Virgo in Telugu Short Stories by M C V SUBBA RAO books and stories PDF | కన్యాదానo

Featured Books
Categories
Share

కన్యాదానo

కన్యాదానం

ఉదయం 10 గంటలు అయింది.

పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్ ముగించుకుని తీరికగా వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఈనాడు పేపర్లో వచ్చే వరుడు కావలెను ప్రకటనలు చూస్తున్నాడు. ఇంతలో ఒక మూలగా కన్యాదాతలు కావలెను అని ప్రచురించిన ప్రకటన బాగా ఆకర్షించింది.

 పరంథా మయ్య గారు ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ ప్రకటన పూర్తిగా చదివాడు.తల్లిదండ్రులు లేని పిల్లకి స్వచ్ఛందంగా కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి దాతలు కావలెను అంటూ మిగిలిన వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. భార్యకు ప్రకటన చూపించి వెంటనే ఆ పేపర్ లో ఇచ్చిన నెంబరుకి కాల్ చేసారు పరంధామయ్య గారు. 

హలో అంటూ అవతల నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. తనని తాను పరిచయం చేసుకుని ఎప్పటినుంచో ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని తనకి ఇద్దరు మగ పిల్లలే అని పెద్దబ్బాయి కి మ్యారేజ్ చేశామని రెండో అబ్బాయికి సంబంధం చూస్తున్నామని తన సంగతులు చెప్పుకుంటూ వచ్చారు పరంధామయ్య గారు. 

సరేనండీ సాయంకాలం మా ఇంటి కి రండి అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్సు చెప్పింది. అనుకున్నట్టుగానే సాయంకాలం ఆ అడ్రస్ కి భార్యని తీసుకుని చేరుకున్నారు పరంధామయ్య గారు. పరంధామయ్య గారు ఉండే విద్యానగర్ కాలనీకి ఆ ఇల్లు కూడా దగ్గరే. ఇంటికి వెళ్లి తలుపు తట్టగానే 25సంవత్సరాలు ఉన్న యువతి తలుపు తీసి
లోపల ఆహ్వానించి రేకుల కుర్చీ చూపించింది

. ఆ ఇల్లు మూడు గదుల పోర్షన్. ఇంటి గోడలన్నీ పెచ్చులూడిపోయి రంగులు లేక వెలిసిపోయినట్లుగా ఉన్నాయి. తన పేరు ఇందిరని తనే ఆ పేపర్లో ప్రకటన ఇచ్చానని ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నానని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని అక్కగారు, భర్త దగ్గర్లోనే కాపురం ఉంటున్నారని బావగారు సరైనవాడు కాదని మనకి ఈ మధ్యనే స్కూల్లో పనిచేసే అబ్బాయి తోటి పెళ్లి కుదిరిందని మగపెళ్లి వారు రిజిస్టర్ మ్యారేజ్ కి ఒప్పుకోవడం లేదని కన్యాదానం చేయమని అడిగితే పినతండ్రులు గాని మేనమామలు అక్క బావలు కానీ ఎవరు ముందుకు రావడంలేదని పైగా మనం బ్రాహ్మణ కులంలో అన్నీ ఎక్కువ సంప్రదాయాలు తంతులు ఉంటాయి కదా అని ఏడుస్తూ చెప్పింది. పెళ్లి కోసం తల్లిదండ్రులు కొంత డబ్బు బ్యాంకులో వేశారని పెళ్లి ఏర్పాట్లు తనే చేసుకుంటాన ని శుభలేఖల్లో అభిమాన పుత్రిక అని వేయించుకుంటానని చెప్పింది

పరంధామయ్య గారు ఒకసారి ఆలోచనలో పడ్డారు. అయినవాళ్లు రక్తసంబంధీకులు ఇలా కూడా ఉంటారా అని ఆలోచిస్తూ ఒకసారి కన్యాదానం గురించి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.వయసు వచ్చిన బిడ్డని మనసు మెచ్చిన వరుడుకి కాళ్లు కడిగికన్యాదానం చేయడం జన్మనిచ్చిన తల్లిదండ్రుల కర్తవ్యం. మంచిసంతానం కోసం త్రి ధర్మ రక్షణార్థం ప్రతి కుటుంబీకుడుకన్యాదానం చేయాలని కోరుకుంటారు. కన్యాదానం చేయడం వలన పితరులు తరిస్తారని పెద్దలు చెబుతుంటారు. ఆడపిల్లలు లేని తల్లిదండ్రులు అడిగి మరీ కన్యాదానం చేస్తుంటారు. అలాంటి అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారు. ఇది దేవుడిచ్చిన అవకాశం. కాబట్టి తన అంగీకారం తెలియజేశారు. ఆ పిల్ల ఆనందానికి హద్దులు లేవు.

