మరుగున పడ్డ కథ
" ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారైనా కనీసం నాలుగు ప్రోగ్రాములు కుదిరితే బాగుండు ను. కనీసం పండగ రోజుల్లో కూడా ఎవరు మీ ప్రోగ్రాం పెట్టించుకోవడానికి రావడం లేదు. ఇదివరకైతే ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. వినాయక చవితి ,దసరా ఉత్సవాలు, దీపావళికి, కార్తీక మాసం సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ఉత్సవాలంటూ ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. ఏదో శాపం తగిలింది. కనీసం బతిమాలుతున్న ఎవరు ఈ ప్రోగ్రాం పెట్టించుకోవడం లేదు.
ఏమిటో ఈ రోజులు? కాలం మారిపోయింది ప్రాచీనమైన కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ కళనీ నమ్ముకుని బతుకుతున్న మనలాంటి కుటుంబాలకి గడిచేది ఎలాగా? గతంలో ప్రతి ఏడాది మీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఉండేది కదా పల్లిపాలెం వినాయక చవితి ఉత్సవాల్లో ,వాళ్లు పిలవకపోతేనే మీరే ఒక్కసారి వెళ్లి అడిగి వస్తే మంచిది కదా !అవసరం మనది అనీ చెప్పింది పతంజలి శాస్త్రి భార్య సుమతి.
"చూడండి పండగ పూట కనీసం పచ్చడి మెతుకులతోనైనా పిల్లల కడుపు నింపాలి కదా!. ఇంక అంతకంటే మీకు నేను ఏం చెప్పను?. మనం ఏదో సర్ది చెప్పుకుని పడుకుంటాం, పిల్లలు ఎలాగండి ?అని చెప్తున్న భార్య మాటలకి దుఃఖం వచ్చింది పతంజలి శాస్త్రికి.
ఇప్పటికే పాలవాడు ,కిరాణా కొట్టు వాడి బాకీలు పెరిగిపోయే యి. వినాయక చవితి ఉత్సవాల్లో ఇస్తాను బాబు! అంటూ బతిమాలుతూ సరుకు తీసుకొస్తున్నాను అంటూ చెబుతున్న భార్య మాటలకు ఏం బదులు చెప్పాలో తెలియలేదు పతంజలి శాస్త్రికి.
" సరే నేను పల్లిపాలెం వెళ్ళొస్తాను అంటూ బట్టలు మార్చుకోవడానికి గది లోపలికి వెళ్ళిన శాస్త్రికి హరికథ చెప్పేటప్పుడు కట్టుకునే ఎర్రటి పట్టు పంచి చిరిగిపోయి తాడు మీద వేలాడుతూ కనబడింది. విరిగిపోయిన చిడతలు, చె ల్లాచెదురుగా ఆ గదిలో పడి ఉన్న కాళ్ల గజ్జెల మువ్వలు కనబడ్డాయి. ఒక్కసారిగా గుండెల్లో బాధ తన్నుకుంటూ వచ్చింది.
అలా సైకిల్ ఎక్కి సందు మలుపు తిరుగుతుంటే వయోలిన్ వాయించే రామశాస్త్రి ,మృదంగం వాయించే అప్పారావు తనకేసి ఆశగా చూడడం గమనించలేకపోలేదు పతంజలి శాస్త్రి. ఏం చేస్తారు పాపం వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది అనుకున్నాడు.
పాపం పతంజలి శాస్త్రి పల్లిపాలెం వెళ్లేసరికి ఎప్పటిలాగే అక్కడ అందమైన తాటాకుల పందిరి, ఆ పందిరిలో అందంగా కట్టిన వేదిక అప్పటికే తయారైపోయి ఉత్సవాల కోసం రెడీగా ఉంది.
ఒక్కసారి ఆ వేదిక చూసేసరికి గతంలో ప్రతి ఏడాది ఆ వేదిక మీద ఎన్నోసార్లు చెప్పిన హరి కథల అనుభవాలన్నీ గుర్తుకు కొచ్చేయి పతంజలి శాస్త్రికి.
