బహుమతి
" నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి.
ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి.
రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో పొదుపుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి రామారావు.
రామారావుకి సీతాదేవికి కూడా బంధువులు ఎక్కువ. ఎవరో ఒకరు బంధువులు రామారావు ఇంట్లో విస్తరి వేయని రోజు ఉండదు. అయినప్పటికీ సీతాదేవి ఇంటెడు చాకరి అంతా స్వయంగానే చేసుకునేది. ఉదయం నాలుగు గంటలకు లేస్తే మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వంటిల్లు విడిచి రావడానికి వీలు ఉండేది కాదు. రామారావు చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి కావడం వల్ల ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో బయలుదేరిన రామారావు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరేవాడు. ఈలోగా ఇంటి బాధ్యతలన్నీ సీతాదేవి చూసుకునేది.
ఆడపిల్లలైనా అందరూ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకుని తండ్రి చూసిన మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వారిని పెళ్లి చేసుకుని హాయిగా కాలక్షేపం చేస్తుంటారు విదేశాలలో. రామారావు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయి ఒక అందమైన ఇల్లు కట్టుకుని భార్యతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. పిల్లలందరూ విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న సీతాదేవి మటుకు మధ్యతరగతి మహిళగానే ఉండిపోయింది. వేష భాషల్లో ఎక్కడా మార్పు లేదు. అలాంటి తన భార్య సీతాదేవికి ఏమి బహుమానం ఇవ్వాలో ఆలోచించుకుంటూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపి ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు.
మనం నివాసముండే ఇంట్లో వంటిల్లు అత్యధిక ప్రాధాన్యత కలిగింది. ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం పెంపొందించడానికి అనారోగ్యం తేవడానికి కూడా వంటిల్లే కారణం. అలాంటి వంటింటికి మహారాణి ఇంటి ఇల్లాలు. ఒక స్త్రీ ఇల్లాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చివరి వరకు ఆ వంటింటి లోకి అడుగుపెట్టకుండా కుదరదు. ఒక స్త్రీకి ఉండే అన్ని బాధ్యతల్లోకి
వంటింటి బాధ్యత చాలా ఎక్కువ. అది కేవలం స్త్రీకే పరిమితం అయిపోయింది ఈ బాధ్యత.
ఒక ఉద్యోగికి పదవి విరమణ ఉంటుంది కానీ స్త్రీకి వంటింటి బాధ్యతల నుండి విముక్తి ఉండదు. పాపం సీతాదేవి ఇన్నేళ్ల నుంచి ఒక్కరోజు కూడా తన పనిలో సాయం అడగలేదు. అలసిపోయి వచ్చేటప్పటికి సౌకర్యవంతంగా అన్ని పనులు చేసి పెట్టి ఉంచేది. పాపం జ్వరం వచ్చినప్పుడు కూడా ఏనాడు ఒక కప్పు టీ నీళ్లు పెట్టి ఇచ్చిన పాపాన్ని పో లేదు రామారావు. తను ఇన్నాళ్లు చేసిన తప్పు ఇప్పుడు గ్రహించాడు రామారావు.
అలా మరునాడు ఉదయం ఐదు గంటలకి అలారం పెట్టుకుని రామారావు లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వంటింట్లోకి అడుగు పెట్టాడు. సీతాదేవి లేచేటప్పటికి కాఫీతో కప్పుతో ప్రత్యక్షo అయ్యాడు. ఎప్పుడూ లేటుగా లేచే భర్త అలా లేచి కాఫీ కప్పు పట్టుకొని వచ్చేటప్పటికి ఆశ్చర్యంగాను ఆనందంగానే అనిపించింది సీతాదేవికి. భార్యకి ఒక కాఫీ కప్పు ఇచ్చి సీతాదేవికి ఒక కుర్చీ చూపించి తను కూడా ఎదురుగా కూర్చుని కాఫీ తాగడం ప్రారంభించాడు రామారావు.