పరంధామయ్య గారు అన్నిటికీ అంగీకరించి ఇంటికి వచ్చి భార్యతో ఆలోచించి మంగళసూత్రాలు మట్టెలు మధుపర్కాలు
పెళ్లి కూతురికి ఒక పట్టు చీర పెడతామని ఇందిరకిఫోన్ చేసి చెప్పారు. భగవంతుడు సహాయం చేయడం అంటే ఇదే కాబోలు అనుకుని సంతోషించి పెళ్లి ఏర్పాటల్లో మునిగిపోయింది ఇందిర.

ఆరోజు రానే వచ్చింది.పెళ్లి రాత్రి ముహూర్తం. ఉదయమే పెళ్లి వారు స్నాతకం చేసుకోవడానికి విడిది లోకి వచ్చేసారు. అమ్మాయి తరఫున బంధువులందరూ వచ్చారు కానీ ఎవరు ఏర్పాట్లు లో వేలు పెట్టలేదు. ముట్టుకుంటే ఎక్కడ అంటుకుంటుందని భయం.
 మగపెళ్లివారిని పరంధామయ్య గారు దంపతులు పెద్ద కొడుకు కోడలు చిన్న కొడుకు లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. జరగవలసిన మర్యాదలని యధాతధంగానే చేశారు. ఒకపక్క కాపీ టిఫిన్లు మరొక పక్క స్నాతకము ఎక్కడ ఊపిరి సలపకుండా ఉంది పరంధామయ్య గారి కుటుంబ సభ్యులకి .

 అయినా ఎక్కడో విసుక్కోకుండా నిజంగా ఆడపిల్ల తండ్రిలాగే పర్యవేక్షణ చేశారు పరంధామయ్య గారు. కాఫీలో పంచదార చాల్లేదని బ్రూ కాఫీ ఇవ్వలేదని టిఫిన్ ఒక ఇడ్లీతో సరిపెట్టేసారని పెళ్ళికొడుకు బావగారు అలిగి గదిలోంచి బయటకు రాలేదు అని పెళ్ళికొడుకు తండ్రి పరంధామయ్య గారికి వచ్చి చెప్పాడు. పాపం పరంధామయ్య గారు బయట హోటల్ నుంచి బ్రూ కాఫీ రెండు రకాలు టిఫిన్లు పిల్లలు చేత తెప్పించి శాంతింప చేశాడు.
నిజానికి టిఫిన్ కూడా బాగులేదు. పాపం ఈ అమ్మాయి తక్కువ రేటుకు వచ్చిందని పెట్టి ఉంటుంది ఈ కేటరింగ్ అనుకున్నాడు పరంధామయ్య గారు. టిఫిన్ కి ఎంత గొడవ చేశారు మళ్లీ భోజనాల దగ్గర ఎంత ఎంత గొడవ చేస్తారో అనుకుంటూ భయపడిపోయాడు పరంధామయ్య గారు. కాశీ యాత్ర మధ్యలోనే ఫెయిల్ అయ్యి పెళ్ళికొడుకు బావమరిది కాని బావమరిది బతిమాలితే తిరిగి వెనక్కి వచ్చేసాడు

పెళ్ళివారందరినీ యధాతధంగా గౌరవ మర్యాదలతో మధ్యాహ్నం విందుకు ఆహ్వానిస్తే ఎవరుబయటకు రాలేదు. మళ్లీ ఏం గొడవ వచ్చిందో అని పరంధామయ్య గారు గదిలోకి వెళ్తే కాశీ యాత్రలో పెళ్ళికొడుకు పెట్టిన బట్టలు రంగు బాగాలేదు అంటూ పెళ్లి కొడుకు తల్లి సాగదీస్తూ చెప్పింది. పరంధామయ్య గారు బతిమాలి బతిమాలి భోజనానికి తీసుకువచ్చి భోజనం అయ్యేటప్పటికి సాయంకాలం నాలుగు గంటలు అయింది. సాయంకాలం 6:00కు ఎదురు సన్నాహాలు అంటూ పురోహితులు వారు ముందుగానే చెప్పారు. ఆ విషయం పెళ్లి కొడుకు తండ్రికి పరంధామయ్య గారు చెప్పారు.