సుమారు ముప్పైసంవత్సరములు పైగా ప్రతి ఏడాది వినాయ లొక చవితి ఉత్సవాలకి శాస్త్రి గారి హరికథ పెట్టించుకోవడం ఆ ఊరి వారికి అలవాటు. హరికథ అది ప్రాచీన మైన సాంప్రదాయ కళ. కథకుడు పౌరాణిక గాథలను ఇతివృత్తంగా చేసుకుని సంగీత, సాహిత్య ,నృత్య ,సహితంగా కథను చెప్పడం నిజంగా చాలా కష్టమైన పని. కొంచెం సంగీత జ్ఞానం, దానికి తగిన గొంతు, కొంచెం సాహిత్యం, మరికొంత నృత్యం తెలిసి ఉంటే చెప్పిన కథ చాలా రక్తి కడుతుంది. మధ్యలో చిన్న చిన్న పిట్ట కథలు చెప్పి హాస్యం పండించడం కూడా కథకుడు యొక్క సమర్ధత. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవాలంటే మధ్య మధ్యలో సామాజిక పరిస్థితులను కూడా కలుపుకుంటూ కథ చెబుతూ ఉండాలి.
మూడు గంటలపాటు ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టాలంటే నోటితో వాచకం చదువుతూ, పద్యం చదువుతూ, సంగీత రాగాలుఆలపిస్తూ, అవసరమైతే సినిమా పాటలు పాడుతూ, పాటకు తగిన నృత్యం చేస్తూ ,చేతిలో చిడతలను వాయిస్తూ, పక్క వాయిద్యాల వాళ్లని అనుసరిస్తూ కథను నడిపిస్తే ఆ కథ ప్రేక్షకుడి గుండెల్లో ఉండిపోతుంది.
నిజానికి ఈ హరికథ ఒక ఏకపాత్రాభినయం లాంటిది. ఒకే వ్యక్తి ఇన్ని రకాల కళలను అభినయించాలి. దానికి తోడు వేషధారణ నుదుటిన ఎర్రటి తిలకం పెట్టుకుని పట్టు పంచి కట్టుకుని ,కండువా వేసుకుని ,చేతిలో చిరతలు ,కాళ్ళకి గజ్జెలు భుజాల మీద విభూది పిండి కట్లు పెట్టుకుని,, మెడలో పూలహారం వేసుకుని సాంప్రదాయ సిద్ధంగా ఉండే ఆ హరికథ చెప్పేవారిని చూస్తే ఒక భక్తి భావం కలుగుతుంది.
ఒకసారి శ్రీకృష్ణ రాయబారం హరికథ చెబుతున్నప్పుడు రాగయుక్తంగా "చెల్లియో చెల్ల కో "అంటూ పద్యం చదివినప్పుడు ప్రేక్షకులు అనేకసార్లు "వన్స్ మోర్ అంటూ లేచి నిలబడి ఒకే పద్యాన్ని పదిసార్లు కూడా చదివించుకున్న సందర్భాలు గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లు వచ్చాయి పతంజలి శాస్త్రికి. ఆ తర్వాత వచ్చిన చదివింపులు జేబులు నింపేయి. అంతకన్నా వేదిక దిగి బయటకు వస్తున్నప్పుడు చాలామంది ప్రేక్షకులు గుమిగూడి కథ చాలా బాగుంది బాగా చెప్పారు అని అభినందిస్తున్నప్పుడు నిజంగా కమిటీ వాళ్ళు ఇచ్చిన పారితోషికం కంటే ఎంతో సంతోషంగా ఉండేది. ఆ హరికథ చెబుతున్నంతసేపు ప్రేక్షకులు కన్నార్పకుండా వింటూ ఉంటే పతంజలి శాస్త్రికి మరింత ఉత్సాహం వచ్చేది.
ఏ హరికథ నైనా పద్యాలు పాడకుండా రాగాలు తీయకుండా పిట్ట కథలు చెప్పకుండా డైరెక్ట్ గా కథ చెప్పుకుంటూ మూడు గంటల కాలం గడిపేయచ్చు కానీ పతంజలి శాస్త్రికి ఆ రకమైన పద్ధతి నచ్చేది కాదు.
ప్రేక్షకులు ఎక్కువ ఉన్న, తక్కువ ఉన్న ,చదివింపులు వచ్చినా రాకపోయినా తన పద్ధతిలోనే కథ చెప్పుకుంటూ పోయేవాడు. అందుకే పతంజలి శాస్త్రికి ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు.
ఒకసారి సీతాపహరణం కథ లో రావణాసురుడు ఆకాశమార్గంలో సీతాదేవిని ఎత్తుకుపోతున్న ఘట్టం చెబుతున్నప్పుడు ప్రేక్షకులు చాలామంది కళ్ళు తుడుచుకోవడం గమనించిన పతంజలి శాస్త్రికి ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే నవరసాలు పండిస్తేనే కదా! కథ రక్తి కట్టేది.
