Veda - 12 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 12

Featured Books
Categories
Share

వేద - 12

ముసుగు మనుషుల చేతిపై రుద్ర భైరవ యొక్క Cult of Chaos సంస్థకు చెందిన, త్రిశూలానికి పాము చుట్టుకున్న ఒక గుర్తును చూసాక, ఈ గుర్తుకు, తన తండ్రి మరణానికి మరియు వేదకు ఏదో సంబంధం ఉందని అర్జున్ కు అనుమానం మొదలైంది.

ఇంతలో, ఇంటిలోపలికి వెళ్తున్న వేద హఠాత్తుగా కింద పడిపోయింది. 

అది గమనించిన వెంటనే అర్జున్ బైక్ మీదనుండి దిగి, పరుగున వెళ్ళి వేదను పైకి ఎత్తి ఇంటి లోపలికి తీసుకెళ్ళి, తన బెడ్ పైన పడుకోబెట్టాడు. 

వేద జీవితంలో ఇంతవరకు జరిగిన సంఘటనలకు, ఆమె మానసికంగా మరియు శారీరకంగా కుంగిపోయింది. వేద స్పృహలో లేనందున, ఆమె రక్షణకోసం అర్జున్ ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. 

తెల్లవారింది, చుట్టూ మొత్తం మసక వెలుతురు కమ్మింది. నగరం ఇంకా నిద్రలేవకముందే అర్జున్ కారు రోడ్ల మీద వేగంగా దూసుకుపోతోంది. 

కారు లోపల నిశ్శబ్దం భయంకరంగా ఉంది. సీటు పక్కన కూర్చున్న వేద భుజానికి తగిలిన గాయం నుండి రక్తం కారుతోంది, కానీ ఆమె ఆ నొప్పిని కూడా గమనించే స్థితిలో లేదు. 

తన కళ్లముందే తను ఒక మనిషిని అంత దూరం విసిరేసిన దృశ్యం ఆమెను వెంటాడుతోంది.

రాత్రి వేద ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాక, తెల్లవారుజామున, వేద బెడ్ మీద భుజానికి రక్తం కారుతుండగా అర్జున్ చూసాడు.

రాత్రి జరిగిన దాడిలో వేదకు తగిలిన దెబ్బ కనిపించలేదు, కానీ తెల్లవారుజామున లేచాక ఆ గాయం పెద్దగా మారి, దాని చుట్టూ రక్తం కారుతుంది. 

అర్జున్ ఒక పక్క కారు నడుపుతూనే, అప్పుడప్పుడు వేద వైపు చూస్తున్నాడు. 

తన షర్టు మీద అంటుకున్న రక్తం మరకలను చూస్తుంటే అతనికి గతరాత్రి జరిగిన పోరాటం కంటే, ఆ ముసుగు మనుషుల మణికట్టు మీద ఉన్న ఆ 'త్రిశూలం-పాము' గుర్తు గుర్తొచ్చి ఒళ్లు గగుర్పొడుస్తోంది.

అంతలో వేద కళ్ళు తెరిచింది. అర్జున్ కారును రోడ్డు పక్కన ఆపి, "వేద.. నొప్పిగా ఉందా?" అని తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీస్తూ నెమ్మదిగా అడిగాడు.

వేద శూన్యంలోకి చూస్తూ ఏమీ మాట్లాడలేదు. అర్జున్ ఆమె గాయానికి డ్రెస్సింగ్ చేస్తుండగా, తన గాయం కొద్ది కొద్దిగా తగ్గడం గమనించి ఆశ్చర్యంతో నేరుగా ఆమె కళ్లలోకి చూశాడు. 

"వేద, ఇప్పుడు మనం అబద్ధాలాడుకునే సమయం లేదు. నిన్ను చంపాలని చూసిన ఆ ముఠా గుర్తు.. అది మా నాన్న డైరీలో నేను చూశాను. మా నాన్న మరణానికి, ఇప్పుడు నిన్ను వెంటాడుతున్న వాళ్లకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వు మామూలు అమ్మాయివి కావు అని నాకు అర్థమైంది. నీలో ఉన్న ఆ శక్తి ఏంటి? ఆ Cult of Chaos వాళ్లు నిన్నెందుకు పట్టుకోవాలని చూస్తున్నారు?" అని వేదపై, తన మనసులో దాగున్న ప్రశ్నల వర్షం కురిపించాడు అర్జున్.

అర్జున్ మాటలకు వేద కళ్లలో నీళ్లు తిరిగాయి. "నాకు తెలియదు అర్జున్.. నిజంగా తెలియదు. నాలో ఈ మార్పు ఎప్పుడు మొదలైందో, ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. కానీ మా అమ్మ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. 'ఏ రోజైనా నీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే, మన మూలాల దగ్గరకు వెళ్ళు.. అక్కడే నీకు రక్షణ దొరుకుతుంది' అని."

"ఎక్కడికి? ఎక్కడున్నాయి ఆ మూలాలు?" అర్జున్ ఆత్రుతగా అడిగాడు.

"The Threshold.. మా పూర్వీకుల ఇల్లు. అది ఈ నగరానికి దూరంగా ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది. అక్కడికి వెళ్తేనే నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమో." అని అన్న ఆమె గొంతులో ఒక రకమైన నిశ్చయత కనిపించింది.

అర్జున్ మరో ఆలోచన లేకుండా ఇంజిన్ స్టార్ట్ చేశాడు. నగరం దాటి, కాంక్రీట్ అడవిని వదిలి కారు దట్టమైన అడవి మార్గంలోకి ప్రవేశించింది. 

