నటీనటులు: ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్, జరీనా వాహెబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా
సహ నిర్మాత:
మ్యూజిక్: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పళని
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2026-01-09
రాజు (ప్రభాస్) సరదాగా లైఫ్‌ను కొనసాగిస్తూ.. ఎవరైనా ఆపదలో ఉంటే సహయపడే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. తన నానమ్మ గంగవ్వ అలియాస్ గంగాదేవీ (జరీనా వాహెబ్) అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. తనకు దూరమైన భర్త కనకరాజ్(సంజయ్ దత్) కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే తన నానమ్మ బాధను చూడలేక తాత కోసం వెతుకుతూ హైదరాబాద్‌కు వెళ్తాడు. అక్కడ తొలి చూపులోనే క్రైస్తవ సన్యాసి బెస్సీ (నిధి అగర్వాల్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడుతాడు. అయితే తాత గురించి గంగరాజు (సముద్రఖని) షాకింగ్ విషయం చెబుతాడు.
తన నానమ్మ గంగవ్వకు ఉన్న వ్యాధి ఏమిటి? తన నానమ్మకు ఉన్న వ్యాధి కారణంగా రాజు ఎలాంటి ఆందోళనకు గురి అవుతుంటాడు? తమకు దూరమైన తాత గురించి ఎందుకు వెతకడానికి వెళ్తాడు? తాత గురించి రాజుకు తెలిసిన విషయం ఏమిటి? బెస్సీతో ప్రేమ వివాహం ఎలా సాగింది? రాజుకు అనిత (రిద్ది కుమార్), భైరవి (మాళవిక మోహనన్)కు మధ్య రిలేషన్ ఎలా సాగింది? చివరకు తన నానమ్మ వద్దకు తాతను తీసుకొచ్చాడా? తాత, నానమ్మతో రాజు ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ది రాజాసాబ్ సినిమా కథ.
తాత, నానమ్మతో బంధాలు, అనుబంధాలు అనే ఎమోషనల్ పాయింట్‌తో ప్రభాస్‌ను కొత్తగా చూపించాలని మారుతి కొత్తగా అటెంప్ట్ చేశాడు. సత్య క్యారెక్టర్‌ను పరిచయం చేసి కథను ఆసక్తిగానే ప్రారంభించాడు. కానీ కథ ముందుకెళ్తిన కొద్ది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తగ్గడం, ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కొత్తగా లేకుండా రొటీన్‌గా ఉండటం వల్ల సినిమాతో బలంగా కనెక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. వీఎఫ్ఎక్స్ వర్క్, కంటికి ఇంపుగా కనిపించే సెట్ వర్క్‌తో సినిమా రిచ్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సాదాసీదాగా సాగే సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో సినిమాను గ్రాఫ్ పెంచి సెకండాఫ్‌పై అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడనిపిస్తుంది.
అయితే సెకండాఫ్‌లోనైనా సినిమా గాడిన పడుతుందని ఆశించిన వారికి మారుతి మూస కథనంతో కొత్తదనమేమీ లేకుండా లాగే ప్రయత్నం చేశాడు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు సైకాలజికల్ డ్రామా, హారర్ ఎలిమెంట్స్, నానమ్మ క్యారెక్టర్‌తో ఎమోషన్స్ పండించిన విధానంతో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా సినిమాను డిజైన్ చేసిన దర్శకుడు మారుతి.. మూవీలో బలంగా క్యారెక్టర్లను రాసుకోలేకపోవడంతో మంచి పాయింట్ తేలిపోయిందని అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ప్రభాస్. రెబల్ స్టార్ తన ప్యాన్ ఇండియా ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్, ఫన్ మూమెంట్స్‌తో రాజు పాత్రలో తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తాతగా సంజయ్ దత్, నానమ్మగా జరీనా తమ పాత్రలకు న్యాయం చేశారు. నిధి, రిధి, మాళవిక పాత్రలు రొటీన్‌గానే ఉన్నాయి. గ్లామర్ పరంగా ఒకే అనిపించినా.. పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీ కొంత వరకు వర్క్ అయింది.
కంటెంట్ పరంగా చాలా లోపాలు ఉన్న ఈ సినిమాకు సాంకేతిక అంశాలు చాలా బలంగా నిలిచాయి. ఈ సినిమా రాజీవన్ అనుసరించిన ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. వీఎఫ్ఎక్స్ వర్క్ కొన్ని చోట్ల బాగుంది. మరికొన్ని చోట్ల ఆకట్టుకోలేకపోయింది. థమన్ మ్యూజిక్ ఎప్పటిలానే చాలా లౌడ్‌గా ఉంది. కంటెంట్, సీన్‌కు సంబంధం లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉందనిపిస్తుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫి ఈ సినిమా అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అనవసరమైన కంటెంట్, సీన్లు ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన కత్తెరకు మరింత పదునుపెట్టి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ ఫీల్ ఇచ్చి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమా నిడివి తగ్గించడానికి ఇంకా ఛాన్స్ ఉంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్‌గా ఉన్నాయి. కంటెంట్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.
ది రాజాసాబ్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. బలమైన కంటెంట్ లేకుండా టెక్నికల్ అంశాలు, ప్రభాస్‌ను ఇమేజ్‌తో నెట్టుకు రావాలనే ప్రయత్నంతో చేసిన మూవీగా కనిపిస్తుంది. కామెడీ వర్కవుట్ కాలేదు. ఎమోషన్స్ పండలేదు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ రొమాన్స్ వర్కవుట్ ఏ కోశానా వర్కవుట్ అయినట్టు కనిపించదు. కథ, కథనాల్లో విపరీతమైన సాగదీత ఉంది. కొంతలో కొంత ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ వర్క్ పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చడం కష్టమే. రెగ్యులర్ ఆడియెన్స్ భారీ అంచనాలతో వెళితే తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నయం అనిపిస్తాయంటే ఎవరైనా నమ్మాల్సిందే.