ఎప్పుడూ కాఫీ కప్పు ఇవ్వగానే పేపర్లో మునిగిపోయే రామారావు తన ఎదురుగుండా కూర్చుని కాఫీ తాగడం వింతగా అనిపించింది సీతాదేవికి. ఇన్నాళ్ల వైవాహిక జీవితంలో కాఫీ తాగావా! అని కూడా ఎప్పుడు అడగలేదు రామారావు. అలాంటిది ఈ రోజు ఏమిటి? అనుకుంది సీతాదేవి. ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావు అని అడిగాడు రామారావు. ఏంటి ఈ వేళ ఏమైంది అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి. జీడిపప్పు ఉప్మా నీకు ఇష్టం కదా నేను తయారు చేస్తున్నా అంటూ వంటింట్లోకి వెళ్లిపోయాడు. ఇంతలో మొబైల్ మోగింది. ఎవరా అని సీతాదేవి తీసి చూసేసరికి పిల్లల దగ్గర నుంచి ఫోను. ఫోన్ ఎత్తగానే అమ్మ హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా అరిచారు ముగ్గురు పిల్లలు. ఈలోగా రామారావు కూడా హ్యాపీ బర్త్డే సీత అంటూ అభినందించాడు. అమ్మ నాన్న నీకేం గిఫ్ట్ ఇచ్చాడు? అని పిల్లలు అడిగిన ప్రశ్నకి మీ నాన్న నాకు పెద్ద గిఫ్ట్ అంటూ మనసులో బాధగా ఉన్నా ఆ మాట చెప్పేసి తప్పించుకుంది సీతాదేవి.
అలా సీతాదేవిని వంటింట్లోకి రానివ్వకుండా రామారావు ఆరోజు అంతా స్పెషల్ వంటలు టిఫిన్లు తయారుచేసి దగ్గరుండి కొసరి కొసరి తినిపించాడు రామారావు. ఇదంతా పుట్టినరోజు స్పెషల్ అనుకుంది సీతాదేవి. మీరు ఎప్పుడూ వంటింట్లోకి రాలేదు కదా ఇన్న్నాళ్ళ నుంచి మరి ఈరోజు ఏమిటి ఇలా? ఏమిటి అనూహ్యమైన మార్పు అని సీతాదేవి అడిగిన ప్రశ్నకి రామారావు నవ్వుతూ ఇది నా బర్త్ డే గిఫ్ట్. మన పెళ్లయి ముప్పై ఐదు సంవత్సరాలైనా ఏనాడు నీకు నేను వంటింట్లో సహాయం చేయలేదు.
మహారాజులా కాలు మీద కాలేసుకునిరిటైర్అయిపోయినప్పటికీ కూడా నీ చేత వండించుకుని తింటున్నాను. నీక్కూడా నాలాగే రోజు రోజుకి శక్తి సన్నిగిల్లిపోతుంది. ఈ వయసులో విదేశాల్లో పిల్లల దగ్గర మనo ఉండలేం. నువ్వు కూడా ఇదివరకు లాగ పనులు చేయలేవు. బయట తిళ్ళు తినలేం. మనకు మనమే బరువైపోతున్నాం. ఈ కాలంలో చివరి రోజుల్లో పిల్లల దగ్గర ఉండడం అనేది ఒక కలలాగే ఉంది. అందుచేత ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే కాలక్షేపం చేసుకుంటూ ఉండాలి అనేది లేటుగా గ్రహించాను.
పిల్లలు నీ బర్తడే గిఫ్ట్ గురించి నన్ను చంపుతుంటే నేను డబ్బు పెట్టి ఖరీదైన వస్తువులు బజార్లో కొనగలను. కానీ అది ఒక రోజో ఒక పూటో ఆనందాన్నిస్తుంది. కానీ మనం బ్రతికున్నంత కాలం నీకు నీ బాధ్యతలు పంచుకుంటే అది నీకు శ్రమ తగ్గిస్తుంది. అందుచేత ఈరోజు నుండి ఒక నెల నేను మరొక నెల నువ్వు ఇంటి బాధ్యతలు పంచుకుని కాలక్షేపం చేద్దాం. ఆడవాళ్లు ఒక్కరే వంటలు చేయాలని రూలు లేదు అంటూ చెప్పిన భర్త మాటలకి సీతాదేవి ఆనందపడిపోయి ఇది నాకు అత్యంత అపురూపమైన మాట. మీ మాట నాకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇస్తుంది అంటూ చెప్పి రాజ్యంలో రాజు ఒక్కడే ఉంటాడు. సేవకులు చాలామంది ఉంటారు. నేను అలాంటి సేవకురాలని , నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు మీరు వంటింట్లోకి రావక్కర లేదని చెప్పింది సీతాదేవి.
ఆ మాటతో రామారావు *ఆడ జన్మలోనే ఉందా గొప్పదనం అనుకుని భార్య వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. ఎన్నిసార్లు బతిమాలిన సీతాదేవి వినిపించుకోక పోవడంతో ఒక మంచి వంట మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు రామారావు. ఎలాగైనా సరే భార్యని బాధ్యతల నుండి విముక్తి చేయాలనే సంకల్పం తో.
నిజమే కుటుంబ బాధ్యతలతో మానసికంగా శారీరకంగా అలసిపోయిన ఆ స్త్రీ మూర్తులకి కొంచెం విశ్రాంతి ఇవ్వాల్సిందే. ఇది అందరూ ఆలోచించవలసిందే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279