For the sake of the future in Telugu Short Stories by M C V SUBBA RAO books and stories PDF | తరువు కోసం తనువు

Featured Books
Categories
Share

తరువు కోసం తనువు

తరువు కోసం తనువు

ఒరేయ్ రామయ్య నువ్వు గుడిలో నాటిన మామిడి మొక్క ఈ ఏడాది ముద్దుగా కాపు కాసింది రా! అందుకే ఈ పండుని నీకు చూపించిన తర్వాతే దేవుడికి నైవేద్యం పెడదామని తీసుకొచ్చానంటూ చేతిలో మామిడిపండ్ల పళ్ళెం పట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తున్న రామయ్య దగ్గరికి వచ్చాడు గుడి పూజారి కృష్ణమాచారి.

 దానికి బదులుగా రామయ్య నవ్వి నాకెందుకండీ! అయ్యగారు ఆ దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆయన తోటలోనివే కదా ఇవన్నీ. కేవలం నేను ప్రతిరోజు కాసిన్ని నీళ్లు పోసాను అంతే కదా అయ్యగారు అన్నాడు రామయ్య. లేదురా ఆ మొక్కల పాలిట నువ్వు దేవుడివే. ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రమ అనుకోకుండా నీళ్లు పోసి పెంచి వాటి సంరక్షణ చూస్తావు కదా! అన్నాడు పూజారి కృష్ణమాచారి.

అలా ప్రతిరోజు ఎంతోమంది "నువ్వు మా పెళ్ళిలో కానుకగా ఇచ్చిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి కాపుకు వచ్చాయి బాబాయ్ అంటూ చెప్పే ఆ ఊరి ఆడపడుచులు, 

రోడ్డు పక్కన నువ్వు వేసిన మొక్కలు బాటసారులకు అలసట తీరుస్తున్నాయని కొందరు, మన పంచాయతీకి నీ మూలంగానే పర్యావరణ పరిరక్షణలో గవర్నమెంట్ వారి ప్రైజ్ ఇచ్చారని ఆ ఊరి ప్రెసిడెంట్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ ఇలా ఎవరో ఒకరు చెబుతుంటే రామయ్యకి చిన్నప్పుడు పాఠం చెప్పిన వీరా స్వామి మాస్టారు పాఠం గుర్తుకొచ్చింది. 

క్షీరసాగర మధనం సమయంలో వచ్చిన హలహలాన్ని మింగి శివుడు లోకానికి మేలు చేశాడు. అలాగే చెట్లు విషవాయువులన్నిటిని పీల్చి మనకి ప్రాణవాయువుని ఇస్తుంది. పచ్చగా ఉన్న చెట్టు లేకపోతే లోకమంతా విషవాయువు రాజ్యమేలుతుంది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది అంటూ చెట్లు ప్రాముఖ్యతను చెబుతూ పిల్లలందరికీ తలో మొక్క ఇచ్చి పాఠశాల ఆవరణలో వేయించి పెంచి పోషించమని చెబుతూ ఉండేవారు ప్రతి సంవత్సరం.  

అలా రామయ్య కి మొక్కలు అంటే ఆ అభిమానం ఏర్పడింది. తన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఏదో ఒక మొక్క తెచ్చి నాటుతూ ఉండేవాడు ప్రతినెల. నాటడమే కాదు సాయంకాలం పూట వాటికి సంరక్షణ చేసి అవి ఎదుగుతుంటే ఆనందపడుతూ ఉండేవాడు. 

"ఒరేయ్ మీరు పెద్దయ్యాక ఏమవుతారు రా !అని మాస్టర్ అడిగిన ప్రశ్నకి నేను పెద్దయ్యాక చెట్లు పెంచుతానండి అని చెప్పిన రామయ్య సమాధానం విని మాస్టారు నవ్వుతూ ఉండిపోయారు.

