Incomplete poem - 8 in Telugu Drama by swathi books and stories PDF | అసంపూర్ణ కావ్యం - 8

The Author
Featured Books
Categories
Share

అసంపూర్ణ కావ్యం - 8

ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు నేల రాలకముందే, ఆకాశం ఆమె బాధను పంచుకుంటున్నట్టుగా జోరుగా వర్షం మొదలైంది. ఆ వాన చినుకుల్లో తన కన్నీళ్లను దాచుకుంటూ, వెన్నెల ఆ తోటలోనే ప్రకృతిలో ఒక్కటిగా కరిగిపోయింది. గాలికి ఊగుతున్న ఆ నీలం గులాబీ మొక్క కూడా ఆమెతో పాటే వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా తోచింది.

జోరున కురుస్తున్న ఆ వానలో తన కన్నీళ్లు ఎవరికీ కనిపించవని వెన్నెల అనుకుంది. కానీ తన గుండెల్లో రగులుతున్న ఆవేదన ఆ వాన చినుకుల కంటే వేగంగా ప్రవహిస్తోంది. ఆవేశం, ఆవేదన కలగలిసిన స్థితిలో కిషోర్ ముందుకు వెళ్లి నిలబడింది. తడిసిన జుట్టు, వణుకుతున్న పెదవులతో అతన్ని నిలదీసింది."ఎందుకు ఇలా చేశావు కిషోర్ గారు? నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే ఆ రోజే ముందే చెప్పొచ్చు కదా! అబద్ధపు ప్రేమికురాలిని సృష్టించి నన్ను ఎందుకు వంచించావు? నీ జ్ఞాపకాలు మసకబారినా నా స్నేహం నీకు తోడుంటుందని నిన్ను ఎంతగా నమ్మాను!" అని ఆక్రందనగా అడిగింది.
కానీ కిషోర్ కళ్లలో కనీసం పశ్చాత్తాపం కానీ, కనికరం కానీ లేవు. అతను ఏమాత్రం చలించకుండా, అత్యంత కఠినంగా ఇలా అన్నాడు.. "అవును వెన్నెలా.. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీ ఈ అతి ప్రేమ, ఆ పాతకాలం హీరోయిన్ లాంటి నీ ప్రవర్తన నాకు విసుగు తెప్పిస్తున్నాయి. నీలో అస్సలు జోష్ లేదు, ఎప్పుడూ ఆ మొక్కలు.. ఆ పాత కబుర్లు! నాలాంటి వాడికి నీ తోడు ఒక భారంగా అనిపించింది. అందుకే నిన్ను దూరం పెట్టడానికి ఆ అబద్ధం చెప్పాను. అసలు నీలాంటి వాళ్ళతో ఎవరైనా స్నేహం చేస్తారా నువ్వే చెప్పు అయిన ఇందులో తప్పేముంది? నా ప్రశాంతత కోసం నేను తీసుకున్న నిర్ణయం అది
ఆ మాటలు విన్న వెన్నెలకు పాదాల కింద భూమి బద్దలై పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. తాను ప్రాణంలా చూసుకున్న స్నేహితుడే, తన సహజ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని ఇంతలా అవమానిస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. వానలో తడిసిన ఆమె శరీరం కంటే, అతని మాటల తూటాలతో గాయపడిన ఆమె మనసు ఎక్కువ గడ్డకట్టుకుపోయింది. తన మౌనాన్ని అర్థం చేసుకున్నాడు అనుకున్న మనిషి, అదే మౌనాన్ని అపహాస్యం చేయడం ఆమె భరించలేకపోయింది. ఆ నీలం రంగు గులాబీ మొక్క సాక్షిగా వెన్నెల నమ్మకం నిలువునా కూలిపోయింది.
"వెన్నెలా.. వెన్నెలా!" అంటూ గట్టిగా వినిపించిన పిలుపుతో వెన్నెల ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా అమ్మ శారదమ్మ ఆందోళనగా నిలబడి ఉంది. "అమ్మా.. ఎప్పుడు వచ్చావు?" అంటూ అయోమయంగా చూసింది వెన్నెల. అప్పుడు కానీ ఆమెకు అర్థం కాలేదు.. ఇదంతా ఒక భయంకరమైన పీడకల అని! కిషోర్ అన్న ఆ కఠినమైన మాటలు, ఆ అవమానం అంతా తన భ్రమ అని తెలిసి నిశ్చేష్టురాలైంది. కానీ ఆమె కళ్ళలోని కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. అమ్మను చూడగానే దుఃఖం పొంగుకొచ్చి, ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. శారదమ్మకు ఏమీ అర్థం కాక తోట వైపు చూసింది.. అక్కడ కిషోర్ ప్రాణంగా ఇచ్చిన ఆ 'నీలం రంగు గులాబీ' మొక్క, గులాబీ చెట్లు కుక్కలు పీకేయడం వల్ల నేలకొరిగి ఛిద్రమై ఉంది.
