Veda - 5 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 5

Featured Books
Categories
Share

వేద - 5

ఆ అజ్ఞాత సందేశం అనన్య గుండెల్లో వణుకు పుట్టించింది. కానీ ఆమెలోని అత్యాశ ఆ భయాన్ని క్షణాల్లోనే అణిచివేసింది.

"అనన్యా! ప్లీజ్.. ఆ మెసేజ్ చూశావు కదా? ఇదేదో చాలా పెద్ద ప్రమాదంలా అనిపిస్తోంది. వీడియో డిలీట్ చేసేయ్, ప్లీజ్!" అని అన్న విక్కీ గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది.

అనన్య, విక్కీ మాటలను పట్టించుకోకపోవడమే కాకుండా, అతన్ని చూస్తూ హేళనగా నవ్వింది. "ఏంట్రా విక్కీ.. నువ్వు మరీ అంత అమాయకంగా ఉన్నావు, ఇదేవరో మనమంటే గిట్టనివాళ్ళు, కావాలని చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా..?" అని అంది.

"సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి బెదిరింపులు కామన్ విక్కీ. ఎవరో మనల్ని భయపెట్టి ఆ వీడియోను వాళ్లు కాపీ చేయాలని చూస్తున్నారు. అంతే! ఈ మిస్టరీ గర్ల్ మన జీవితాల్ని మార్చబోతోంది. Just chill రా.. " అంటూ అనన్య, ఏమాత్రం ఆలోచించకుండా 'PUBLISH' బటన్ మీద తన వేలిని నొక్కింది.

ఆ ఒక్క సింపుల్ క్లిక్.. వేద జీవితాన్ని తలకిందులు చేస్తుందని అనన్యకు ఏమాత్రం తెలియలేదు.

మరుసటి రోజు ఉదయం..

నగరం ఇంకా నిద్ర లేవకముందే సోషల్ మీడియాలో ఒక విస్ఫోటనం సంభవించింది. 

కాలేజీ క్యాంటీన్ నుండి పబ్లిక్ బస్టాండ్ల వరకు.. ప్రతి ఫోన్లోనూ ఒకటే శబ్దం, ఒకటే దృశ్యం. 'The Girl with Red Eyes' అనే వీడియో ఒక పెద్ద కార్చిచ్చులా వ్యాపించింది.

"ఒరేయ్! ఇది చూశావా? మన సిటీలోనే జరిగిందంట..!"

"ఇది ఖచ్చితంగా గ్రాఫిక్స్ రా.. సినిమాల్లో మాత్రమే మనుషులకు అలాంటి పవర్స్ ఉంటాయి.."

"గ్రాఫిక్స్ కాదురా! ఇంకోసారి సరిగ్గా చూడు.. ఆ కోట పగుళ్లు, ఆ కళ్లలోని మెరుపు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో!"

అనే కామెంట్స్ మరియు పుకార్లు సోషల్ మీడియాలో సునామీల చెలరేగాయి.

వేద కాలేజీ పరిసరాల్లో తల దించుకుని నడుస్తోంది. తన హుడీని ముఖానికి అడ్డంగా లాక్కుని, ఎవరి కంటా పడకూడదని ప్రయత్నిస్తోంది. 

కానీ తన ప్రతి అడుగులోనూ ఒక భయం. చుట్టూ ఉన్న వాళ్లందరూ తన గురించే మాట్లాడుకుంటున్నట్టు, ప్రతి ఫోన్ తన వైపు గురిపెట్టిన తుపాకీలా అనిపిస్తోంది.

'అందరి ఫోన్లలో అదే వీడియో, ప్రతి ఫోన్ ఒక బాంబులా కనిపిస్తుంది. ఆ వీడియోలో ఉన్నది నేనే అని ఎవరైనా గుర్తుపడితే? నేను వీళ్ళ మధ్య ఎలా తిరగగలను? నేనేంచేయాలి' ఇలాంటి ప్రశ్నలు ఆమె మనసులో సుడిగుండంలా తిరుగుతున్నాయి.

ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్ లో.. ప్రొఫెసర్ డ్రాయింగ్స్ గురించి వివరిస్తున్నా, వేద మనసు మాత్రం అక్కడ లేదు. ఎవర్ని చూసినా ఆమె చేతులు వణుకుతున్నాయి. 

పక్క బెంచిలో ఉన్న ఒక అమ్మాయి తన ఫోన్లో ఏదో చూస్తూ, ఒక్కసారిగా వేద వైపు తీక్షణంగా చూసింది. ఆ అమ్మాయి చూపులో అనుమానం స్పష్టంగా కనిపిస్తోంది.

