This is a Story is not Life in Telugu Moral Stories by Yamini books and stories PDF | ఇది కథ కాదు.. జీవితం!

The Author
Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

ఇది కథ కాదు.. జీవితం!

మన వల్ల సాధ్యం కాదు అనేది మదిలోకి రాకుంటే.. మనిషి ఎంత పనైనా చేస్తాడు. ఇద్దరు అన్నదమ్ముల్లో.. ఒకడికి పదేళ్లు, మరొకడికి ఆరేళ్లు. వాళ్లిద్దరూ ఊరి బయట పొలం దగ్గర సరదాగా అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తుండగా.. పెద్దోడు వాడికి దొరకకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతూ.. ఆ పెద్దోడు చూసుకోకుండా ఓ బావిలో పడిపోయాడు. వాడికి ఈత రాదు. పైగా బావి చాలా లోతుగా ఉంది. అరిచినా సాయం చేయడానికి చుట్టుపక్కల ఒక్కరూ లేరు. చిన్నోడికి అక్కడ తాడు కట్టిన బొక్కెన ఒకటి కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి జారవిసిరాడు. "అన్నా...దీన్ని పట్టుకో" అన్నాడు. నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును అందుకున్నాడు. చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు. "అన్నా... భయపడకు.. జాగ్రత్తగా పట్టుకో.. పడిపోకుండా చూసుకో" అంటూ నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. తాడు చివరను అప్పటికే ఒక చెట్టుకు కట్టాడు. అరగంట తర్వాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఊర్లోకి పరుగెత్తారు. ఊరువాళ్లకు జరిగింది చెప్పారు.

ఊళ్లో వారెవరూ వాళ్లు చెప్పింది నమ్మలేదు. ఆరేళ్ల వాడు, పదేళ్ల వాడిని లాగడమేమిటి? అందునా అంత లోతు బావి నుంచి అసాధ్యం.. అన్నారు. ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా దేవాలయ పూజారి వద్దకు చేరింది. "మీరు నమ్ముతారా పూజారి గారూ" అడిగాడొకడు ఆసక్తిగా..
"నమ్ముతాను" అని బదులిచ్చాడు పూజారి.
"ఎలా?" మళ్లీ మరో ప్రశ్న ఎదురైంది. అప్పుడు పూజారి ఇలా బదులిచ్చాడు.. "తనకు అంత బలం లేదని, పెద్దోడిని బావి నుంచి లాగలేననే సంగతి చిన్నోడికి తెలియదు. ఒరేయ్.. నీకంత బలం లేదురా.. నువ్వు చేయలేవురా.. నీ వల్ల సాధ్యం కాదురా.. అని వాడికి చెప్పిన వారెవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీ వల్ల కాదని చెప్పే వాళ్లుంటే, వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊర్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు". మన వల్ల సాధ్యం కాదు అనేది మదిలోకి రాకుంటే.. మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా.. ఒకటే. మనం తలచుకోవాలే గానీ అసాధ్యం అనేది ఏదీ లేదు. అందువల్ల ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ ఆత్మవిశ్వాసంపై నమ్మకముంచి మీరు ముందుకు సాగుతారు కదూ..
తృప్తి ఉంటేనే సంతోషం
పూర్వం ఒకరాజుగారు ఉండేవారు. ఆయన ప్రతీరోజూ నగరసంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదోవిధమైన బాధలతోనో, విచారంతోనో కన్పిస్తుండేవారు. కాని సంతోషంతో నున్న వారెవ్వరూ కన్పించేవారుకాదు. "వీళ్ళని సంతోషవంతులుగా చేయడమెలాగ? నారాజ్యంలో ఒక్కడూ, సంతుష్టిగా, సంతోషంగా ఉండే మనిషే లేడా?" అని ఎంతగానో బాధపడేవాడు. ఎప్పుడూ ఆయన యీ విషయాన్ని గురించే ఆలోచిస్తూండేవారు.
ఒకరోజున అలవాటుప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒక చోట ఆయనకు ఒకముసలి వాడు కన్పించాడు. అతడు పొలంలో గోతులు త్రవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతడు వాటిని ఎంతో ఓపికగాను, శ్రద్ధగాను నాటుతున్నాడు. అతన్ని చూచిన రాజుగారికి చాల సంతోషమనిపించింది. రాజుగారు అతని వద్దకువెళ్ళి "తాతా! ఏమిటి పాతుతున్నావు?" అని అడిగారు. రాజుగారి ప్రశ్నకు జవాబుగా అయ్యా! నేను మామిడి మొక్కలను పాతుతున్నాను." అన్నాడు.
"అవి చెటై ఎన్నేళ్ళకు కాస్తాయి?" రాజుగారి ప్రశ్న. "సుమారు ఐదులేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు" ముసలివాని జవాబు."తాతా, నీకు వయసుముదిరి పోయింది కదా! వీటి కాయలు తినడాన్కి నీవు మరొక ఐదేళ్ళు జీవిస్తావా!” "మహారాజా! ఇవి నాకోసంకాదు. నామనుమల కోసం నాటుతున్నాను. మా తాతలు పూర్వం యిలా చెట్లనుపాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను." అన్నాడు. రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందంకల్గింది. “కనీసం ఈ ఒక్కడైనా నారాజ్యంలో సంతుష్టిగాను, సంతోషంగాను ఉన్నాడు" అనుకొని వెళ్ళిపోయాడు. తరువాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతుల్ని పంపించాడు.
నీతి : ఉన్నదానితో తృప్తిపడేవాడే అదృష్టవంతుడు.

అరుదైన అవకాశం
వారణాసిలో ఉంటున్న కృష్ణమోహనక్కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుం దనీ అక్కడ రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారం భించాడు కృష్ణమోహన్. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది. నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశచెందాడు. ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు. చివరకి అతడికది అలవాటుగా మారింది. వెతగ్గా వెతగ్గా ఓరోజు మహిమలున్న వెచ్చనిరాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతినుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగానీ అతడా విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది.
నీతి: అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి.