ఎపిసోడ్ 6
ఆరోజు రాత్రి ఇంట్లో సువర్ణ, అఖిరా గదిని శుభ్రం చేస్తుండగా తన కబర్డ్‌లో ఒక చెక్ దొరికింది.
“అఖిరా!” అని గట్టిగా పిలిచింది.
అఖిరా వంటగదిలో నీళ్లు తాగుతోంది. పిలుపు వినగానే,
“ఏమైంది?” అని ఒక్క క్షణం ఉలికిపడి,
“ఏమైంది పిన్ని?” అంటూ గదికి పరుగెత్తుకుంటూ వచ్చింది.
పిన్ని చేతుల్లో ఉన్న చెక్ చూసి అఖిరా నవ్వుతూ వచ్చి పిన్నిని కౌగిలించుకుంది.
“ఇది మీ ఆపరేషన్‌కే పిన్ని. పోయిన వారం ఈవెంట్‌కి వెళ్లాను కదా, అక్కడ ఇచ్చిందే,” అని చిరునవ్వుతో చెప్పింది.
ఆ క్షణం సువర్ణ, అఖిరా కళ్లలో తన మీద ఉన్న ప్రేమను చూసింది.
“ఎందుకే నా కోసం ఇంత కష్టపడుతున్నావు?” అంటూ కన్నీరు కార్చింది.
అఖిరా సువర్ణ చేయి పట్టుకుని,
“నాకు నువ్వు, నిక్కీ తప్ప ఇంకెవరున్నారు పిన్ని? మీకోసం కాకపోతే ఇంకెవరికి చేస్తాను? మీరు నా ఫ్యామిలీ కదా పిన్ని,” అని అనగానే అఖిరా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇంతలో నిక్కీ గదిలోకి వచ్చి అఖిరా, సువర్ణ ఇద్దరినీ కౌగిలించుకుంది.
సువర్ణ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది—
“నేను నీ మీద ఎప్పుడూ కోపపడుతూనే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఎప్పుడూ పట్టించుకోలేదు. మీ నాన్న వెళ్లిపోయాక ఒంటరిదానినయ్యాను అనే బాధలోనే ఉండిపోయాను తప్ప, నీ జీవితం ఎలా నడుస్తుందో ఆలోచించలేదు. అహం నా కళ్లను కట్టేసింది. నీ కష్టసుఖాల్లో నీ వైపు తిరిగి కూడా చూడలేదు. కానీ నువ్వు ఎప్పుడూ నా వైపే చూశావు. నన్ను క్షమించు అఖిరా.”
అని సువర్ణ, అఖిరా చేయి పట్టుకుని కన్నీరు కార్చింది.
మూడు నెలల తర్వాత
అఖిరా అనుకున్నట్టుగానే పిన్ని ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు పిన్నికి ఎలాంటి ప్రమాదం లేదు. నిక్కీని, అఖిరాను సువర్ణ చాలా బాగా చూసుకుంటోంది. తాను చేసిన తప్పును గ్రహించి, ఇకపై ఎప్పటికీ తన ఇద్దరు కూతుళ్లను బాధ పెట్టకూడదని అనుకుని, ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది.
రోజులు గడుస్తుండగా అఖిరా కూడా ఫైనల్ ఇయర్‌లో అడుగు పెట్టింది. సత్య అఖిరాను చూసి చాలా సంతోషంగా ఉంది.
క్లాస్‌లో పాఠాలు వింటూ ఉన్నారు. సత్య అఖిరా చెవుల దగ్గరికి వచ్చి మెల్లగా,
“నిన్ను ఇలా నవ్వుతూ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది,” అని చెప్పింది.
అఖిరా వెంటనే తిరిగి చిరునవ్వు ఇచ్చింది.
“ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. అనుకున్నట్టే జరిగింది. పిన్ని ఆరోగ్యం బాగుంది, నాతో ప్రేమగా మాట్లాడుతోంది. అమ్మ ప్రేమ మళ్లీ దొరికినట్టుగా ఉంది. ఇంకేమి కావాలి నాకు?”
“నిక్కీ కామర్స్ తీసుకుంది. ఈ ఇయర్ పరీక్షలు అయిపోగానే నెక్స్ట్ ఇయర్ డిగ్రీలో జాయిన్ అవుతుంది. జాబ్ చేస్తూనే చదువుతుందట,” నాతొ చెప్పింది.
“ఇంటికి వెళ్తే ఏదో ఒక హ్యాపినెస్, ప్రశాంతత ఉంటుంది. ఇంకేమి కావాలి? ఇదే చాలు,” అని నవ్వుతూ అంటుంది.
అలా తన కుడివైపు వెనక నుంచి రెండో బెంచ్‌లో కూర్చున్న అతడిని చూసింది. తనలో తానే నవ్వుకుంది.
అతనే అభయ్.
క్లాస్ అయిపోయాక కాంటీన్‌లో సత్య అడిగింది—
“ఏంటి, అభయ్‌కి లైన్ వేస్తున్నావా? అతన్ని చూసినప్పుడల్లా ఆ నవ్వేంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆ?” అని కాస్త వ్యంగ్యంగా అడిగింది.
అఖిరా మెల్లగా చెప్పింది—
“ఏమోనే… అతన్ని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఏమీ తోచదు, ఏం చేయాలనిపించదు. చాలా నచ్చేశాడు.”