అలాగే శ్రీకృష్ణ లీలలు కథ చెప్తున్నప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన హరికథా కాలక్షేపం తెల్లవారుజామున ఐదు గంటల వరకు కొనసాగిన ఒక పిట్ట కూడా కదలకుండా ఎంతో ఆసక్తితో శ్రీకృష్ణ లీలలు వినడం చాలా ఆనందం వేసింది శాస్త్రికి. ఏదైనా ఒక విషయం మీద గట్టి పట్టు ఉన్నవాళ్లు దానిని మిగతా వారికి అర్థమయ్యేలా చెప్పగలరు. ఒక విషయం బాగా అర్థమవుతున్నప్పుడు దానిని వినాలని కుతూహల o బాగా కలుగుతుంది. అప్పుడే ప్రేక్షకుడి కదలకుండా కూర్చుంటాడు.
సాధారణంగా హరికథ చెబుతున్నప్పుడు వచ్చే చదివింపులు ఆ కథకుడు ఒక్కడే తీసుకుంటారు. కానీ పతంజలి శాస్త్రి తనతో పాటు వచ్చే పక్క వాయిద్యం వారికికూడా సమానంగా పంచిపెట్టేవాడు. అందుకే పతంజలి శాస్త్రి అడిగినప్పుడల్లా ఆ పక్క వాయిద్యగాళ్లు కాదనకుండా వచ్చేవారు.
హరికథ చెప్పే వారితో పాటు వయోలిన్ మృదంగం వారి పూర్తి సహకారంతోటే కథ బాగా రక్తి కడుతుంది. ఒక్కొక్కసారి కథకుడు పూర్తిగా రాగాలు తీయలేక పోతాడు. అటువంటి సమయాన్ని గుర్తుపట్టి వయోలిన్ వాయించేవారు ఆ రాగాన్ని పూర్తి చేసి ఆ సందర్భంలో లోటు లేకుండా చేస్తాడు.
ఎప్పుడూ హరికథ చెప్పడానికి పల్లిపాలెం వెళ్ళినా ఆదరించి భోజనం పెట్టి ఎంతో అభిమానంతో పలకరించి చివరలో అందరూ సంతోషపడేలాగా సత్కరించి పంపేవారు.
"ఏమిటి శాస్త్రి గారు ఎలా వచ్చారు? అంటూ పలకరించిన వినాయక చవితి కమిటీ ఉత్సవాల ప్రెసిడెంట్ సత్తిరెడ్డి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చారు పతంజలి శాస్త్రి.
శాస్త్రి గారు ఎందుకు వచ్చారో సత్తిరెడ్డికి తెలుసు అయినా ఏదో పలకరించాలి కదా. అదేనండి ఉత్సవాలు వస్తున్నాయి కదా! అంటూ నసిగాడు పతంజలి శాస్త్రి.
ఆ మాట వినగానే సత్తిరెడ్డి పెద్ద నవ్వునవ్వి ఇంకా ఈ రోజుల్లో హరికథలు ఎవరు వింటున్నారండి? అంత హరికథలు వినే ఓపిక ఎవరికీ లేదండి . కాలం మారిపోయింది. ఇదివరలో ఇటువంటి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఒకరోజు నాటకం, ఒకరోజు హరికథ ,ఒకరోజు తోలుబొమ్మలాట, రెండు రోజులు బుర్రకథలు ,మిగిలిన రోజుల్లో రికార్డింగ్ డాన్స్, సినిమాలు పెట్టేవాళ్ళo.
ఇప్పుడు కుర్ర కారు వీటిని ఇష్టపడటం లేదు. మారిన సామాజిక పరిస్థితులు దానికి తోడు అభివృద్ధి చెందిన సాంకేతికత ప్రేక్షకుడి దృష్టిని మరొక వినోదo వైపుకు మళ్లించేయి. ఇప్పుడు అంతా కొత్తదనం కోరుకుంటున్నారు. మూడు గంటల పాటు తెరమీద నడిచే బొమ్మల నృత్యాలు, పాటలు, సంభాషణలు ,హాస్యపు మాటలు, అభినయం ఇవన్నీ ప్రేక్షకుడిని మత్తులో పడేసి తనకు దగ్గరకు లాగేసుకుంటున్నాయి. మీరు చెప్పే భక్తి రస ప్రధాన కథలు ఈరోజుల్లో ఎవరికీ అక్కర్లేదు .
