రుద్రకోటలో జరిగిన ప్రమాదంతో, ధూళి మేఘాలు ఆ గదిని కమ్మేశాయి. పైకప్పు నుండి రాలిపడుతున్న సున్నం, మట్టి అనన్య కళ్ళను పూర్తిగా కప్పేస్తున్నాయి.
పైన మృత్యువులా వేలాడుతున్న ఆ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా ఊడి కిందకు దూసుకొచ్చింది. ఆ క్షణం అనన్యకు తన మరణం కళ్ళముందు కనిపించింది.
"అమ్మో!" అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని నేల మీద ముడుచుకుపోయింది.
కానీ, ఆతరువాతి దృశ్యం చూసి అనన్య స్తంభించిపోయింది. ఆమె ఊహించినట్టుగా తన మరణం సంభవించలేదు.
దానికి బదులుగా గాలిలో ఒక వింతైన కంపనం.. ఒక ఉగ్రమైన శబ్దం వినిపించింది.
వేద మెడలోని 'శరభ ముద్ర' ఇప్పుడు కేవలం వేడెక్కడం కాకుండా, అది అగ్నిగోళంలా మండుతోంది. ఆమె నరనరాల్లో రక్తం ఉడుకుతోంది.
అనన్య ఎవరో తెలియకపోయినా, సాటి మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన, ఆమె యొక్క అంతరాత్మలో నిద్రపోతున్న ఆ ప్రాచీన శక్తిని తట్టిలేపింది.
దానితో వేద కళ్ళు ఒక్కసారిగా రక్తంలా ఎర్రగా మారాయి. ఆమె చూపుల్లో ఇప్పుడు భయం అనే స్థానంలో.. ప్రళయ కాల రుద్రుని ఉగ్రత కనబడుతుంది.
ఆ భారీ ఇనుప స్తంభం అనన్యను తాకబోతుండగా, వేద మెరుపు వేగంతో తన కుడిచేతిని అనన్యకు కవచంలా అడ్డుపెట్టింది.
ఆ భారీ ఇనుప స్తంభం, వేద చేయిని తాకగానే, భీకరమైన లోహపు శబ్దం ఆ గదిని దద్దరిల్లేలా చేసింది. సామాన్యులెవరైనా అయితే ఆ దెబ్బకు నుజ్జునుజ్జు అయిపోయేవారు.
కానీ వేద చేతి స్పర్శ తగిలిన చోట ఆ ఇనుము ఒక కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఆమె గొంతులో నుండి ఒక భయంకరమైన గర్జన ఆ భవనం మొత్తం దద్దరిల్లింది.
అది కేవలం ఒక మనిషి అరుపు కాదు.. సింహపు గాండ్రింపును నింపుకున్న గంభీరమైన నాదం! ఆ శబ్దానికి కోట గోడలు చిటపటలాడుతూ పగుళ్లిచ్చాయి.
కళ్ళు తెరిచి చూసిన అనన్యకు దిమ్మతిరిగి పోయింది. తన ముందు ఒక సామాన్యమైన అమ్మాయి.. ఆ భారీ బరువును కేవలం ఒక చేత్తో ఏ శ్రమ లేకుండా, అలవోకగా ఆపుతోంది.
వేద శరీరం చుట్టూ ఒక వింతైన ఉష్ణోగ్రత ఆవరించి ఉంది. గాలిలోని ధూళి కణాలు ఆమె చుట్టూ ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి.
"వద్దు.. వద్దు.. నావల్ల కావట్లేదు!" అని వేద తనలో తానే వేదన పడుతోంది. కానీ ఆమెలోని ఆ ఉగ్ర శక్తికి, వేద తన నియంత్రణ కోల్పోయింది.
ఆమె ఆ భారీ స్తంభాన్ని ఒక చిన్న కర్ర ముక్కలా పట్టుకుని, గాలిలోకి విసిరికొట్టింది. అది అవతలి గోడను ఢీకొట్టి, ఆ గోడను పిండి చేస్తూ బయటకు దూసుకెళ్లిపోయింది.
ఆ దృశ్యాన్ని చూసిన అనన్య నోట మాట రాక, భయంతో వెనక్కి పాకుతూ గోడకు అతుక్కుపోయింది. వేద నెమ్మదిగా వెనక్కి తిరిగి అనన్య వైపు చూసింది.