“అలా అయితే వెళ్లి ప్రపోజ్ చేసేయ్. ఇంకెన్ని రోజులు ఇలా దూరం నుంచే చూస్తావు?” అని సత్య అనగానే,
“వామ్మో! నేను చేయను. చేశాక ‘నో’ అంటే? రోజూ ఇదే కాలేజ్‌కు రావాలి. నేను ఫేస్ చేయలేను. కాలేజ్ లాస్ట్ డే చెప్తాను లే. అప్పటివరకు ఇలాగే,” అని చెప్పింది.
ఎప్పటి లాగే అతను ఎక్కడికి వెళ్తే అక్కడే అఖిరా ఉంటుంది. అభయ్ చేసే ప్రతి పెర్ఫార్మెన్స్‌లో మొదటి ఆడియన్స్ తనే.
అతని కోసం ఇంత ప్రేమ ఎలా మొదలైందో, అంతలా ఎలా పెరిగిందో తనకే తెలియలేదు…
ఆ సంతోషంతో ఇంటికి వెళ్లింది.
“పిన్ని… పిన్ని…” అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది.
కానీ లోపలికి వచ్చిన క్షణంలోనే, ఆమె ముఖంలో ఉన్న ఆనందం అంతా ఒక్కసారిగా మాయమైంది.
“నువ్వు—” అని అనగానే,
“అఖిరా వచ్చావా? చూడు, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు,” అని చెప్పింది.
“హాయ్ అఖిరా… how are you?” అనే స్వరం వినిపించింది.
వైభవ్ నందా.
“నేను అఖిరాకు తెలుసు anti,” అని నవ్వుతూ చెప్పాడు.
అఖిరా షాక్‌లో అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోయింది.
“పిన్ని, మీరు మాట్లాడుతుండండి. నేను కాఫీ తీసుకొస్తాను,” అని చెప్పి లోపలికి వెళ్లింది.
అఖిరా, వైభవ్ చేయి పట్టుకుని కోపంతో బాల్కనీ దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె చేయి పట్టుకుని నడుస్తుంటే వైభవ్ చాలా సంతోషంగా ఆమెనే చూస్తున్నాడు.
“ఏంటి? ఎందుకొచ్చావు ఇక్కడికి? అసలు మా ఇంటి అడ్రస్ నీకెలా దొరికింది?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అఖిరా.
వైభవ్ నవ్వుతూ,
“కూల్ అఖిరా, కూల్. అంత కోపమెందుకు? ఏమైతే ఏమి, ఇది నా ఇన్-లాస్ ఇల్లే కదా. అందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్లాలని వచ్చాను,” అన్నాడు.
ఇది వినగానే అఖిరా కోపం ఇంకా పెరిగింది.
అతనికి వేలు చూపిస్తూ,
“చూడు, నీ ఆటలు నా దగ్గర సాగవు. మర్యాదగా వెళ్లిపో. ఇది నీ ఇన్-లాస్ ఇల్లు అసలు కాదు. నేను నీకు ఏమీ కాను. I don’t care about you. Leave now!” అని గట్టిగా చెప్పింది.
వైభవ్ నవ్వుతూ,
“I know… అయినా నిన్ను కేర్ చేయమని ఎవరు అన్నారు? నువ్వంటే నాకు ఇష్టం,” అన్నాడు.
వెంటనే అఖిరా,
“కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ!” అని కోపంతో అరిచింది.
వైభవ్ ఆమె చేయి పట్టుకుని,
“అయినా సరే, నాకు నువ్వు నచ్చావు. ఇది ఫిక్స్ అయిపో. ఐనా ఇంత డబ్బున్నోడిని వదిలేసి, నిన్ను తిరిగి కూడా చూడని వాడి వెనక పిచ్చిదానిలా తిరుగుతున్నావెంటి నువ్వు?” అన్నాడు.
అఖిరా షాక్ అయింది. తన చేయిని విడిపించుకుంది.
వైభవ్ ఆమె కళ్లలోనే చూస్తూ,
“అభయ్ ఏ కదా?” అన్నాడు.
అఖిరా ఒక అడుగు వెనక్కి వేసింది.
“Don’t worry. వాడి సంగతి నేను చూసుకుంటా,” అని చెప్పి వెళ్లిపోయాడు.
అఖిరా ఆలోచనల్లో మునిగి లోపలికి వచ్చింది.
పిన్ని కాఫీ ట్రే పట్టుకుని వచ్చి,
“ఇక్కడే వైభవ్ వెళ్లిపోయాడా?” అని అడిగింది.
“అఖిరా… అఖిరా…” అని రెండుసార్లు పిలిచింది.
అఖిరా ఆలోచనల నుంచి తేరుకుని,
“అతనికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట, వెళ్లిపోయాడు,” అని షాక్‌లోనే చెప్పింది.
“సరే, నువ్వు ఫ్రెష్ అయ్యి రా. కాఫీ తాగుదాం,” అని పిన్ని చెప్పినా వినకుండా, అఖిరా తన గదిలోకి వెళ్లి కూర్చుంది.
ఆమె మనసులో మళ్లీ మళ్లీ వైభవ్ మాటలే తిరుగుతున్నాయి—
“అభయ్ ఏ కదా?”
ఆ పిలుపు…
మళ్లీ… మళ్లీ…
వినిపిస్తూనే ఉంది…
---
ముందుకు కొనసాగుతుంది…
---