Incomplete poem - 2 in Telugu Drama by swathi books and stories PDF | అసంపూర్ణ కావ్యం - 2

The Author
Featured Books
Categories
Share

అసంపూర్ణ కావ్యం - 2

అలా రోజులు గడుస్తున్నాయి.. వెన్నెల ఎప్పటిలాగే తన గులాబీ మొక్కలకు నీళ్లు పోస్తూ, మురిపెంగా ముచ్చట్లు చెప్పుకుంటోంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. మళ్ళీ మొదలుపెట్టింది ఈ పిచ్చిది! ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు" అంటూ విసిరేసిన మాటలు వెన్నెల మనసుని చివుక్కుమనిపించాయి. అప్పుడే వాళ్ళ అమ్మ శారద మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారి గా ఎవరో ఇక చాలు అన్నట్టు అనిపించింది ఎవరు అని వెనుకకు తిరిగి చూస్తే   సరిగ్గా అప్పుడే.. "ఆమె చేస్తున్న తప్పేమిటి?" అన్న ఒక గంభీరమైన గొంతు వినిపించింది. "మొక్కలకి ప్రాణం పోస్తూ, వాటితో కాలం గడపడం నేరమా? అది పిచ్చితనం కాదు, ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమ" అంటూ ఒక వ్యక్తి ఆమెకు అండగా నిలబడ్డాడు. వెన్నెల ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. సుమారు 5.6 అడుగుల ఎత్తు, మెరిసే కళ్ళు, ముఖంలో ఒక వింతైన తేజస్సు.. చూడగానే మనసు ప్రశాంతంగా' అనిపించేలా ఉన్నాడు ఆయన. లోకం తనను తప్పుబడుతున్న వేళ, తన మనసుని అర్థం చేసుకున్న ఆ కొత్త వ్యక్తిని చూసి వెన్నెల మౌనంగా ఉండిపోయింది.

చుట్టుపక్కల వాళ్లంతా ఈ  పిచ్చిదానికి వత్తాసు  పలకడానికి కూడా ఒకరు వచ్చారు అని     మూతులు తిప్పుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వెన్నెల, ఆ యువకుడు మాత్రమే మిగిలారు. వెన్నెల మెల్లగా గొంతు సవరించుకుని, "థాంక్యూ.. నా కోసం మాట్లాడినందుకు" అంది. "నా పేరు కిషోర్" అని అతను తనని తాను పరిచయం చేసుకున్నాడు. "నా పేరు వెన్నెల.." అని ఆమె చెప్పబోతుంటే, "నాకు తెలుసు" అని నవ్వేశాడు కిషోర్.

వెన్నెల ఆశ్చర్యంగా చూస్తుంటే.. "అయ్యో! వేరేలా అనుకోకండి. రెండు రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ ‘ఇంకా కావాలా?’ అని అడగడం, ఆ చిన్న మొగ్గ వంక చూస్తూ ‘రేపు పూస్తావా.. ఎల్లుండి పూస్తావా?’ అని మురిపెంగా పలకరించడం చూశాను. నాకు కూడా మొక్కలంటే ఇష్టం. మీరు వాటిని పెంచే తీరు నాకు చాలా నచ్చింది. నాకు కూడా కొంచెం సహాయం చేస్తారా?" అని అడిగాడు. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ చూసి వెన్నెల మనసులో ఒక తెలియని సంతోషం కలిగింది. అప్పుడు తన తల్లి వైపు చూసింది వెన్నెల!

శారదమ్మ తన కూతురి మీద ఉన్న నమ్మకంతో కిషోర్ అభ్యర్థనకు సరే అని ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం వెన్నెలను కిషోర్ ఇంట్లో దించి వెళ్ళింది. అక్కడి గార్డెన్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది. అన్ని రకాల పూల మొక్కలను ఒకేచోట చూడడం ఆమెకు అదే మొదటిసారి. ఆ ఆనందంలో మాటలు రాక అలా చూస్తుండిపోయింది.

"ఏమిటి వెన్నెల.. అలా చూస్తున్నావు?" అని కిషోర్ అడగగా, "ఇన్ని పువ్వులను నేను ఎప్పుడూ చూడలేదు.. ముఖ్యంగా ఆ నీలం రంగు గులాబీ చాలా బాగుంది" అంది మురిపెంగా. "అవును, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దీన్ని పెంచుతున్నాను.. కానీ దీనికి ఇంకా పేరు పెట్టలేదు" అన్నాడు కిషోర్. వెంటనే వెన్నెల ఏమాత్రం ఆలోచించకుండా "మౌనరాగం" అని పేరు పెట్టింది. ఆ పేరు వినగానే కిషోర్ ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. 

వెన్నెల పిలిచిన ఆ "మౌనరాగం" అనే పేరు కిషోర్ గుండె లోతుల్లో ఒక ప్రకంపన సృష్టించింది. ఆ నీలం రంగు గులాబీ వైపు చూస్తూ కిషోర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ పువ్వు చుట్టూ ఉన్న గాలిలో ఏదో తెలియని వేదన, అంతకు మించిన ఆత్మీయత ఉన్నట్లు అతనికి అనిపించింది.
"మౌనరాగం.. ఎంత బాగుంది ఈ పేరు! వెన్నెల, ఈ పేరు పెట్టడానికి నీకేమైనా ప్రత్యేక కారణం ఉందా?" అని కిషోర్ మెల్లగా అడిగాడు.

వెన్నెల ఆ పువ్వు దగ్గరకు వెళ్లి, దాని రేకులను సున్నితంగా స్పృశిస్తూ, "నీలం రంగు అంటేనే ఒక లోతైన నిశ్శబ్దం కిషోర్ గారు. మిగిలిన రంగు పూలు తమ అందాన్ని లోకానికి చాటిచెప్పాలని చూస్తాయి. కానీ ఈ నీలం రంగు గులాబీ మాత్రం తనలోని బాధను, సంతోషాన్ని తనలోనే దాచుకుని, మౌనంగా ఒక రాగాన్ని ఆలపిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టాలనిపించింది" అంది.
కిషోర్ ఆమెకు దగ్గరగా వచ్చి, "ఇకపై నీ మౌనాన్ని

ఈ మొక్కలే కాదు వెన్నెల.. నేను కూడా అర్థం చేసుకుంటాను. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నీలోని ఈ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోకు. ఈ మౌనరాగం ఎలాగైతే ఈ తోటలో ప్రత్యేకమో, నా జీవితంలో నీ పరిచయం కూడా అంతే ప్రత్యేకం" అని ఆత్మీయంగా చెప్పాడు.

ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడింది. చుట్టూ ఉన్న వేల పూల మొక్కలు వారి సంభాషణను వింటూ ఆనందంతో తలలూపుతున్నట్లు అనిపించింది. 


అలా రోజులు గడుస్తుండగా వాళ్ళ పరిచయం స్నేహం గా మారింది ఒకరోజు కిషోర్ మెల్లగా అడిగాడు.. "వెన్నెల! ఇప్పటి వరకు నీ గురించి నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. నీ గురించి కొంచెం చెబుతావా? వింటాను" అని.