Blue-eyed hunt in Telugu Thriller by Twist Master Sandeep books and stories PDF | నీలి నేత్రాల వేట

Featured Books
Categories
Share

నీలి నేత్రాల వేట

హైదరాబాద్‌లోని ఆ అర చీకటి సైబర్-ల్యాబ్‌లో రాత్రి మూడు గంటలైనా డిటెక్టివ్ సమర్ తన నేత్రాలను మూయలేదు. టేబుల్ మీదున్న కాఫీ కప్పులు ఖాళీ అయ్యాయి, గది మూలలో ఉన్న ఏసీ మెషిన్ నిరంతరంగా చిన్న శబ్దం చేస్తోంది. అతనికి ఎర్రబడిన కళ్ళ ముందు డజన్ల కొద్దీ ఫైళ్లు, బాధితుల భయంకరమైన ఫోటోలు చెల్లాచెదురుగా ఉన్నాయి. గత మూడు నెలలుగా ఇరు తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖను వణికించిన ఆ సిరీస్ కిల్లర్ రహస్యాలను ఛేదించడం అతనికి కేవలం ఒక కేస్ మాత్రమే కాదు, అదొక ప్రతిష్టాత్మకమైన ప్రశ్న.

నాలుగు హత్యలు, నాలుగు విభిన్న ప్రాంతాలు. కానీ అన్ని హత్యల్లోనూ ఒకే పోలిక ఉంది. బాధితుల గుండె భాగంలో పదునైన సర్జికల్ బ్లేడ్‌తో అత్యంత ఖచ్చితంగా ఒక నీలి కంటి ఆకృతిని చెక్కారు. మీడియా ప్రతి హెడ్‌లైన్‌లోనూ దీనిని "నీలి కంటి వేట అని వర్ణించింది. ప్రజల్లో భయాందోళనలు తీవ్రంగా నెలకొన్నాయి. సమర్ తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో రోజురోజుకూ నలిగిపోతున్నాడు. గత మూడు నెలలుగా అతనికి రాత్రిపూట సరైన నిద్ర లేదు. ప్రతిరోజూ ఉదయం అతను తన అపార్ట్‌మెంట్ బెడ్‌పై కళ్ళు తెరిచినప్పుడు అతని శరీరం తీవ్రంగా నొప్పులు పుట్టేది. విచిత్రమేమిటంటే, పగటిపూట ఆరిపోయిన అతని బూట్లపై ఉదయం లేచేసరికి తడి మట్టి మరకలు ఉండేవి, గోళ్ల సందుల్లో నల్లటి జిడ్డు ఉండేది. "కేస్ ఒత్తిడి వల్ల నా సుప్తచేతనావస్థ తీవ్రంగా అలసిపోయింది. బహుశా నేను నిద్రలో నడిచే వ్యాధితో బాధపడుతున్నానేమో అని అనుకుంటూ అతను రోజువారీ డాక్టర్ ఇచ్చిన హై-డోస్ నిద్ర మాత్రలు మింగి పడుకునేవాడు. కానీ ఆ మాత్రలు కూడా అతని మెదడును శాంతపరచలేకపోయాయి.
అతని ఫోన్ అకస్మాత్తుగా వైబ్రేట్ అయింది. అతని నమ్మకమైన అసిస్టెంట్ కిరణ్ లైన్లోకి వచ్చాడు. సార్, ఐదో హత్య జరిగింది. ఎం.జి. రోడ్డు పాత అండర్‌పాస్ చీకటి మూలలో శవం దొరికింది అని కిరణ్ చెప్పగానే, సమర్ వెంటనే తన కోటు ధరించి, తుపాకీని నడుముకి తగిలించుకుని ల్యాబ్ నుండి బయటకు పరుగెత్తాడు. క్రైమ్ సీన్‌కి వెళ్లేసరికి అక్కడ ఎప్పటిలాగే భయంకరమైన వాతావరణం ఉంది. ఎల్లో టేపుల మధ్య ఫోరెన్సిక్ టీమ్ పనిచేస్తోంది. శవం గుండెపై అదే రక్తసిక్తమైన నీలి కంటి గుర్తు ఉంది. కానీ ఈసారి కిల్లర్ తొందరపాటులో ఒక చిన్న తప్పు చేశాడు. శవం పక్కనే ఉన్న పాత కాంక్రీట్ గోడపై రక్తంతో కూడిన బొటనవేలి ముద్ర స్పష్టంగా పడింది.
