మధుర క్షణం
ఉదయం కాఫీ షాప్‌లో రాహుల్ అలసిపోయి, కానీ ఒకరకమైన తృప్తితో కూర్చుని ఉన్నాడు. అతని కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు, ఆ రాత్రి అతను పడిన మానసిక సంఘర్షణకు మౌన సాక్ష్యంగా నిలిచాయి. కాఫీ కప్పు నుంచి వచ్చే ఆవిరిని చూస్తూ, అతను మాటలు లేకుండా కూర్చున్నాడు. నిద్రలేని రాత్రి ముగిసినా, ఆ రాత్రి జ్ఞాపకాలు ఇంకా అతన్ని వదలలేదు.
కాఫీ షాప్‌లో చుట్టూ వినిపిస్తున్న మాటలు, నవ్వులు, కప్పుల చప్పుళ్లు అన్నీ రాహుల్‌కి చాలా దూరంగా అనిపిస్తున్నాయి. అతని మనసు మాత్రం ఇంకా నిన్నటి రాత్రిలోనే ఇరుక్కుపోయింది. గడియారం ముల్లు, ఆ నిశ్శబ్ద గది, మూసి ఉన్న ఆ తలుపు—అవి ఒక్కొక్కటిగా అతని కళ్ల ముందు మెరుస్తూ, మళ్లీ మళ్లీ అదే క్షణాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఎదురుగా కూర్చున్న విక్రమ్, తన స్నేహితుడి ముఖంలోని అలసటను, అదే సమయంలో దాగి ఉన్న తృప్తిని గమనిస్తూ ఒక చిలిపి నవ్వు నవ్వాడు.
“ఏ రా… నిన్న రాత్రి అనుకున్న ప్రకారం అంతా జరిగిందా? చివరికి లొంగిపోయావా?” అని కన్నుగీటాడు.
రాహుల్ ఒక లోతైన నిట్టూర్పు విడిచాడు.
“లొంగిపోయాను రా… కానీ ఆ చివరి గంట మాత్రం నరకం చూపించింది,” అన్నాడు.
విక్రమ్ ఆసక్తిగా తన కుర్చీని ముందుకు జరుపుకుని, టేబుల్ మీదకు వంగాడు.
“అదే నాకు కావాల్సింది! నువ్వు అసలు మొత్తం ఏమి జరిగిందో ఏ ఒక్కటి మర్చిపోకుండా మొదటి నుంచి ప్రతి క్షణం చెప్పు. ఆ చివరి గంట ఎలా గడిచిందో వినాలి.”
రాహుల్ కళ్లు మూసుకున్నాడు. కాఫీ షాప్‌లోని శబ్దాలు నెమ్మదిగా మాయమై, నిన్నటి రాత్రి నిశ్శబ్దం మళ్లీ అతన్ని ఆవరించింది.
(Flashback – Yesterday Night)
11:00 PM
గడియారం వైపు చూశాను. ఇంకా ఒక గంట ఉంది. ఆ అరవై నిమిషాలు అరవై యుగాల్లా అనిపించాయి. నా గుండె అప్పుడే వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నా ఆలోచనలన్నీ మూసి ఉన్న ఆ తలుపుల వెనుకే తిరుగుతున్నాయి. గాలిలో ఏదో కవ్వించే వాసన తేలుతున్నట్టు అనిపించింది. అది నిజమో, ఊహో తెలియదు గానీ ఆ భావన మాత్రం నన్ను వదలడం లేదు.
11:15 PM
ఇక నా వల్ల కాలేదు. సోఫాలోంచి లేచి, నెమ్మదిగా ఆ తలుపు దగ్గరకు వెళ్లాను. దాన్ని తెరవకుండా, కేవలం దూరం నుంచే చూస్తూ నిలబడ్డాను. లోపల ఉన్నది ఏదో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపించింది.
“ఒక్కసారి… ఒక్కసారి చూడు,” అని నా మెదడులో ఒక గొంతు గుసగుసలాడుతోంది. నా నియంత్రణ క్రమంగా జారిపోతోంది. నా చేతులు తెలియకుండానే ముందుకు కదలాలని చూస్తున్నాయి.
