Veda - 1 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 1

Featured Books
Categories
Share

వేద - 1

ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, భయంతో వణికిపోతున్నాయి. 

ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం దాల్చిన ప్రాణి చేస్తున్న హుంకారం.

వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.

వేద, తెల్లటి కుర్తా వేసుకున్న ఒక సున్నితమైన అమ్మాయి, కానీ ఆమె నీడ మాత్రం ఒక భయంకరమైన సింహం ఆకారాన్ని పోలి ఉంటుంది.

ఆ రూపం చూస్తుంటే ఎలాంటి మృగాలైనా వణికిపోవాల్సిందే. తన చేతుల్లో పెరుగుతున్న నఖాలను చూసి ఆమె లోపల ఉన్న 'మనిషి' ఆర్తనాదం చేస్తోంది. 

"వద్దు.. ఇది నేను కాదు.. నన్ను వదిలేయ్! ఎవరో ఒకరు నన్ను ఆపండి!" అని అరుస్తున్నా, బయటకు మాత్రం కేవలం భయంకరమైన గర్జనలు మాత్రమే వస్తున్నాయి. 

తన మీద తనకే అదుపు తప్పుతున్న ఆ క్షణం, తనలోని రాక్షసత్వం తన అస్తిత్వాన్ని మింగేస్తున్న ఆ మరుక్షణం.. 

ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది వేద.

చుట్టూ ఉన్న గోడలు, టేబుల్ మీద ఉన్న డ్రాయింగ్ షీట్లు, పెన్సిళ్లు.. అంతా మామూలుగానే ఉంది. అది ఒక కల.. కానీ ఆమెకు అది ప్రతిరోజూ వెంటాడే నిజం. ఆమె నుదిటి మీద చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. గుండె చప్పుడు ఇంకా తగ్గలేదు.

"శాంతం.. శాంతం.." అని తనలో తాను గొణుక్కుంటూ, మెడలో ఉన్న 'శరభ ముద్ర' లాకెట్‌ను గట్టిగా పట్టుకుంది. ఆ వెండి లాకెట్ ఆమె అరచేతికి తగలగానే ఏదో ఒక తెలియని ప్రశాంతత, కానీ.. అది కేవలం తాత్కాలికమేనని ఆమెకు తెలుసు.

సిటీలోని ఒక పేరున్న ఆర్కిటెక్చర్ కాలేజీ స్టూడియోలో ఇప్పుడు అంతా సందడిగా ఉంది. ఒక పక్కన విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటున్నారు, ఇంకో పక్కన సరదాగా నవ్వులు, కబుర్లు.

కానీ ఆ సందడి మధ్యలో వేద ఒక ఏకాంత ద్వీపంలా కూర్చుని ఉంది. తన డ్రాయింగ్ బోర్డు మీద తల దూర్చి, లోకాన్ని మర్చిపోయినట్టుగా లైన్లు గీస్తోంది. ఎవరూ తన కళ్ళలోకి చూడకూడదు, ఎవరూ తన దగ్గరకు రాకూడదు అన్నట్టు ఒంటరిగా ఉండిపోయింది.

"హేయ్ వేద! ఏంటి మేడం.. ఎప్పుడూ ఆ డ్రాయింగ్ షీట్స్ లోనే బతికేస్తారా ఏంటీ? అసలు బయట ప్రపంచం కూడా ఒకటి ఉందని మీకు తెలుసా?" అంటూ ఒక క్లాస్‌మేట్ ఆమె టేబుల్ దగ్గరకు వచ్చి గట్టిగా తట్టాడు.

వేద ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె లోపల ఏదో సుడిగుండం తిరుగుతోంది. "వద్దు.. వద్దు.. దూరంగా ఉండు.. ప్లీజ్, నా దగ్గరకు రాకు. నా స్పర్శ ఎవరికీ ప్రమాదం కాకూడదు." అని మనసు అరుస్తున్నా, ఆమె పెదవులు మాత్రం ఏమీ మాట్లాడలేకపోయాయి. 

కేవలం భయంతో కూడిన చూపును అతడికి ఇచ్చి, తన డ్రాయింగ్ షీట్స్ మరియు టూల్స్ సర్దుకుని అక్కడి నుండి వేగంగా బయటకు నడిచింది.

వేద మెట్లు దిగుతున్నప్పుడు ఎవరో కావాలని అడ్డం పడ్డారు. చేతిలో ఉన్న డ్రాయింగ్ షీట్లు కింద పడి చెల్లాచెదురయ్యాయి. ఆ అల్లరి మూక నవ్వులు ఆమె చెవుల్లో హోరులా వినిపిస్తున్నాయి.

వేద గుండెల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. కనుపాపలు ఎర్రబడటం మొదలయ్యాయి. ఆమెకు తెలుసు, ఇప్పుడు కోపం వస్తే తను అదుపు తప్పుతుందని. 