సమర్ ఆ ప్రాంతాన్ని సూక్ష్వంగా గమనించాడు. అతని కళ్ళలో వేటాడే గద్ద లాంటి తీక్ష్ణత ఉంది. కిరణ్, ఈ బొటనవేలి ముద్రను వెంటనే అత్యంత రహస్యంగా ఫోరెన్సిక్ ల్యాబ్ సైబర్ డివిజన్‌కు పంపించు. ఈసారి కిల్లర్ తప్పించుకోలేడు. అతని జాతకం మనకు దొరుకుతుంది" అన్నాడు. అంతటా చీకటి ముసిరిన ఆ రాత్రి వర్షం, ఈదురుగాలులతో ఘోరంగా కురుస్తోంది. సమర్ తన అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తు గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. కిరణ్ నుండి ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అతని తలలో నొప్పి మితీమీరింది. ఎవరో మెదడును సుత్తితో కొడుతున్నట్లు అనిపించింది. భరించలేక అతను బాత్రూమ్ అద్దం ముందుకు వచ్చి నిలబడి తన ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకున్నాడు. అంతలోనే అతని మొబైల్ స్క్రీన్ వెలిగింది. కిరణ్ ఫోన్ చేశాడు. సమర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. కానీ అవతలి వైపు నుండి కిరణ్ వెంటనే మాట్లాడలేదు. కేవలం అతని శ్వాస వణుకు మాత్రమే వినిపిస్తోంది. ఏమైంది కిరణ్? రిపోర్ట్ వచ్చిందా? సమర్ గంభీరమైన స్వరంతో అడిగాడు.
సార్ ఆ, ఆ బొటనవేలి ముద్ర డిఎన్‌ఏ, బయోమెట్రిక్ మ్యాచ్ అయ్యాయి సార్ కిరణ్ వాయిస్ పూర్తిగా వణికిపోయింది. ఎవరిది? పాత రౌడీ షీటర్ లిస్ట్ లో ఉన్నవాడిదా? పేరు చెప్పు కిరణ్ సమర్ గట్టిగా అరిచాడు.
సార్ ఆ బొటనవేలి ముద్ర మన పోలీస్ హెడ్‌క్వార్టర్స్ డేటాబేస్‌లో ఉన్న మీ బొటనవేలి ముద్రతో నూటికి నూరు శాతం మ్యాచ్ అవుతోంది సార్, ఆ నీలి కంటి కిల్లర్ మరెవరో కాదు,అది మీరే సార్ కిరణ్ మాట ముగించేలోపే సమర్ చేతిలోంచి ఫోన్ జారి కిందపడి స్క్రీన్ ముక్కలైంది.
సమర్ ప్రపంచం ఒక క్షణం గిర్రున తిరిగి స్తంభించిపోయింది. ఇది ఎలా సాధ్యం? నేను నగరంలోనే అత్యంత ప్రాప సర్టిఫైడ్ ఇన్వెస్టిగేటర్ ని. నేనే ఎలా కిల్లర్ ని అవుతాను? ఇది కిరణ్ చేస్తున్న కుట్రనా? అతని మెదడులోని తార్కిక ఆలోచనలన్నీ గందరగోళంలో పడ్డాయి. అతను వెంటనే తన బెడ్‌రూమ్ వైపు పరిగెత్తాడు. వణుకుతున్న చేతులతో తన బట్టల అల్మారాని పూర్తిగా వెతికాడు. దాని అత్యంత దిగువన ఉన్న రహస్య అరను లాగినప్పుడు అతని గుండె ఆగిపోయినంత పనైంది, శరీరం గడ్డకట్టుకుపోయింది.
అక్కడ ఒక చిన్న నల్లటి పెట్టె ఉంది. దాన్ని తెరిచినప్పుడు దాని లోపల హత్యకు గురైన ఐదుగురి వ్యక్తిగత వస్తువులు, ఒక పదునైన సర్జికల్ బ్లేడ్, ఒక చిన్న గాజు డబ్బా ఉన్నాయి. ఆ డబ్బాను వెలుతురులోకి తెచ్చి చూసినప్పుడు సమర్ శ్వాస ఆగిపోయింది. దాని లోపల నీటిలో తేలుతున్నాయి, కరుడుగట్టిన నీలి రంగు కాంటాక్ట్ లెన్స్‌లు. సమర్ గాభరాగా తిరిగి బాత్రూమ్ లోని పెద్ద అద్దం ముందుకు వచ్చి నిలబడ్డాడు. గదిలోని మసక ఎరుపు వెలుతురులో అద్దంలోని అతని ప్రతిబింబం నిదానంగా మారడం ప్రారంభించింది.
