Mana Shankara Varaprasad Garu Movie Review and Rating in Telugu Film Reviews by SriNiharika books and stories PDF | మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Featured Books
Categories
Share

మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Mana Shankara Vara Prasad Garu Movie Review:3.5/5.

నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, క్యాథరీన్ త్రెసా, జరీనా వహబ్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, రఘుబాబు తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
బ్యానర్: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2026-01-12
కేంద్ర హోంమంత్రి (శరద్ సక్సేనా) సెక్యూరిటీని పర్యవేక్షించే శంకర వరప్రసాద్ (చిరంజీవి) NIA ఆఫీసర్. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీఆర్ (సచిన్ ఖేడేకర్) కూతురు శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల భార్యతో శంకర వరప్రసాద్ విడాకులు తీసుకొంటాడు. తన ఇద్దరు పిల్లలకు దూరంగా ఉండలేక వారికి ప్రేమతో దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తన భార్యకు తిరిగి దగ్గర కావాలని ఆమె ఇంటిలోనే తిష్ట వేస్తాడు.
బిలియనీర్ అయిన శశిరేఖతో శంకర వరప్రసాద్ ఎలా ప్రేమలో పడ్డాడు? కోట్లకు పడగలెత్తిన మహిళా పారిశ్రామికవేత్త అయిన శశిరేఖ సాధారణ ఉద్యోగిని ఆమె ఎలా పెళ్లి చేసుకొన్నది? ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఆమె.. శంకర వరప్రసాద్‌కు ఎందుకు విడాకులు ఇచ్చింది? తన ఇద్దరు పిల్లల ప్రేమను పొందడానికి శంకర వర ప్రసాద్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? తనను అసహ్యించుకొనే భార్య, మామల ఇంట్లో శంకరవరప్రసాద్ ఎలా తిష్టవేశాడు? తన భార్యను తిరిగి పొందాలని శంకర వర ప్రసాద్ చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అయ్యాయా? శశిరేఖ, శంకరవరప్రసాద్ ఫ్యామిలీ డ్రామాలో వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మన శంకర వరప్రసాద్ గారు సినిమా కథ.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే. ఎలాంటి కొత్తదనం లేని పరమ రొటీన్, రెగ్యులర్ స్టోరీ. ఇష్టపడి పెళ్లి చేసుకొన్న దంపతులు విడిపోవడం.. మళ్లీ కలవడమనే పాయింట్ చూస్తే అనుక్షణం ఈ సినిమా రొట్ట కథనే అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకొన్న సన్నివేశాలు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ అద్బుతంగా వర్కవుట్ అయ్యాయి. ఫాదర్ సెంటిమెంట్, కామెడీ సీన్లు ఈ సినిమాకు అత్యంత బలంగదా మారాయి. చిరంజీవి లాంటి స్టార్ హీరో క్యారెక్టర్‌ను తెర మీద చూపించిన విధానమే ఈ సినిమాను సక్సెస్ బాట పట్టించేలా చేశాయి.
అనిల్ రావిపూడి విజన్‌ను ఆకళింపు చేసుకొన్న చిరంజీవి ప్రతీ సన్నివేశంలోను చెలరేగిపోయినటించాడు. దర్శకుడి ఆలోచనలను గుడ్డిగా నమ్మడమే కాకుండా వాటిని తన పాత్ర ద్వారా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌ను డెలివరీ చేయడంలో చిరంజీవి మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సెకండాప్‌లో లేడీస్‌తో ఎపిసోడ్ సాగదీసినట్టు ఉంటుంది. ఈ చిత్రంలో బలమైన విలన్ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. ఇక సినిమా కథ అయిపోయిందనే ఫీలింగ్ కలిగిన సమయంలో వెంకటేష్‌ పాత్రను కథలోకి తీసుకొచ్చి జోష్ పుట్టించారు. చిరంజీవి, వెంకటేశ్ కాంబో మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్కించేలా ఉందనే చెప్పాలి. స్క్రిప్టు పరంగా కథలో చాలా లోపాలు ఉన్పప్పటికీ పండగ ఆడియెన్స్‌కు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను అందించడంలో అనిల్ రావిపూడి తన మార్కు టాలెంట్‌ను పక్కాగా ప్రదర్శించాడు. సంక్రాంతి సీజన్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకొన్నాడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూ చూడని చిరంజీవిని శంకర వరప్రసాద్‌ పాత్రలో కామెడీ, ఫన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో చూసే అవకాశం కలిగింది. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలను అద్బుతంగా పండించడమే కాకుండా ఫాధర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకొన్నాడు. పాటలు, డ్యాన్సులతో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు నాటి చిరంజీవిని తలపించాడు. ఓవరాల్‌గా వన్ మ్యాన్ షోతో తెర మీద మ్యాజిక్ చేశాడు. నయనతార విషయానికి వస్తే.. హుందాతనంతో కూడిన సీరియస్ పాత్రలో ఒదిగిపోయారు. గ్రేస్, గ్లామర్‌తో అరిపించారు. వెంకటేష్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఆయన, చిరంజీవి ఉన్నంత సేపు స్క్రీన్ మీద సునామీ వాతావరణం కనిపించింది. సచిన్, శరద్ సక్సేనా, హర్షవర్ధన్, క్యాథరీన్ త్రెసా ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అంత్యంత బలంగా మారింది. పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్లోను, సెంటిమెంట్ సీన్లో ఆయన అందించిన మ్యూజిక్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది. ఇక సినిమాలని ప్రతీ ఫ్రేమ్ కూడా రిచ్‌గా, అందంగా కనిపించేలా చేయడంలో సమీర్ రెడ్డి తన అనుభవాన్ని రంగరించి సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చారు. తమ్మిరాజు కూడా తన ప్రతిభతో సన్నివేశాలను పరుగులు పెట్టించారు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ఆ వేగానికి కళ్లెం వేశాయనిపిస్తుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బేషుగ్గా ఉన్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. లాజిక్కులకు ఆమడదూరంలో ఉన్న కథ.. సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించే కథనంతో రూపొందిన పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఆద్యంత ప్రతీ సీన్‌లో వినోదాన్ని ఆస్వాదించడం తప్పితే బుర్ర పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేని విధంగా ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందించారు. ఈ సినిమాలో కామెడీ, భావోద్వేగాలు, యాక్షన్, పాటలు, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ తానై చేసి చిరంజీవి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. నయనతార అందం, అభినయం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. టెలివిజన్ సీరియల్ ఎపిసోడ్ ఈ సినిమాకు మైనస్. కథా వేగానికి కళ్లెం వేసింది. ఎమోషన్స్‌ను దిగజార్చింది. ఇవన్నీ పక్కన పెడితే.. హిట్ సినిమాకు కావాల్సిన అన్నిరకాల మాస్, మసాలాలు ఉన్న చిత్రం ఇది. పండుగ ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌తోపాటు మంచి అనుభూతిని, వినోదాన్ని అందిస్తుంది.




                 డోంట్ మిస్ ఇట్.💓💝❤️