సెలవు వస్తే అందరి పిల్లలు హాయిగా ఆటలాడుకుంటుంటే రామయ్య ఏదో ఒకటి రెండు మొక్కలను తీసుకుని చెరువుగట్టు మీద కాలువ గట్టుమీద నాటుతూ వాటికి నీళ్లు పోసి ఆనందిస్తూ ఉండేవాడు. మొక్కలంటే అంత ప్రాణం రామయ్యకి. 

రామయ్య తండ్రి నారాయణరావు ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వాడు. నలుగురు పిల్లలతో ఉన్న కొద్దిపాటి భూమి వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా కాలక్షేపం చేసుకుంటూ ఉండేవాడు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత రామయ్య ని చదువు మానిపించేసి వ్యవసాయ పనిలో సహాయం కోసం పొలానికి తీసుకెళ్లేవాడు తండ్రి. తండ్రికి సహాయం చేయడం మాట దేవుడెరుగు ఎక్కడ మొక్క కనబడితే అక్కడ నిలబడిపోయి వాటితోటి ఏదో మాట్లాడుతుండేవాడు రామయ్య. 

ఇలా కొంత కాలానికి పొలం నుంచి వస్తూ తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ భారం అంతా రామయ్య మీద పడింది. అలా పొలం పనులతో పాటు కుటుంబ భారం చూసుకుంటూ పొలంలోనూ ఇంటిలోని ఖాళీ స్థలంలోనూ అంతా మొక్కలు వేసి ఆనందిస్తుండేవాడు.
రామయ్య తల్లి కూడా చనిపోవడంతో ఇంట్లో ఆడ దిక్కు లేకపోవడంతో మేనమామ తన కూతురు కావమ్మను ఇచ్చి పెళ్లి చేస్తాడు రామయ్యకి.

 కావమ్మ కాపురానికి వచ్చిన తొలి రోజునే తన ఆశయం గురించి చెబుతాడు రామయ్య. అప్పట్నుంచి రామయ్యకి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. 

ఒకపక్క కుటుంబాన్ని మరొక పక్క పొలం పనులు కాళీ ఉన్న సమయంలో సైకిల్ మీద మొక్కలు పెట్టుకుని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు వేసి వాటి బాగోగులు చూసేవాడు.

 ఎక్కడపడితే అక్కడ గోడల మీద వంకర టింకర అక్షరాలతో మొక్కల పెంపకం గురించి వ్రాసే వాడు. మొక్కలు కూడా ప్రాణం ఉంటుందని కాబట్టి వాటిని మన పిల్లల్లాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులతో చెబుతుండేవాడు. ఏదైనా కారణం వల్ల మొక్క చనిపోతే రెండు మూడు రోజులు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. పశువులు తినేస్తే పశువుల యజమానితో గొడవలు పెట్టుకునేవాడు. రామయ్యకు తోడు కావమ్మ కూడా మొక్కల్ని పెంచడంలో భర్తకు చేదోడవాసుడుగా ఉండేది. ఎప్పటికైనా కోటి మొక్కలు నాటాలని కనపడిన ఖాళీ ప్రదేశం అంతా మొక్కలతో నింపేసాడు రామయ్య. 

రామయ్య తలపెట్టిన ఈ యజ్ఞానికి ఊరి పెద్దలతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఎంతగానో సహకరించేవారు . రామయ్య అడిగినప్పుడల్లా మొక్కలు ఉచితంగా ఇవ్వడం ఊరి వాళ్ళందరూ విత్తనాలు సేకరించి ఇవ్వడం ఇలా ఆ ఊరు కోటి మొక్కలుతో హరితవనం అయిపోయింది. రామయ్య ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 

 ఎంత దూరమైనా సైకిల్ మీద మొక్కలు మోసుకుంటూ ఆకుపచ్చ రంగు టోపీ పెట్టుకుని మొక్కల మీద తన కున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉండేవాడు రామయ్య. 

నిజజీవితంలో కూడా తన మనవరాళ్ళకి చెట్ల పేర్లు పెట్టుకున్నాడు. వాళ్ల మధ్య గడుపుతుంటే మొక్కలు మధ్య గడిపినట్టు ఉంటుందని అనేవాడు రామయ్య. ఇంతకంటే అభిమానం ఎవరికి ఉంటుంది. తన ఇంటి పేరు కూ డా మార్చుకున్నాడు .

