ప్రొద్దున ఎండ కాస్త ప్రశాంతంగా ఉన్నా, రుద్రకోట శివార్లలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఆ కోట ప్రవేశ ద్వారం దగ్గర పడి ఉన్న శిథిలాలు, శతాబ్దాల నాటి గాథలను మోస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలిలో ఒక రకమైన పాత వాసన.. మట్టి, తడిసి ఆరిన రాయి, ఇంకా ఏదో తెలియని ప్రాచీన గంధం కలగలిసిన వాసన.
"గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఈ ప్రాంతంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం.. రుద్రకోట!" అనన్య కెమెరా వైపు చూస్తూ ఉత్సాహంగా అరిచింది.
ఆమె గొంతు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రతిధ్వనించింది.
విక్కీ మాత్రం కెమెరాను భుజానికి తగిలించుకుని భయం భయంగా అడుగులు వేస్తున్నాడు.
చుట్టూ ముసురుతున్న గబ్బిలాల చప్పుడు, నేల మీద పాకుతున్న పాముల పొలుసుల శబ్దం అతడిని వణికేలా చేస్తున్నాయి.
"అనన్యా.. ప్లీజ్, నా మాట విను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. గాలిలో నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకెందుకు ఈ రిస్క్? తిరిగి వెళ్ళిపోదాం పదా." అని బ్రతిమాలాడు.
అనన్య వెనక్కి తిరిగి అతడి వైపు ఎగతాళిగా చూసింది. "ఏంటిది విక్కీ, భయం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీనే మన వ్లాగ్కు కావలసిన అసలైన మసాలా! పద పద కెమెరా ఆన్ చెయ్, ఆ శిథిలాల మీద పడుతున్న నీడలు సరిగ్గా క్యాప్చర్ అవ్వాలి." అంది.
ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన.. 'ఈ ఒక్క వీడియో నా ఫేట్ మార్చేయాలి. అందుకోసమే ఇక్కడ ఏదో ఒక శక్తి నన్ను పిలుస్తోంది.'
అదే కోట యొక్క మరో దిశలో..
వేద తన ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ కోసం స్కెచ్ బుక్ పట్టుకుని నిలబడి ఉంది. తన చుట్టూ ఉన్న ఆ పురాతన కట్టడాలు ఆమెకు ఏమాత్రం కొత్తగా అనిపించడం లేదు.
ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఆమెకు తెలిసినవే అన్నట్టుగా ఒక వింతైన అనుభూతి. ఆమె వేళ్ళతో ఆ రాతి గోడలను తాకినప్పుడు, ఆమె మెడలోని 'శరభ ముద్ర' ఒక్కసారిగా వేడెక్కింది, దాదాపు చర్మం కాలుతున్నంత వేడి.
"నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో.." అని వేద తనలో తానే గొణిగింది.
గాలిలో ఏదో ఒక మార్పు జరిగినట్టు వేదకు అనిపించింది.. ఆ రాళ్లలో నిక్షిప్తమై ఉన్న ఏదో ఒక ప్రాచీన శక్తి ఆమెలోని లోతైన చైతన్యాన్ని నిద్రలేపుతున్నట్టుగా ఉంది. దానితో, ఆమె కళ్లు కాసేపు స్థిరత్వం కోల్పోయి మెరిశాయి.
'ఎంత వీలైతే అంత త్వరగా పని ముగించుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ కోట గోడలు నాతో ఏవో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.. అవి నన్ను హెచ్చరిస్తున్నాయా? లేకపోతే ఆహ్వానిస్తున్నాయా?' అనే ప్రశ్నలు వేద మనసులో తేలాడాయి.
ఇటువైపు, అనన్య మరియు విక్కీ కోట అంతర్భాగంలోకి వెళ్తున్న కొద్దీ చీకటి ముదురుతోంది. వారిద్దరూ ఒక పాడుబడ్డ మంటపం దగ్గరకు చేరుకున్నారు.
విక్కీ అడుగు వేయగానే కింద ఉన్న రాయి ఒకటి కదిలి లోపలికి వెళ్ళింది. దానితో, ఒక్కసారిగా ఆ మంటపం పైభాగంలో ఉన్న భారీ రాతి శిల్పం ఊగిసలాడటం మొదలైంది.