అద్దంలో ఉన్న సమర్ తన జేబులోంచి ఆ నీలి లెన్స్ తీసి తన కళ్ళల్లో పెట్టుకున్నట్లు అనిపించింది. ఇప్పుడు అద్దంలో నిలబడిన వాని కళ్ళు సాధారణ కళ్ళు కావు. అవి ఒక క్రూరమైన, రక్తపిపాసి వేటగాడి కరుడుగట్టిన నీలి కళ్ళు, అతని పెదవులపై ఒక వికృతమైన నవ్వు ఉంది.
అవును సమర్, అద్దంలోని ఆ కరాళ రూపం నిదానంగా మాట్లాడటం ప్రారంభించింది. "నువ్వు పగటిపూట చట్టాన్ని రక్షించే బుద్ధిమంతుడైన సమర్ వి. కానీ రాత్రి కాగానే, నువ్వు ఆ నిద్ర మాత్ర మింగి పడుకున్నప్పుడు నీ సుప్తచేతనలో దాగి ఉన్న క్రూరత్వం మేల్కొంటుంది. నేనే ఆ నీలి కంటి వేటగాడిని, నువ్వు ఇంతకాలం నగరం మొత్తం వెతుకుతున్న ఆ సిరీస్ కిల్లర్ మరెక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు సృష్టించిన ఈ వేట ఆటలో, నిన్ను నువ్వే వెంటాడుకున్నావు.
సమర్ తన జేబులోంచి తుపాకీని తీసి నేరుగా అద్దం మధ్య భాగానికి కాల్చాడు. 'ధఢాం' మంటూ అద్దం ముక్కలై నేలపై పడింది. కానీ విచిత్రమేమిటంటే, పగిలిపడిన ఆ ప్రతి చిన్న గాజు ముక్కలోనూ ఆ నీలి కళ్ళే ఇతడిని చూసి అట్టహాసం చేస్తున్నట్లు అనిపించింది. సమర్ తల పగిలిపోయేంత నొప్పి ప్రారంభమైంది.
మరుసటి రోజు ఉదయం పోలీస్ ఫోర్స్ సమర్ అపార్ట్‌మెంట్ తలుపును హైడ్రాలిక్ ప్రెషర్ ఉపయోగించి బద్దలు కొట్టి లోపలికి వచ్చినప్పుడు, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కిరణ్ గన్ పట్టుకుని మొదట గదిలోకి అడుగుపెట్టాడు.
గదిలోని దృశ్యం చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గదిలోని తెల్లటి గోడలపై సమర్ తన స్వంత రక్తంతో వందలాది 'నీలి కంటి' చిత్రాలను గీశాడు. గది మధ్యలో, పగిలిన అద్దం ముక్కల మధ్య సమర్ మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. అతని కుడిచేతిలో ఉన్న తుపాకీ నేలపై పడి ఉంది. అతని ఎడమచేతిలో ఒక పదునైన గాజు ముక్క ఉంది. కిరణ్ దగ్గరికి వచ్చి చూసేసరికి సమర్ నేత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అతని కనురెప్పల చాటు నుండి రక్తపు చుక్కలు కెన్నెలపై కారుతున్నాయి. అతను ఆ గాజు ముక్కతో తన సొంత నేత్రాలను పొడుచుకున్నాడు. తన లోపల ఉన్న ఆ 'నీలి కంటి వేಟగాడిని' శాశ్వతంగా చంపడానికి అతను తన దృష్టినే బలి ఇచ్చాడు. కిరణ్ అతనిని దిగులుగా చూస్తూ మోకాళ్లపై కూర్చున్నప్పుడు, సమర్ ఎండిపోయిన పెದవులు మెల్లగా వణికాయి. అతను స్పృహ తప్పి పడిపోయే ముందు అత్యంత క్షీణించిన, భీకరమైన స్వరంతో ఒక చివరి వాక్యాన్ని పలికాడు.
కిరణ్ కళ్ళు పగలగొట్టుకుని వెలుపలి ప్రపంచాన్ని చీకటి చేసినా ఆ నీలి కళ్ళు ఇప్పుడు నా మెదడు లోపలి కరాళ లోకంలో ఇంకా స్పష్టంగా నన్నే నిలదీసి చూస్తున్నాయి.
అంతటితో ఆ గదిలో ఒక నిగూఢమైన మౌనం ఆవరించింది.