అలా కాదండి రెడ్డి గారు! కనీసం ఎంతోకొంత ఇచ్చి హరికథ చెప్పడానికి అవకాశం ఇవ్వండి. మీరు పెద్దమనసు తోటి ఆలోచించండి. " లేదండి శాస్త్రి గారు కరెంటు ఖర్చు తప్పితే ఏమి ఉపయోగం లేదండి. ఏమీ అనుకోవద్దు . కానీ మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ హరికథ గురించి బాగా తెలుసు ఉన్న వాడి ని కాబట్టి చెబుతున్నాను మీరు వీడియోలు తయారుచేసి యూట్యూబ్ లో పెట్టండి. అవి కనక ప్రేక్షకులకు నచ్చితే మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేక్షకులేవస్తారు అని తువ్వాలు దులుపుని లేచి వెళ్లిపోయాడు సత్తిరెడ్డి.
అలాగే పక్కనున్న గ్రామాల్లో కూడా ఇంచుమించుగా అదే అనుభవం జరిగింది శాస్త్రి గారికి.
ఒకప్పుడు వేదిక మీద ఇచ్చిన ప్రదర్శనలకి అనేక బిరుదులు ఇచ్చి సత్కారాలు చేసి సన్మానాలు పొందిన ఈ కళ ఈవేళ ఇలా అయిపోయింది అంటే ఎవరు కారణం ?ఏమో ఎవరిని నిందించకూడదు. కానీ దీని మీద ఆధారపడిన కుటుంబాల సంగతి ఏమిటి?. రేపటి నుంచి పిల్లల పరిస్థితి ఏమిటి?. ఉత్సవాలు వస్తే ఎంతోకొంత ఆదాయం వస్తుంది కుటుంబాన్ని నడిపించవచ్చు అనే ఇల్లాలి పరిస్థితి ఏమిటి ?.
ఇదివరకు మూడువందల అరవై ఐదు రోజులు ప్రోగ్రాములు లేకపోయినా కనీసం సంవత్సరంలో ఆరు నెలల పాటు పండగలకు వేదికలు ఎక్కే అవకాశం ఉండేది. కమిటీ వాళ్ళు ఇచ్చే పారితోషకం తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో కొంత ముట్ట చెప్తుండేవారు.
అలా సంతోషంగా జీవితాలు గడిచిపోయేవి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి ఈ కళని ఆదరణ లేకుండా
చేసే యి. సత్తి రెడ్డి గారి మాటలకి కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఒకవేళ ఏదో మీ మొహమాటం కొద్ది మేము ప్రోగ్రాం పెట్టిన చివరికి కమిటీ వాళ్లు కూడా ప్రోగ్రాం చూడరు అంటూ చెప్పిన సత్తి రెడ్డి గారి మాటలలో నిజం లేకపోలేదనిపించింది. అన్ని రంగాల్లోనూ మార్పు ఉన్నట్లుగానే ఈ వినోద రంగంలో కూడా మార్పు వచ్చేసింది.
ఈ ప్రాచీన కళ పెరుగుతున్న సాంకేతికతతో తయారవుతున్న కళల తోటి పోటీ పడలేకపోతోంది.
సుమారు వందల సంఖ్యలో వేదికలపై హరికథలు చెప్పిన నా పరిస్థితి ఇలా ఉందంటే మరి కొత్తగా వచ్చే వారికి ఈ రంగం ఎలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరూ రారేమో !ఇక ముందు ఈ రంగంలోకి అనుకున్నాడు పతంజలి శాస్త్రి.
పతంజలి శాస్త్రి గుండె లోతుల్లో నిండిపోయిన వేదనతో ఇంటికి చేరుకున్నాడు. ఆఖరున సత్తిరెడ్డి చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో గింగురమంటు ఉన్నాయి. పోనీ ఒకసారి ప్రయత్నిద్దాం తప్పేముందని ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు.
"ఏమైంది? ఎవరైనా ప్రోగ్రాం పెట్టించుకుంటారన్నారా?" అని అడిగింది సుమతి ఇంటికి వచ్చిన భర్తని.
"ఏమీ లేదు సుమతి… కాలం మారిపోయింది," అని అన్నాడు
"అప్పుడు మనం ఏమి చేయాలి?" అని భార్య ప్రశ్నించగా, పతంజలి శాస్త్రి చిరునవ్వు నవ్వాడు.