"చచ్చాంరా బాబోయ్.. ఇవాళ ప్రాణాలతో ఇంటికి వెళ్లడం కష్టమే విక్కీగా గా!" అని విక్కీ తనలో తాను గొణుక్కున్నాడు. కీచుమనే శబ్దాలు, ఎక్కడో ఏదో పడుతున్న చప్పుళ్లు ఆ ప్రదేశాన్ని మరింత భయంకరంగా మార్చాయి.
ఆ ప్రదేశం యొక్క భయాన్ని తట్టుకోలేక, "మమ్మీ, డాడీ నన్ను క్షమించండి, ఈరోజుతో నాకు సెలవు పడేటట్టు ఉంది.. నా చావుకు కారణం ఈ అనన్యనే.." అని విక్కీ అంతిమ ప్రణామాలు చెప్పుకున్నాడు.
దూరం నుండి వేదకు ఆ శబ్దాలూ మరియు అరుపులు వినిపించాయి. అది విన్న ఆమె లోపల మనిషి, రాక్షసత్వం మధ్య యుద్ధం జరుగుతోంది.
'ఇక్కడ ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుంది.. ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు ఆ శబ్దాలేంటీ..? వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం, నేను ఇక్కడి నుండి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి' అని ఒకవైపు మనసు చెబుతుంటే, 'లేదు, కాపాడు.. ఒకరి ప్రాణాన్ని నువ్విలా వదిలేసి వెళ్ళలేవు' అని మరోవైపు ప్రాణం తపిస్తోంది.
పక్కనే ఉన్న ఒక తుప్పు పట్టిన ఇనుప చువ్వను ఆమె తాకగానే, అది ఆమెలోని శక్తికి లోనై వింతగా కంపిస్తూ మెరిసింది.
"శరభేశ్వరా.. నన్ను నేను నియంత్రించుకునేలా, నాకు బలాన్ని ఇవ్వు." అని ప్రార్థిస్తూ ఆమె అరుపులు వినిపించిన దిశగా పరిగెత్తింది.
చీకటిగా ఉన్న ఒక నేలమాళిగ ప్రవేశం దగ్గర అనన్య టార్చ్ లైట్ వేస్తూ దేన్నో వెతుకుతోంది. గోడల మీద వింతైన సింహపు ఆకృతులు, ఉగ్ర రూపంలో ఉన్న దేవతా విగ్రహాలు ఉన్నాయి.
వేద ఒక స్తంభం వెనుక దాక్కుని అనన్యను గమనిస్తోంది. 'ఈ అమ్మాయికి పిచ్చా? ప్రాణాలకు తెగించి ఇక్కడికి ఎందుకు వచ్చింది?' అని వేద ఆశ్చర్యపోయింది.
అనన్య గది మధ్యలో ఉన్న ఒక ఎత్తైన రాతి పీఠాన్ని చూసింది. దాని మీద ఏదో రహస్యం దాగి ఉందని భావించి, ఆ పీఠం మీద చేయి వేసింది.
అంతే! ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా నేల అదిరిపోయింది. పైకప్పులోని భారీ శిలలు ఒక్కొక్కటిగా ఊడి పడటం మొదలయ్యాయి. ఒక భారీ రాయి నేరుగా అనన్య మీదకు వేగంగా పడబోతోంది.
దానితో అనన్యకు గుండె ఆగినంత పనైంది. ఆమె భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా కేక వేసింది.
భారీ రాయి అనన్య మీదకు రావడం గమనించిన ఆ మరుక్షణం.. సామాన్య మానవ మాత్రులకు సాధ్యం కాని వేగంతో వేద అక్కడికి దూసుకొచ్చింది. ఒక మెరుపులా వచ్చి అనన్యను పక్కకు నెట్టేసింది.
అక్కడ జరిగిన బీభత్సం కారణంగా, ఆ ప్రదేశం చుట్టూ ధూళి మేఘాలు అలముకున్నాయి. భయంతో విక్కీ కెమెరా కింద పడిపోయింది. కానీ, ఆ మసకబారిన లెన్స్ లో ఒక అస్పష్టమైన నీడ అనన్యను కౌగిలించుకుని కాపాడటం మాత్రం రికార్డ్ అయింది.