ఆ రాత్రంతా అఖిరా నిద్రపోలేక అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయింది.
“ఎలా అయినా రేపు చెక్ దొరికితే సరిపోతుంది… అంతా బాగుపడుతుంది,” అని మనసులోనే అనుకుంది.
---
తర్వాత రోజు ఉదయం సత్య అఖిరాకు ఫోన్ చేసింది.
“హలో అఖిరా,” అని పిలిచింది.
“హా సత్య, చెప్పు,” అంది అఖిరా.
“నేను కిషోర్‌తో మాట్లాడాను. ఆఫీస్ అడ్రస్ దొరికింది. నీకు వాట్సాప్ చేశాను.
పది గంటలకు సర్ ఆఫీస్‌లో ఉంటారట. నువ్వు వెళ్లి మాట్లాడితే చెక్ ఇస్తారట,” అని చెప్పింది.
అఖిరా వెంటనే,
“సరే. నేను వెళ్తాను,” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
---
కొద్దిసేపటికి అఖిరా ఆఫీస్ ముందు నిలబడింది.
బోర్డుపై పెద్ద అక్షరాల్లో — ‘Gokulnanda Industries’ అని రాసి ఉంది.
లోపలికి వెళ్లి,
“ఎక్స్క్యూజ్ మీ… I'm Akhira మిస్టర్ గోకుల్‌నంద గారిని కలవాలి,” అని రిసెప్షనిస్టుకు చెప్పింది.
“ఒక నిమిషం,” అని ఆమె చెప్పి కాల్ డయల్ చేసింది.
“సర్, అఖిరా అని ఒక అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చారు,” అని చెప్పగానే,
అటువైపు నుంచి, “లోపలికి పంపించండి,” అని సమాధానం వచ్చింది.
“సరే సర్,” అని చెప్పి,
“సర్ మిమ్మల్ని పిలిచారు. స్ట్రైట్‌గా వెళ్లి, రైట్ సైడ్ క్యాబిన్‌కి వెళ్లండి,” అని అఖిరాకు చెప్పింది.
“ఓకే… థ్యాంక్ యూ,” అని చెప్పి అఖిరా ముందుకు అడుగు వేసింది.
అంతలోనే—
ఒక్కసారిగా ఎవరో వచ్చి ఆమెకు ఢీ కొట్టారు.
“హే!” అంటూ అఖిరా వెంటనే తిరిగింది.
ఆ వ్యక్తి ముఖం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.
నిన్న జరిగిన సంఘటన కళ్లముందు మెదిలింది.
“నువ్వు…?” అని చెప్పబోతుండగా—
అతను గంభీరంగా,
“I’m Vaibhav… Mr. Vaibhav Nanda,” అని చెప్పాడు.
తర్వాత జేబులో నుంచి మద్యం బాటిల్ తీసి తాగడం మొదలుపెట్టాడు.
అఖిరాను ఒకే చూపుతో చూస్తూ నిలబడ్డాడు.
అఖిరా కోపంతో,
“నీకు రాత్రే అనుకున్న పగటి పూట కూడా కళ్లు కనబడవ?
అందరికీ ఇలాగే ఢీ కొట్టి మాట్లాడుతావా?” అని అడిగింది.
వైభవ్ వ్యంగ్యంగా నవ్వి,
“అందరితో కాదు… నిన్ను చూస్తే ప్రతిసారి ఢీ కొట్టాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా?” అన్నాడు.
అఖిరా కోపంగా చూసింది.
“నీ లాంటి వ్యక్తితో మాట్లాడటం కూడా వ్యర్థం.
నిన్న ప్రపోజ్ చేస్తావు… ఈరోజు ఇలా…
ప్రతి అమ్మాయితో ఇలాగే ప్రవర్తిస్తావా?” అని విసుగ్గా అడిగింది.
వైభవ్ ముఖం మారలేదు.
సూటిగా,
“నాకు నువ్వంటే ఇష్టం,” అని అన్నాడు.
అఖిరా కఠినంగా,
“I don’t care.
నీ ఇష్టాలు వేరే ఎవరికైనా చెప్పుకో.
నాతో కాదు.
నీ వల్ల నాకు ఎంత నష్టం జరిగిందో తెలుసా?” అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
---
అఖిరా గోకుల్‌నంద గారి దగ్గరకు వెళ్లి, మాట్లాడి మరో చెక్ తీసుకుంది.
ఈసారి అఖిరా ఆనందానికి హద్దే లేదు.
“ఇక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి,” అని మనసులో అనుకుంది.
ఆనందంతోనే డాక్టర్ నిర్మలకు ఫోన్ చేసింది.
“డాక్టర్ గారు, నేను అఖిరానే మాట్లాడుతున్నాను.
అమౌంట్ అరేంజ్ అయింది. ఇక ఆలస్యం చేయలేం.
ఈరోజే పిన్నీని హాస్పిటల్‌కు తీసుకొస్తాను. ఆపరేషన్ చేయండి,” అని చెప్పింది.
అటువైపు నుంచి డాక్టర్ నిర్మల నవ్వుతూ,
“That’s good to hear, Akhira.
