Akhira - A tale of presence - 9 in Telugu Drama by Sangeetha Pushpa books and stories PDF | అఖిరా – ఒక ఉనికి కథ - 9

Featured Books
Categories
Share

అఖిరా – ఒక ఉనికి కథ - 9

ఎపిసోడ్ 9

ఉదయం సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే అఖిరా లేచింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అభయ్ ఫోన్ స్విచ్ ఆఫ్… వైభవ్ మాటలు…

అన్నీ కలిసిపోయి మనసు ఇంకా ఆందోళనలోనే ఉంది. ఏదో తప్పు జరిగిందేమో అనే భయం వదలడం లేదు.

కాలేజ్ కి వెళ్లే వరకు ఆమె అడుగులు కూడా వేగంగా పడుతున్నాయి. గేట్ దగ్గరకు చేరగానే కళ్లతో ఒక్కటే వెతుకుతోంది — అభయ్.

క్యాంపస్ అంతా చూసింది. క్లాస్ రూమ్… కాంటీన్… లైబ్రరీ… ఎక్కడా కనిపించలేదు. గుండె ఇంకా బలంగా కొట్టుకోవడం మొదలైంది.

అప్పుడే దూరంగా పార్కింగ్ దగ్గర ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటున్నట్టు కనిపించారు.

అభయ్…

అతని ఎదురుగా వైభవ్.

అఖిరా అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి.
వాళ్లు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేదు. కానీ వైభవ్ ముఖంలో ఒక అర్ధం కాని నవ్వు. అభయ్ మాత్రం ప్రశాంతంగా ఏదో చెప్తున్నాడు. కొన్ని క్షణాల తర్వాత వైభవ్ వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
అభయ్ తిరిగి నడుస్తూ అఖిరా వైపు చూసాడు.

ఒక క్షణం కళ్లలోకి చూసి… చిన్నగా నవ్వి… ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్లిపోయాడు.

అఖిరా అక్కడే నిలబడి పోయింది.
“ఏమైంది? ఎందుకు మాట్లాడలేదు? వైభవ్ తో ఏమి మాట్లాడాడు?”
ప్రశ్నలు మాత్రమే… సమాధానం ఒక్కటి లేదు.

మధ్యాహ్నం క్లాస్ అయిపోయాక ఫోన్ వైబ్రేట్ అయింది.

Unknown number.

“Evening 5 pm. ఈ location కి రా.”

అంతే. ఇంకేమీ లేదు.

అఖిరా గుండె ఒక్కసారిగా దిగిపోయింది.

“ఈ నంబర్ ఎవరిదీ…?” అని అఖిరా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ నెమ్మదిగా అనుకుంది.
వైభవ్ ఉదయం కనిపించిన విధానం ఒక్కసారిగా గుర్తొచ్చింది.
“ఇది అతనేమో…?” అని ఒక క్షణం వెనక్కి తగ్గింది.
అభయ్ ముఖం గుర్తొచ్చింది.
“లేదూ… అభయ్ కి ఏమైనా జరిగి ఉంటే?” అని గుండె వేగంగా కొట్టుకుంది.
కొన్ని క్షణాలు ఆగి, లోతుగా ఊపిరి తీసుకుంది.
“ఒక్కసారి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది…” అని తనలో తాను చెప్పుకుని బయలుదేరింది.

నగరం చివర్లో ఉన్న చిన్న హిల్ ప్రాంతం. చుట్టూ చెట్లు, గాలి నెమ్మదిగా వీస్తోంది. సాయంత్రపు వెలుతురు ఆకాశాన్ని నారింజ రంగులో ముంచేసింది. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది.

“ఇక్కడికి ఎందుకు పిలిచారు?” అని అఖిరా చుట్టూ చూసింది.

అప్పుడే వెనుక నుంచి స్వరం వినిపించింది.
“అఖిరా…”

ఆమె వెంటనే తిరిగి చూసింది.

అభయ్.

అఖిరా ఊపిరి బిగపట్టుకుంది.

“అభయ్… నువ్వేనా మెసేజ్ చేసినది? నేను ఎంత భయపడ్డానో తెలుసా!” అని అంది.
అభయ్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు,
“భయపడకు… నాకు ఏమీ కాలేదు.”

ఆ మాట విన్నాకే అఖిరా గుండె సద్దుకుంది.