"కాలం మారిపోయింది. మనం కూడా మారాలి," అన్నాడు నిశ్చయంగా.సుమతి అతన్ని ఆశ్చర్యంగా చూసింది.
"హరికథకు ఈ నూతన కాలంలో కూడా ప్రాధాన్యత ఎలా పెంచాలో ఆలోచించాలి. పాత పద్ధతుల్లోనే వుంటూ ప్రేక్షకుడిని నమ్ముకుని కూర్చుంటే ఇక మన కళ చరిత్రలోనే మిగిలిపోతుంది. కొత్త మార్గాలు అన్వేషించాలి.
పాత శైలిని కొత్త రుచితో అందించాలి. భక్తి కథలతో పాటుగా, సమకాలీన విషయాలను కూడా హరికథల రూపంలో వినిపించాలి. యూట్యూబ్ అన్న మాట విన్నావా? హరికథలకు కొత్త వేదిక అది!"
" దానివల్ల మనకు లాభం ఏమిటి? మన జీవితాలు గడవవు కదా !అని అడిగింది సుమతి.
" ప్రస్తుతం ఏమి లాభం లేకపోయినా భవిష్యత్తులో దీ ని విలువ ఎక్కువ. ఈరోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ టీవీల ముందు కూర్చుని కొత్త సినిమాలు సహితం చూస్తున్నారు. అలాగే మన కార్యక్రమం కూడా.
మన కార్యక్రమం అంటే ఇష్టపడే వారిలో ఎక్కువమంది వయసు పైబడిన వాళ్లు కదా! వాళ్లే ఈ మధ్యన ఎక్కువగా యూట్యూబ్ ని చూస్తున్నారు. పురాణాలు, ప్రవచనాలు , సంగీత కార్యక్రమాలు, పాటలు, పాత సినిమాలు ఇలా ఎక్కువగా వయసు పైబడిన వాళ్లు చూస్తున్నారు. మనం పెట్టిన వీడియోలు వలన కళ నశించి పోకుండా ఉంటుంది. మామూలుగా ఎవరు ఆహ్వానించకపోతే వేదిక ఎక్కి ఈ కళని ప్రదర్శించలేము. ఈ యూట్యూబ్ లో అంతా మన ఇష్టం. అదృష్టం బావుంది ఆదరించే వాళ్ళు ఉంటే మనకు ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఈలోగా కుటుంబం గడవడానికి మన ఊరు కాన్వెంట్లో తెలుగు టీచర్ గా జాయిన్ అవుతాను అంటూ చెప్పుకొచ్చాడు పతంజలి శాస్త్రి.
సుమతి ఆశ్చర్యంగా చూసింది. పతంజలి శాస్త్రి తన జీవితంలో మొదటిసారి ఆశతో ముందడుగు వేస్తున్నాడు.
"మరి మనం ఎప్పుడు మొదలు పెడదాం?" అని ఆమె అడిగింది.
"ఇప్పుడే! ముందు ఒక కెమెరా కొనాలి!"ఈ రోజే మంచి ముహూర్తం అన్నాడు పతంజలి శాస్త్రి
ఆ రోజు సాయంత్రం ఇంటి వాకిలిలో బల్ల వేసి, ఓ చిన్న కెమెరా పెట్టి చాలా రోజుల తర్వాత వేషం వేసుకొని వయోలిన్ మృదంగం కీబోర్డు కళాకారులతోపాటు తబలా వాయించే వాడిని కూడా కలుపుకొని హరికథలను వీడియో రూపంలో తయారుచేసి యూట్యూబ్లో పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో అది కష్టం అనిపించినా పతంజలి శాస్త్రి తెలివైనవాడు కాబట్టి పక్కింటి కాలేజీ కుర్రాడి సహాయం తీసుకుని నేర్చుకున్నాడు.
పతంజలి శాస్త్రి ఆదాయం పెరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఒక కళని ప్రజలు మర్చిపోకుండా ప్రస్తుతo లభిస్తున్న సాంకేతికతను వాడుకున్నాడు పతంజలి శాస్త్రి. ఆర్థికంగా ప్రస్తుతం ఏవి లాభం లేకపోయినా భవిష్యత్ మీద ఆశతో ఆ వాయిద్య సహకారం అందించే వాళ్ళు కూడా పతంజలి శాస్త్రి తో చేతులు కలిపారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.