"అయ్యో పిచ్చిపిల్లా! ఆ మొక్క పాడైందని ఇంతలా ఏడుస్తావా? రేపు మళ్ళీ బాగు చేయొచ్చు కదా.. ఊరుకోమ్మా!" అని శారదమ్మ తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. కానీ వెన్నెల మనసు మాత్రం ఆ మొక్కతో పాటు తనలోని ఏదో భాగం శాశ్వతంగా విరిగిపోయినట్టుగా మూగగా రోదిస్తోంది. తల్లి బలవంతంగా పాలు పట్టించి నిద్రపుచ్చినా, వెన్నెల అంతరంగంలో ఆ పీడకల మిగిల్చిన భయం ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంది.ఆ పీడకల ప్రభావంతో వెన్నెల గాఢ నిద్రలోకి జారుకుంది. రోజూ అందరికంటే ముందే లేచి మొక్కలను పలకరించే వెన్నెల, ఆ రోజు బారెడు పొద్దెక్కినా కళ్ళు తెరవలేదు. శారదమ్మ వెళ్లి చూస్తే, వెన్నెల ఒళ్లు సెగలు గక్కుతోంది. కాలిపోతున్న జ్వరంతో, స్పృహ లేకుండా పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లి గుండె నీరయ్యింది. ఊరి డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇచ్చారు, తడిగుడ్డలు పెట్టి జ్వరం తగ్గించడానికి ప్రయత్నించారు.. కానీ ఫలితం లేకపోయింది. రెండు రోజులు గడిచినా జ్వరం తగ్గకపోవడంతో, ఆందోళనతో పట్టణంలోని పెద్ద హాస్పిటల్‌కు తరలించారు
ఎన్ని ఖరీదైన మందులు వాడినా, ఎంతటి నిపుణులైన వైద్యులు చికిత్స చేసినా వెన్నెల శరీరంలో చలనం లేదు. ఆమె మనసు ఆ పీడకల తాలూకు విషాదంలోనే కూరుకుపోయిందేమో అన్నట్టుగా ఉంది. చివరికి డాక్టర్లు నిస్సహాయంగా చేతులెత్తేస్తూ, "మేము ఏమీ చేయలేము.. ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి మా చేతుల్లో ఏమి లేదు అన్నట్టు చేతులు ఎత్తేశారు !ఆమెలో జీవించే కోరిక ఉన్నట్టు లేదు" అని చెప్పిన మాటలు శారదమ్మ చెవిన పడ్డ పిడుగుల్లా మారాయి. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా వికసించిన ఆ 'వెన్నెల', ఇప్పుడు తన వెలుగును కోల్పోయి కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.
వెన్నెల శరీరం జ్వరంతో కాలిపోతోంది. కనీసం కనురెప్పలు వాల్చే శక్తి కూడా ఆమెలో లేదు. కానీ, ఆమె మనసు మాత్రం ఈ నిస్సహాయ స్థితి నుండి తప్పించుకుని, తను సృష్టించుకున్న ఆ అందమైన ఊహల లోకానికి వెళ్ళిపోయింది. అప్పుడే కిషోర్ మాటలు గుర్తు వచ్చాయి వెన్నెల ఎప్పుడూ చూసిన తోటల కాడా ఏదో ఆలోచిస్తూనే ఉంటావు నువ్వు అని అడిగాడు అప్పుడు వెన్నెల నాకు చిన్నపటినుంచి అందమైన ఊహ లోకానికి సృష్టించికొన్నాను. 
అక్కడ జలపాతం,గులాబీ తోటలు, సూర్యాస్తమయం , ఇంద్ర ధనుస్సు ఇవ్వన్నీ అక్కడ ఉండాలి అక్కడ చక్కగా నేను సరదగ గడపాలి అని చెపుతుంటే నిజమే వెన్నెల నీ లోకం చాలా బాగుంది అన్నట్టు నీ లోకానికి నువ్వు ఏమని పేరు పెట్టావు అని అడగగా అయ్యో ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు అని వెన్నెల అన్నది అప్పుడు కిషోర్ నిస్వార్ధంగా ఉండే నీకు "హార్మొనీ హెవెన్" అని పేరు పెడితే బాగుంటుంది అని చెప్పాడు కిషోర్. వెన్నెల కూడా బాగా నచ్చడం తో చాలా బాగుంది అని చెప్పింది బాగుంటే సరి పోయింది నేను కూడా రావచ్చా అని అడిగాడు అప్పుడు వెన్నెల తప్పకుండా రావచ్చు కిషోర్ గారు చెప్పండి మీకు ఏ మొక్కలు కావాలి మీకు? నాకు టీ సమోసా చాలు ఇంకేమి వద్దు అన్నాడు. అలాగేనండీ తమరు చిత్తం అనుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు వాళ్ళ నవ్వును చూసి అక్కడ తోట మొత్తం ఆహ్లాదకరం మారిపోయాయి.