"ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయలేను!"
చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా పరిగెడుతోంది. ఆమె నుదిటిపై చెమట ధారగా కారుతోంది, గుండె వేగంగా, బిగ్గరగా కొట్టుకుంటోంది.
ఆమె వెనుకే, సరిగ్గా రెండు అడుగుల దూరంలో ఒక భారీ నల్లటి పాము. నోరు తెరిచి, కోరలతో ఆమెను కాటేయడానికి సిద్ధంగా ఉంది. దాని బుస్సుమనే శబ్దం ఆ నిశ్శబ్ద అడవిలో మరింత భయాన్ని పుట్టిస్తోంది. బయటకు వెళ్ళే దారి ఎక్కడా కనిపించడం లేదు.
పరుగెడుతూ పరుగెడుతూ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు పురాతనమైన, నాచు పట్టిన రాతి మెట్లు కనిపించాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు కానీ, అవే తనకు చివరి ఆశ అనిపించింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ మెట్లు ఎక్కబోయింది. కానీ తొందరలో ఆమె కాలు జారింది.
బలంగా కింద పడిపోయింది. మోకాలికి, అరచేతికి పెద్ద గాయమై రక్తం కారడం మొదలైంది. నొప్పితో లేవలేకపోయింది.
"అయిపోయింది.. ఇంతటితో నా కథ ముగిసిపోయింది" అనుకుని భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. పాము ఆమె మొహం దగ్గరకు వచ్చేసింది.
సరిగ్గా ఆ క్షణంలో ఆకాశం చీల్చుకుంటూ ఒక పెద్ద శబ్దం. ఒక బ్రహ్మాండమైన గద్ద, గరుత్మంతుడిలా రెక్కలు చాపుకుని రయ్ మంటూ కిందకు దూసుకొచ్చింది. దాని రెక్కల గాలి తాకిడికి చుట్టూ ఉన్న పొదలు అల్లాడాయి. అది తన వాడియైన గోళ్ళతో ఆ పామును ఒడిసి పట్టుకుని, ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ పాము, ఆ గద్ద రెండూ చీకట్లో కలిసిపోయాయి.
ధరణి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఇంకా వణుకుతూనే ఉంది, కానీ ప్రమాదం తప్పిందని అర్థమై కొంచెం ఊపిరి పీల్చుకుంది. "హమ్మయ్య.. తప్పించుకున్నా" అనుకుంది.
లేవబోతుంటే ఆమెకు పైన మెట్ల చివరన ఒక చిన్న పాడుబడిన గుడి కనిపించింది. దాని గోపురం సగం కూలిపోయి ఉంది. తీగలు అల్లుకుని ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ ఆ గుడి ఆమెను పిలుస్తున్నట్టు అనిపించింది.
నొప్పిని భరిస్తూనే మెట్లు ఎక్కి గుడి దగ్గరకు వెళ్ళింది. గుడి తలుపులకు ఒక పెద్ద, తుప్పు పట్టిన తాళం వేసి ఉంది. లోపల ఏముందో చూడాలనే కుతూహలం ఆమెలో పెరిగింది. చుట్టూ వెతికి ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి, శక్తినంతా కూడగట్టుకుని తాళంపై బలంగా కొట్టింది. రెండు మూడు దెబ్బలకు ఆ తాళం విరిగి కింద పడిపోయింది.
తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే లోపలంతా దుమ్ము, ధూళి. గబ్బిలాల వాసన. గర్భగుడిలో నల్లరాతితో చేసిన ఎంతో ఎత్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ పూజ చేయనట్టు, దీపం వెలగనట్టు ఉంది. అయినా ఆ విగ్రహం మొహంలో ఒక తేజస్సు.
ధరణి ఆ విగ్రహానికి దగ్గరగా వెళ్ళగానే ఒక్కసారిగా అద్భుతం జరిగింది. ఆ విగ్రహం నుండి కళ్ళు చెదిరే బంగారు రంగు కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి ఆ చీకటి గుడి అంతా నిండిపోయింది. ఆ వెలుగులో ధరణి కళ్ళు తానంతట తానే మూసుకుపోయాయి.
"ఏయ్ ధరణీ లే.. ఇంకా ఎంతసేపు నిద్రపోతావ్? మధ్యాహ్నం అయింది!"
