంది.
"మేడమ్!" అని అయాన్ పిలిచేసరికి ఆమె ఉలిక్కిపడింది. "ఏమిటి అయాన్.. బయట అంత సేపు ఏం చేస్తున్నావు? ఎందుకు లేట్ అయింది?" అని అడిగింది.
అయాన్ సమాధానం చెప్పేలోపే కాలింగ్ బెల్ మోగింది. "ఒక్క నిమిషం ఉండు.. ఎవరో చూస్తాను" అని సుస్మిత వెళ్లి తలుపు తీసింది. అక్కడ షీలా నిలబడి ఉంది.
"రా షీలా! ఏంటి ఇటు వచ్చావు? ఈరోజు కాలేజీకి వెళ్లలేదా?" అని అడిగింది సుస్మిత.
"లేదు ఆంటీ.. కొంచెం నీరసంగా ఉంది, అందుకే వెళ్లలేదు" అని షీలా దిగులుగా చెప్పింది.
అప్పుడే అయాన్ అక్కడికి వచ్చాడు. సుస్మిత అతడిని షీలాకు పరిచయం చేయబోతుంటే.. "పర్వాలేదు ఆంటీ! ఇందాకే లిఫ్ట్ దగ్గర పరిచయం అయ్యాడు" అని షీలా నవ్వింది.
అది విన్న సుస్మిత మనసులో చిన్న ఆందోళన మొదలైంది. 'ఓహో.. వీడు అప్పుడే అందరితో పరిచయాలు పెంచేసుకుంటున్నాడా? నేను వీడిని ఇంటి నుండి ఎలా పంపేయాలి అని ఆలోచిస్తుంటే.. వీడేమో అందరితో పలకరిస్తూ మంచివాడని ముద్ర వేయించుకుంటున్నాడు. ఇప్పుడు నేను వీడిని పంపేస్తే అందరూ నన్నే చెడ్డదానిని అనుకుంటారు' అని తనలో తాను మధనపడసాగింది.
సుస్మిత ఆలోచనలో ఉండగా, "ఆంటీ.. ఆంటీ..!" అని షీలా పిలిచేసరికి తేరుకుంది. "ఆ.. చెప్పు షీలా!" అంది.
షీలా లిఫ్ట్ దగ్గర జరిగిన ఆకతాయిల గొడవ గురించి, అయాన్ ఎలా నిశ్శబ్దంగా భరించాడో మొత్తం వివరించింది.
"అవునా షీలా! ఈ మధ్య ఆ ఆకతాయిల అల్లరి మరీ ఎక్కువైపోతోంది. మొన్న ఇలాగే నీలని కూడా ఏడిపించారు" అని సుస్మిత ఆవేదనగా చెప్పింది.
ఆ మాట వినగానే అయాన్ కళ్ళలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తన ప్రోగ్రామింగ్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన 'సీరియస్ మోడ్' ఆన్ అయింది. నీలని ఎవరో ఏడిపించారు అనే మాట అతని సర్క్యూట్లలో తీవ్రమైన అలజడిని సృష్టించింది
అయాన్‌లో వచ్చిన మార్పును షీలా నిశితంగా గమనిస్తోంది. అతని కళ్లలో మారుతున్న రంగులు, శరీరం నుండి వస్తున్న ఆ వింతైన మెటాలిక్ శబ్దాన్ని చూసి ఆమెకు భయం వేసింది. సుస్మిత కూడా అయాన్ వైపు అనుమానంగా చూడటం గమనించి, షీలా టాపిక్ మార్చింది. "ఆంటీ! కొంచెం తలపోటుగా ఉంది.. కాఫీ ఇస్తారా?" అని అడిగింది.
"ఉందమ్మా.. ఇప్పుడే తీసుకువస్తాను" అని సుస్మిత వంటగదిలోకి వెళ్ళింది. షీలా మెల్లగా అయాన్ దగ్గరకు వెళ్లి, "అయాన్.. అయాన్!" అని పిలిచింది. కానీ అయాన్ ఇంకా ఆ 'సీరియస్ మోడ్' లోనే ఉన్నాడు. అతని కోపం అణుమాత్రం తగ్గలేదు.
సరిగ్గా అదే సమయంలో నీల లోపలికి వచ్చింది. షీలాను చూసి ఆశ్చర్యపోతూ, "షీలా! నువ్వు ఇక్కడ ఉన్నావేంటి?" అని అడిగింది. నీల గొంతు వినగానే షీలా వెనక్కి తిరిగి చూసి, "నీలా!" అంది.
కానీ అప్పుడే అయాన్ గొంతులో అద్భుతమైన మార్పు వచ్చింది. ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా "నీలా!" అని పిలిచాడు. అది వినగానే షీలాకు ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. అంత కోపంగా ఉన్న రోబో, నీల గొంతు వినగానే ఒక్క సెకనులో సాధారణ స్థితికి వచ్చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది.
"నువ్వేంటి షీలా.. అలా వింతగా చూస్తున్నావు? ఏం జరిగింది?" అని నీల అడిగింది. షీలా తేరుకుని, "ఏమీ లేదు.. నువ్వు ఇంత త్వరగా కాలేజీ నుండి వచ్చేసావేంటి?" అని అడిగింది.
"ఈ రోజు సార్ రారు అని చెప్పారు. నెక్స్ట్ క్లాస్ ఎలాగో బోర్ కొడుతుంది.. అందుకే వచ్చేసాను" అని చెప్పింది నీల. నీల మాట్లాడుతుంటే అయాన్ కళ్లలో మళ్ళీ ఆ పాత కాంతి తిరిగి వచ్చింది. నీల గొంతు వింటే అయాన్ లోపల జరుగుతున్న ఆ రసాయన మార్పులు ఏదో పెద్ద విషయానికి దారితీస్తాయని షీలాకు అర్థమైంది