నేనో రగులుతున్న మంచుకొండను
ప్రవహించే అగ్గిధారను
నా తపో జ్వాలలతో
మాయ మంచు తెరలు కరిగిస్తాను
నా తపనా ప్రకంపనాలతో
పంచ వికారాల కంచు కోటలు బద్దలుగొడతాను
వేల వేల ఆలోచనల మేఘాలు గర్జించే
మనసు నింగిని ఆఘమేఘాల మీద
చీల్చుకొచ్చిన పిడుగును నేను
కడగండ్ల వడగండ్లను ఇనుపగోడలా
అడ్డుకునే గొడుగును నేను
నేనో వాన చినుకును
విషయవాంఛల విశ్వ సాగరంలోకి దూకి
క్షారాన్ని క్షీరంగా మారుస్తాను
క్షీర సాగరంగా చేసేస్తాను