సంధ్య అరుపుతో ధరణి ఉలిక్కిపడి లేచింది. తన గదిలో, తన మంచం మీద ఉంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి ఉంది. గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటోంది.
"ఆ.. లేస్తున్నా అమ్మా.." అని పైకి చెప్పినా, మనసులో మాత్రం అదే కల తిరుగుతోంది. "ఏంటి ఇదంతా? ఇదంతా కలా? కల అంటే ఇంత నిజంగా ఎలా అనిపించింది? ఆ అడవి, ఆ మెట్లు, ఆ గుడి.. అవన్నీ నిజంగా ఎక్కడైనా ఉన్నాయా? ఆ స్వామి విగ్రహం నుండి వచ్చిన కాంతి ఏంటి?"
"ఇంకా కలలు కంటూ కూర్చున్నావా? వెళ్లి తొందరగా స్నానం చేసి రా, బ్రేక్ ఫాస్ట్ చల్లారిపోతోంది" అని సంధ్య మళ్ళీ పిలిచింది.
హాల్లో టిఫిన్ చేస్తూ రాఘవ(ధరణి నాన్న) మొదలుపెట్టాడు.
"సంధ్యా, ధరణికి ఇక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అనుకుంటున్నా. ఇక టైం వచ్చింది."
సంధ్య, "సరే అండి, అదే మంచిది. ముందు అత్తయ్యకి ఒక మాట చెప్పండి, ఆవిడ కూడా సంతోషిస్తుంది" అంది.
అప్పుడే వంటగదిలో నుండి వచ్చిన జయంతి(సంధ్య నానమ్మ) ఆ మాట విని, "రేయ్ రాఘవా, ఈసారి పండగకైనా లక్ష్మిని పిలువురా. చాలా రోజులైంది బిడ్డను చూసి. నా మనసు కొట్టుకుంటోంది" అంది దీనంగా.
రాఘవ మొహం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. "నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అడుగుతావ్? ఆ పేరు ఈ ఇంట్లో మళ్ళీ ఎత్తకు" అన్నాడు గట్టిగా.
జయంతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అది కాదురా, అది నా కూతురురా, ఒకసారి చూడాలని.." అని మాట పూర్తి చేయకముందే, "నాకు ఆఫీస్ కి టైమ్ అవుతోంది" అంటూ ప్లేట్ విసిరేసి వెళ్ళిపోయాడు రాఘవ.
ధరణి వెంటనే నానమ్మ దగ్గరకు వెళ్లి, "ఏంటి నానమ్మ, మళ్ళీ అదే మాటన్నాడా నాన్న? నువ్వు బాధపడకు. ఎందుకు అత్తయ్యని ఇంటికి రానివ్వట్లేదో నాకు తెలియదు కానీ, ఏదో ఒక రోజు అత్తయ్య తప్పకుండా వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు" అని ఓదార్చింది.
అదే సమయంలో, నగరంలో మరో చోట..
ఒక పోలీస్ ఆఫీస్ లో..
శ్రీనివాస్: "అర్జున్, నీకు వేరే ఆప్షన్ లేదు. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్. డిపార్ట్మెంట్ లో చాలా మంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. నువ్వు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలవని మాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళక తప్పదు."
అర్జున్ కొంచెం ఆలోచించి, "ఓకే సర్, నేను వెళ్తాను" అన్నాడు.
శ్రీనివాస్: "గుడ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కీప్ ఇట్ యాజ్ ఏ సీక్రెట్. నువ్వు వెళ్తున్న పని డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియకూడదు. ఇది చాలా సెన్సిటివ్ మేటర్. కావాలంటే మీ అమ్మా నాన్నలకు మాత్రం చెప్పు."
అర్జున్ మొహంలో ఆలోచనలు, ఉత్కంఠ.
అసలు ధరణికి వచ్చిన ఆ భయంకరమైన కలకి అర్థం ఏంటి? ఆ గుడి ఎక్కడ ఉంది? అర్జున్ కి అప్పగించిన ఆ రహస్యమైన పనికి, ధరణి కలకి ఏమైనా లింక్ ఉందా? అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాడు?
To be Continued...