అది గమనించిన వేద గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె పట్టుకున్న పెన్సిల్ ముక్కు 'టక్' మని విరిగిపోయింది. 

గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగినట్టు ఆమెకు అనిపించింది. వేద నుదుటి మీద చెమట బిందువులు చేరుతున్నాయి.

'అందరూ నన్నే చూస్తున్నట్టు, గమనిస్తున్నట్టు అనిపిస్తుంది.. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నాలోని రక్తం మళ్ళీ వేడెక్కుతుంది!' అని తనలో తానే ఆవేదన పడుతూ, డ్రాయింగ్ షీట్లను చుట్టేసి క్లాస్ మధ్యలోనే బయటకు పరుగు తీసింది.

కాలేజీ వెనుక ఉన్న పార్కింగ్ లాట్ లో.. విక్కీ ఫోన్లో వీడియో కింద వస్తున్న కామెంట్స్ చూసి హడలిపోతున్నాడు. వెంటనే వీడియో స్టాప్ చేసి, అనన్యకు కాల్ చేశాడు. 

"అనన్యా! అసలు ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా. సోషల్ మీడియాలో అందరి దృష్టీ మన వీడియోమీదే ఉంది. కొంతమంది ఇదొక ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు, మరికొందరు ఆ అమ్మాయిని పట్టుకుని బంధించాలంటున్నారు. నాకెందుకో ఇది సేఫ్ కాదు అనిపిస్తుంది అనన్యా.. ప్లీజ్ ఇప్పుడైనా ఆ వీడియో డిలీట్ చెయ్!" అని అరుస్తున్నాడు.

కానీ అవతలి వైపు నుండి అనన్య గొంతు మాత్రం ఉత్సాహంగా వినిపిస్తోంది. "హేయ్ విక్కీ! అసలు నీకేమైనా అర్థం అవుతుందా..? మన వీడియోకు పది లక్షల వ్యూస్ దాటాయి. ఇండియాలో ఇప్పుడు ఇదే నెంబర్ వన్ ట్రెండింగ్! ఇప్పుడు డిలీట్ చేయమంటావేంటి మూర్ఖంగా.. మనం అనుకున్నది కూడా ఇదే కదా!" అని అంది.

చిరాకుతో విక్కీ ఫోన్ కట్ చేసి తల పట్టుకున్నాడు. 'మేము ఒక రాక్షసిని నిద్రలేపామా? లేక ఒక దేవతను బజారుకు లాగామా?' అన్న సందేహం అతడిని తొలిచేస్తోంది.

ఆరోజు సాయంత్రం.. వేద తన పాత ఇంటి గదిలోకి వచ్చి లోపల గడియ పెట్టుకుంది.

ఆమెకు బయట ప్రపంచం తనను వేటాడుతున్నట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చదువుతుంటే ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి. 

'దెయ్యం', 'మృగం', 'ఏలియన్'.. ఇలా రకరకాల పేర్లు. ఆమె తనను తాను ఒక చీకటి గదిలో బంధించుకుని కుమిలిపోతోంది.

"ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? ఈ శాపం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందా? అమ్మా.. నీలాగే నన్ను కూడా ఈ లోకం బ్రతకనివ్వదా?" అని ఏడుస్తూ ఫోన్‌ను పక్కన పడేయబోయింది.

సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఒక తెలియని నంబర్ నుండి మెసేజ్ వచ్చింది.

కన్నీళ్లు తుడుచుకుంటూ వేద ఆ మెసేజ్ ఓపెన్ చేసింది. అది చదవగానే ఆమె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినంత పని అయింది.

"నీ కళ్ళలోని నిప్పును నేను గుర్తుపట్టాను. రేపు సాయంత్రం లోపు నువ్వు నన్ను కలవాలి. లేదంటే ఈ ప్రపంచం నిన్ను ఒక మృగంలా వేటాడుతుంది. జాగ్రత్త! - A"

వేద ఊపిరి ఆగిపోయినట్టుగా, ఆ మెసేజ్ ను చూస్తూ ఉండిపోయింది. ఆ మెసేజ్ వెనుక ఉన్న 'A' ఎవరు? తన రహస్యం తెలిసిన ఆ వ్యక్తి మిత్రుడా.. లేక శత్రువా?

దీనితో, వేదకు ఈ ప్రపంచం నుండి తప్పించుకునే దారి దొరుకుతుందా, లేక మరో భయంకరమైన ఉచ్చులో పడబోతుందా?