ఆ క్షణం వరకు తనలో ముడుచుకుని ఉన్న భయం నెమ్మదిగా కరిగిపోయినట్టనిపించింది. ఉదయం నుంచి గుండెల్లో వేసుకున్న బరువు ఒక్కసారిగా తగ్గినట్టు అనిపించింది. అభయ్ ముందున్నాడనే భావన చాలు అనిపించింది ఆమెకు. ఏ సమస్య ఉన్నా, అతను ప్రశాంతంగా నిలబడే విధానం ఆమెకి ఎప్పుడూ ఒక నిశ్చింత ఇస్తుంది. అతను పెద్ద మాటలు చెప్పకపోయినా, తన పక్కన ఉన్నాడనే భావననే అఖిరా కోసం సరిపోతుంది అనిపించింది.

కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.

అభయ్ ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు —

“నిన్ను ఇక్కడికి పిలిచింది ఒక విషయం చెప్పడానికి.

అఖిరా ఆశ్చర్యంగా చూసింది.

అభయ్ అఖిరా దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకుని,
“నువ్వు ఇక వైభవ్‌కు భయపడాల్సిన అవసరం లేదు… వింటున్నావా? భయపడాల్సిన అవసరం లేదు,” అని ఆమె కళ్లలోకి చూస్తూ చెప్పాడు.

అఖిరా ఆశ్చర్యంగా అడిగింది,
“అభయ్… నీకు వైభవ్ తెలుసా? అతను నాకు ఏమి చెప్పాడో నీకు ఎలా తెలుసు?”

అభయ్ కాసేపు నిశ్శబ్దంగా ఆమె వైపు చూసి,
“ఈ ఉదయం మాట్లాడాం… అంతే,” అని నెమ్మదిగా అన్నాడు.
అఖిరా ఆశ్చర్యంగా చూసింది.
“ఏమి మాట్లాడారు?” అని అడగబోయింది.
అభయ్ చిన్నగా తల ఊపాడు.
“ఇప్పుడది ముఖ్యం కాదు అఖిరా… నువ్వు భయపడకపోవడం ముఖ్యం,” అని చెప్పాడు.

అభయ్ కళ్ల నిండా ప్రేమతో,
“నన్ను నమ్ము… నేను చూసుకుంటాను. నీకు ఏ భయం లేదు,” అని చెప్పాడు.

"ఇక వైభవ్ గురించి నువ్వు మర్చిపో అఖిరా… నాకు ‘నా వాళ్లు’ అని చెప్పుకోవడానికి ఉన్నది నువ్వొక్కదానివే. యెవరో వచ్చి నిన్ను నా నుంచి లాగేసుకుంటాను అంటే ఎలా వదిలేస్తాను…” అని చిరునవ్వుతో చెప్పాడు.

అఖిరా కళ్ళలో మెల్లగా నీళ్లు చేరాయి.

“నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాలని అనిపించింది అంతే,” అని అభయ్ చిరునవ్వుతో అన్నాడు.

అతను తిరిగి నడవడం మొదలుపెట్టాడు.

అఖిరా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన ఆనందం.

ఆ రోజు వాళ్లు “ప్రేమిస్తున్నాను” అని చెప్పుకోలేదు.
కానీ మాటల మధ్య… ఒకరికి ఒకరు ఉన్నామనే హామీ కనిపించింది.

అఖిరా ఇంటికి తిరిగి వెళ్తూ చిరునవ్వు ఆపుకోలేకపోయింది. మనసులో ఒక తేలిక. పేరు పెట్టని ప్రేమ… కానీ స్పష్టంగా అనిపిస్తున్న బంధం.

ఆ సాయంత్రం జరిగిన ప్రతి మాట, ప్రతి నిశ్శబ్దం మళ్లీ మళ్లీ గుర్తొస్తూనే ఉంది. జీవితంలో కొన్ని బంధాలు ఇలా నెమ్మదిగా మొదలవుతాయని ఆమెకి ఇప్పుడు అర్థమవుతోంది. చెప్పని మాటల్లోనే ఎంత ప్రేమ దాగి ఉంటుందో అనిపించింది.

ఈ భావన ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు.
కానీ ఇద్దరికీ ఒక విషయం మాత్రం అర్థమైంది —
ఇప్పుడిక వాళ్లు ఒంటరిగా లేరు.

ఆ ఆలోచనతో ఆమె హృదయం నిండిపోయింది, ముందున్న రోజులు ఎలా మారబోతాయో తెలియకపోయినా ఒక మధురమైన నమ్మకం మాత్రం మిగిలింది.

ముందుకు కొనసాగుతుంది…