జాస్మి
- బివిడి ప్రసాదరావు
 
EPISODE 5
 
 అంతలోనే ఆ చుట్టు పక్కల వాళ్లు శకుంతల ఇంటి లోని రొదకు అక్కడ పోగయ్యారు.
 అంతా విషయం తెలుసుకున్నారు.
***
7
 
డోర్ బెల్ కాల్ తో వెళ్లి, తలుపు తీసింది జాస్మి.
 "జాస్మీగారా." అన్నాడు ఆ వచ్చిన వాళ్లలో ఒకతను.
 "అవును. నేనే జాస్మీని." అంది జాస్మి వచ్చిన ఆ ఇద్దరినీ ఎగాదిగా చూస్తూ.
 "నమస్కారం మేడమ్." ఆ ఇద్దరూ చేతులు జోడించి అన్నారు కోరస్ లా.
 "నమస్కారం. మీరు నాకు ఎవరో తెలియదు." చెప్పింది జాస్మి.
 ఆ వచ్చిన వాళ్లు తమను తాము పరిచయం చేసుకున్నారు.
 ఆ పిమ్మట వాళ్లిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించింది జాస్మి.
 ఆ ముగ్గురూ హాలులో సోఫాల్లో కూర్చున్నారు.
 "ఈ మధ్య తోరణం వేదికన మీ డాన్స్ పెర్ఫార్మన్స్ చూశాం. మాకు మీ ప్రజెంటేషన్ విధం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. దాంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాం." చెప్పాడు కిరణ్.
 ఆ వెంబడే, "మీ హావభావాలు భేష్ గా ఉంటున్నాయి." చెప్పాడు వశిష్ఠ.
 "థాంక్యూ." అంది జాస్మి. చిన్నగా నవ్వింది.
 "మా ఇద్దరి డైరక్షన్ తో ఒక కొత్త సీరియల్ టివి కై తీయబోతున్నాం. అందులో మీరు మైన్ రోల్ కైతే బాగుంటుంది. సంప్రదించడానికై వచ్చాం." చెప్పాడు కిరణ్.
 "మిమ్మల్ని చూడడం కొత్త ఐనా, ప్రసారమైన మీ కొన్ని సీరియల్స్ ను చూశాను." చెప్పింది జాస్మి.
 "మేడమ్. మా సీరియల్స్ కు మంచి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. మాకు ఆఫర్స్ బాగానే ఉన్నాయి." చెప్పాడు వశిష్ఠ.
 "కావచ్చు. కానీ మీ సీరియల్స్ లోని పాత్రలపై నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పాడ్డాయి. అవి నాకు అసంతృప్తి పర్చాయి." చెప్పింది జాస్మి.
 "ఏ పాత్రలు మేడమ్." అన్నాడు వశిష్ఠ.
 ఆ వెంబడే, "ఏ సీరియల్స్ లో మేడమ్." అడిగాడు కిరణ్.
 "ఒకటేమిటి. నేను చూసిన మీ సీరియల్స్ లో చాలా పాత్రలు సహజం గా ఉండవు." చెప్పింది జాస్మి.
 ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.
 "మీ సీరియల్స్ లోని చాలా పాత్రలు రోత పుట్టిస్తుంటాయి. చివరికి అమ్మ పాత్రల్లో కూడా సున్నితత్వాన్ని మృగ్యం చేస్తున్నారు." చెప్పింది జాస్మి.
 "నేటి ట్రెడింగ్ బట్టే మేము పాత్రలను మలుస్తుంటాం మేడమ్." చెప్పాడు కిరణ్.
 "ఛ. నేడు అంత విలనిజిమ్ ఏ కుటుంబాల్లో అగుపిస్తుందండీ. అంతేసి గయ్యాళతనాల్ని భరిస్తూ పోతున్నవారు ఎక్కడ మీకు నేడు అగుపిస్తున్నారండీ." అడిగింది జాస్మి.
 "మేడమ్. జరిగే దానిని, జరుగుతున్న దానిని చూపిస్తే ఏం రక్తి కడుతుంది. నాటకీయతే కదా రంజింప చేయగలుగుతుంది." అన్నాడు వశిష్ఠ.
 "అలాని అసహజాన్ని చూపుతూ అసామ్యామైన చిత్రీకరణ అంటే భావ్యమా. చూసి నేర్చుకోక పోయినా చూపి పాడు చేయడం దొడ్డది కాదు కదండీ." అంది జాస్మి.
 ఆ ఇద్దరూ మాట్లాడలేదు.
 "నన్నే చూడండి. నృత్యంకి ఒక తీరు, రీతి ఉంటాయి. వాటిని కాదని నేను డాన్స్ చేసి ఇది ఒక ప్రక్రియ అంటే హర్షింప బడుతుందా. మన్నగలుగుతుందా. అట్టిది చూసిన వారు ఏ కొందరో దానిని వెరైటీగా ఉంది అన్నా, ఆ మిగతావారు 'ఏమిటీ పిచ్చి గెంతులు' అని గేలి చేయక పోతారా. అట్టిది అవసరమా. మెప్పించ లేకపోయినా నొప్పించందే మేలు." చెప్పింది జాస్మి.
 ఆ ఇద్దరూ అప్పటికీ మాట్లాడలేదు.
 "వినండి. విలనిజం చూపే పాత్ర, గయ్యాళితనం ప్రదర్శించే పాత్ర, ఎదుట పాత్రను ఇబ్బంది పాలు చేసి, అందులో విఫలమై, తిరిగి మళ్లీ మళ్లీ అట్టి విఫల ఇబ్బందులనే చేపట్టే పాత్ర నాకు ససేమిరా వద్దు. అసహజం అనిపించని పాత్రనైతే నేను ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది. సో. అట్టిదైతేనే మీరు వచ్చిన పనిని కానీయండి. లేదా దయచేసి నన్ను వదిలేయండి." చెప్పేసింది జాస్మి.
 ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. 
 లేచారు.
 "ఇది అట్టిది కాదు మేడమ్. అట్టిది కుదిరేక తప్పక మిమ్మల్నే కలుస్తాం." చెప్పారు కోరస్ లా.
 పిమ్మట వాళ్లు వెళ్లి పోయారు.
 జాస్మి వెళ్లి తలుపు మూసేసింది.
***
G
 