ఎదురు సన్నాహంలో ఆ పక్క మగ పెళ్లి వారు ఈ పక్క ఆడపెళ్లి వారు కూర్చుంటే ఆడపిల్ల తండ్రిగా చేయవలసిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించారు పరంధామయ్య గారు. బ్రహ్మగారు శుభలేఖ చదువుతూ పరందామయ్య గారి అభిమాన పత్రిక బదులు పుత్రికని అలవాటు కొద్ది చదివేశారు. పరంధామయ్య గారి కళ్ళల్లో నీళ్లు వచ్చే యి. ఆ పిల్లకి తనకి రక్తసంబంధం లేదు. అయినా ఇన్ని కార్యక్రమాలు చేయాలని తలంపు తనకు వచ్చిందంటే అది పూర్వజన సుకృతం అయ్యుంటుంది. ఏదో బుు ణానుబంధం ఉంటే గాని ఇలా జరగదు అనుకుని మగపిల్లవారికి మర్యాదలన్ని సక్రమంగా పూర్తి చేసి పానకం గ్లాసులు అందించారు. ఆడపడుచు పానకం ముట్టుకోలేదు.
ఇత్తడి బిందెలు కోరుకుంటే స్టీలు బిందెలు ఇచ్చారని పెద్ద గొడవ. సాధారణంగా పెళ్లిలో ఇటువంటివే ఎక్కువ గొడవలు ఉంటాయి.

పెళ్లికూతురుతోటి సంప్రదించి ఆ బిందె లు మార్చడానికి ఒప్పుకుని మొత్తానికి కార్యక్రమాన్ని గట్టెక్కించారు పరంధామయ్య గారు. పెళ్లి వారు పట్టుమని పదిమంది కూడా లేరు. కానీ వంద మంది పెట్టు. వాళ్ళ గొంతెమ్మ కోరికలకి హద్దు లేదు. కోరికలు దారుణంగా ఉన్నాయి.

ఇలా ప్రతిదానికి గొడవలు పెడుతూ మొత్తానికి పెళ్ళికొడుకు పెళ్లికూతురు మెడలో మూడు ముళ్ళు వేశాడు. పరంధామయ్య గారి కల నెరవేరింది. అప్పగింతల సమయంలో కన్నతండ్రిల్లా ఏడిచారు పరంధామయ్య గారు. ఒప్పుకున్న బాధ్యతని సక్రమంగా నెరవేర్చినందుకు పెళ్లికూతురు చేతులు పట్టుకుని ఏడ్చింది. వెళ్లే ముందు పెళ్ళికొడుకు తండ్రి మీరు మాకు దేవుడిచ్చిన బావగారు అంటూ అభినందించి వెళ్ళాడు కానీ మర్నాడు జరిగే సత్యనారాయణ వ్రతం మాట ఎత్తలేదు. వార్తాపత్రికలు టెలివిజన్ లు పరంధామయ్య గారిని ఆకాశానికి ఎత్తేసేయి. స్నేహితులు బంధువులు అందరూ పరంధామయ్య గారి ని అభినందించారు.

ఈ కలికాలంలో ఇటువంటి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరని తెలిసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు.ఒక నెల రోజుల తర్వాత నూతన దంపతులను తమ ఇంటికి లంచ్ కి ఆహ్వానించడానికి పరంధామయ్య దంపతులు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వయంగా పిలుద్దాం అని ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా అనలేదు ఆ దంపతులు. ఎలా ఉన్నావు అమ్మ అంటే పెద్దగా సమాధానం లేదు ఇందిర దగ్గరనుంచి. ఇందిర ఎందుకు అలా మారిపోయింది అనే ప్రశ్నకు సమాధానం పరందామయ్య గారి కుటుంబ సభ్యులకి ఇప్పటివరకు అర్థం కాలేదు.ఆ పెళ్లితో పరంధామయ్య గారి అవసరం తీరిపోయింది. పెళ్లి పేరు చెప్పి కొంత చేతి చమురు కూడా వదిలింది పరంధామయ్య గారికి. ఇది కథ కాదు నిజంగా జరిగింది. దానికి సాక్ష్యం ఈనాటి వరకు పరంధామయ్య గారు దాచుకున్న శుభలేఖలు, పెళ్లి ఫోటోలు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన కన్యాదానం కోరిక తీరిందని పరంధామయ్య గారు ఈనాటి కూడా సంతోషంగా వచ్చిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటారు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279