వెంటనే తన అరచేతిలోకి ఆ శరభ ముద్రను తీసుకుని బలంగా నొక్కుకుంది. ఆ లాకెట్ చివరన ఉన్న పదునైన అంచులు ఆమె అరచేతిని చీల్చుకున్నాయి. రక్తం నీటి బిందువుల్లా కారుతోంది. నొప్పి తెలుస్తోంది, కానీ ఆ నొప్పి కంటే భయమే ఎక్కువగా ఉంది.

"శాంతం.. శాంతం.. శరభేశ్వరా, నేను అదుపులో ఉండేలా చూడు. నాలోని మృగం బయటకు రాకుండా చూడు.." అని మనసులో ప్రార్థిస్తూ అక్కడి నుండి పరిగెత్తింది.

తన గదిలోకి రాగానే తలుపులు గట్టిగా వేసి, అద్దం ముందు నిలబడింది. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం తనదేనా? కాసేపు ఆ కళ్ళు ఎర్రగా మెరిసి మళ్ళీ నల్లగా మారుతున్నాయి.

వేద ఉద్దేశంలో, తన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం.. అది కేవలం రక్తం కాదు, అది ఒక శాపం. పూర్వీకులు చేసిన ఏదో తప్పుకు, తరతరాలుగా వస్తున్న శిక్ష ఇది. తను ఎవరినీ ప్రేమించకూడదు, తను ఎవరితోనూ సరదాగా ఉండకూడదు, కనీసం మనస్ఫూర్తిగా భావాలను కూడా చూపించకూడదు.

"ఇది నా రక్తం కాదు.. ఇది జ్వాల. నాలోనే నన్ను దహించే ఒక కంటికి కనబడని జ్వాల..!" అని అనుకుంటూ అద్దం మీద తల వాల్చి కన్నీళ్లు పెట్టుకుంది.

అదే సమయంలో, నగరంలోని ఒక ఖరీదైన కేఫ్‌లో అనన్య తన కెమెరా సెట్టింగ్స్ చూసుకుంటోంది. ఆమె కళ్లలో ఒక రకమైన తెగింపు, గెలుపు పిచ్చి కనిపిస్తున్నాయి. తన పక్కనే ఉన్న కెమెరామెన్ విక్కీతో చాలా సీరియస్‌గా మాట్లాడుతోంది.

"చూడు విక్కీ, ఈసారి మనం చేసే వ్లాగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేయాలి. ఈ చిన్న చిన్న దెయ్యాల కథలు, పాత ఇళ్ల మీద వీడియోలు చేసి బోర్ కొట్టింది, అన్నీ రొటీన్ అయిపోయాయి. ఈసారి మనం వెళ్లే ప్లేస్ 'రుద్రకోట'. 400 ఏళ్లుగా ఆ కోట వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడ దెయ్యాలు ఉంటాయని కొందరు, దేవుడే ఏదో రహస్యాన్ని దాచాడని మరికొందరు అంటారు. అసలు అక్కడ ఏముందో నేను ప్రపంచానికి చూపిస్తాను." అంది అనన్య ఉత్సాహంగా.

"కానీ అనన్య, ఆ అడవి చాలా దట్టంగా ఉంటుందట. పైగా ఆ కోట గురించి వింత వింత కథలు విన్నాను నేను." అని విక్కీ అనుమానంగా అన్నాడు.

"విక్కీ.. కథలు ఉంటేనే కదా వ్యూస్ వస్తాయి! ఈ ఒక్క వీడియోతో నా సబ్‌స్క్రైబర్స్ మిలియన్లు దాటాలి. అక్కడ ఏమున్నా సరే, అది నా కెమెరాలో బంధించి తీరుతాను..!" అని మొండిగా చెప్పింది అనన్య.

ఆ రాత్రి అనన్య తన ప్రోమో కోసం ఒక చిన్న వీడియో క్లిప్ రికార్డ్ చేసింది. "హలో ఫ్రెండ్స్, రేపు రాత్రి నేను మీకు ఈ కోటలోని రహస్యాన్ని ప్రత్యక్షంగా చూపించబోతున్నాను. సిద్ధంగా ఉండండి!" అంటూ కెమెరా వైపు చూసి నవ్వింది.

ఆమె ఆ మాటలు చెబుతున్నప్పుడు, ఆమెకు వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో కోట గోడల మీద చెక్కిన ఒక పురాతన సింహం శిల్పం ఉంది. 

అనన్య కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతుంటే, ఆ శిల్పం కళ్ల నుండి నెత్తురు చుక్కలు కారుతున్నట్టుగా కెమెరా లెన్స్‌లో రికార్డ్ అయింది. 

కానీ తన సక్సెస్ ఊహల్లో ఉన్న అనన్య ఆ విషయాన్ని గమనించలేదు. కాలం ఆమెను, వేదను ఒకే చోటికి చేర్చబోతోందని ఆమెకు తెలియదు. నిప్పును దాచిన నిజం బయటపడే సమయం దగ్గర పడింది.