సూర్యంని తలో మాటతో నిలవరించారు.
 సూర్యం బెంబేలులో పడిపోయాడు.
 చివరాఖరుగా శకుంతలే 'అట్టివి తనకు వద్ద'ని ఖరాఖండీగా చెప్పేసింది. సూర్యంని ఇంట్లోంచి గెంటేసింది. దానికి చుట్టు పక్కల వాళ్లు వత్తాసు పలికారు. మళ్లీ వస్తే సూర్యంపై కేస్ పెట్టి అతడి ఆట కట్టిస్తామని నికరంగా తేల్చేశారు.
 సూర్యం జారుకున్నాడు.
 అప్పుడే అక్కడి వాళ్లు శకుంతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేపట్టారు.
 'ఇప్పటికైనా తన తండ్రి స్వభావంని దుర్గకు తెలియ పర్చేయ్.'
 'దాస్తూ పోతే ఏం ప్రయోజనం.'
 'దుర్గ ఇంకా చిన్న పిల్ల. తను పెద్దయ్యేక చెప్పితే అర్ధం చేసుకోగలదు అని చెప్పుతున్నావు కానీ, తన తండ్రి విషయం తనకు నీ ద్వారా కాక వేరేలా తెలిస్తే దుర్గ రియాక్షన్ వేరేలా ఉంటుంది.' 
 'దుర్గకు ఇప్పటికైనా నువ్వే తెలియచేస్తే తను దాగుడు మూతల ముసుగు నుండి బయట పడి నెమ్మదిగా తమాయించుకోగలదు. నిలదొక్కుకోగలదు.'
 'మా మాటలు విను. దుర్గకు జరిగిందంతా నువ్వే చెప్పేయ్.'
 ఇలా అక్కడ చేరిన వారు శకుంతలతో గట్టిగానే చెప్పారు.
 శకుంతల కూడా చివరికి అందుకు సిద్ధమయ్యింది.
 దుర్గకు సూర్యం సంగతి తనే సరళంగా తెలియ పర్చేసింది ఒక రోజున.
 తొలుత దుర్గ హడలిపోయింది. పిదప శకుంతల నిబ్బరాన్ని గ్రహించి తనూ స్థిర మైంది. సర్దుకుంది. తల్లికి సపోర్ట్ ఐంది.
 దుర్గ పట్టుగా చదివింది. డిగ్రీ పొందింది. 
 దుర్గ ఉద్యోగంకై ప్రాకులాడింది. ఫలితం దక్కడం లేదు. 
 ఇప్పటి వరకు తనకై ఇంకా శ్రమిస్తూ వస్తూన్న తల్లిని కూర్చోపెట్టి విశ్రాంతి పర్చాలని తలుస్తున్న దుర్గ పంతంగా తన ప్రయత్నాల్ని కొనసాగిస్తుంది.
***
8
 
"నేను ప్రెస్ రిపోర్టర్ ను." చెప్పింది జాస్మి.
 "ఇక్కడ నీకు న్యూస్ ఏముంటుంది." ప్రశ్నించాడు రేవంత్.
 "న్యూస్ మాట అటు పెడితే, ఇక్కడ బోలెడు న్యూసెన్స్ కానవస్తుంది." చెప్పింది జాస్మి.
 "ఏమంటున్నావ్. ఫోఫో." అరిచాడు రేవంత్.
 "కూల్ కూల్. తొలుత ఎదుట వారిని గుర్తించడం, గౌరవించడం నేర్చుకోవాలి. అది విద్యార్థి ప్రధమ పద్ధతి. మరీ ముఖ్యంగా అది పోటీలో ఉన్న అభ్యర్థికి అవసరం." చెప్పింది జాస్మి.
 రేవంత్ అసహనంగా కదులుతున్నాడు. 
 రేవంత్ ఆ కాలేజీ వార్షిక ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు.
 "మీ ప్రత్యర్థి కమలాకర్ ను ఇక్కడికి పిలిపిస్తున్నాను. మీ ఇద్దరినీ ఇంటర్వ్యూ చేయబోతున్నాను." చెప్పింది జాస్మి.
 "ఇదేం వింత." అన్నాడు రేవంత్.
 "వింత కాదు. అవసరం. రిపోర్టర్ గా నా కర్తవ్యం." చెప్పింది జాస్మి.
 విస్మయమయ్యాడు రేవంత్.
 అప్పుడే జాస్మి మనిషి ఒకరు కమలాకర్ ను అక్కడికి తీసుకు వచ్చాడు.
 అక్కడ మూగిన మూకను చూస్తూ, "దయచేసి మీరంతా కాస్తా జరిగి స్పేస్ కల్పించండి. మీ సమక్షంలోనే, మీ కోసమే, నేను ఈ ఇద్దరినీ ప్రశ్నించాలి." చెప్పింది జాస్మి.
 తర్వాత ఆ ఇద్దరినీ తన ఎదుట నిలబెట్టించుకుంది జాస్మి.
 "వాట్ ఈజ్ దిస్. మమ్మల్ని ప్రశ్నించే అవసరమేమిటి." అడిగాడు కమలాకర్.
***
(కొనసాగుతుంది..)
***