ఆకాశం మేఘాలతో నిండిపోయింది. సూర్యుడు ఉదయించినా ఆ వెలుతురు కిందకు రాకుండా మేఘాలు అడ్డుపడుతున్నాయి. గాలిలో తేమ పెరిగింది.

కొంతదూరం వెళ్ళాక మొబైల్ సిగ్నల్స్ పూర్తిగా పోయాయి. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. 

వేదకు తన శరీరంలో ఒక వింతైన వేడి మొదలైంది. రక్తం నరాల్లో ఉడుకుతున్నట్లు అనిపిస్తోంది. ఆమె గుండె చప్పుడు పెరిగింది. అది భయం వల్ల కాదు.. ఏదో తనను పిలుస్తున్నట్లున్న ఒక తెలియని ఆకర్షణ.

"మనం సరైన దారిలోనే వెళ్తున్నామా?" అని అర్జున్ అడిగాడు. ఆ పాడుబడ్డ ఘాట్ రోడ్ చూస్తుంటే అతనికి అనుమానంగా ఉంది.

"అవును.. ఇది సరైన మార్గమే అని నాకు అనిపిస్తోంది. మేము దగ్గరకు వచ్చేశాం." అన్న వేద గొంతు గంభీరంగా మారింది.

చివరికి ఒక పెద్ద కొండ మలుపు తిరగగానే, వారి కళ్లముందు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 

ఒక ఎత్తైన కొండ మీద, మేఘాల మధ్య దాగి ఉన్నట్లుగా ఒక పురాతనమైన భారీ మేనార్ (కోట వంటి ఇల్లు) కనిపించింది. 

దాని గోడల మీద ప్రాచీనమైన శిల్పాలు ఉన్నాయి. ఆ ఇల్లు ఏదో గొప్ప రహస్యాన్ని శతాబ్దాలుగా దాచుకున్నట్లుగా గంభీరంగా నిలబడి ఉంది.

కారు ఆపి దిగగానే అర్జున్ ఆ ఇంటిని చూసి విస్తుపోయాడు. అది కేవలం ఇల్లు కాదు, అది ఒక శక్తికి కేంద్రంలా అనిపిస్తోంది. 

గాలిలో ఒక రకమైన ఆధ్యాత్మిక కంపనం వినిపిస్తోంది. ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను అనుభవించగానే అర్జున్ చర్మం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఇంకేమీ మాట్లాడకుండా వేద అడుగులు మెల్లగా ఆ మేనార్ వైపు పడ్డాయి. ఆ భారీ చెక్క తలుపుల దగ్గరకు వెళ్లగానే, ఆమె మెడలో ఉన్న 'శరభ ముద్ర' లాకెట్ అకస్మాత్తుగా నీలిరంగులో ప్రకాశించడం మొదలుపెట్టింది. ఆ కాంతి చీకటిగా ఉన్న ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది.

గీ.... అని భయంకరమైన శబ్దం చేస్తూ, ఎవరూ నెట్టకుండానే ఆ భారీ తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. లోపల గాఢమైన చీకటి. ఆ చీకటి నుండి ఒక వింతైన పరిమళం వస్తోంది.

అర్జున్ వేద చెయ్యి పట్టుకున్నాడు. "ఆగు వేద, నాకెందుకో లోపలికి వెళ్లడం క్షేమమేనా అనిపిస్తుంది." అని అన్నాడు.

కానీ వేదకు ఏ భయం లేకుండా, ఆమెను ఏదో శక్తి లోపలికి లాగుతోంది. వారు ఇద్దరూ ఆ చీకటి హాలులోకి అడుగుపెట్టారు. మౌనంగా ఉన్న ఆ హాలులో వారి అడుగుల శబ్దం ప్రతిధ్వనిస్తోంది.

అప్పుడే.. ఆ చీకటి లోపల దూరం నుండి ఒక చిన్న దీపం వెలుగు కనిపించింది. ఆ వెలుగు మెల్లగా వారి వైపు కదులుతోంది.

ఆ వెలుతురులో ఒక గంభీరమైన వ్యక్తి ఆకారం కనిపించింది. తెల్లటి గడ్డం, నుదుట విభూతి రేఖలు, కళ్లలో లోతైన జ్ఞానం.. 

ఆయనే గురుస్వామి. ఆయన చేతిలో ఉన్న మట్టి ప్రమిద వెలుతురులో వేద ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆయన వేద వైపు చూసి పెదవుల మీద చిన్న నవ్వు పులమగా, గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు:
"వచ్చావా.. అమ్మా! నీ కోసం ఈ ఇల్లు, ఈ శక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ద్వారాపాలిక రావాలని ఎప్పుడో రాసి ఉంది.. కాలచక్రం మళ్ళీ తిరుగుతుంది. సిద్ధంగా ఉండు.. ఇక యుద్ధం మొదలు కాబోతుంది!"

ఆ మాటలు విన్న అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. ద్వారపాలికా? యుద్ధమా?

అసలు వేదకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? గురుస్వామి చెప్పిన ఆ యుద్ధం ఎవరితో? తన తండ్రి డైరీలో ఉన్న రహస్యం ఇక్కడే బయటపడబోతోందా?

వచ్చే ఎపిసోడ్ లో.. Threshold దాచిన మరిన్ని భయంకరమైన నిజాలు!