ముందుగా హాస్పిటల్‌కు తీసుకురండి. కొన్ని టెస్టులు చేయాలి.
రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం,” అని చెప్పి కాల్ కట్ చేశారు.
ఫోన్ పెట్టేసిన అఖిరా కళ్లల్లో ఆనందంతో నీళ్లు మెరిశాయి.
ఇప్పటివరకు మోసిన భారమంతా కాస్త తగ్గినట్టుగా అనిపించింది.
మరుసటి రోజు – కాలేజ్ క్యాంపస్
క్లాస్ ముగిసిన తర్వాత అఖిరా, సత్య ఇద్దరూ క్యాంటీన్‌కు వచ్చారు.
“ఇక నువ్వేమీ కంగారు పడకు,” అని సత్య అంది.
“సమస్య సాల్వ్ అయిపోయింది.
ఇక స్టడీస్ మీద, జాబ్ మీద ఫోకస్ చేయి.”
“అవును సత్య,” అఖిరా నవ్వింది.
“నిక్కీ ఉంది కదా… పిన్నీని చూసుకుంటుంది.
నేను కాస్త కష్టపడి డిగ్రీ పూర్తిచేసి మంచి జాబ్ కొడితే…
ఇక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
పిన్నీ, నిక్కీ, నేనూ…
మనకు నచ్చినట్టుగా జీవించగలం.
నాన్న ఆశపడ్డట్టుగా నేను ఆర్కిటెక్ట్ అవుతాను.
మన సొంత ఇల్లు నేనే డిజైన్ చేస్తాను.”
కళ్ల నిండా కలలతో అఖిరా చెప్తుంటే,
“కచ్చితంగా చేస్తావ్,” అని సత్య ప్రోత్సహించింది.
---
అంతలోనే…
అఖిరాకు మళ్లీ అదే ఉనికి అనుభూతి కలిగింది.
ఏదో తెలియని భావం.
“నాకు ఇలా ఎప్పుడూ అనిపించలేదు కదా…
మరి ఇప్పుడు కొన్ని రోజులు గా ఎందుకు ఇలా అనిపిస్తోంది?”
అని గుండెపై చేయి వేసుకుని ఆలోచించింది.
“నువ్వు ఇక్కడే ఉండు. బిల్ పే చేసి వస్తాను,” అని సత్య చెప్పింది.
అఖిరా వినకుండానే…
తనలో తానే మునిగిపోయింది.
ఒక్కసారిగా కళ్ళు తెరిచి,
వేగంగా అడుగులు వేస్తూ నడవడం మొదలుపెట్టింది.
ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా.
ఆమె కళ్ళు…
ఎవరో వెతుకుతున్నట్టుగా కనిపించాయి.
అప్పుడే…
దూరంగా ఎవరో పాట పాడుతున్న స్వరం వినిపించింది.
ఆ స్వరం వచ్చిన వైపుకి మళ్లింది.
చివరికి…
ఆడిటోరియం దగ్గరికి వచ్చి ఆగింది
అతను స్నేహితుల మధ్య నిలబడి పాట పాడుతున్నాడు.
సాధారణమైన లైట్ బ్లూ షర్ట్, స్లీవ్స్ మడిచినట్టుగా…
గాలి తాకుతూ నుదుటి మీద పడుతున్న జుట్టు,
పాటలో లీనమై కళ్లను మెల్లగా మూసుకుంటూ,
ప్రతి లైన్‌ని మనసులోంచి పలికినట్టుగా అతని ముఖంలో ఒక ప్రశాంతమైన భావం కనిపిస్తోంది.
అతని కళ్లలో అహంకారం లేదు… ఆర్భాటం లేదు…
ఉన్నది కేవలం నిశ్శబ్దమైన లోతు,
మాట్లాడకుండా కూడా చాలా చెప్పగలిగే చూపు.
అతని గొంతు గాలిలో కలిసిపోతూ
అఖిరా గుండెల్లోకి నెమ్మదిగా జారుకున్నట్టు అనిపించింది.
ఆ క్షణంలో—
ఆ పాట తనకోసమే అతను పాడుతున్నట్టుగా అఖిరాకు అనిపించింది.
అతన్ని చూసిన క్షణంలోనే అఖిరా కళ్ళు మెరిశాయి.
మనసులో ఏదో శాంతి దొరికినట్టైంది.
తెలియకుండానే ముఖంపై చిరునవ్వు వచ్చింది.
Love at first sight.
ఇంతవరకూ తనకూ ఎవరైనా నచ్చుతారని ఆమెకు తెలియదు.
కానీ ఆ క్షణం…
ఆకర్షణగా, అనూహ్యంగా ఆమె మనసు అతని వైపు లాగబడింది.
అంతలోనే సత్య వచ్చి,
“అఖిరా! ఇక్కడ ఏమి చేస్తున్నావ్? పద,” అని చేతిపట్టుకుని తీసుకెళ్లింది.
అఖిరా మాత్రం ఆ చిరునవ్వుతోనే
వెనక్కి తిరిగి అతనిని చూస్తూనే నడిచింది.
---
ముందుకు కొనసాగుతుంది…
---