ఆ ఎర్రటి కళ్ళు, చెమటతో తడిసిన నుదురు, ఆవేశంతో ఊగిపోతున్న ఛాతి.. వేద మనిషిలా అనిపించడం లేదు. వేద తన చేతులను చూసుకుంది. ఆ చేతుల్లో ఇంకా ఆ భయంకరమైన శక్తి ప్రకంపిస్తోంది.
మృత్యువు నుండి తప్పించుకున్న అనన్యకు ఇప్పుడు, వేద నే ఒక మృత్యు దేవతలా కనబడుతుంది.
"నువ్వు.. నువ్వు ఎవరు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?" అని అంటున్న అనన్య గొంతు భయంతో వణికిపోతోంది.
వేదకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనలోని ఆ మృగం బయటకు వచ్చిందని ఆమెకు అర్థమైంది.
భయం, అసహ్యం, ఆవేదన అన్నీ కలగలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన ముఖాన్ని చేతులతో దాచుకుని, ఒక బాధితురాలిలా అక్కడి నుండి పరుగు తీసింది.
శిథిలాల గుండా ఆమె పరిగెత్తుతుంటే, ఆమె అడుగులు పడిన చోట రాయి కూడా చిట్లిపోతోంది, భవనం అల్లాడిపోయింది.
కొద్ది నిమిషాల తర్వాత..
కోట బయట నేల మీద పడి ఉన్న విక్కీ మెల్లగా కళ్ళు తెరిచాడు.
అనన్య పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని ఊపిరాడటానికి కూడా వీలు లేకుండా, విక్కీను లేపుతుంది.
"విక్కీ! లే.. లే త్వరగా! మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి!" అని అంటున్న అనన్య గొంతులో వణుకు ఇంకా తగ్గలేదు.
విక్కీ తడబడుతూ లేచి అటూ ఇటూ వెతుకుతూ, పక్కనే పడి ఉన్న తన కెమెరాను తీసుకున్నాడు.
"అనన్యా.. నా కెమెరా.. ఇది పగిలిపోయి ఉంటుంది. ఐపోయింది.. మన కష్టం అంతా వృథా ఐపోయింది!" అని బాధగా అన్నాడు.
"ఓరినీ.. నీ కెమెరా కన్నా ముఖ్యమైన మన ప్రాణాలు ఇంకా ఉన్నాయి కదా, అది చాలు. పద, త్వరగా ఇక్కడినుండి వెళ్ళాలి" అని అనన్య తొందర పెట్టింది.
కానీ, విక్కీ ఆ కెమెరా ఆన్ చేయగానే అతడి కళ్ళు బైర్లు కమ్మాయి. "ఇది.. ఇది ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది అనన్యా!"
అనన్య వంగి ఆ చిన్న స్క్రీన్ వైపు చూసింది. ఆ ధూళి మబ్బుల మధ్య నుండి ఒక నీడ.. ఎర్రటి కళ్లతో ఆ భారీ స్తంభాన్ని విసిరికొడుతున్న దృశ్యం అత్యంత స్పష్టంగా రికార్డ్ అయింది.
ఆ వీడియోలో కనిపిస్తున్న ఆకారం చూస్తుంటే, వారిద్దరికీ గుండె ఆగిపోయేంత భయం వేస్తోంది.
విక్కీ వణుకుతున్న చేతులతో కెమెరాను పట్టుకుని, "అనన్యా.. ఇది.. ఒక మనిషి ఇలా ఎలా చేయగలుగుతుంది? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఇది గనుక సోషల్ మీడియాలో పడితే.. ప్రపంచం మొత్తం సెన్సేషన్ అవుతుంది. ఇది కేవలం వైరల్ అవ్వడం కాకుండా, ఒక విస్ఫోటనం అవుతుంది!" అన్నాడు.
అనన్య ఆ వీడియోను తీక్షణంగా చూసింది. ఆమె భయం మెల్లగా ఒక వింతైన ఆశగా, ఉత్సాహంగా మారుతోంది.
"ప్రపంచం మొత్తం సెన్సేషన్ అవ్వడం కాదు విక్కీ.. ఇది మనల్నే ఒక సెన్సేషన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియాలి. ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటో నాకు కావాలి!" అని, భయంలో కూడా అనన్యలో ఒక ఆశ పుట్టింది.
కానీ ఆ వీడియో చివరలో.. వేద కెమెరా వైపు చూసిన ఆ క్షణం, ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆ 'రక్త వర్ణం' చూస్తుంటే, తాము ఒక భయంకరమైన మృగాన్ని నిద్రలేపామని వారికి అప్పుడు అర్థం కాలేదు.