 రామయ్య చేపట్టిన దీక్షని ,కోటి మొక్కలు పెంచిన విధానాన్ని ఒక యూట్యూబ్ లో చూసిన మంత్రిగారు ఆ గ్రామానికి వచ్చి రామయ్యకి అభినందన సభ ఏర్పాటు చేశాడు. "మొక్కలే నా ప్రాణం అని నా మనవరాళ్లకు కూడా చెట్లు పేరే పెట్టుకున్నానని నా గూడు పేరు హరితవనమని చెబుతూ రామయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొక్కల కోసం నా ఇంటిపేరు కూడా మార్చుకున్నాను అని రామయ్య చెప్పిన మాటల్లో ఎంతో వేదన ధ్వనించింది. 
మంత్రిగారు రామయ్యకు చేసిన సన్మానం తర్వాత అనేక పర్యావరణ పరిరక్షణ సంస్థలు రామయ్య ని  
సన్మానించేయి. 

ఎప్పుడు ఊరు వదిలి వెళ్ళకుండా కేవలం మొక్కల మధ్య మొక్కలు తోటి జీవితం గడిపిన రామయ్య కి ఒక్కసారిగా తనకు వచ్చిన అవార్డు విలువ కానీ, తన విలువ కానీ రామయ్యకు తెలియదు. అక్కడ కూర్చున్న పెద్దల సంగతి అసలు తెలియదు. 

దేశ విదేశాలు వాళ్లు తనని చూస్తున్నారనే సంగతి అసలు తెలియదు . కేవలం ప్రతిరోజు లాగే దుస్తులు ధరించి కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకుని వృక్షో రక్షిత రక్షితః అనే నినాదంతో ఉన్న టోపీ పెట్టుకుని వచ్చిన రామయ్య ను చూసి 
మట్టిలో పుట్టిన మాణిక్యం అని నవ్వుకున్నారు. తను నమ్ముకున్న జీవితాశయానికి జీవితాన్ని త్యాగం చేసిన రామయ్య ని పద్మశ్రీ వరించింది. 

అలా మొక్కల మధ్య జీవితం గడిపిన రామయ్య ఆఖరి శ్వాస కూడా మొక్కల్లోనే కలిసిపోయింది. ఎందుకంటే రామయ్యకి మొక్కలంటే అంత ఇష్టం. ఆఖరి రోజున తన దగ్గరకు తీసుకొచ్చిన మామిడి పండ్లను చూసి ఇంకా ఎన్నో పండ్లు కాస్తాయి ఈ చెట్లు నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు. ఆరోజు రాత్రి చెట్టు కింద ఆఖరి శ్వాస విడిచాడు. ప్రకృతి తన బిడ్డను తనలోనే కలిపేసుకుంది .

పెద్దగా డిగ్రీలు సంపాదించకపోయినా రామయ్యకి పరిసరాల పట్ల ఎంతో అవగాహన ఉంది. పర్యావరణ పట్ల ఎంతో విజ్ఞానం ఉంది. అందుకే భావితరాలకు ఉపయోగపడేలా కోటి మొక్కలను పెంచాడు. రామయ్య జీవితం ఎంతోమంది పిల్లలకి ఆదర్శప్రాయం కావాలి అంటూ అందరూ రామయ్య ఆదర్శాలను పాటించాలని ఆ ఊరి ప్రెసిడెంట్ గారు రామయ్య సంతాప సభలో అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తాడు. 

 ఆ ఊరి పేరుని రామయ్య వనంగా మార్చడానికి గవర్నమెంట్ కి ప్రతిపాదనలు పంపుతాడు .రామయ్య చనిపోలేదు. మనం పీల్చే గాలిలోనే ఉన్నాడు. మనం తినే పండులోనే ఉన్నాడు. రహదారి పక్కనున్న చెట్లలో ఉన్నాడు. రామయ్య ఓ దేవుడు.

పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కథని ఆదర్శంగా తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేశాను.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279