11:30 PM
చివరి ప్రయత్నంగా నీకు ఫోన్ చేశాను. నా గొంతులోని వణుకు నీకు వినిపించి ఉండాలి.
“ఇప్పుడు ఆగిపోతే, నువ్వు నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టే. ఇన్ని రోజులు నువ్వు నీ మీద పెట్టుకున్న నియమాన్ని ఒక్క రాత్రితో పగలగొట్టకు,” అని నువ్వు అనేసరికి, ఆ మాటల్లో ఒక హెచ్చరిక దాగి ఉందని అర్థమైంది.
ఫోన్ పెట్టేశాక, బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి వచ్చి సోఫాలో కూర్చున్నాను. కళ్లు మూసుకుని, ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాను. కానీ మనసు మాత్రం వినడం లేదు.
11:45 PM
ఇదే అత్యంత కఠినమైన సమయం. కళ్లు మూసుకున్నా, నా ఊహల్లోకి రంగు, పరిమళం దూసుకొస్తున్నాయి. నా ఇంద్రియాలు చుట్టుముట్టాయి. చేతులు వాటంతట అవే వణకడం మొదలుపెట్టాయి.
“ఇంకేముందిలే… కేవలం పదిహేను నిమిషాలే కదా,” అని ఒక దురాలోచన పుట్టింది.
వెంటనే నీ మాటలు గుర్తొచ్చాయి—
“రేపు అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకోగలవా?”
11:55 PM
చివరి ఐదు నిమిషాలు. కూర్చోవడం అసాధ్యమనిపించింది. లేచి గదిలో అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాను. గడియారం టిక్ టిక్ శబ్దం నరాల మీద పడుతోంది. ప్రతి సెకను ఒక గంటలా అనిపిస్తోంది. బయట శబ్దాలు కూడా వినిపించనంతగా నేను నా ఆలోచనల్లో మునిగిపోయాను.
11:59 PM
గడియారం ముందు నిలబడ్డాను.
60… 59… 58…
నా శ్వాస వేగంగా మారింది. శరీరం వేడెక్కింది. నేను ఎదురుచూస్తున్న క్షణం దగ్గరవుతోంది.
12:00 AM
గడియారం పెద్దగా మోగింది.
ఆ శబ్దం నాకు స్వేచ్ఛా ప్రకటనలా వినిపించింది.
ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆ తలుపు వైపు దూసుకెళ్లి బలంగా తెరిచాను. లోపల జాగ్రత్తగా దాచిపెట్టిన నా నిరీక్షణ ఫలం ఉంది. దానిపై ఉన్న అడ్డును తొలగించగానే, వెచ్చని ఘాటైన వాసన నా ముఖాన్ని తాకింది.
మొదటి రుచి నోటికి చేరబోయే ఆ మధుర క్షణం…
ఆ క్షణం కోసం ఇన్ని రోజులు పడిన బాధ అంతా మర్చిపోయాను.
(Present Day)
రాహుల్ చెప్పడం ఆపి కళ్లు తెరిచాడు. అతని ముఖంలో ఇంకా ఆ రాత్రి మిగిల్చిన మైకం స్పష్టంగా కనిపిస్తోంది.
విక్రమ్ ఆశ్చర్యంగా చూసి నవ్వాడు. “అమ్మ బాబోయ్… ఇంత జరిగిందా?
రాహుల్ ఒక రహస్యమైన నవ్వు నవ్వి, కాఫీ కప్పు నోటికి తీసుకెళ్లాడు.
“ఆ రాత్రిని అంత తేలిగ్గా మర్చిపోలేను,” అన్నాడు.
విక్రమ్ కాసేపు మౌనంగా అతన్ని గమనించి, చిన్నగా నవ్వుతూ అడిగాడు,
“అంతా బానే ఉంది కానీ… నా కోసం ఏమైనా మిగిల్చావా?”
రాహుల్ ఏమీ చెప్పలేదు. కేవలం చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులోనే… అన్ని సమాధానాలు దాగి ఉన్నాయి.